హైదరాబాద్‌ చే గువేరా

14 Apr, 2020 01:01 IST|Sakshi

జీనా హై తో మర్నా సీఖో! కదం కదం ఫర్‌ లడ్‌నా సీఖో!! ‘జీవిం చాలంటే మరణం గురించి నేర్చుకో, అడుగడుగునా పోరాటం గురించి నేర్చుకో’ అంటూ ఉస్మానియా కేంద్రంగా ఒక నినాదం జనించింది. వేలాది మందిని చైతన్యపరిచింది. ఆ గొప్పతనం ఆ నినాదానిదే కాదు, ఆ నినాదాన్నిచ్చిన వ్యక్తిత్వానిది కూడా. ఎం.బి.బి.ఎస్‌. చదివి, డాక్టర్‌ కావాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయిన సందర్భంలో, సమాజం లోని వ్యవస్థీకృత  దోపిడీని నయం చేసే విప్లవ విద్యార్థి ఉద్యమానికి ఆయన్ని ఆద్యుడిని చేసింది. బలహీనులపట్ల బలంగా నిలబడాలనే కాంక్ష  ‘హైదరాబాదు చే గువేరా’గా మలిచింది. 

జార్జిరెడ్డి 1947 జనవరి 15న కేరళలో పుట్టి, తమిళనాడులో పెరిగాడు. అమ్మ లీలా వర్గీస్, నాన్న రఘునాథ రెడ్డి. చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు. ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన జార్జి, ఇక్కడి భౌతిక పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. గ్రామీణ విద్యార్థులపై ఉన్నత వర్గానికి చెందిన విద్యార్థులు చేసే దాడులను గమనించాడు. అకడమిక్‌ పుస్తకాలతో పాటు, నాన్‌ అక డమిక్‌ పుస్తకాలను అధ్యయనం చేశాడు. అప్పటికే సామ్రాజ్యవాద దేశాలతో పోరాటం చేస్తున్న చే గువేరా, నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. జాతీయ, అంతర్జాతీయ ఉద్యమాల ప్రభావంతో ఉస్మానియా కేంద్రంగా విద్యార్థి మేధోవర్గాన్ని తయారు చేశాడు. విద్యార్థి రాజకీయాల్లో ముందుండి, ఆయన బలపరిచిన వ్యక్తులు గెలుపొందడంతో జార్జిని భౌతికంగా నిర్మూలిస్తే గాని తమ ఆగడాలు సాగవనే నిర్ణయానికి వచ్చిన మతోన్మాదులు, కిరాయి మూకలు ఈ ప్రగతిశీల నాయకున్ని హత్య చేశాయి. హత్య జరిగిన 47 ఏళ్ల తర్వాత ఆయన జీవిత చరిత్రను జీవన్‌రెడ్డి తెరకెక్కించారు. జార్జిరెడ్డిని ఆయన భావజాల వారసులే గాక సాధారణ విద్యార్థులు, ప్రజలు కూడా నేటికీ స్మరించుకుంటున్నారు.
(ఏప్రిల్‌ 14న జార్జి రెడ్డి 48వ వర్ధంతి)
గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ

మరిన్ని వార్తలు