కఠిన వైఖరే సరైన మార్గం!

17 Dec, 2017 01:09 IST|Sakshi

రాజకీయవాదితో ప్రత్యేకించి గతంలో బీజేపీ సభ్యుడిగా ఉన్న వ్యక్తితో ఏకీభవించగలగడం కన్నా మించిన సంతోషం ఏముంటుంది? నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ, సభకు అంతరాయం కలిగించే పార్లమెంటు సభ్యులపై కఠినమైన క్రమశిక్షణను అమలు చేయాలంటూ ఉపరాష్ట్రపతి ఇచ్చిన పిలుపును బలపరుస్తూ ఈ కథనం రాస్తున్నాను.

ఇటీవల చేసిన ఒక ప్రసంగంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సభామధ్యంలోకి దూసుకొచ్చే ఎంపీలను తక్షణం సస్పెండ్‌ చేయాలని పిలుపునిచ్చారు. ఇది అద్భుతమైన ఆలోచన. కానీ దీన్ని అమలు చేయాలంటే, కఠినంగా వ్యవహరించడమే కాకుండా తమ అధికారాన్ని ప్రబలంగా ఉపయోగించే గుణం కలిగిన స్పీకర్లు మనకు అవసరం. అయితే ప్రతి ఒక్కరికీ అలాంటి శక్తి ఉండదు. అంటే స్పీకర్‌ పదవికి మనం ఎంచుకోవాల్సిన వ్యక్తుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని దీనర్థం.

కాస్సేపు బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ లేక ఆస్ట్రేలియా ప్రతి నిధుల సభను గమనించండి. ఈ రెండు సభలకు చెందిన స్పీకర్లు క్రమశిక్షణను అమలుపర్చడంలో ప్రదర్శించే కఠిన వైఖరిని మీరు పరిశీలించవచ్చు. అక్కడ సభకు అంతరాయం కలిగించడాన్ని అలా పక్కనబెట్టండి.. పార్లమెంట్‌ సంప్రదాయాలకు విరుద్ధమైన భాషను వాడినా వారు సహించరు. గతంలో ప్రతిపక్ష నాయకుడు టోనీ అబ్బోట్‌ పట్ల అసభ్యకరమైన భాషను ప్రయోగించిన నాటి ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్‌ను క్షమాపణ చెప్పవలసిందిగా ఆ దేశ దిగువ సభ స్పీకర్‌ ఒత్తిడి చేసిన సందర్భాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రధాని స్పీకర్‌ ఆదేశానికి కట్టుబడకపోవడంతో ఆయన తన స్వరం పెంచి ఆమెను తీవ్రంగా మందలించారు. దాంతో మారుమాట లేకుండా ఆమె స్పీకర్‌ ఆదేశాన్ని పాటించారు.

మన లోక్‌సభ స్పీకర్లు అలాంటి దృఢవైఖరిని ప్రదర్శించాలంటే వారి స్వాతంత్య్రానికి హామీ ఇవ్వడంతోపాటు, సభలో వారిని కొనసాగించే హామీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానమంత్రికి లేదా అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీకి తలవంచే స్పీకర్‌ కఠినంగా వ్యవహరించడానికి బదులు సులువుగా లోబడిపోతారు.

ఈ విషయంలో మనం బ్రిటిష్‌ ప్రతినిధుల సభ పాటించే రెండో సంప్రదాయాన్ని అనుసరించాలి. ఒకసారి ఎంపికయ్యాక పార్లమెంటుకు తిరిగి ఎన్నికయ్యే హక్కుపై బ్రిటిష్‌ స్పీకర్‌కు హామీ ఉంటుంది. ఎంపీగా వారు తిరిగి ఎంపిక కావడం కోసం ఇతరులెవరూ ఆ స్థానంలో పోటీ చేయరు. పైగా ఇక పదవిలోంచి దిగిపోవాలని అతడు/ఆమె ఎంచుకునేంతవరకు స్పీకర్‌ తన పదవిలో కొనసాగుతూనే ఉంటారు. అందుకే బ్రిటిష్‌ స్పీకర్‌ జాన్‌ బెర్కౌ.. భారతీయ స్పీకర్లతో పోలిస్తే చాలా విభిన్నంగా కనిపిస్తారు.

మరొక విషయం: పార్లమెంటు సభ్యులు సరిగా ప్రవర్తించకుంటే వారిని సభనుంచి బయటకు బలవంతంగా పంపించే అధికారం మన స్పీకర్లకు తప్పక ఉండాలి. కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా)లో స్పీకర్‌ ఆదేశాలను ధిక్కరించి లేదా దాటవేసి పార్లమెంటరీయేతర అసభ్య వ్యాఖ్యలను చేస్తూ అంతరాయం కలిగించే ఎంపీలను, మంత్రులను సైతం చాంబర్‌ వదలి వెళ్లిపోవలసిందిగా స్పీకర్‌ ఆదేశిస్తారు. దాన్ని సభ్యులు తప్పక పాటిస్తారు కూడా. అవసరమైన ప్రతిసారీ విధించే తక్షణ శిక్షారూపం ఇది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు ఇలా స్పీకర్‌ ఆదేశించిన ఘటనను నేను స్వయంగా చూశాను. అర్ధగంట విరామం తర్వాత అలా సస్పెండ్‌ చేసిన ఎంపీని తిరిగి సభలోకి అనుమతిస్తారు.
అయితే, ఇదంతా పార్లమెంట్‌ విశిష్ట ప్రాముఖ్యతను గుర్తించే ఎంపీలపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు మాత్రమే సభ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని వారు గుర్తిస్తారు. ఇక్కడ కూడా ప్రధానంగా వారి వైఖరి మారవలసిన అవసరముంది. పార్లమెంటు ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి ఈ ప్రక్రియ ఇతోధికంగా సహాయపడుతుంది.

ఈ రోజుల్లో పార్లమెంటు సంవత్సరానికి 70 రోజులు కూడా సమావేశం కావడం లేదు. గత పదేళ్ల కాలంలో సగటున 64 నుంచి 67 రోజులు మాత్రమే పార్లమెంటు నడుస్తోంది. అదే 1952–1972 మధ్యకాలంలో పార్లమెంట్‌ సమావేశాలు సంవత్సరానికి 128 నుంచి 132 రోజులపాటు జరిగాయి.

ప్రస్తుత పార్లమెంట్‌ రికార్డు అయితే మరీ ఘోరంగా ఉంది. 2014లో లోక్‌సభ సమావేశాలు 55 రోజులు (రాజ్యసభ 52 రోజులు) జరిగితే, 2017లో ఇంతవరకు ఉభయ సభలూ కేవలం 48 రోజులు మాత్రమే సమావేశమయ్యాయి.
అంతిమంగా మన పార్లమెంటు శుక్రవారం తిరిగి సమావేశమైంది. కానీ దాని ఎజెండాలో ఈ సమస్యలు కీలకంగా ఉన్నాయా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. నిస్సందేహంగా కొద్దిమంది వ్యక్తులు నా ఆందోళనను పంచుకుంటారు కానీ మొత్తంగా సంస్థ విషయం ఏమిటి? ప్రభుత్వంలోనూ, ప్రతిపక్షంలోనూ ఉన్న మన ప్రముఖ రాజకీయ నేతల మాటేమిటి? వారి మౌనం ప్రతీకాత్మకమైనదేనా?

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net
కరణ్‌ థాపర్‌

మరిన్ని వార్తలు