‘చేతి’కి చేటు తెచ్చిన ‘దేశం’ దోస్తీ

4 Dec, 2018 01:00 IST|Sakshi

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం శిఖరస్థాయికి చేరుకున్నది.  తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకు అయిదారు సభలకు తగ్గకుండా పర్యటిస్తూ, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారిలో ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు.  కేసీఆర్‌ సభలకు ప్రజాదరణ మిగిలిన వారితో పోలిస్తే కొంచెం అధికంగానే ఉంది.  కేసీఆర్‌ కు ఉన్న ఒక ప్లస్‌ పాయింట్‌ ఏమిటంటే, మాటలకోసం ఎక్కడా తడుముకోకుండా, చెప్పాల్సింది సూటిగా, సుత్తిలేకుండా చెప్పగలగడం. ముఖ్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం, పింఛన్లు, ఇరవైనాలుగు గంటల కరెంట్‌ సరఫరా, కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ లాంటి పథకాలు ఆయనలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.

కేసీఆర్‌ పథకాలు చూసిన తరువాత గుర్తు చేసుకోవలసింది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని.  కేసీఆర్‌కు, వైఎస్సార్‌కు అనేక విషయాలలో పోలికలు కనిపిస్తాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలను ఇచ్చింది.  వాటిలో ముఖ్యమైనది రైతులకు ఉచిత కరెంట్, విద్యుత్‌ బకాయిల మాఫీ. ప్రమాణస్వీకారం చేసిన పది నిముషాలలోపే వైఎస్సార్‌ ఆ హామీలను నెరవేర్చారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలనే కాకుండా, ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు ఆయన. వాటిలో అనేక ప«థకాలు కాంగ్రెస్‌ పార్టీవి కావు. వైఎస్సార్‌ మదిలో మొదలైన ఆలోచనలు. ఫీజు రీయిం బర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, 108  సర్వీసులు, రెండు రూపాయలకు కిలో బియ్యం లాంటి పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా అమలుకాలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలయ్యాయి.  

వైఎస్సార్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుతించిన కేసీఆర్‌.. పాలనలో అదేబాటలో పయనించారనిపిస్తున్నది.  వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే, జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.  అదేవిధంగా కేసీఆర్‌ కూడా అధికారంలోకి రాగానే కాళేశ్వరం, సీతారాం సాగర్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి, కేంద్రం నుంచి అన్నిరకాల అనుమతులను సాధించి రికార్డు వ్యవధిలో తొంభై శాతం పనులను పూర్తి చేశారు. ఇక మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనుల ఫలితంగా లక్షలాది ఎకరాలు పచ్చబడి తెలంగాణను అన్నపూర్ణగా మార్చేసింది. రైతుబంధు చెక్కుల ద్వారా రైతుల హృదయాలను చూరగొన్నారు. తెలంగాణ మీద చంద్రబాబుకు ప్రత్యేకంగా ఒక శత్రుత్వం ఉంది. ఇది వ్యక్తిగత శత్రుత్వం. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా పాలిం చుకోవలసిన హైదరాబాద్‌ మహానగరం తనకు కాకుండా పోయిందే అన్న బాధ, తగిన ప్రతీకారం తీర్చుకోవాలి అన్న కసి ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  

జగన్‌ తలకెత్తుకున్న ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రస్థాయికి చేరడంతో, ప్రజల్లో కూడా చైతన్యం రావడంతో..విధిలేక మోదీతో చంద్రబాబు సంబంధాలు తెంచుకున్నారు..  మొదట్లో అది నాటకం అనుకున్నప్పటికీ, రానురాను నమ్మక తప్పడం లేదు. ఇక బీజేపీతో సంబంధాలు తెంచుకోగానే, చంద్రబాబు ప్రత్యేక విమానానికి ప్రత్యేక రెక్కలు మొలి చాయి. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్న పార్టీలను మళ్ళీ కట్టగట్టి మరేదో కూటమిగా తయారు చేస్తున్నట్లు బిల్డప్పులు ఇచ్చుకుంటూ తెగ ఆయాసపడిపోతున్నారు. ఆ కూటమి ఎంతవరకు ఏర్పడుతుందో తెలియదు కానీ, కాంగ్రెస్‌ పార్టీతో జట్టుకట్టగానే, మళ్ళీ తెలంగాణాలో చోటు దొరుకుతుందనే ఆశ చంద్రబాబులో పొటమరించుకొచ్చింది.  తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీకి ఐదు వందల కోట్ల రూపాయల నిధులను ఎన్నికల ఖర్చు కోసం చంద్రబాబు సమకూర్చినట్లు వార్తలు వినిపించాయి. పన్నెండు సీట్లకోసం అంత పెట్టుబడి పెట్టడానికి చంద్రబాబు సాహసించారంటే అది తెలంగాణ మీద ఉన్న కక్ష మాత్రమే అంటే పొరపాటు లేదు.  

రాహుల్‌ గాంధీ వెంట ఉండటంతో చంద్రబాబుకు ప్రచారం చేసే ధైర్యం కూడా వచ్చింది.  ఇక ఆ ప్రచారంలో చంద్రబాబు మాటలకు, మాయాబజార్‌ సినిమాలో రేలంగి డైలాగులకు పెద్ద భేదం లేదు.  ఆంధ్రాలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ ను నేనే కట్టించానని, హైదరాబాద్‌ ను నేనే ప్రపంచపటంలో పెట్టానని వందలసార్లు ప్రవచించిన బాబు.. హైదరాబాద్‌ లో అడుగుపెట్టగానే, తాను హైదరాబాద్‌ ను కట్టించానని ఎన్నడూ చెప్పలేదని, సైబరాబాద్‌ ను కట్టించానని మాత్రమే చెప్పారు.  ఇక అలాగే, 2005  లో మొదలైన ఔటర్‌ రింగ్‌ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తానే నిర్మించానని చాటుకోవడం ప్రారంభించారు.  అంతేకాదు.. వైఎస్సార్‌ హయాంలో వచ్చిన ఫైనాన్షియల్‌ సిటీని కూడా తానే రప్పిం చానని, తన వల్లనే హైదరాబాద్‌ ధనికనగరం అయిందని డప్పు మొదలు పెట్టారు.  అంతటితో ఆగితే బాగుండేది... ఆధునిక తెలంగాణ నిర్మాతను కూడా తానే అని నిస్సిగ్గుగా ప్రకటించేశారు. చంద్రబాబు అలా నోరు పారేసుకుంటున్నా, గుడ్లలో నీళ్లు కుక్కుకుని చూడాల్సిన దుస్థితి కాంగ్రెస్‌ నాయకులది. ‘అయ్యా.. చంద్రబాబు... ఔటర్‌ రింగ్‌ రోడ్‌ శంకుస్థాపన అయినపుడు నువ్వు అధికారంలో లేవు... ఓడిపోయి మూలన కూర్చున్నావు...అవన్నీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ‘కష్టార్జితాలు, ముందుచూపు ఫలాలు’ అని చెప్పడానికి కూడా కాంగ్రెస్‌ నాయకులు సాహసం చేయలేకపోతున్నారు.
 
ఇక వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే... కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉన్నట్లయితే కనీసం నలభై స్థానాలకు తగ్గకుండా వచ్చేవని... ఇప్పుడు చంద్రబాబు గారితో కలిసిన   కారణంగా కాంగ్రెస్‌కు ఓటు వేద్దామనుకునే వారు కూడా మనసు మార్చు కుంటున్నారని...తత్ఫలితంగా, మహాకూటమికి శృంగ భంగం తప్పదేమో అని కొందరు బుద్ధిజీవులు గొణుగుతున్నారు. అందుకు ఉత్తరకుమార ప్రగల్భాలతో చంద్రబాబు తనవంతు సాయం అందిస్తున్నారు.

- ఇలపావులూరి మురళీ మోహన రావు, రాజకీయ విశ్లేషకులు 

మరిన్ని వార్తలు