ఉపాధి హామీతోనే గ్రామీణ వికాసం

19 Oct, 2019 04:47 IST|Sakshi

గ్రామీణ భారతదేశంలో ప్రజల వినియోగాన్ని క్షీణింపజేయడంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాల్లోని తప్పటడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వ్యవసాయానికి పోటీగా వాణిజ్యాన్ని నిలబెట్టడం, ద్రవ్యోల్బణంపైనే గురిపెడుతున్న ద్రవ్యవిధానం, పెద్దనోట్ల రద్దు, అధిక మొత్తం నగదు లావాదేవీలపై పన్ను, జీఎస్టీ వంటివి మొత్తంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి గ్రామీణ మార్కెట్లలో నగదు చెలామణీని, మొదటి నుంచి వాడుకలో ఉన్న నగదు లావాదేవీలను విచ్ఛిన్నపర్చడానికే తోడ్పడ్డాయి. అందుచేత గ్రామీణ ఆర్థిక ఉద్దీపనను అమలు చేయడానికి మరింత మెరుగుపర్చిన రూపంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. ఇది ఒక డిమాండ్‌ను సృష్టించే పథకం. పనికోసం చూస్తున్న ఎవరికైనా ఈ పథకం పని కల్పిస్తుంది. కాబట్టి ఆదాయ మద్దతు పథకాలతో ఘర్షించే సమస్యలను ఇది అధిగమించి గ్రామీణ ప్రాంతంలో శ్రమజీవులకు ఎక్కువ మేలు చేస్తుంది.

ప్రస్తుతం దేశంలో అలుముకుంటున్న ఆర్థిక మందగమనాన్ని అడ్డుకోవడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న మన విధాన నిర్ణేతలు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న సంక్షోభాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని నెలల క్రితం ఎన్నికలు సమీపించిన తరుణంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతీయ విధాన నిర్ణేతల ప్రథమ ప్రాధాన్యతగా ఉండేది. ఈ సంవత్సరం జనవరిలో ప్రధానమంత్రి–కిసాన్‌ యోజన్‌ పథకాన్ని ప్రకటించి భారీ ఎత్తున అమలుకు ప్రయత్నాలు చేశారు. కానీ సరిగ్గా అయిదు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతోందని గుర్తిస్తున్నప్పటికీ పీఎం కిసాన్‌ యోజన పథకం అమలు వేగాన్ని తగ్గిస్తూ వస్తోంది. కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం రైతులకు మూడో విడత నగదు చెల్లింపు మొత్తం తొలి రెండు విడతల కంటే గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. తొలి రెండు విడతల నగదును ఎన్నికల ప్రచార సమయంలో సత్వరం పంపిణీ చేసిన వాస్తవాన్ని మర్చిపోకూడదు. బహుశా, పార్లమెంట్‌ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం కేంద్ర ప్రభుత్వ రాజకీయ గణాంకాలను మార్చివేసి ఆర్థిక వ్యవస్థలోని ఇతర అంశాలపై తన దృష్టిని మరల్చినట్లుంది. కార్పొరేట్, ద్రవ్యరంగం ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మిక్కుటంగా కృషి చేస్తోంది. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విస్మరించి పెట్టుబడుల పెంపుదల కోసం ప్రయత్నించడం అంటే చాలా తీవ్రమైన తప్పిదం కాగలదు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కార్పొరేట్‌ పన్నులను భారీగా తగ్గిస్తూ ప్రస్తుతం విధానపరంగా తీసుకున్న చర్యలు దేశంలో డిమాండును పెంచే సమస్యను పరిష్కరించడంలో భవిష్యత్తులో విఫలం కాక తప్పదనిపిస్తోంది. ప్రముఖ ఆర్థిక వేత్త హిమాన్షు నొక్కి చెప్పినట్లుగా భారతదేశం వినియోగ సరకులకోసం పెట్టే ఖర్చు కనీవినీ ఎరుగని స్థితికి దిగజారిపోయింది. జాతీయ శాంపిల్‌ సర్వే ఆఫీసు డేటాను ఉపయోగించి గ్రామీణ భారతదేశంలో సంవత్సరానికి 4.4 శాతం చొప్పున దేశీయ వినియోగ వ్యయం క్షీణించిపోయిందని ఆయన లెక్కించారు. అదే పట్టణ ప్రాంతాల్లో వినియోగ వ్యయం 4.8 శాతం పడిపోయింది. రెండోది.. గ్రామీణ భారతదేశంలో ప్రజల వినియోగాన్ని క్షీణిం పజేయడంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానాల్లో తీసుకున్న తప్పటడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. వ్యవసాయానికి పోటీగా వాణిజ్యాన్ని నిలబెట్టి ద్రవ్యోల్బణంపై గురిపెడుతున్న ద్రవ్యవిధానం, పెద్దనోట్ల రద్దు, అధిక మొత్తంలో నగదు లావాదేవీలపై పన్ను, జీఎస్టీ వంటివి మొత్తంగా వ్యవసాయ రంగం అభివృద్ధిపై శీతకన్ను వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి గ్రామీణ మార్కెట్లలో నగదు చెలామణీని, మొదటి నుంచి వాడుకలో ఉన్న నగదు లావాదేవీలను విచ్ఛిన్నపర్చడానికే ఇతోధికంగా తోడ్పడ్డాయి.

విధాన పరమైన ఈ తప్పటడుగులను ప్రత్యేకంగా సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలహీనంగా ఉన్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వినియోగం తగ్గిపోవడం అంటేనే అక్కడ దారిద్య్రం పెరుగుతోందని అర్థం. అందుకే అతితక్కువ కాలంలోనే వినియోగ డిమాం డును పునరుద్ధరించడానికి గ్రామీణ భారతదేశానికి సత్వరమే ఆర్థిక ఉద్దీపన అనేది అవసరం కార్పొరేట్‌ ఇండియాకంటే మించిన ఉద్దీపన ప్యాకేజీనీ మన గ్రామప్రాంతాలకు అందించి తీరాలి. గ్రామీణ ఉద్దీపన ప్యాకేజీకి అందించాల్సిన రెండు విధానపరమైన సాధనాలపై ఇటీవలకాలంలో చాలా విస్తృతమైన వాదనలు చోటుచేసుకున్నాయి. అవి కనీస మద్దతు ధరను పెంచడం, ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలోని అనేక రాష్ట్రాలు ఇటీవలికాలంలో కేంద్ర ప్రభుత్వ అడుగుల్లో అడుగులేసి తమవైన రైతు ఆదాయ మద్దతు విధానాలను ప్రకటించాయి. ఇవి ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కంటే ఎక్కువగా తమ తమ బడ్జెట్లలో అధిక మొత్తాన్ని రైతు సహాయ నగదు పథకాల కోసం కేటాయించాయి.
 
కానీ ఇలాంటి ఉద్దీపన సాధనాలకు పరిమితులున్నాయి. కనీస మద్దతు ధరను దెబ్బతీసే ధరలు, పంటల ఎంపికలు అనేవి వ్యవసాయ సంస్కరణల అమలును దీర్ఘకాలంలో  దెబ్బతీస్తాయి. పైగా, కేంద్రప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేయనటువంటి ఆహార ధాన్యాలను భారీస్థాయిలో నిల్వ చేసుకుని సిద్ధం చేసుకుని కూర్చుంది. దీంతో అదనపు ధాన్య సేకరణకు అవకాశాలు చాలా పరిమితమైపోయాయి. నగదు మద్దతు పథకాలు కనీస మద్దతు ధరపై ప్రతికూల ప్రభావాలను తగ్గించగలుగుతాయి కానీ వీటి అమలులో తీవ్రమైన సవాళ్లు ఎదురుకాక తప్పదు. 2018–19 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదిక ఎత్తి చూపినట్లుగా, ఇలాంటి ప్రత్యక్ష నగదు పంపిణీ పథకాల విజయం అనేది భూ రికార్డులను డిజిటలీకరించడం, వాటిని బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయడం పూర్తిగా నెరవేర్చారా లేదా అనే షరతులపై ఆధారపడి ఉంటుంది. పైగా లక్షలాది మంది రైతుల భూ రికార్డుల డిజిటలీకరణ అనేది ఒక్క రాత్రిలో జరిగిపోదు. అందుకే పీఎమ్‌ కిసాన్‌ సభను వేగంగా అమలు చేయాలంటే సాధ్యపడదు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా అమలు చేసిన తెలంగాణ రాష్ట్రం తన రైతుల భూ రికార్డుల డేటా బేస్‌ను సరిచేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందంటే వాస్తవ పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు.
 
అందుచేత గ్రామీణ ఆర్థిక ఉద్దీపనను అమలు చేయడానికి మరింత మెరుగుపర్చిన రూపంలోని జాతీయ ఉపాధి హామీ పథకం ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. ఈ పథకం గొప్పదనం ఏమిటంటే ఇది ఒక డిమాండ్‌ను సృష్టించే పథకం. పనికోసం చూస్తున్న ఎవరికైనా ఈ పథకం పని కల్పిస్తుంది. కాబట్టి ఆదాయ మద్దతు పథకాలతో ఘర్షించే సమస్యలను చాలావాటిని ఇది అధిగమించి గ్రామీణ ప్రాంతంలో శ్రమజీవులకు ఎక్కువ మేలు చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అనేది రైతులకు మాత్రమే కాకుండా వ్యవసాయ కార్మికుల విస్తృత భాగస్వామ్యానికి వీలిచ్చేలా రూపొందించడమైనది. అందుకే ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల ప్రజల ఆదాయాలను బాగా పెంచగలుగుతుంది. చివరగా, జాతీయ ఉపాధి హామీ పథకం ప్రధానంగా గుంతలు తవ్వే పనులకే పరిమితమైపోయిందనే భావన విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ,  వ్యవసాయ  భూమిలో ఉత్పాదకతను మెరుగు పర్చడంలో ఇది అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఉపాధి హామీ పథకం కింద పనుల్లో ఎక్కువ భాగం సన్నకారు రైతుల యాజమాన్యంలోని భూ కమతాలను అభివృద్ధి చేయడం పైనే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు సాగునీటి వసతుల నిర్మాణం, పశువులు, జంతువుల షెడ్ల నిర్మాణం వంటివి. భూ ఉత్పాదకతను మెరుగుపర్చడం అంటేనే రైతుల ఆదాయాలను సూత్రబద్ధంగా పెంచడం, వ్యవసాయ కార్మికులకు డిమాండును అధికంగా ఏర్పర్చడం అన్నమాట.

అయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పైకెత్తాలంటే బడ్జెట్లలో కేటాయింపులను పెంచవలసి ఉంటుంది. అధిక వేతనాలు ఇవ్వడం, అమలులో మెషిన్‌ తరహా క్రమబద్ధమైన పర్యవేక్షణను సాగించడం చేయాల్సి ఉంటుంది. 2012–13 సంవత్సరం నాటి నుంచి ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులను తగ్గిస్తూ వచ్చినప్పటికీ పనికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో 2017–18 నాటికి రూ. 5,000 కోట్ల రూపాయల విలువైన అదనపు వ్యయం వెచ్చించాల్సి వచ్చింది. పర్యవసానంగా, వేతన చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. 2017–18 సంవత్సరం తొలి సగంలో 32 శాతం వేతనాలు మాత్రమే సకాలంలో పంపిణీ చేయగలిగారు. పైగా రాష్ట్ర కనీస వేతనాల కంటే తక్కువ స్థాయిలో జాతీయ ఉపాధి హామీ పథకంలో చెల్లించే వేతనాలు తగ్గుస్థాయికి పడిపోయాయి. ఈ అడ్డంకులను అధిగమించడం పరిష్కరించడం సంక్లిష్టంగా మారింది.  అయితే కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 10 శాతం వరకు అధిక అప్పులను చేస్తున్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని విస్తరింపజేయడం ఎలా అనేది ప్రశ్న. ప్రభుత్వం అప్పుల జోలికి వెళ్లకుండానే ఈ పథకానికి నిధులను సమకూర్చవచ్చు. ఎరువులు, నీరు, విద్యుత్‌ వంటి వాటిపై ఇస్తున్న భారీ సబ్సిడీలను దశలవారీగా హేతుబద్దీకరించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. సంక్షోభం అనూహ్య అవకాశాలను కల్పిస్తుంది. భారతీయ సబ్సిడీ రాజ్‌ని సంస్కరించడం చాలాకాలంగా పెండింగులో ఉంది. ఉపాధి హామీ పథకాన్ని విస్తృతం చేయడం అంటేనే వ్యవస్థ నిర్మాణాత్మక సంక్షోభానికి ఒక పరిష్కారం కావచ్చు.

యామిని అయ్యర్, సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ 

మరిన్ని వార్తలు