మార్క్సిజం ప్రాముఖ్యత మరింత పెరిగింది

10 Jun, 2018 00:53 IST|Sakshi

ప్రపంచంలోని అనేక దేశాల్లో మార్క్సిజం, కమ్యూనిజం అదృశ్యమౌతున్న నేపథ్యంలో వివిధ దేశాల్లో ఈమధ్య కారల్‌మార్క్స్‌ ద్విశత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చాలాచోట్ల ఆయన స్మృతికి నివా ళులర్పించడంతోపాటు మార్క్సిజాన్ని భిన్న కోణాల్లో చర్చించారు. గోష్టులు నిర్వహించారు. మార్క్స్‌ జన్మించిన జర్మనీలోని ట్రియర్‌ పట్ట ణంలో ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. చైనా బహుకరించిన ఈ విగ్ర హాన్ని ఆయన అప్పట్లో నివసించిన ఇంటికి సమీపంలో ప్రతిష్టించారు.

ఈ సందర్భంగానే చైనాలోని బీజింగ్, షెన్‌జెన్‌ నగరాల్లో గత నెల 27 నుంచి 30 వరకూ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. 21వ శతాబ్దంలో కారల్‌మార్క్స్‌ ప్రాముఖ్యత గురించి, ప్రపంచంలో సామ్యవాదం భవితవ్యం గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సదస్సుల్లో 70 దేశాలకు చెందిన 75 కమ్యూనిస్టు పార్టీల నుంచి 112 మంది నేతలు పాల్గొన్నారు. మన దేశం నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కూడా సదస్సులకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏచూరి చైనా నగరాల్లో జరిగిన సదస్సులు, వాటిలో జరిగిన చర్చల గురించి సాక్షి ప్రతినిధి జీకేఎం రావుకు ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చ డానికి భౌతిక శక్తులను శ్రామికవర్గం నేతృత్వంలో బలోపేతం చేయడం కోసం ప్రజా పోరాటాలను నిర్మించడమే మార్గమని ఏచూరి అంటున్నారు. ఇలాంటి పోరాటాలకు మార్క్సిజం ఒక్కటే సైద్ధాంతిక భూమికను అందిస్తుందని చెబుతున్నారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు:

కారల్‌ మార్క్స్, కమ్యూనిజంపై వర్క్‌షాప్‌లు ఎలా జరిగాయి?
చైనా సోషలిజానికి తిలోదకాలు ఇస్తూ, పెట్టుబడిదారీ పంథాలో పయనిస్తోందని ప్రపంచ దేశాలు భావిస్తున్న కారణంగా చైనాలో ఇలాంటి సమావేశాలు జరగడం మార్క్సిజానికి గొప్ప విజయం. తమపై ప్రపంచ ప్రజానీకంలో ఉన్న అపోహలనూ, అనుమానాలనూ నివృత్తి చేయడానికి చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ఈ సమావేశాలు నిర్వహించింది.

ప్రపంచంలో బలమైన ఆర్థికశక్తిగా చైనా అవతరించింది. సామ్యవాద పంథాలో పయ నిస్తూనే ఇది ఎలా సాధ్యమైంది?
నేడు మార్క్సిజం అవసరం ఉందనడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చేసిన ప్రారంభ ఉపన్యాసం ప్రపంచ దేశాల కళ్లు తెరిపించింది. మార్క్సిజానికి చైనా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. సామ్యవాద పంథాలో పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదగటం సాధ్యమేనని చైనాను చూస్తే అర్ధమవుతుంది. 

చైనాలో అవినీతి, అసమానతలపై ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఈ రెండు అంశాలపై చైనా నిజంగా కలవరపడుతోంది. అవినీతి విస్తరించింది. ప్రభుత్వం అవినీతిని రూపుమాపడానికి కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అవినీతికి పాల్పడే వేలాది మంది అధికారులకు ప్రతి వారం ఉద్వాసన పలుకుతున్నారు. చైనాలో నగరాలు, పట్టణాలు పెరిగిపోవడంతో అసమానతలు అధికమౌతున్నాయి. ఈ సమస్య పరిష్కా రానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పట్టణాల్లోని ప్రజలు, ఫ్యాక్టరీలను గ్రామాలకు తరలిస్తున్నారు. గ్రామాల సముదాయాల్లో వైద్య సౌకర్యాలు సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నగరాలపై ఒత్తిడి తగ్గిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తున్నాయి. 

మార్క్సిజంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఏ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు?
ప్రారంభ, ముగింపు సమావేశాలతోపాటు మూడు అంశాలపై ప్రత్యేక చర్చాగోష్టులు నిర్వహించారు. కారల్‌మార్క్స్‌ చారిత్రక ప్రాధాన్యం–నేటి పరిస్థితుల్లో మార్క్సిజం ప్రయోజనం, 21వ శతాబ్దంలో కొత్త పరిస్థితులకు అనుగుణంగా చైనా తరహా సోష లిజంపై షీ జిన్‌పింగ్‌ ఆలోచనా విధానం ప్రభావం, చైనాకు అనుసరణీయమైన సోష లిజం సిద్ధాంతాలు, ఆచరణ–ప్రపంచ సామ్యవాదం భవితవ్యంపై మూడు సదస్సులు జరిగాయి. 

ప్రపంచంలో సోషల్‌ డెమొక్రాట్లు, లిబరల్‌ డెమొక్రాట్లకు ఆదరణ పెరగడంతోపాటు, కొన్ని దేశాల్లో మార్పును వ్యతిరేకించే మితవాదులు బలపడుతున్న నేపథ్యంలో–మార్క్సిజం భవితవ్యం ఏమిటనే విషయం చర్చించారా?
విశ్వవ్యాప్తంగా ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభం ఫలితంగా నేడు మార్క్సిజం విలువను, ప్రాధాన్యాన్ని అందరూ గుర్తిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీకి అంతముండదని, సంక్షోభం ముగియదని గుర్తించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందువల్లే పెట్టుబడిదారీ వ్యవస్థ పోవాల్సిందేనని అందరూ కోరుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడం మార్క్సిజాన్ని అనుసరించే పార్టీల వల్లనే సాధ్యమని తెలుసుకుంటున్నారు.

‘‘తత్వవేత్తలు ప్రపంచం తీరు గురించి అనేక పద్ధతుల్లో కేవలం భాష్యం చెప్పారు. కాని, ప్రపం చాన్ని మార్చాల్సిన అవసరం ఉంది’’ అని కారల్‌ మార్క్స్‌ చెప్పారు. ఎలా మార్చాలి? అనే విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దోపిడీని అంతం చేసి, మానవుల విముక్తి సాధించడానికి మార్క్సిజం ఒక్కటే మార్గాన్ని అందిస్తుంది. దోపిడీకి గురవుతున్న ప్రజలను ఆకట్టుకుంటున్న సిద్ధాంతం ఇదొక్కటే.

మార్క్సిజం మార్పులేని సిద్ధాంతం కాదు. ఇదొక సృజనశీల శాస్త్రమని విప్లవ నేత లెనిన్‌ ఎన్నడో బోధించారు. చరిత్ర విశ్లేషణకు, మరీ ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానం పరిశీలనకు మార్క్సిజమే మంచి మార్గం. మార్క్సిస్టు సిద్ధాంతాలు, మార్క్స్‌ చూపించిన మార్గాల ప్రాతిపదికగా మేము మా సైద్ధాంతిక అవగాహనను బలోపేతం చేసుకుంటు న్నాము. ప్రస్తుత పరిస్థితులు, సంక్షోభాల నేగాక భవిష్యత్తులో కమ్యూనిస్టులకు గల అవ కాశాలను మార్క్సిజం వెలుగులో అర్థంచేసుకుంటున్నాం. 

ప్రపంచ నేతగా అవతరించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రసంగంలో మీకు నచ్చిన అంశమేంటి?
మార్క్సిజం కాలం చెల్లిన సిద్ధాంతం కాదని, ఇది ఎప్పటికీ విలువైనదేననే వాదనకు అభివృద్ధి పథంలో అగ్రగామిగా సాగుతున్న చైనా తిరుగులేని సాక్ష్యమని జిన్‌పింగ్‌ చెప్పారు. ‘ఇరవయ్యో శతాబ్దం మధ్య వరకూ తూర్పు ప్రపంచంలో జబ్బు మనిషిగా ముద్రపడిన దేశం నేడు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా నిరూపించుకుంది’ అని ఆయన స్పష్టం చేశారు. కొత్త శకానికి కావాల్సింది చైనా తరహా లక్షణాలున్న సామ్య వాదమే అని జిన్‌పింగ్‌ నమ్ముతున్నారు. 

ఈ సదస్సులో మీరేం మాట్లాడారు?
సమస్య ఎంత తీవ్రమైనదైనా పెట్టుబడిదారీ వ్యవస్థ దానంతటదే కూలిపోదు. కేపిట లిజాన్ని సవాలు చేసే రాజకీయ ప్రత్యామ్నాయం రూపుదిద్దుకునే వరకూ ఇది మానవుల దోపిడీని కొనసాగిస్తూ తన ఉనికిని కొనసాగిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదో యడానికి మేం సమాజంలోని భౌతిక శక్తులను శ్రామిక వర్గం నేతృత్వంలో బలోపేతం చేయాల్సి ఉంటుంది. ప్రజా పోరాటాల ద్వారానే ఇది సాధ్యమౌతుంది. ఇలాంటి పోరా టానికి మార్క్సిజం ఒక్కటే సైద్ధాంతిక భూమికను అందిస్తుంది.
 

మరిన్ని వార్తలు