రోగ నిరోధక శక్తే కరోనాకు మందు

16 May, 2020 04:09 IST|Sakshi

ప్రపంచంలోని తెలుగువారు గర్వపడేలా దాదాపు 100కు పైగా అమెరికా, ఇతర దేశాల ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్న డాక్టర్‌ ఎం. శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులో జన్మించారు. వైరాలజీలో ఆయన పీహెచ్‌డీ చేశారు. 2012లో నోబెల్‌ బహుమతికి కూడా ఆయన పేరును నామినేట్‌ చేశారంటే, బయో టెక్నాలజీలోనూ, వైరాలజీ లోనూ ఆయనకు ఉన్న అవగాహన, పట్టు ఏమిటో అర్థమవుతుంది. అమెరికాలోని డెన్వర్‌లో ఉంటున్న ఆయన కరోనా వైరస్‌ గురించి వివరంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే...

డిసెంబర్‌ 2019 – జనవరి 2020లోనే వూహాన్‌లో కరోనా వైరస్‌ బయటపడగానే, నన్ను కొందరు చైనా వారు కాంటాక్ట్‌ చేశారు. అప్పుడే నేను ఈ వైరస్‌ మీద ఒక ఆర్టికల్‌ రాశాను. భారతీయులం, ముఖ్యంగా తెలుగువాళ్ళం ఈ కరోనా వైరస్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా అనేది చిన్న  వైరస్‌ కణం... బ్యాక్టీరియా కన్నా చిన్నకణం. వైరస్‌ కంటే బ్యాక్టీరియా కొన్ని వేల రెట్లు పెద్దది. అంటే  కరోనా వైరస్‌ కణం ఎంత చిన్నదో అర్థం అవుతుంది. వందలో 80 మంది దగ్గర అది చచ్చిపోతుంది.

అంటే కరోనా పరీక్షలో పాజిటివ్‌గా వచ్చిన వాళ్ళు, కరోనా పరీక్ష చేయించుకోకపోయినా కరోనా పాజిటివ్‌ ఉన్న వాళ్ళు 80 శాతం మంది ఉంటారు. వారి దగ్గర ఈ కరోనా చచ్చిపోతుంది. మిగిలిన వారిలో  దాదాపు 15 శాతం మందికి ట్రీట్మెంట్‌ ద్వారా లోపల ఉన్న కరోనా కణాలను చంపేస్తారు కనుక వారు మళ్ళీ మామూలు మనుషులవుతారు. ఇంకా మిగిలిన 5 శాతం మనుషులలో వెంటిలేటర్‌ వరకు వెళ్ళి కరోనా మరణాన్ని తప్పించుకున్న వాళ్ళ శాతం 2.5 అంటే కరోనా వలన చనిపోయేవారు కేవలం 2.5 శాతం మంది మాత్రమే.

అయితే కరోనా సోకిన వారు, కరోనా వలన చనిపోయిన వారిని జాగ్రత్తగా పరిశీలిస్తే వారికి అనేక ఇతర వ్యాధులు ఉండడం, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండడం కారణమని తెలుస్తోంది. అంటే కరోనాకు మందు మన శరీరాల్లో మంచి రోగ నిరోధకశక్తి ఉండటమే. మనిషిలో రోగ నిరోధకశక్తి ఉంటే యాంటీ వైరస్‌ కణాలు కొత్తగా వచ్చిన వైరస్‌ కణాల్ని చంపేస్తాయి.  అమెరికాలో నేను డెయిరీ బిజినెస్‌లో ఉన్నాను. అనేక డెయిరీ ప్రొడక్ట్‌ తయా రుచేసే కంపెనీలకు నేను అడ్వయిజర్‌గా ఉన్నాను. అమెరికాలో డెయిరీ ప్రొడక్ట్స్‌లో రోగ నిరోధకశక్తిని పెంచే పదార్థాలు లేవు.

అమెరికాలో ప్రభుత్వ విధానం ప్రకారం బ్యాక్టీరియా రహిత వస్తువులనే అమ్ముతారు. అవే ప్రజలు వాడతారు. అందువల్ల వారిలో రోగ నిరోధకశక్తి తక్కువ. భారతీయులకు రోగ నిరోధకశక్తి బాగా ఎక్కువ ఉంటుంది. మనం ఇంట్లో పాల నుంచి పెరుగు చేసుకుతింటాం. అందులో రోగ నిరోధకశక్తి పెంచే బ్యాక్టీరియా ఉంటుంది. ఇదివరకు రాత్రి పూట పాలలో అన్నం ఉంచి, ఆ పాలను తోడుపెట్టి ఉదయమే ఆ పెరుగు అన్నం పెట్టేవారు. దీనికి మించిన రోగ నిరోధకశక్తిని పెంచే మందు లేదు.

భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు తినే తిండిలో నిమ్మకాయ, పసుపు, లవంగం, వెల్లుల్లి, అల్లం లాంటి అనేక యాంటీబయాటిక్‌ పదార్థాలను వాడతారు. అవి తినేవారిలో రోగ నిరోధకశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వారిని  కరోనా వైరస్‌ ఏమీ చేయలేదు. మన ఆహారపు అలవాట్లే మనల్ని రక్షిస్తాయి అన్నమాట. అంటే కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రతి వ్యక్తి రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. అలా చేస్తే కరోనా ఉందా, పోయిందా? వ్యాక్సిన్‌ వచ్చిందా, రాలేదా? లాక్‌డౌన్‌ ఉంటుందా, తీసేస్తారా? లాంటి భయాందోళనలు ఉండవు.
చెన్నూరి వేంకట సుబ్బారావు, అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు టైమ్స్‌ పత్రిక సంపాదకులు 

మరిన్ని వార్తలు