కుటుంబాలు సమాజ అభివృద్ధికి సూచికలు

15 May, 2018 03:15 IST|Sakshi

సమాజ మార్పు అభివృద్ధి, పరివర్తనలో కుటుం బాలే కీలకం. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న కుటుంబాల విశిష్ఠతను తెలపడానికి అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం  ప్రతి ఏటా మే 15న జరుపుకుంటారు. 1993లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 20 సెప్టెంబర్‌ 1993 నాటి 47/237 తీర్మానంలో ఇంటర్నేషనల్‌ ఫ్యామిలీస్‌ డేని ప్రకటించింది. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం కుటుంబాల సమస్యల గురించి అవగాహనను, కుటుంబాలను ప్రభావితం చేసే సాంఘిక, ఆర్థిక మరియు జనాభా ప్రక్రియల పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. 1994లో ఐక్యరాజ్యసమితి కుటుంబాల అంతర్జాతీయ సంవత్సరాన్ని అధికారికంగా ప్రకటించారు. 1994 మే 15న ప్రారంభించిన కుటుం బాల దినోత్సవం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుం బాలు, ప్రజలు, సమాజాలు, సంస్కృతులను ప్రతి బింబించేలా ఉంటుంది. కుటుంబాలు సమాజానికి కేంద్రం. పైగా అన్ని వయసుల ప్రజలకు స్థిరమైన, సహాయక గృహాన్ని అందిస్తాయి అని ఇది సూచి స్తుంది. మొదటిసారిగా 1996లో  ‘ఫ్యామిలీస్‌: ఫస్ట్‌ విక్టిమ్స్‌ ఆఫ్‌ పావర్టీ అండ్‌ హోమ్‌లెస్‌నెస్‌’ అనే థీమ్‌తో జరుపుకోగా 2018లో ‘కుటుంబాలు  సంఘటిత సంఘాలు’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

ప్రతి మనిషి కుటుంబంలో ఒక భాగమే. సమాజంలోని వ్యక్తి సామాజీకరణం ద్వారానే సమాజంలో ఒక మానవత విలువలున్న మనిషిగా మారుతాడు, మనిషిని సమాజంలో ప్రాథమికంగా నియంత్రించేది కుటుం బమే. ఈ నియంత్రణ వల్లే వ్యక్తులు పరిమితులలో ఉంటారు. నేటి ఆధునీకరణ ప్రపంచంలో కుటుంబాలు వ్యక్తులను సామాజికంగా ఎంతవరకు నియంత్రిస్తున్నాయో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో నేరాలు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. సమాజంలో మానవత , నైతిక విలువలు క్షీణించినపుడు యువత తప్పుదారిన పడుతుంది. యువతను నియంత్రించవలసిన బాధ్యత కుటుంబాలదే. కుటుంబాల నియంత్రణ సరిగా లేకపోతే సామాజిక నియంత్రణ ఉండదు దాంతో సమాజంలో అనేక వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కుటుంబాలు బాగుంటే సమాజాలు కూడా బాగుంటాయి. సమాజ అభివృద్ధి కోసం కుటుం బాలు నిరంతరం పాటు పడాలని కోరుకుందాం!.
(మే15, అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం)

– కందగట్ల శ్రవణ్‌ కుమార్, పీహెచ్‌డీ స్కాలర్‌,కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌

మరిన్ని వార్తలు