అమరావతిలో ఆర్థిక నగరమా?

30 Jan, 2019 08:43 IST|Sakshi

విశ్లేషణ

ఈ మధ్య వార్తా పత్రిక లలో ఒక వార్త చదివా. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అమరావతిలో భాగంగా ఆర్థిక నగరాన్ని అభివృద్ధి చెయ్యాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార వర్గాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆ వార్త సారాంశం. అమరావతి నగర నిర్మాణంలో భాగంగా ఒక ఆర్థిక నగరాన్ని, పరిపాలన నగరాన్ని, న్యాయ నగరాన్ని అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు నెలవుగా వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి ఒక బృహత్‌ ప్రణాళికను రూపొందించారు. ఈ విధంగా అమరావతిలో భాగంగా ఒక ఆర్థిక నగరాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ అంశాన్ని పరిశీలించే ముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రత్యేకత, వివిధ ప్రాంతాలకు ఉన్న సహజసిద్ధమైన లక్షణాలను వనరులను, అవకాశాలను, పరిశీలించాల్సి ఉంటుంది. 

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక కాస్మోపాలిటన్‌ నగరంగా స్వయంసిద్ధంగా అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం. కలకత్తా నుంచి చెన్నై  మధ్యలో కోరమాండల్‌ తీరంలో వ్యాపారానికి ఒక ప్రధాన బిందువు వైజాగ్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రులు హైదరాబాద్‌ నగరానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని విశాఖపట్నానికి కూడా ఇచ్చి ఉంటే ఈనాటికే ఇది ఇంకా గొప్ప నగరంగా అభివృద్ధి చెంది ఉండేది.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాణిజ్య వ్యాపారపరంగా ఆర్థిక కేంద్ర బిందువుగా ఏనాటికైనా అభివృద్ధి చెందగలిగిన ఏకైక నగరం విశాఖపట్నం. విశాఖపట్టణాన్ని విస్మరించి, ఆర్థిక నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలనే ఆలోచన అటు విశాఖపట్నానికి, ఇటు అమరావతికి మేలుకన్నా ఎక్కువ కీడు చేస్తుంది. ఇందువలన అమరావతిలో ప్రత్యేకంగా ఆర్థిక నగరం అభివృద్ధి చేసే ప్రతిపాదనలు మానుకొని విశాఖపట్నం మీదనే దృష్టి కేంద్రీకరించటం మంచిది. ఆర్థిక వాణిజ్య వ్యాపార అంశాలకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి విశాఖపట్నాన్ని కేంద్రబిందువుగా అభివృద్ధి చేస్తే గణనీయమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రాజమండ్రినుంచి గుంటూరు వరకు ఉన్న మధ్య కోస్తా ప్రాంతం పంజాబ్‌ హరి యాణాలకన్నా మెరుగైన వ్యవసాయానికి నెలవు. కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి, చొరవ తీసుకొని ప్రయోగాలు చేసి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించిన వ్యవసాయదారులు ఈ ప్రాంతంలో ఉన్నారు. విజయవాడ ప్రాంతం మొదటినుంచీ రవాణా కార్యక్రమాలకు నెలవుగాఉంది. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో మొదటినుంచి నాణ్యమైన విద్యను అందించే విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో విద్యారంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, రవాణా లాజిస్టిక్స్‌ సర్వీస్‌ విభాగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి  ప్రణాళిక రూపొందించుకుంటే గణనీయమైన ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయి. 

ఇక రాయలసీమ ప్రాంతం మూడు మహానగరాలకు మధ్య స్థానంగా ఉంది. చెన్నై నగరానికి పారిశ్రామిక స్థానంగా నెల్లూరు, చిత్తూరు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో కృష్ణపట్నం, రామాయపట్నం ఓడరేవులను అభివృద్ధి చేసి అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రబిందువుగా చేయవచ్చు. ఓబులవారిపల్లె, కృష్ణపట్నం రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తి కావడంతో కాళహస్తి నడికుడి రైల్వే లైన్‌∙నిర్మాణంతో రవాణాపరంగా కూడా  ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాళహస్తి, నడికుడి రైల్వే లైను కేంద్ర ప్రభుత్వ సహాయంతో  వరంగల్‌ దాకా పొడిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు చెన్నై వరంగల్‌ రైల్వే మార్గానికి  సమాంతర రైల్వే మార్గం అభివృద్ధి చెందుతుంది. గూడూరు నుంచి బలార్షాకు మూడవ రైల్వే లైను వేయటానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఇది త్వరితగతిన పూర్తి అయ్యేటట్లు చూసుకోవాల్సిన అవ సరం ఏపీ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. గూడూరు బలార్షా అదనపు రైల్వే లైను వైజాగ్‌ రాయపూర్‌ రైల్వే లైన్లు డబుల్‌ లైన్లుగా మార్చటం తూర్పు తీరంలో మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఓడరేవుల కార్యక్రమాలు విస్తృతం కావడానికి దోహదం చేస్తాయి. 

ఈమధ్య జయప్రకాష్‌ నారాయణ ఆధ్వర్యంలో ఏర్పడిన నిష్ణాతుల కమిటీ భవిష్యత్తులో పెట్టే పెట్టుబడులలో 85% రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలలో పెడితేనే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అన్ని అంశాల మీద దృష్టి కేంద్రీకరించడానికి ముందుగా అమరావతి మహానగర వ్యామోహం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మహా నగరాలు తేనె కుండల్లాగా అన్ని ప్రాంతాల పెట్టుబడులను ఒక చోటికి ఆకర్షించి మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి నష్టం చేస్తాయని శివరామకృష్ణ తన అనుభవంతో చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికను ఆలోచించకుండా మొండిగా ముందుకు పోతే రాష్ట్రం అన్ని విధాలా నష్టపోక తప్పదు.

వ్యాసకర్త : ఐవైఆర్‌ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

iyrk45@gmail.com

మరిన్ని వార్తలు