ఉగ్రవాద దాడిపై కఠిన వైఖరి అవశ్యం

13 Mar, 2019 00:48 IST|Sakshi

సందర్భం 

ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో అవంతిపురం ప్రాంతంలో సిఆర్పీఎఫ్‌ వారి కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. ఆదిల్‌ అహ్మద్‌ ధార్‌ అనే ఆత్మాహుతి దళ సభ్యుడు పక్కదారి నుంచి వచ్చి సిఆర్పిఎఫ్‌ శకటాల శ్రేణిలో 5వ క్రమసంఖ్యలో ఉన్న వాహనాన్ని తన వాహనంతో కొట్టి తనను తాను పేల్చి వేసుకున్నాడు. ఈ మారణహోమంలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైనారు. ఈ దాడిని నిర్వహించింది తనేనని ఆదిల్‌ అహ్మద్‌ ధార్‌ రూపొందించిన ముందస్తు వీడియో ఒకటి వెనువెంటనే విడుదలైంది. పాకిస్తాన్‌లో స్థావరం ఏర్పరచుకుని ఉగ్ర దాడులు ప్రేరేపిస్తున్న జైషే మొహమ్మద్‌ సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ శతాబ్దిలో ఇంతే తీవ్రమైన దాడులు ఇంతకుముందు మూడు జరిగాయి. 2001 సంవత్సరంలో భారత పార్లమెంటు లక్ష్యంగా ఒక దాడి జరిగింది. 2008లో ముంబాయి మహానగరంలో పలు పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. 2016 సంవత్సరంలో ఉడీ విభాగంలో సైన్యంపై దాడి ఆ తర్వాత పఠాన్‌ కోట్‌లో మరొక దాడీ జరిగాయి. ఇంతకు ముందు జరిగిన దాడుల సమయంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు సైనికపరమైన సమాధానాన్ని ఇవ్వలేదు.  

ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయంగా ఉగ్రవాద నిరో ధం కోసం పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచటానికే భారత ప్రభుత్వ చర్యలు పరిమితమైనాయి. పాకిస్థాన్‌ సైన్యం పూర్తి సహాయ సహకారాలతో ఉగ్రవాద సంస్థలు ఈ దాడులు నిర్వహిస్తున్నాయని పూర్తి సమాచారం ఉన్న భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచడం వరకే తన చర్యలను పరిమితం చేసింది. పాక్‌ నిఘా విభాగమైన ఐఎస్‌ఐ ఈ ఉగ్రవాద సంస్థలతో కలిసి మెలిసి పనిచేస్తుందనేది నిర్వివాదాంశం. బంగ్లాదేశ్‌ యుద్ధం సమయంలో జుల్ఫీకర్‌ అలీ భుట్టో భారతదేశంపై 1000 సంవత్సరాల జిహాద్‌ జరుపుతామని ప్రకటించారు. బహిరంగ యుద్ధంలో చాలామార్లు ఓటమి చవి చూసిన తర్వాత నాటి పాకిస్తాన్‌ సైన్యం అధిపతి జియావుల్‌ హక్‌ భారతదేశానికి 1000 ఏళ్లు నష్టం కలిగించే విధంగాగా ఉగ్రవాద సంస్థల చర్యలు ప్రోత్సహిస్తూ పరోక్షంగా భారత్‌పై చర్యలు చేపట్టడానికి ఒక విధానాన్ని రూపొందించారు. దానిలో భాగంగానే పాకిస్తాన్‌ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం, మద్దతుతో ఈ సంస్థలు ఉగ్రవాద కార్యక్రమాలను భారతదేశంలో నిర్వహిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14 సంఘటన తర్వాత భారత ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి.  ఇంతకుముందు లాగానే పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగేటట్లుగా చూడటం. ఈ ఒత్తిడి మూలంగా పాక్‌ ఉగ్రవాద సంస్థలపై చర్య తీసుకుంటుందని ఆశించటం. ఈ సమస్యను భారత్లేవనెత్తిన ప్రతిసారీ తనకు సరైన సాక్ష్యాధారాలు ఇవ్వమని పాక్‌ మనల్ని కోరటం, ఆ పైన ఇచ్చిన సాక్ష్యాధారాలు సరిపోలేదని పేర్కొనటం పరిపాటి అయిపోయింది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా ఈ ఉగ్రవాద సంస్థలపై తగిన ఆధారాలు సేకరించి చర్య తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందనే విషయాన్ని పాక్‌ ఎప్పుడో మర్చిపోయింది. ఈ సంస్థలు పాక్‌ ప్రభుత్వ కనుసన్నల్లోనే పని చేస్తున్నప్పుడు వారిపై అంతర్జాతీయ ఒత్తిడి మూలంగా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశించటం అవివేకమే అవుతుంది.

ఈసారి భారత ప్రభుత్వం ఇంతకుముందు కన్నా భిన్నంగా వ్యవహరించటానికి నిర్ణయించుకుంది. దీనికనుగుణంగా చక్కని ప్రణాళిక రచించింది. భారత యుద్ధ విమానాలు పాక్‌లో చాలా లోపలికి చొచ్చుకుని పోయి బాలాకోట్‌ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యాన్ని ఛేదించి ఎటువంటి నష్టం లేకుండా వెనక్కి తిరిగి వచ్చాయి. మర్నాడు ఈ సంఘటనకు సంబంధించి పాక్‌ స్పందన గంట గంటకు మారిపోతూ వచ్చింది. భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను మాత్రమే దాటాయని బాలాకోట్‌ దాకా రాలేదని ఉదయాన్నే ప్రకటించింది. సాయంత్రానికి మాట మార్చి భారత్‌ విమానాలు బాలాకోట్‌ దాకా వచ్చాయి కానీ పాక్‌ యుద్ధ విమానాలు నిలువరించే సరికి గమ్యరహితంగా తమ బాంబులను వదిలిపెట్టి వెళ్ళిపోయాయని ప్రకటించారు. 

రెండవ రోజు ప్రపంచ మీడియాను తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూపెడతామని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్‌ ఈరోజు వరకు ప్రపంచ మీడియాను ఆ ప్రాంతాలకు రాకుండా కట్టడి చేయడం గమనార్హం. భారతదేశంపై ఎదురుదాడి ఆలస్యం ఎందుకు అయింది అని అడిగిన ప్రశ్నకు జరిగిన నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాతనే  ఎదురుదాడికి దిగాము అని ఇమ్రాన్‌ఖాన్‌ సమాధానమిచ్చారు. వీటన్నిటిని బట్టి చూస్తే భారత యుద్ధ విమానాలు తీవ్రవాదుల స్థావరాలకు తీవ్ర నష్టాన్ని కలిగించినట్లే ఉంది. భారత వైమానిక అధిపతి మార్చి 4న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, చాలా సమాచారం సేకరించిన తర్వాతనే లక్ష్యాలను నిర్ధారిం చుకోవడం జరిగిందని లక్ష్యాలను అనుకున్న విధంగానే ఛేదించామని ఎంతమంది చనిపోయారు అనేది అక్కడ ఉన్న వారి సంఖ్యను బట్టి ఉంటుంది కానీ ఇదమిద్ధంగా చెప్పలేమని చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.

పాకిస్తాన్‌ రెండోరోజు తన అస్తిత్వాన్ని చాటుకోవడానికి వైమానిక దాడికి తలపెట్టడం, దానిని తిప్పికొట్టే యత్నాల్లో రెండవసారి భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్‌ గగనతలంలోకి చొచ్చుకొనిపోవడం వెంటవెంటనే జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్‌ ఒక ఎఫ్‌–16 విమానాన్ని, ఒక పైలట్‌ను కోల్పోయింది. భారత్‌కు చెందిన మిగ్‌–21 విమానం కూలి పోయి ఆ విమాన పైలెట్‌ అభినందన్‌ పాకిస్తాన్‌ సైన్యానికి దొరికారు. అతని విడుదల తర్వాత రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ప్రస్తుతానికి ఉపశమించింది.

ఈ మొత్తం సంఘటనలో ప్రతిపక్షాల పాత్ర చాలా విచి త్రంగానూ బాధ్యతారహితంగానూ ఉంది. దాడులు చేసింది మేము అని జైషే మొహమ్మద్‌ సంస్థ ఒప్పుకున్న తర్వాత కూడా ఈ మొత్తం పుల్వామా సంఘటనపై తమకు అనుమానాలున్నాయని మమతా బెనర్జీ, చంద్రబాబు వ్యాఖ్యాని స్తారు. తీవ్రవాదులపై విమాన దాడులను గురించి  సాక్ష్యాలు చూపెట్టమని కాంగ్రెస్‌ మరికొందరు అడుగుతారు. దేశ రక్షణ అంశంలో అందరూ కలిసి పనిచేయాలనే మౌలిక అంశాన్ని ప్రతిపక్షాలు విస్మరించినట్లున్నాయి. అదే బంగ్లాదేశ్‌ యుద్ధం సమయంలో ఆ నాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్‌పేయి నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఇచ్చిన మద్దతు వారి  దార్శనీక నాయకత్వ లక్షణాలు తెలియజేస్తున్నాయి!

పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు ఒక రక్షిత ప్రాంతంగా ఉండి ఇతర దేశాలపై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్న సమయంలో దానిని ఏ విధంగా దీర్ఘకాలంలో ఎదుర్కోవాలి అనే అంశంపై స్పష్టత అవసరం. ఈ ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్‌ రక్షక దళాల పూర్తి సహాయ సహకారాలతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి  అనేది స్పష్టమే. గతంలోనే ఇలాంటి ఉగ్ర దాడులు జరిగినప్పుడు తగిన ప్రతీకార చర్యలు తీసుకుని ఉంటే ఈ ఉగ్రవాద సంస్థలు మళ్లీ మళ్లీ ఇటువంటి కార్యక్రమాలకు విజృంభించి ఉండేవి కావు. చాలా స్పష్టంగా భారతదేశంలో జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా సరే.. భారతదేశం మీద యుద్ధంగా పరిగణించి స్పందిస్తామనే సందేశాన్ని పాకిస్తాన్‌కు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ప్రధాని ఈ మధ్య ప్రతి ఉగ్రవాద దాడికి అవసరమైతే పాకిస్తాన్లో చొరబడి అయినా సమాధానం చెబుతామని పేర్కొనటం హర్షణీయం అయిన విషయం.

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చెప్పిన విషయం గుర్తు చేసుకుందాం. ‘పిరికితనం’ హింస మధ్య ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటే నేను హింసనే ఎంచుకుంటాను. భారతదేశం తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం అవసరమైతే ఆయుధాలను చేపట్టడాన్ని నేను సమర్థిస్తాను. తనపట్ల జరుగుతున్న అగౌరవానికి పిరికితనంతో సాక్షిగా ఉండే బదులు ఆయుధాలు చేపట్టడమే ఉత్తమం’.


ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com

మరిన్ని వార్తలు