అమరావతి–ఎవరి రాజధాని?

10 Jun, 2018 01:07 IST|Sakshi

ఇటీవల రాజకీయ వర్గాలలోనూ, సోషల్‌ మీడియాలోనూ వార్తల్లో ఉన్న పుస్తకం శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు రాసిన ‘‘అమరావతి – ఎవరి రాజధాని?’’. ఈ పుస్తకం మార్చి–2018లో ప్రచురితమైంది. రాజధాని నగరానికి అంతకుముందే పునాదులుపడ్డాయి, భవనాలు వెలిశాయి, కార్యాలయాలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఈ సందర్భంలో ఈ పుస్తకం రావడం గత జల సేతుబంధనమేనా (వెళ్ళిపోయిన నీటికి ఆనకట్ట కట్టడం) అనే భావన పాఠకుల మనస్సులో మెదిలే అవకాశం ఉంది. అంతమాత్రమే అయితే పుస్తకానికి చారిత్రక విలువ మాత్రమే ఉంటుంది. కానీ అందులో మిగతా అంశాల్ని ప్రస్తావించారు. 

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో ఏవిధంగా సమతౌల్యం సాధించాలి అనే విషయాన్నీ, ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పారు. అంతేకాక వాస్తవాల్ని తెలుసుకునే అధికారం ప్రజలకు ఉందన్న ఉద్దేశం రచయితది. వివిధ దేశాల్లో రాజధానులు ఎలా ఏర్పడ్డాయి, ఎలాంటి ప్రాతిపదికల్ని విశ్లేషించి నిర్మిం చారు అన్న విషయంపై రచయిత పరిశోధన చేశారు. భౌగోళిక ఉనికి, అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యంగా ఉండటం, ఏ ప్రాంతానికీ, వర్గానికీ అక్రమ లాభాన్ని చేకూర్చకుండా ఉండటం, భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలుండటం మొదలైన వాటిని పరిగణనలో తీసుకుని రాజధాని నగరాల్ని ఎన్నుకుంటారు. చారిత్రక నేపథ్యాన్నీ, మిగతా దేశాల్లో అనుభవాన్నీ, మనదేశంలో మిగతా నగరాల అనుభవాన్నీ మొదటి ఐదు అధ్యాయాలలో రచయిత అందించారు. 

2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంలో ఉన్న ఆలోచనావిధానం 2014లో ప్రభుత్వం మారగానే పూర్తిగా మారింది. శివరామకృష్ణన్‌ కమిటీ ఎన్ని అడ్డంకుల్నీ, సహాయ నిరాకరణను ఎదుర్కొని తమ నివేదిక అందించిందీ ఇందులో చూడగలం. అయినప్పటికీ ఆ కమిటీ ఇచ్చిన స్పష్టమైన నివేదికను పూర్తిగా తృణీకరించి తమదైన శైలిలో నిర్ణయాన్ని తీసుకోవడం అప్రజాస్వామికంగా జరిగిందని రచయిత అభిప్రాయం. నిజానికి కొత్త రాజధాని ఏర్పాటు వినూత్నంగా ఆలోచించడానికి ఒక గొప్ప అవకాశం. సంకుచిత రాజకీయ, వర్గ, వ్యాపార ప్రయోజనాల్నీ ఎంచుకున్నందువల్ల వినూత్నంగా ఆలోచించే అవకాశాన్ని ప్రభుత్వం ఎలా కోల్పోయిందీ ఈ పుస్తకంలో పలుచోట్ల చూడగలం. ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని నగరాన్ని ప్రభుత్వ మోతుబరి పెద్దలే ఎలా నిర్ణయించారు అని పుస్తకం వివరిస్తుంది. సంబంధిత వర్గాలతోనూ, ప్రతిపక్ష పార్టీలతోనూ ఏ సంప్రదింపులూ జరగలేదని రచయిత అభిప్రాయం. ఎన్నికల ముందు చేసిన ప్రభుత్వ అధ్యయనాలన్నింటినీ పక్కన ఉంచి కొత్త ప్రభుత్వం ఏకపక్షమైన నిర్ణయం తీసుకుని ఒక ప్రాంతానికీ, ఒక వర్గానికీ లాభదాయకంగా ఉండేట్టు పనిచేసిందని రచయిత వివరించారు. 

ప్రభుత్వ యంత్రాంగానికంతటికీ అధిపతిగా ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో అధికారులు ఎలా నిస్సహాయంగా ఉంటారో రచయిత స్పష్టంగా చెప్పారు. ఉద్యోగంలో చేరినపుడు ప్రభుత్వాధికారులు రాజ్యాంగానికీ, రాజ్యాంగ విలువలకూ కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. రాజకీయనాయకులు కూడా ఇలాంటి ప్రమాణమే చేస్తారు. అయినా అధికార యంత్రాంగానికీ, అధికార పార్టీకీ అభిప్రాయభేదాలు వస్తూంటాయి. ఇద్దరూ ప్రజల సంక్షేమాన్ని గూర్చి మాట్లాడినా రాజకీయ వర్గాలకు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ మారుతున్న రాజకీయ వర్గాల గూర్చి రచయిత ‘కాంట్రాక్టర్‌ క్లాస్‌ నాయకులు’( p.76) అని నిర్మొహమాటంగా చెప్పారు. రాజధాని నగరాన్ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని మరొకచోట (p.81) పేర్కొన్నారు.

పట్టణ నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల్నీ, కొత్త ఆలోచనల్నీ ఈ పుస్తకం వివరిస్తుంది. గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ (పొలాల స్థలంలో కొత్త పట్టణాలు తయారుకావడం) అనే ప్రయోగం మనదేశంలోనే కొన్నిచోట్ల విఫలమైన విషయాన్ని ఇందులో చూస్తాం. అలాగే భూమి సేకరణ (land pooling) చేయాల్సిన విధానం, చేసిన విధానం రెంటినీ రచయిత విశ్లేషిం చారు. బెదిరింపులు, ఊహాలోక నిర్మాణం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం భూసేకరణ చేయడం విచారకరమైన విషయం. తరతరాలుగా వచ్చిన భూముల్ని, తాము ఎంతో ప్రేమగా చూసుకున్న భూముల్ని వదులుకోవడంలో రైతులు ఎంత మానసిక క్షోభను అనుభవించారో రచయిత (p.90) వివరించారు. గొప్ప నైతిక రాజ్యంగా అందరూ భావించే సింగపూర్‌ లాంటి దేశాలు విదేశవిధానాల్లో ఎంత అనైతికంగా ఉంటాయి అన్నది అందరికీ తెలి యని విషయం. సింగపూర్‌ డొల్లతనాన్ని కూడా (p.94) రచయిత వర్ణించడాన్ని చూడగలం.       
 
ఎవరి రాజధాని? అనే ప్రశ్నతోనే ఇది ప్రజల రాజధాని కాదని స్పష్టంగా చెప్పారు. రచయిత ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కావడం వల్ల వారికి విషయాలపై పూర్తి అవగాహన, పూర్తి సమాచారం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పంపకం ఉండాలని రచయిత సూచించారు. ప్రజాసమస్యలపై ఆలోచించే ప్రతి పౌరుడూ, విద్యార్థులూ అందరూ చదవాల్సిన పుస్తకమిది. కేవలం వర్గ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిపై నిర్ణయాలు తీసుకున్నారని ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇద్దరు ప్రముఖులూ తెలపడం కూడా గమనించదగింది. 

కె. అరవిందరావు,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ

 

మరిన్ని వార్తలు