వితండవాదమే ఒక విధ్వంసం

13 Mar, 2018 02:41 IST|Sakshi

విశ్లేషణ
విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రధానంగా నష్టపోయినది– హైదరాబాద్‌ మహా నగరం. ఆ నగరం ద్వారా వచ్చే ఆదాయ వనరులు. నిజానికి ఈ మహా నగరాన్ని అంతా కలసి నిర్మించుకున్నాం. ఇంతకు మించి రాష్ట్రానికి జరిగిన నష్టం ఏదీ లేదు. ఈ నష్టానికి కూడా పూర్తిగా కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత కేంద్రం నుంచి పరిహారం వచ్చింది. విభజనతో నష్టం, కేంద్రం సహాయ నిరాకరణ అంటూ అవే విషయాలను, విమర్శలను పదే పదే ప్రస్తావిస్తూ దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని పాకులాడడం సరికాదు.

గుంటూరు జిల్లా కాకానిలో ఈమధ్య జరిగిన ఒక బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి వైదొలగకపోయినా, కేంద్ర మంత్రిమండలి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేలూ రాజీనామాలు సమర్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమనే చెప్పాలి.

కొందరు వ్యక్తులు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్కలు చూపించమని అడుగుతున్నాయనీ, కానీ అది సాధ్యం కాదనీ, అడగడం సరికాదనీ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలేనని ఆయన వాదన. ఒకవేళ దేని గురించి అయినా సమాధానమో, వివరణో ఇవ్వవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కూ, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకూ సమాధానం చెప్పుకోవాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు.

అంతేతప్ప ఇంకెవరికీ జమాఖర్చులు చెప్పవలసిన అవసరం లేదని భాష్యం చెప్పారు. అంతేకాదు, రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదనీ, దీనితో ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం వాటిల్లిందనీ అంటూ, ఇందువల్ల పంజాబ్, అస్సాం రాష్ట్రాల తరహాలో వెళితే ఆంధ్రప్రదేశ్‌ మరింతగా నష్టపోక తప్పదని కూడా చంద్రబాబు విశ్లేషించారు.

అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోకుండా, దానికి బదులు నవ నిర్మాణదీక్షా దినాన్ని జరుపుకోవడం వెనుక ఆర్థిక పరిస్థితులే ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. అంతేకాకుండా, రాష్ట్రానికి న్యాయం జరగని పక్షంలో విభజన శక్తులు విజృంభిస్తాయని పార్లమెంట్‌ సభ్యుడొకరు హెచ్చరిక వంటి వ్యాఖ్య కూడా చేశారు. పైగా ఆ ఎంపీ ముఖ్యమంత్రికి సన్నిహితునిగా పేర్గాంచారు కూడా.

ఆ వ్యాఖ్యలు అవాంఛనీయం
దేశంలో ఒక అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రి పదవిని చిరకాలం నిర్వహించిన వ్యక్తిగా పేరున్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలలోని ఔచిత్యాన్ని చర్చిద్దాం. వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వాలు లెక్కలు చూపించవలసిన అవసరం లేదన్నది చంద్రబాబు చేసిన మొదటి వ్యాఖ్య. ఇలా భావించడం సహేతుకమే. సరైనదే కూడా. సమాచార హక్కు చట్టం కిందనే అయినా కూడా, ఇవ్వవలసిన సమాచారం కన్నా ఎక్కువ సమాచారాన్ని ఏ ప్రభుత్వమూ అటు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వవలసిన అవసరం లేదు.

ఆ చట్టం పరిధి మేరకు ప్రజలు కావలసిన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పొందవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకు సంబంధించి వినియోగ పత్రాలను (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌) సమర్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద మాత్రం ఉంది. ఈ బాధ్యత నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన వెసులుబాటు, మినహాయింపు లేవు. రాష్ట్రాలలో చేపట్టవలసిన కొన్ని పథకాలు, ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా కొన్ని నిధులు వస్తాయి. ఆ నిధులు ఎలా ఖర్చు చేసినదీ లెక్క చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణలో కీలకమైన అంశం.

రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ ఒకటి. రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలంటే ఎవరికీ పేచీ ఉండదు. కానీ అవి సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలు కావని మాత్రం గుర్తించాలి. ఏ దేశంలో అయినా రక్షణ, విదేశీ వ్యవహారాలను నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికే సార్వభౌమాధికారం ఉంటుంది. చంద్రబాబు భావనలోని సార్వభౌమాధికార వ్యవస్థ చాలా కఠినమైన నిబంధనలతో రూపొందించిన అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా లేదు.

రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా విభజించారని చంద్రబాబు ఆరోపణ. అందుకు రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. అసలు జరిగిన పరిణామాలు, గడచిపోయిన కాలం నేపథ్యంలో ఇలాంటి వాదనలోని సహేతుకత ఎంత? పైగా ఈ అంశాన్ని నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి ఎప్పుడు అవకాశం వచ్చినా జార విడుచుకోకూడదన్నట్టు చర్విత చర్వణంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు.

కానీ రాష్ట్ర విభజన అనే ఆ ‘అశాస్త్రీయ’ పరిణామంలో, అందుకు అంకురార్పణ చేసిన అనేక శక్తులలో ముఖ్యమంత్రిగారి పాత్ర కూడా లేదని చెప్పలేం కదా! ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలుకుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అక్టోబర్‌ 8, 2006లో చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాశారు. అందువల్ల రాష్ట్ర విభజన నిర్ణయానికి ఆయన కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ఆయన కట్టుబడి ఉన్న సంగతి తేలిపోయినప్పుడు, ఇక మిగిలేది ఏమిటి? హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారన్న అంశం.

బిల్లుకు ప్రతిపాదనలు చేస్తే బాగుండేది
పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టదలిచిన బిల్లు ఏదైనప్పటికీ దాని ప్రతులను ముందుగానే సభ్యులందరికీ అందచేస్తారు. అలాగే విభజన బిల్లు ప్రతులు కూడా తెలుగుదేశం సభ్యులందరికీ ముందుగానే అంది ఉంటాయి. మరి, విభజన నిర్హేతుకమన్న అభిప్రాయం కలిగి ఉన్నవారు ఆ బిల్లును అధ్యయనం చేసి, శాస్త్రీయమైన, హేతుబద్ధమైన మార్పులను ఆనాడే ఎందుకు ప్రతిపాదించలేదు? తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు కూడా ఆ బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరిశీలించి తన పార్టీ సభ్యులకు ఎందుకు తగిన విధంగా దిశా నిర్దేశం చేయలేదు? విభజన బిల్లు పార్లమెంట్‌లో గందరగోళం మధ్య నెగ్గింది.

నిజమే. అయినా కూడా ఆ బిల్లుకు లిఖిత పూర్వకంగా మార్పులూ చేర్పులూ సూచించడానికి పార్లమెంట్‌ సభ్యులకు చాలినంత సమయం ఉందన్న మాట మాత్రం వాస్తవం. కానీ ఆనాడు రాజకీయ ప్రయోజనాల కోసం వారు మౌనం దాల్చారు. ఇప్పుడుమాత్రం విభజన అశా స్త్రీయం, నిర్హేతుకం అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ధోరణి వల్ల ముఖ్యమంత్రి విశ్వసనీయతపైనే అనుమానం కలుగుతుంది.

విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని, పంజాబ్, అస్సాం రాష్ట్రాలకు జరిగిన నష్టాలతో పోల్చడం మరొకటి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఈ తరహా పోలికలు తేవడం సుదీర్ఘ రాజకీయ, పాలన కలిగిన నాయకుల స్థాయికి ఎంత మాత్రం తగదు. అసలు ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయకుండా ఉంటే బాగుండేది. పంజాబ్, అస్సాం రాష్ట్రాల పరిస్థితికీ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితికీ పోలికే లేదు.

అనాలోచితంగా జరిగిన రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు దెబ్బ తిన్నాయని అభిప్రాయపడడం, భావించడం తప్పు కాదు. కానీ, తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఆనాడు విభజనను అంగీకరించిన అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు బాధ్యత వహించవలసిందే. మరొక విషయం. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందించవలసిన చేయూత గురించి నాలుగేళ్లుగా రాష్ట్రం తరఫున మంతనాలు సాగించారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని చెబుతూ వచ్చారు.

పురోగతి కూడా తృప్తికరంగానే ఉందని చెప్పారు. కానీ మళ్లీ ఇప్పుడు హఠాత్తుగా వేరొక ధోరణి ప్రదర్శిస్తూ పంజాబ్, అస్సాంల స్థితిగతులతో రాష్ట్ర పరిణామాలను పోల్చడం చాలా ప్రమాదకరమైన ఎజెండాను తెర మీదకు తీసుకురావడమే అవుతుంది. ముఖ్యమంత్రితో పాటు, పార్టీలో ముఖ్యునిగా భావించే మరొక ఎంపీ చేసిన వ్యాఖ్యలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల వ్యాఖ్యానాలు పరిశీలిస్తే అవన్నీ దేశ ప్రయోజనాలకు, వాటి స్ఫూర్తికి భిన్నమైన ధోరణులని చెప్పక తప్పదు.

ఇక, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడానికి బదులు నవ నిర్మాణ దీక్షను జరుపుకోవడం గురించి కొంచెం. ముఖ్యమంత్రికి అపార పాలనానుభవం ఉంది. కొత్త రాష్ట్రం సమస్యలు, ఆర్థిక సమస్యలు తెలుసు. కానీ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా ఆర్థిక క్రమశిక్షణ కనిపించదు. ఎటు చూసినా హద్దులెరుగని ఖర్చు.

వీటిని గమనించకుండా ఇప్పుడు బీద అరుపులు శోచనీయం కాదా! ఇలాంటి ధోరణికీ, ఆ బీద అరుపులకు ఇకనైనా స్వస్తి పలకవలసిన అవసరం చాలా ఉంది. నవ నిర్మాణదీక్ష పేరుతో, హేతుబద్ధత లేకుండా విభజన జరిగిందంటూ కాంగ్రెస్‌ అనే చచ్చిన గుర్రాన్ని మళ్లీ మళ్లీ బాదుతున్నారు. ఇలాంటి ధోరణితో చల్లారిన మనోభావాలను రెచ్చ గొట్టే యత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ సరికాదు.

ఆశావాదంతో అడుగేద్దాం!
నిజమే, మనకు 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి సంక్రమించిన ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు దక్కింది. మళ్లీ ఇందులో భద్రాచలం మినహాయింపు. విభజనకు ముందే దూరదృష్టితో భద్రాచలానికి ప్రత్యేక జిల్లా హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి ఉంటే ఆ ప్రాంత వాసులు కూడా ఆంధ్రప్రదేశ్‌తో కలిసేవారు. కానీ రాజధాని సమస్య ఒకటి ఉంది. మళ్లీ ఎక్కడ రాజమండ్రి, కాకినాడ పరుగెత్తవలసి వస్తుందోనని వారు తెలంగాణ వైపు మొగ్గు చూపారు.

విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రధానంగా నష్టపోయినది– హైదరాబాద్‌ మహా నగరం. ఆ నగరం ద్వారా వచ్చే ఆదాయ వనరులు. నిజానికి ఈ మహా నగరాన్ని అంతా కలసి నిర్మించుకున్నాం. ఇంతకు మించి రాష్ట్రానికి జరిగిన నష్టం ఏదీ లేదు. ఈ నష్టానికి కూడా పూర్తిగా కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత కేంద్రం నుంచి పరిహారం వచ్చింది. విభజనతో నష్టం, కేంద్రం సహాయ నిరాకరణ అంటూ అవే విషయాలను, విమర్శలను పదే పదే ప్రస్తావిస్తూ దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని పాకులాడడం సరికాదు.

అందుకు బదులు కొత్త రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆశావాదులమై ముందడుగు వేయడం అత్యంత అవసరం. అలాంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది కూడా. ముఖ్యమంత్రికి నా విన్నపం ఏమిటంటే– అక్టోబర్‌ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుందాం. విశాలాంధ్ర విభజనతోనే నవంబర్‌ 1 తన ఉనికిని కోల్పోయింది. అక్టోబర్‌ 1, 1953 నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కర్నూలులో నిర్వహించారు.

ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే స్ఫూర్తితో ఆశావాదంతో అవతరణ దినోత్సవాన్ని జరుపుకుందాం. నిరాశావాదానికి ప్రతిబింబించే నవ నిర్మాణ కార్యక్రమానికి చరమగీతం పాడదాం. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని అర్పించిన పొట్టి శ్రీరాములుగారికీ, తన సంపదనంతా త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అప్పుడే నిజమైన నివాళి ఘటించినట్టు అవుతుంది.

ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు