రాజ్యాంగం వేదమంత్రమా, కరదీపికా?

26 Jan, 2019 00:34 IST|Sakshi

విశ్లేషణ

పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ద్రవ్యబిల్లును పొరపాటున తన ఆమోదం కోసం తీసుకువచ్చినప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న నాటి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎమ్‌. హిదయతుల్లా దాన్ని తిరస్కరించారు. ఆయన రాజ్యాంగాన్ని సంప్రదాయంగా కాకుండా, కార్యనిర్వాహక కరదీపికలాగా చూశారు. కానీ నేటి రాజకీయ నాయకత్వం రాజ్యాంగంలోని సూక్ష్మభేదాలను పట్టించుకోవడం లేదు. రాబర్ట్‌ బొర్క్‌ ప్రకారం, మనం రాజ్యాంగాన్ని చదవడం కాదు.. అసలు చదవాలా అన్నదే ప్రశ్న. నేడు మనం ‘రాజ్యాంగ నైతికత’ యుగంలోనూ, న్యాయ ధర్మ శాస్త్రాన్ని సీల్ట్‌ కవర్‌లో ఉంచేసిన యుగంలోనూ జీవిస్తున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించుగాక..!

అత్యంత శ్రద్ధాశక్తులతో, శ్రమకోర్చి రూపొం దించిన భారత రాజ్యాంగం.. రాజకీయ పవి త్రత కలిగిన శాసన పత్రం. నూతన గణతంత్ర వ్యవస్థ నిర్మాతలు పొందుపర్చిన ఆదర్శాలతో అది ప్రతిష్టితమైనది. కానీ దేశంలో 70 ఏళ్లుగా సాగుతున్న క్రమబద్ధ పాలనలో అది దాని ప్రాసంగికతను, ప్రగతిశీల స్వభావాన్ని కోల్పోయిందా అని నేను భీతిల్లుతున్నాను. ఏడు దశాబ్దాలలోపే మన రాజ్యాంగం సారాంశాన్ని లేక స్ఫూర్తిని కొనసాగించకుండా, దాన్ని కేవలం ఒక పూజనీయమైన పవిత్రగ్రంథం స్థాయికి కుదించివేశారు. నిజానికి అది రాజ్యాంగ పరిధిలో స్థాపించిన ప్రభుత్వానికి చెందిన మూడు విశిష్ట విభాగాల దుష్పరిపాలనకు వీలుకల్పించే అధికార వనరుగా మారిపోయింది. వివిధ రాజ్యాంగ సంబంధ కార్యాలయాలు తమ అసమర్థత కారణంగా రాజ్యాంగ ప్రతిని చదవటం కానీ లేక దాని సంవిధానాన్ని అర్థం చేసుకోవడం కాని చేయలేకపోతున్నాయి. తన మహోన్నతమైన ప్రయోజనాన్ని గుర్తించడానికి బదులుగా భారత ప్రజ లపై అధికారాన్ని చలాయించే వనరుగా మాత్రమే మన రాజ్యాంగం మారిపోయింది. వేదమంత్రాల స్థాయిలో రాజ్యాంగ అధికరణలను మతిహీనంగా జపిస్తున్నారు.

రాజ్యాంగ న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులే భారత రాజ్యాంగం అత్యున్నత పూజారులు. చాలాకాలం క్రితమే మృతిచెందిన ఇతర దేశాలకు చెందిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయోగించిన సామెతలు, నిగూఢ పదబంధాలు, ఉల్లేఖనల ప్రస్తావనలతో వీరు సంతోష పడుతున్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త హైకోర్టు ఏర్పాటు అంశం దీనికి సంబంధించిన తాజా అభాసగా నిలుస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం (1956 నుంచి 2014 వరకు మనుగడలో ఉండింది) ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 పేరిట పార్లమెంటు చేసిన చట్టం ద్వారా విభజనకు గురైంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అనే రెండు రాష్ట్రాలను రూపొందించింది. రెండు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైన వివిధ అంశాలను ఈ చట్టంలో పొందుపర్చారు. 

ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకించి విడిగా హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలోని 214 అధికరణ ఆదేశించి ఉన్నందున, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టును ‘ఏర్పాటు చేయాల్సిన’ అవసరముందని, హైదరాబాద్‌ పరిధిలోని హైకోర్టును, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా మార్చాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 30, 31 ప్రకటించాయి. అయితే హైదరాబాద్‌ పరిధిలోని హైకోర్టు మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టే తప్ప మరొకటి కాదు. దాని ప్రాదేశిక అధికార పరిధి రెండు కొత్త రాష్ట్రాల సారాంశంగా ఉండేది. కానీ రెండు రాష్ట్రాల అధికార పరిధిని కలిగి ఉండిన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాదేశిక అధికార పరిధిని మాత్రమే కలిగి ఉంటోంది. 

అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ‘ఏర్పర్చాల్సిన’ తేదీ గురించి పునర్వ్యవస్థీకరణ చట్టం మౌనం వహించింది. అలాగే ప్రత్యేక హైకోర్టును ఏర్పర్చాల్సిన విధివిధానం గురించి కూడా ఈ చట్టం మౌనం పాటిస్తోంది. దీన్ని వివరించడానికి మనం ఆంధ్రప్రదేశ్‌ చట్టం 1953, సెక్షన్‌ 28ని ప్రస్తావించాలి. 1956 జనవరి ఒకటవ తేదీన లేక రాష్ట్రపతి ప్రకటన ద్వారా నిర్దేశించిన అంతకు మునుపటి తేదీన కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలని ఇది నిర్దేశించింది. హైకోర్టు ప్రధాన పీఠం నెలకొల్పాల్సిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నిర్ణయించవచ్చని సెక్షన్‌ 28(3) ప్రకటించింది. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, గుజ రాత్‌ రాష్ట్రాలను ఏర్పర్చిన బిహార్, మధ్యప్రదేశ్, బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టాల్లో కూడా ఇదే విధమైన అంశాలను మనం చూడవచ్చు.

పైన పేర్కొన్న చట్టాలన్నింటిలోనూ నూతనంగా ఏర్పర్చిన హైకోర్టు ఉనికిలోకి వచ్చే తేదీని నిర్ధారించే నిబంధనలను, హైకోర్టు ప్రధాన పీఠం ఎక్కడ ఉండాలో నిర్ణయించే రాజ్యాంగబద్ధ అధికారి గురించి నిర్దిష్టంగా సూచించడమైనది. నూతన హైకోర్టుకు చెందిన రాజ్యాంగబద్ధ ప్రాథమిక శాసనాధికారాన్ని పార్లమెంటు అత్యంత స్పష్టంగా నిర్దేశించింది. దురదృష్టవశాత్తూ, నూతన హైకోర్టు ఉనికిలోకి రావలసిన తేదీకి సంబంధించి 2014 చట్టంలో అలాంటి శాసనసంబంధమైన నిబంధనను మనం చూడలేం. లేక అలాంటి నిర్దిష్ట  తేదీని ప్రకటించే అధికారాన్ని భారత రాష్ట్రపతి లేక మరెవరైనా రాజ్యాంగబద్ధ అధికారికి కట్టబెట్టిందీ లేదు.
 
అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన హైకోర్టు ఏర్పాటు, భారత రాష్ట్రపతి సంతకం చేసిన 2018 డిసెంబర్‌ 26 నాటి భారత ప్రభుత్వ గెజెట్‌లో ప్రచురించిన ప్రకటన ద్వారా ఉనికిలోకి వచ్చింది. భారత ప్రభుత్వం వర్సెస్‌ బి. ధనపాల్‌ ఎస్‌ఎల్‌పి 298902018 మరియు రాష్ట్రాలకు చెందిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ ప్రకటన ప్రస్తావిస్తూ, ఆ తీర్పు స్ఫూర్తితో హైదరాబాద్‌ అధికార పరిధిలోని హైకోర్టును తెలం గాణ హైకోర్టుగా, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుగా విభజించే ప్రకటనను సంబంధిత సమర్థ అధికారి చేయగలరని పేర్కొంది. అయితే న్యాయపాలనా పవిత్ర సూత్రం పరిధిలో అలాంటి సమర్థ అధికారి ఎవరు, స్వయంగా రాజ్యాంగం ద్వారా లేక రాజ్యాంగం పరి  ధిలో రూపొందించిన ఏదైనా చట్టం ద్వారా రాజ్యాంగ పాలన కలిగిన దేశంలో ఏదైనా ప్రభుత్వ చట్టం ద్వారా అలాంటి అధికారాన్ని చలాయిస్తారా అన్నదే ప్రశ్న. నేను ముందే చెప్పినట్లుగా హైకోర్టు ఏర్పాటు తేదీని ఎవరు నిర్ణయించాలి అనే అంశానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పూర్తిగా మౌనం పాటిస్తోంది. కానీ రాష్ట్రపతి పేరుతో జారీ చేసే ప్రకటన ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని  ప్రభుత్వం లేక దేశ పాలకులు విశ్వసిస్తున్నారు.

అయితే ఒరిజనల్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుగా ఉండి ఇప్పుడు మారిన తెలంగాణ హైకోర్టులో కుదించిన ప్రాదేశిక న్యాయాధికార పరిధితో కొనసాగనున్న జడ్జీలుకూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేయడమే ఈ మొత్తం ఉదంతంలో ఉల్లాసం కలిగించే అంశం. అయితే తాజాగా ఎలాంటి నియమకాలకు చెందిన వారంట్లనూ జారీచేయలేదు. నా అభిప్రాయంలో ఇది సరైనదే. కానీ అదేసమయంలో, రాజ్యాంగ సంవిధా నాన్ని లేక రాష్ట్రపతి అధికారాలను విశ్లేషించి చూస్తే ఇలా కొత్తగా ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. మాతృసంస్థ అయిన మద్రాసు హైకోర్టు నుంచి ప్రాదేశిక న్యాయాధికార పరిధిలో ఆంధ్ర హైకోర్టు 1953లో ఏర్పాటైన సందర్భంగా మదరాసు హైకోర్టులోనే ఉండిపోయిన న్యాయమూర్తులు కొత్తగా ప్రమాణం చేయలేదు. అలాగే గుజరాత్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నూతన హైకోర్టులను ఏర్పర్చిన సందర్భం లోనూ బాంబే, పాట్నా, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు కొత్తగా ఎలాంటి ప్రమాణం చేయలేదు. చెప్పుకుంటే ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టుగా పిలుస్తున్న హైదరాబాద్‌ అధికార పరిధిలో కొనసాగుతున్న జడ్జీలు మాత్రం తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో ఇలాంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినప్పుడు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, ప్రస్తుత సిట్టింగ్‌ జడ్జీలు కూడా వాటికి హాజరవటం గమనార్హం.

1969లో నాటి రాష్ట్రపతి జకీర్‌ హుస్సేన్‌ పదవిలో ఉండగానే మరణించినప్పుడు, రాష్ట్రపతిగా వ్యవహరించిన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన పదవికి రాజీనామా  చేశారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి దేశ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి రాజ్యాంగం రీత్యా పరిస్థితి డిమాండ్‌ చేసిన నేపథ్యంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎమ్‌  హిదయతుల్లా మరొకరి బదులుగా రాష్ట్రపతిగా అయ్యారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మనీ బిల్లును ఆయన పరిశీలనకు పంపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 117(1) ప్రకారం, రాష్ట్రపతి  ‘సిపార్సు’తో మాత్రమే పార్లమెంటులో మనీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. పార్లమెంటు ఉభయసభల్లో ఈ బిల్లు నెగ్గినట్లయితే, దాన్ని మళ్లీ రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. ఇక్కడ సంక్లిష్ట  పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికే రాష్ట్రపతి సిఫార్సు చేస్తారు. రాష్ట్రపతి ఆమోదం ఆ బిల్లును శాసనంగా మారుస్తుంది.

అయితే పార్లమెంటులో ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగా నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా ముందుకు పొరపాటున ఆ ద్రవ్య బిల్లును తీసుకెళ్లారు. హిదయతుల్లా  రాజ్యాంగం గురించి మరిచిపోయి ఉంటే, లేక రాజ్యాంగం గురించి తెలియకుండా ఉంటే, లేక అహంభావంతో ప్రవర్తించి ఉంటే ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతూ సంతకం పెట్టేవారు. దీంతో  పార్లమెంటులో దాన్ని ప్రవేశపెట్టకుండానే ఆ బిల్లు భారత ప్రామాణిక శాసనంగా మారిపోయి ఉండేది. హిదయతుల్లా రాజ్యాంగానికి సేవ చేసిన విశిష్ట న్యాయవేత్త. ఆయన రాజ్యాంగాన్ని కార్యనిర్వాహక కరదీపికలాగా చూశారు. ఆయన కేవలం సంప్రదాయాలను గుడ్డిగా పాటించే అత్యున్నత  పూజారి కాదు. అందుకే పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే తన వద్దకు వచ్చిన ఆ ద్రవ్యబిల్లును ఆమోదించడానికి ఆయన తిరస్కరించారు. దాంతో ఆయన కింది అధికారులు న్యాయమీమాంసకు సంబంధించిన ఒక పెను సంక్షోభాన్ని తప్పిస్తూ తమ తప్పును సరిదిద్దుకోవలసి వచ్చింది. 

హిదయతుల్లా ఇప్పుడు లేరు. కానీ నేటి రాజకీయ నాయకత్వం రాజ్యాంగంలో పొందుపర్చి ఉన్న సూక్ష్మభేదాల గురించి పెద్దగా విచారించడం లేదు. వారితోపాటు ప్రధాన పూజారులు  కూడా వాటిని లెక్కబెట్టడం లేదు. ఈ సందర్భంగా నేను రాబర్ట్‌ బొర్క్‌ ప్రకటనను గుర్తు చేస్తాను– ఈరోజుల్లో రాజ్యాంగాన్ని ఎలా చదవాలన్నది కాదు.. చదవాలా వద్దా అన్నదే ప్రశ్న.  ఇప్పుడు మనం ‘రాజ్యాంగ నైతికత’ యుగంలోనూ, న్యాయ ధర్మశాస్త్రాన్ని సీల్ట్‌కవర్‌లో ఉంచేసిన యుగం లోనూ జీవిస్తున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించుగాక!


జాస్తి చలమేశ్వర్‌ 
వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

మరిన్ని వార్తలు