తూర్పు కనుమల్లోకి ‘రాజ్యం’ ప్రవేశం!

22 Feb, 2020 14:25 IST|Sakshi
వెలింగొండ సొరంగ మార్గంలో లోకో ట్రైన్‌ నుంచి దిగుతున్న సీఎం జగన్‌

అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులు పరి శీలించడానికి ఫిబ్రవరి 20న శివరాత్రికి ముందురోజు నల్లమల అడవుల ముఖ ద్వారం డోర్నాల వద్దకు వెళ్లారు. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రమాదవశాత్తు నల్లమల అడవుల్లో మరణించిన కర్నూలు జిల్లా వెలిగోడు మండలంలోని రుద్రకొండ వద్ద ఉన్న పావురాలగుట్టకు ఈ వెలిగొండ ప్రాజెక్టు సమీప ప్రాంతం. అయితే, సీఎంగా వైఎస్సార్‌ జీవించివున్న రోజుల్లో నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలకు సిద్ధం అన్నప్పుడు, ‘మీడియా’ సాక్షిగా వాళ్ళు అడివిలో నుండి బయటకు వచ్చిందీ, చర్చలు ముగిసాక వాళ్ళు తిరిగి ‘లోపలికి’ వెళ్ళిందీ ఆ ప్రాంతంలోనే. మా ప్రభుత్వం మీతో మాట్లాడుతుంది అని నక్సలైట్లను ఆహ్వానించిందీ, ఆ ప్రాంతాన్ని ప్రధాన స్రవంతితో కలపడానికి వెలుగొండ ప్రాజెక్టుకు ఆయన శంకు స్థాపన చేసిందీ; ఇవి రెండూ జరిగింది, 2004లో వైఎస్సార్‌ సీఎం అయిన తొలి ఆరు నెలల్లోనే. నిజానికి ఈ ప్రాజెక్టును 1996 మార్చి 5 న అప్పటి సీఎం చంద్రబాబు తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును అయిదేళ్లలో పూర్తి చెయ్యాలని అప్పట్లో లక్ష్యం పెట్టారు, కాని 2000 మే చివరి వరకు కనీసం అనుమతులు కూడా రాలేదు. తర్వాత 2004 ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది.

వైఎస్సార్‌ సీఎం అయ్యాక, 2004 అక్టోబర్‌ 27న నల్లమల ముఖద్వారం గొట్టిపడియ దగ్గర దీనికి శంకుస్థాపన చేసి, వెంటనే నిధులు విడుదల చేశారు. అప్పటికి 1996లో రూ. 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి రూ. 5,500 కోట్లకు చేరింది. కానీ, వైఎస్సార్‌ చొరవతో 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80% పూర్తి అయ్యాయి. మూడు ఆనకట్టలు పూర్తి చేశారు. కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు ఇంకా పూర్తి కాలేదు. తండ్రి ఆనాడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు వద్ద, ఇప్పుడు తనయుడు సీఎం హోదాలో ప్రాజెక్టు సొరంగం ‘లోపలికి’ వెళ్ళడం అనేది, దృశ్యమానంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉండవచ్చు. కానీ చూడ్డానికి అక్కడ అంతకు మించి ఇంకా ఎంతో వుంది. ఇప్పటివరకు రాజ్యం ‘లోపలికి’ వెళ్ళక, ‘ఓపెన్‌’ కాని చాలా కొత్త ప్రాంతాలను, ఈ ప్రభుత్వం విద్య, వైద్యంతో పేదలకు గౌరవ ప్రదమైన జీవనం ఇస్తూ, చేస్తున్న ‘ఓపెన్‌’కు ఇదొక ఆరంభం మాత్రమే. (చదవండి: వెలిగొండ వేగం పెరగాలి)  


మధ్య కోస్తాలో తూర్పుకనుమల పాదాల వద్ద నల్లమల అడవుల అంచుల్లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు, జిల్లాల్లోని కరువు ప్రాంతాల్ని కలుపుకుని, 1970లో ‘ప్రకాశం’ ఒక జిల్లా అయింది. జిల్లా పశ్చిమ ప్రాంతం పెద్దగా మెరుగుపడిన పరిస్థితి అయితే ఇప్పటికీ లేదు. 2014 లో రాష్ట్ర విభజన జరిగాక, ఇప్పుడు ఈ ప్రాంతం మీద ప్రభుత్వం ‘ఫోకస్‌’ పడింది గానీ, లేకుంటే ఈ ప్రాంత పరిస్థితిని వూహించడం కష్టం.

‘వెలుగొండ’ ప్రాజెక్టు పూర్తి అయ్యాక, సాగులోకి రానున్న 4,47,300 ఎకరాల భూములకు ఇన్నేళ్లకు విలువ పెరగనుంది. కృష్ణా నది సహజ ప్రవాహాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన దారి మళ్ళించి నల్లమల అడవుల గర్భం లోపల నుండి కొండకు వేసిన సొరంగ మార్గం ద్వారా, త్వరలో నదీ జలాలు ఇకముందు రాష్ట్రం నడిబొడ్డున ఉన్న నిత్య కరువు ప్రాంతానికి తరలివస్తాయి. తూర్పు కనుమల్లో నల్లమల అరణ్యం అంచుల్లో ఇప్పటివరకు సాగు జలాలు అందని ఇంత పెద్ద విస్తీర్ణం ఇకముందు సాగులోకి వస్తుంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 30 మండలాలోని 15.25 లక్షల మంది ప్రజలకు తాగునీరు సాకర్యం లభిస్తుంది. ఏకకాలంలో ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి మధ్యకోస్తా ప్రాంతాన్నే కాకుండా రాయలసీమ జిల్లాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతిపాదిత ‘మెరైన్‌ బోర్డ్‌’ వచ్చాక రామాయపట్నం, దుగ్గరాజపట్టణం పోర్టులకు రవాణా కోసం అనుసంధానం అయ్యే ఈ ప్రాంతం రూపురేఖలు చాలా తక్కువ కాలంలో మారిపోతాయి అనడంలో ఆశ్చర్యం లేదు.
 


- జాన్‌సన్‌ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు