ట్రంపూ–విశాఖపట్టణం–మనమూ!

3 Mar, 2020 01:10 IST|Sakshi

సందర్భం

ఇప్పటికే దేశ సరిహద్దుల్ని చుట్టుముట్టిన చైనా ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్టు విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక, ఐదేళ్ళుగా చేసిన తాత్సా రం కారణంగా, చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాక ఏక పక్షం అయింది. పర్యటన తర్వాత ఎవరికెంత ప్రయోజనం అంటూ వేస్తున్న లాభనష్టాల లెక్కల్లో ఏ విలువ లేదు. అమెరికా గత సంవత్సరం థాయ్‌లాండ్‌లో జరిగిన ‘ఆసియాన్‌’ సదస్సులోనే ఇందుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను సిద్దం చేసుకుంది. ఆగ్నేయ ఆసియా దాటి ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలోకి ప్రవేశించాలనే చైనా దూకుడును ఆపాలని బరాక్‌ ఒబామా తన రెండవ ‘టర్మ్‌’ లో ఆసియా–పసిఫిక్‌ కేంద్రిత విదేశీ విధానం ప్రకటించినా ట్రంప్‌ దాన్ని కొనసాగించలేదు. ఇండియాలో ఎన్నికలు ముగిశాక, అక్టోబరు 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ల మధ్య మహాబలిపురం సౌహార్ద్ర సమావేశం జరిగినా, ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్టు విషయంగా ఎటువంటి చొరవ లేకపోయింది.

దాంతో మనల్ని తన దారికి తెచ్చుకోవడం అమెరికాకు సులువు అయింది. అందుకు, ఆసియా దేశాలతోనే అది కొత్త వేదిక నిర్మించింది. ‘ఇంటర్నేషనల్‌ డెవెలప్మెంట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌’ (అమెరికా) ‘జపనీస్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోపరేషన్‌’ (జపాన్‌) ‘డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ట్రేడ్‌’ (ఆస్ట్రేలియా) తో కలిసి కొత్తగా అమెరికా ‘బ్లూ డాట్‌’ నెట్‌ వర్క్‌ ప్రారంభించింది. ఈ ముగ్గురితో నాలుగవ భాగస్వామిగా ఇండియా కూడా చేరింది. అలా, ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ లకు చెందిన 126 దేశాలు 29 అంతర్జాతీయ సంస్థలు సభ్యులుగా ఉన్న చైనా ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్టు నుంచి అమెరికా విజయవంతంగా మనల్ని దూరం చేసేసింది. 

ఈ వ్యూహం ముందుగా పూర్తి చేసుకుని, తర్వాత ట్రంప్‌ ఇండియాకు వచ్చారు. ఈ పర్యటన తర్వాత, ఆయా రంగాల నిపుణులు చేస్తున్న లోతైన సమీక్షల నుంచి తెలుస్తున్న విషయాలు మాత్రం, ట్రంప్‌ మీద ఆశల సంగతి అటుంచి, ముందు ఎన్డీఏ విదేశీ విధానం మీద నమ్మకం పెరగడం లేదు. ఎందుకీ మాట అనడం అంటే– ‘‘ఈ ‘బ్లూ డాట్‌’ నెట్‌ వర్క్‌ ఒప్పందం పత్రాన్ని జపాన్, ఆస్ట్రేలియా రెండు కూడా వేర్వేరుగా తమకు అనుకూలమైన పొందికైన పదాల అమరికతో రాసుకున్నాయి. ఒక్క ఇండియా మాత్రమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ఎజెండా’కు విశ్వాస పాత్రంగా దీనికి తలొగ్గింది’’ అంటున్నారు ‘ట్రై కాంటినెంటల్‌ ఇనిస్టిట్యుట్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌’ డైరెక్టర్‌ విజయ్‌ ప్రహ్లాద్‌. యు.పి.ఏ. ఆంధ్రప్రదేశ్‌ను 2014లో రెండుగా విభజించి పక్కకు తప్పుకున్నాక, అదే ఏడాది అక్టోబర్‌ 1న వాషింగ్టన్‌లో బరాక్‌ ఒబామా మన ప్రధాని మోడీతో ఇండియా తలపెట్టిన నూరు స్మార్ట్‌ సిటీల ప్లాన్‌కు సహకరిస్తామని, అలహాబాద్, అజ్మీర్, విశాఖపట్టణం నగరాలను ‘స్మార్ట్‌ సిటీస్‌’గా తాము అభివృద్ధి చేస్తాము అని అమెరికా ప్రకటించింది. ట్రంప్‌ వచ్చాక అది కాస్త అటకెక్కింది.

‘ఆసియాన్‌’ ఒప్పందం తర్వాత 970 కి.మీ. తీరమున్న ఆంధ్రప్రదేశ్‌ ఈ దేశానికీ ఎటువంటి కీలకమైన రాష్ట్రమో గడచిన ఐదేళ్ళలో మనకు అర్ధం కాలేదు సరే, ఈ కాలంలో టీడీపీ ప్రభుత్వంతో రాజ కీయ మైత్రి నెరపిన ఎన్డీఏ ప్రభుత్వానికీ అర్థం కాలేదు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు ఏ.పి. ఓడరేవులున్న రాష్ట్రమనే సోయి ఉన్నా,  కేంద్రానికి ఏమాత్రం లేకపోయింది. ఇలా ఐదేళ్ళు ‘ఇంక్యుబేటర్‌ బేబీ’ గా చూడాల్సిన ఆంధ్రప్రదేశ్‌ వైపు, కేంద్రం విభజన చట్టం దృష్టిని దాటి చూసింది లేదు. పోనీ కేంద్రం ఇంతగా తగిలించుకున్న ఈ ‘గంతల చూపు’లో ఏదైనా చాణక్యం ఉందా అంటే, అదీ లేదు. చైనాను మనం ‘ఒక వైపు’ నుంచి చూస్తుంటే, మరొక వైపు నుంచి దేశం నలుమూలల్ని అది తన పెట్టుబడులతో ఆక్రమించింది. 

మార్చి 2020తో ముగిసే మొదటి ఐదేళ్ళలో ఇక్కడి ‘స్టార్ట్‌ అప్‌’ పరిశ్రమల్లో చైనా పెట్టుబడులు 4 బిలియన్‌ డాలర్లు. ‘‘చైనా ‘రోడ్‌ అండ్‌ బెల్ట్‌’ ప్రాజెక్టును మన సరిహద్దుల్లోకి అనుమతించలేదు అనుకున్నా తెలియకుండానే చైనా ‘వర్చువల్‌’ ప్రాజెక్టు మీద ఇండియా సంతకం పెట్టింది’’ అంటున్నారు ‘గేట్‌ వే హవుస్‌’ ఎనర్జీ అండ్‌ ఎంపవర్‌ మెంట్‌ స్టడీస్‌ ఫెలోస్‌ డా‘‘ అమిత్‌ భండారీ, డా‘‘ ఆస్నా అగర్వాల్‌. ఇదంతా వదిలిపెట్టి, చర్చ అంతా  ‘అస్సలు మనల్ని భోజనానికి ఎందుకు పిలవలేదు?’ వద్ద ఆగిపోతే, అంతకంటే సుఖం మరొకటి లేదు!


జాన్‌సన్‌ చోరగుడి
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు
మొబైల్‌: 98662 24828

మరిన్ని వార్తలు