మూగబోయిన కశ్మీరం

29 Aug, 2019 01:21 IST|Sakshi

జమ్మూ కశ్మీర్‌కి స్వయంప్రతిపత్తిని కల్గించడమే కాకుండా రాష్ట్రేతరులు భూములు కొనుగోలు చేయడాన్ని, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడాన్ని, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడాన్ని నిషేధించిన ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌ వ్యాప్తంగా ప్రజలు దిగ్భ్రాంతితో, ఆగ్రహంతో కుపితులయ్యారు. ఆగస్ట్‌ 5న జమ్మూ కశ్మీర్‌కి వర్తింపచేస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును, జమ్మూ కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎన్డీఏ రెండో దఫా పాలన ప్రారంభంలో అతిపెద్ద రాజకీయ జూదానికి తెర తీశారు. 

రాజ్యసభలో మెజారిటీ లేనప్పటికీ ఎన్డీఏలో భాగం కానటువంటి వైఎస్సార్‌ సీపీ, టీఆర్‌ఎస్, బీజేడీ, టీడీపీ తదితర పార్టీల మద్దతు దన్నుతో కేంద్రప్రభుత్వం ఆశ్చర్యకరంగా అదే రోజు రాజ్యసభలో సవరణ బిల్లును ఆమోదింపజేసుకుంది. ఇక గణనీయ సంఖ్యలో మెజారిటీ ఉన్న లోక్‌సభలో ఈ రెండు బిల్లులను బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా ఆమోదింపచేసుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా జమ్మూ కశ్మీర్‌ వునర్వ్యవస్థీకరణకు సత్వరం తన ఆమోద ముద్ర తెలిపారు. దీంతో 70 సంవత్సరాలుగా సాగుతున్న జమ్మూ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి చరిత్రకు ముగింపు పలికినట్లయింది.

ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జాతీయ పతాకాలు, ఇద్దరు ప్రధానుల వ్యవస్థ కొనసాగింపు పట్ల జనసంఘ్‌ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ తీవ్రంగా  వ్యతిరేకిస్తూ జమ్మూ కశ్మీర్‌ని భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేసిన నాటి నుంచీ, జమ్మూ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు అంశం బీజేపీ ఎజెండాలో భాగమై ఉంటోంది. రాష్ట్రేతరులపై ఉన్న నిషేధ వ్యవస్థను ధిక్కరించి ముఖర్జీ జమ్మూ కశ్మీర్‌లో ప్రవేశించడంతో నాటి జే–కే ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసింది. తర్వాత కస్టడీలోనే శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ చనిపోయారు. 

జనసంఘ్‌ అనంతర కాలంలో బీజేపీగా పేరు మార్చుకున్నప్పటికీ ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా తన వ్యవస్థాపకుడి ఆశయాన్ని నెరవేర్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చింది. 70 ఏళ్ల తర్వాత ముఖర్జీ ఆశయం జమ్మూ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు ద్వారా ఫలించింది. ఆగస్టు 25న జమ్మూ కశ్మీర్‌ పతాకను సచివాలయం నుంచి తొలగించడం ద్వారా స్వయం ప్రతిపత్తికి సంబంధించిన చివరి అవశేషం కూడా కనుమరుగైపోయింది. ఇకనుంచి కేంద్రప్రభుత్వ  చట్టాలన్నీ జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తాయి. లదాక్‌ మినహా మిగిలిన రాష్ట్రానికి ఇకపై కూడా అసెంబ్లీ ఉన్నా, మునుపటిలా ప్రత్యేక రాజ్యాంగం, జెండా ఉండవు.

పాకిస్తాన్‌ నుంచి 1947లో జమ్మూకు వలసవచ్చిన పశ్చిమ పాకిస్తాన్‌ శరణార్థులకు చెందిన 50 వేల కుటుం బాలు ఈ అనూహ్య పరిణామం ఫలితంగా తక్షణం లబ్ధి పొందనున్నాయి. ఇకనుంచి వారు ఎలాంటి నిషేధం లేకుండా జమ్మూ కశ్మీర్‌లో భూముల కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వోద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. గతంలో వీరికి పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రమే ఓటు వేసే హక్కు ఉండేది. స్వయంప్రతిపత్తి రద్దు ద్వారా కశ్మీర్‌ యువతులు రాష్ట్రేతరులను పెళ్లాడవచ్చు. కశ్మీర్‌ బయటి వ్యక్తిని పెళ్లాడితే అలాంటి స్త్రీలు వారసత్వ హక్కు, ప్రభుత్వోద్యోగం పొందే హక్కు, ఎన్నికల్లో పాల్గొనే హక్కును కోల్పోయేవారు.

దశాబ్దాల నాటి తన కలను సాఫల్యం చేసుకున్నం దుకు బీజేపీ తన్ను తాను అభినందించుకోవచ్చు కానీ జమ్మూ కశ్మీర్‌కి చెందిన 70 లక్షల మంది ప్రజలతో ఆ పార్టీ శత్రుత్వం కొనితెచ్చుకుంది. గత మూడు వారాలుగా కశ్మీర్‌ మొత్తంగా కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షల మధ్య చిక్కుకుపోయింది. ల్యాండ్‌ లైన్, మొబైల్, ఇంటర్నెట్‌ వంటి సమస్త కమ్యూనికేషన్‌ సంబంధాలకు కశ్మీర్‌ దూరమైంది. పైగా భారత అనుకూల రాజకీయ నేతలపై కూడా భారీ స్థాయి నిర్బంధాన్ని విధించారు. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తితోపాటుగా సయ్యద్‌ లోనె, ఇమ్రాన్‌ అన్సారి, అలీ మొహమ్మద్‌ సాగర్, హకీమ్‌ యాసిన్‌ వంటి వందలాది రాజకీయ నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎనభై మూడేళ్ల వయసున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, శ్రీనగర్‌ ప్రస్తుత ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లాను సైతం గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ క్రమంలో బీజేపీ నేతల బంధువులైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతల సన్నిహిత అనుయాయులను కూడా వదిలిపెట్టకుండా గృహనిర్బంధంలో ఉంచడం గమనార్హం.

కశ్మీర్‌లో ఇంతవరకు  భారత జాతీయ పతాకను గౌరవిస్తూ వచ్చిన  ప్రధానస్రవంతి రాజకీయ నేతలను సైతం నిర్బంధంలోకి తీసుకోవడంతో రేగిన ప్రజాగ్రహాన్ని చల్చార్చడానికి రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తన వంతు ప్రయత్నం చేస్తూ కశ్మీర్‌ నేతల అరెస్టులో తన పాత్రేమీ లేదని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో ఏ వ్యక్తినైనా సరే అరెస్టు చేయడం, విడుదల చేయడంలో తాను పాలుపంచుకోవడం లేదనీ, స్థానిక పోలీసు యంత్రాంగమే సంబంధిత నిర్ణయాలు తీసుకుంటోందనీ, అరెస్టైన నేతలతో తాను కమ్యూనికేషన్‌ జరిపే పరిస్థితుల్లో లేనని గవర్నర్‌ తేల్చి చెప్పేశారు. తమ కశ్మీర్‌ సందర్శన ప్రజల్లో సమస్యలను సృష్టిస్తుందని రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్ష నాయకుల బృందం గ్రహించడం లేదని, కశ్మీర్‌ సందర్శనకు అనుమతి లేకపోవడంతో తిరిగి న్యూఢిల్లీకి వెనుదిరిగిన ఈ బృందం కశ్మీర్‌లో పరిస్థితి గురించి అసత్య ప్రకటనలు చేసిందని గవర్నర్‌ ఆరోపించారు.

అయితే ఆసక్తికరంగా, 2016, 2010 నాటి స్థాయిలో కశ్మీర్‌లో ఇప్పుడు రాళ్లు రువ్వే ఘటనలు చోటు చేసుకోవడం లేదు. స్వయంప్రతిపత్తి రద్దుకు ముందు కేంద్రం మోహరించిన భారీ సంఖ్యలో భద్రతా బలగాల గస్తీ అలాంటి చర్యలకు అవకాశం లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ వీధుల్లో తమ ఆందోళనను సాగించడానికి ప్రజలు కొత్త తరహా వ్యవస్థను ఏర్పర్చుకున్నారు. గతంలో మాదిరిగా వేర్పాటువాద నేతలు ఎవరూ ఊరేగింపుకు నేతృత్వం వహిస్తూ, నినాదాలు చేస్తూ ఇప్పుడు కనిపిం చడం లేదు. అలాగే షాపులు మూసివేయమని ఎవరూ పిలుపునివ్వడం లేదు. అయినప్పటికీ మార్కెట్లు మూతపడే ఉన్నాయి, ట్రాఫిక్‌ చాలా తక్కువగా ఉంది. నిజానికి ప్రజలు తమ కార్యాచరణ తీరును మార్చుకున్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి ఉదయం, సాయంత్రం మూడు గంటలపాటు మార్కెట్లను తెరిచి ఉంచుతున్నారు. తక్కిన దినంలో ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు వ్యతరేకంగా కశ్మీర్‌ లోని మార్కెట్లను మూసి ఉంచుతున్నారు. 

ప్రజల ఆందోళనల కంటే మించి ప్రజల మధ్య కమ్యూనికేషన్‌ సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. గత మూడువారాలుగా ఫోన్లు, మొబైల్స్, ల్యాండ్‌ లైన్‌ పనిచేయడం లేదు. అనేక ప్రాంతాల్లో తమ ప్రియతములతో మాట్లాడడం ఇప్పటికీ కలగానే ఉంది. ఇంటర్నెట్‌ లేనందున స్థానిక పత్రికలు తమ ప్రచురణలను కూడా ఆపేశాయి. జిల్లాల్లోని డిప్యూటీ కమిషనర్‌ ఆఫీసు ద్వారా, కొన్ని పీసీఓల ద్వారా టెలిఫోన్లను అందుబాటులో ఉంచినప్పటికీ మొత్తం సమాజం అనుభవిస్తున్న బాధలను అవితీర్చడం లేదు. చివరకు పండ్ల మార్కెట్టుకు తాము పంపిస్తున్న పళ్లు ఏ రేటుకు అమ్ముడు పోతున్నాయో కూడా తెలీకుండా పోవడంతో భారీ నష్టాలను చవిచూస్తున్నామని స్థానిక వ్యాపారులు వాపోవడం గమనార్హం.

వ్యాసకర్త: ఇష్ఫాఖ్‌–ఉల్‌–హసన్‌
సీనియర్‌ జర్నలిస్టు, జమ్మూ కశ్మీర్‌
 

>
మరిన్ని వార్తలు