నిషేధం అమలయ్యేనా?

28 Mar, 2018 00:08 IST|Sakshi

విశ్లేషణ

ప్లాస్టిక్‌ నిషేధంలో సానుకూల కారణమేదంటే.. తయారీదారు, సరఫరాదారుతోపాటు వినియోగదారుపై కూడా జరిమానా విధిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరులో జాప్యమే నిషేధం అమలులో ప్రధాన అవరోధం.

ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధానికి సంబంధించిన అనుభవం సానుకూలంగా మాత్రం లేదు. మహారాష్ట్రలోని దాదాపు అన్ని మునిసిపల్‌ కార్పొరేషన్లలో 20 మైక్రాన్లకంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ పదార్థాలను నిషేధించారు కానీ, రెండు సాధారణ కారణాల వల్ల ఈ నిషేధం ఉల్లంఘనకు గురవుతోంది. ఒకవైపు ప్లాస్టిక్‌ బ్యాగులను తీసుకెళ్లడం సౌకర్యవంతంగా ఉండటం, మరోవైపు ప్లాస్టిక్‌ నియంత్రణ యంత్రాంగం నిబంధనలను పట్టించుకోకపోవడం.

ప్లాస్టిక్‌ మురుగుకాలువలను అడ్డుకుంటుంది. బహిరంగ స్థలాలను చెత్తతో నింపుతుంది. డంపింగ్‌ కేంద్రాలలో ప్లాస్టిక్‌ పోగుపడుతోంది. ప్రతి సంవత్సరం నగరాల్లో వరదలకు భారీవర్షాలు కారణం కాదు. మురుగుకాలవలను ప్లాస్టిక్‌ వ్యర్థాలు అడ్డుకోవడం వల్లే కారణమని తెలిసిందే. ఇప్పుడు ఉన్నట్లుండి మహారాష్ట్ర ప్రభుత్వం ఉగాది (గుడిపర్వ) నుంచి ప్లాస్టిక్‌ నిషేధంపై జీవో జారీ చేసింది. కానీ ఇది ఎలా అమలవుతుందన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

ఈ నిషేధం ఎందుకు పనిచేస్తుందో, ఎందుకు పని చేయదో చెప్పడానికి ప్రాథమికంగా రెండు కారణాలున్నాయి. సానుకూల కారణమేదంటే, ప్లాస్టిక్‌ తయారీదారు, సరఫరాదారు మీదే కాకుండా వినియోగదారుపై కూడా జరిమానా విధిస్తారు. అందుకే ఇప్పటికే జనాభాలోని ఒక చిన్న విభాగం ఈ కొత్త నిబంధనకు కట్టుబడాలని నిర్ణయించుకుంది. పర్యావరణ కారణాలపై కాదు కానీ జరిమానా భయంతోనే అన్నది నిజం.
ఎందుకంటే ప్లాస్టిక్‌ని వినియోగించినందుకు తొలిసారి తప్పు కింద రూ. 5,000లు రెండో తప్పుకు రూ. 10 వేలు జరిమానా విధిస్తారు, ఇక మూడో తప్పుకింద రూ. 25,000ల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. మరో కోణం ఏదంటే, ప్లాస్టిక్‌ నిషేధ యంత్రాంగం పనితీరులో జాప్యం కారణంగా ప్లాస్టిక్‌ సంచులను చాలా షాపులు ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నాయి. నిఘా యంత్రాంగం క్రియాశీలం అయ్యేంతవరకు వీటిని ఉపయోగిస్తూనే ఉంటారు. 

ప్లాస్టిక్‌ చెత్తను సేకరించే కేంద్రాలను నెలలోపు ఏర్పర్చి వినియోగించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను వాటిలో ఉంచాలని అన్ని ప్రభుత్వ సంస్థలకూ ఆదేశాలు వెళ్లాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందని ప్రశ్నార్థకమే. ఇలా సేకరించిన చెత్తలో ప్లాస్టిక్‌ సంచులు, స్పూన్లు, థర్మోకోల్‌ వంటివి ఉంటాయి. వీటిని విస్తృతంగా వినియోగిస్తున్న రీత్యా వీటి నిషేధం పెద్ద లక్ష్యమే అవుతుంది. అదే సమయంలో ఇప్పటికే తయారీదారుల వద్ద ఉన్న ప్లాస్టిక్‌ నిల్వలను అవి అమ్ముడయేంతవరకు మార్కెట్లోకి తీసుకురావచ్చని ప్రభుత్వం అనుమతించింది. ఒక నెలలో ఈ నిల్వలన్నీ ఖాళీ చేయాలనడం అయోమయం కల్గించే వైరుధ్యమే. 

పెద్దపెద్ద బాటిళ్లు కాకుండా నీటిని నిల్వచేసిన అర్ధ లీటర్‌ బాటిళ్లను వదిలించుకోవలసిన చెత్తగా ప్రకటించడం గందరగోళం కలిగిస్తోంది. ఇది తర్క విరుద్ధంగా ఉంది. బ్రాండ్‌ ప్లాస్టిక్‌ బాటిళ్ల వినియోగాన్ని కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశం చెబుతోంది. ప్యాక్‌ చేసిన ప్లాస్టిక్‌ పట్ల జాగ్రత్త వహించాల్సిన బాధ్యత రిటైలర్లమీదే ఉంటుందని 2016లో ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవానికి పూర్తిగా విఫలమైంది. అందుకే ఇప్పుడు కూడా వాటిని మినహాయించారు. 

మరింత చిక్కు ఏమిటంటే పాల ప్యాకెట్లతో వ్యవహరించవలసి రావడం. పాల ప్యాకెట్లను డెయిరీలు సేకరించి వాటిని మళ్లీ రీసైకిల్‌ చేస్తుం టాయి. అయితే అసంఘటిత రంగంలో సాగుతున్న పాల పంపిణీ రంగం ఈ కొత్త ఆదేశాలతో ఎలా వ్యవహరిస్తుందన్నది అస్పష్టమే. పాల ప్యాకెట్లు, బాటిళ్ల తయారీదారులను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోలేదు. పునర్వినియోగానికి సిద్ధం కావలి సిందిగా వీరికి ప్రభుత్వం చెప్పడం లేదు. పైగా ఇలాంటి వాటిని ఏర్పర్చుకోవడం రాత్రికి రాత్రే జరిగిపోదు.

ఒక బ్యాగ్‌ రీసైకిల్‌ చేసే ప్రక్రియలో 50 పైసలు పాల డైరీకి వెళుతుంది. అలాగే, బ్యాటిల్‌ తయారీదారులు 500 మిల్లీ లీటర్ల బ్యాటిల్‌కి రూపాయి లెవీ వసూలు చేస్తారు. ముందే చెప్పినట్లుగా ప్రభుత్వాదేశం ప్రకారం ప్లాస్టిక్‌ బ్యాటిల్స్‌ పునర్వినియోగ వసతుల ఏర్పాటు చట్టం చేసినంత సులభమైన విషయం మాత్రం కానే కాదు. పైగా ఇక నుంచి ఆహారం రుచి కూడా కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత దానిలోని దినుసుల రుచి మారిపోవచ్చు లేదా మార్పులేకుండా ఉండవచ్చు. కానీ ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం అమలు అనే మంచి ఉద్దేశం కూడా మహారాష్ట్రకు పెద్ద సమస్యే అవుతుంది.  ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే 1000 బ్యాటిల్స్‌ తయారీ సంస్థలను మూసివేసింది. వాటిలో 500 సంస్థలు చాలా పెద్దవి. రోజుకు మహారాష్ట్రలో 30 లక్షల నీటి బ్యాటిళ్లు అమ్ముడవుతుంటాయి. వీటన్నింటినీ కలిపితే సంవత్సరానికి అయిదు లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థం పోగుపడుతుంది. దీన్ని ఉన్న పళానా తొలగించడం అన్నదే ప్రధాన సమస్య.

- మహేశ్‌ విజాపుర్కర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు