ఆరేళ్లయినా ఆమడదూరంలో అభివృద్ధి

4 Jun, 2020 00:53 IST|Sakshi

సందర్భం

తెలంగాణ ఆవిర్భవించి జూన్‌ 2 నాటికి ఆరేండ్లు పూర్త వుతున్నాయి. ప్రజలు పోరాడి, అనేక మంది యువ కులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకొచ్చి కూడా ఆరు సంవత్సరాలు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజలకు ఎన్నో భ్రమలు కల్పిం చబడ్డాయి. రాష్ట్రం ఏర్పడితే ‘బంగారు తెలంగాణ’గా మారుతుందని చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయి. 

టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ఏ ఒక్క రైతు వ్యవసాయం వల్ల నష్టపోకుండా లాభసాటిగా చేస్తానని’ ప్రకటించారు. రాష్ట్రంలో 59.48 లక్షల భూకమతాలుండగా, వీటి కింద 147.50 లక్షల ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఐదెకరాల్లోపు కల్గిన వారు 52.49 లక్షల కమతాలు కాగా, వీరి చేతిలో 90.97 లక్షల ఎకరాల భూమి ఉంది. వీరిలో ఐదెక రాల్లోపు ఉన్న వారిలో 12 లక్షల మందికి పాస్‌ పుస్తకాలు ఇప్పటికీ రాలేదు. వీరికి రైతుబంధు ప్రారం భమైనప్పటి నుంచి ఒక్క రూపాయి సాయం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. అలాగే ప్రభుత్వం చెప్పిన పంటలు వేయనిచో రైతుబంధు నిలిపివేస్తా మని ముఖ్యమంత్రి స్వయంగా రైతులను బెదిరిస్తుం  డటం సిగ్గుచేటు.

రాష్ట్రంలో కౌలు రైతులు సుమారు 20 లక్షల మంది వరకూ ఉంటారు. ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా కౌలురైతులను గుర్తించమనీ, గుర్తింపు కార్డులు ఇవ్వమనీ కరాఖండిగా తేల్చి చెప్పారు. కౌలు చట్టాలు అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండివైఖరి విడనాడటం లేదు.

రాష్ట్రంలో 1.63 కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో 25, 30 లక్షల ఎకరాలు నీరందక ప్రతి ఏటా బీడు భూములుగా ఉంటున్నాయి. రియల్‌ ఎస్టేట్, వ్యవసాయేతర అవసరాలకు భూములు పెద్ద ఎత్తున సేకరించడంతో సాగు భూమి విస్తీర్ణం ప్రతి ఏటా తగ్గుతోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా 230–320 మండలాల వరకూ అనావృష్టి వల్ల కరువుకు గురవు  తున్నాయి. వాటికి పరిహారం ఏమాత్రం ఇవ్వడం లేదు. ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ కింద పేద, మధ్యతరగతి రైతుల నుంచి భూములు బలవం తంగా తీసుకొని, న్యాయమైన పరిహారం ఇవ్వక పోవడం విచారకరం. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని, అనేక ప్రాజెక్టులకు రీడిజైన్, రీఎస్టిమేట్స్‌ చేసి ఇప్పటికీ సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి, మరో రూ.20 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. అయితే ఏయే ప్రాజెక్టులపైన ఎంత ఖర్చు పెట్టారు? ఏ ప్రాజెక్టు ఎన్ని ఎకరాలకు నీరందిస్తుంది? వీటిపై ప్రాజెక్టుల వారీగా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు తెలియజేయాలి.

దళిత, గిరిజనులకు భూపంపిణీ పథకం ఆర్భా టంగా ప్రకటించి అమలులో మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది భూమి లేని దళితులుండగా, ఈ ఆరేళ్లలో కేవలం 6,104 కుటుంబాలకు 15,447.74 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూవ్‌ు ఇండ్లు ఇస్తామని కల్పించిన ఆశ నిరాశగా మారింది. అక్కడక్కడ కొన్ని మోడల్‌ హౌజ్‌లు మాత్రమే నిర్మాణం చేసి వాటినే చూపిస్తూ అందరికీ ఇండ్లు ఇస్తున్నామని భ్రమలకు గురిచేస్తున్నారు.

తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని కేసీఆర్‌ అనేక సందర్భాల్లో ప్రకటనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో లక్షలాది మంది అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో ఏండ్ల తరబడి పని చేస్తున్నా, వారిని పర్మనెంట్‌ చేయకుండా చాలీచాలని వేతనాలతో పని చేయించుకుంటూ అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేయమని పోరాడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె, అంగన్‌వాడీ, మున్సిపల్‌ వర్కర్స్, ఆయాలు చేసిన సమ్మెలపై ఉక్కుపాదం మోపి లొంగదీసుకున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధిం చుకున్న కార్మిక హక్కులను హరిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.  ప్రతిపక్షాలు, ప్రజలు చెప్పే విషయాలను పెడ చెవిన పెడుతూ, తమకు నచ్చిందే సరైందన్న నియంతృత్వ పోకడలను మానుకోవాలి. ఈ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, లోపాలను సమీక్షించి నిర్లక్ష్యం చేయబడిన సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరి ష్కారానికి తగిన ప్రణాళికను రూపొందించి పూర్తి చేయాలి.

వ్యాసకర్త : జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా