-

కరోనాపై కార్యాచరణ ఏది?

18 Apr, 2020 01:25 IST|Sakshi

సందర్భం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 1,32,000 దాటిపోయాయి. ఈ మహమ్మారి మీద పోరాడుతున్న వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ పరిణామాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పెనుకుదుపులకు లోనయ్యింది. పారి శ్రామిక ఉత్పాదక, సేవా రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, శ్రామిక వర్గాల ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దేశ ఆర్థిక వద్ధి రేటు పాతాళానికి పడిపోయింది. పొరుగున ఉన్న చైనా, అమెరికా, ఇటలీ మొదలగు దేశాల దారుణ అనుభవాల నుంచి మన ఏలికలు ఏమి గ్రహించలేకపోయారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 

అమెరికాతో సహా అనేక అభివద్ధి చెందిన దేశాల్లో రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ పోతుంటే, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వంలోని వివిధ విభాగాల యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదు. మూడు వారాల లాక్‌డౌన్‌ వ్యవధిలో కూడ కరోనా వైరస్‌ నిర్ధారణ కిట్లు సమకూర్చుకోకపోవడం, కరోనా కట్టడిలో కీలక భాగస్వాములైన వివిధ విభాగాల ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యంగా చికిత్సలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బంది అందరికీ సరిపడా వ్యక్తిగత రక్షణ సామాగ్రి (పీపీఈల) సమకూర్చడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏప్రిల్‌ మొదటి వారం నాటికి చైనా మన దేశానికి విరాళంగా ఇచ్చిన వాటితో కలిపి 2 లక్షలా 10 వేల పీపీఈ కిట్లు మాత్రమే అందుబాటులోనున్నాయి. వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి భారీ ఎత్తున పరీక్ష కిట్లు అందుబాటులో ఉంటే కానీ కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య ఖచ్చితత్వం తేలదు. 

మన దేశంలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు ప్రతి 10 లక్షల మందిలో 1610 మందికి మాత్రమే. ఇంత తక్కువ సంఖ్యలో పరీక్షల ద్వారా కరోనా కేసుల వాస్తవ సంఖ్యను బేరీజు వేయడం దుర్లభం. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేసిన చైనాలో వెయ్యి మంది జనాభాకు 1.8 వైద్యులు ఉంటే మనదేశంలో 0.62 వైద్యులు మాత్రమే ఉన్నారు. ఇక నర్సింగ్‌ సిబ్బంది కొరత కూడ విపరీతంగా ఉంది. మన దేశంలోని మొత్తం జనాభాలో 40 కోట్ల మంది దాకా రోజు కూలీలు కావడం గమనార్హం. ఇళ్ళలో పని వారు, భవన నిర్మాణ రంగం, ఇటుక బట్టీలు, ఇండ్లలో పని వారు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 23 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలోని 25 వేల చిన్న, మధ్యతరహాపారిశ్రామిక యూనిట్లు లాక్‌డౌన్‌ కారణంగా మూతపడటం జరిగింది. దీనివల్ల 7.50 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్మికులు కరోనా భయంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. 

మన ప్రధాని మోడీ ప్రపంచ దేశాల్లో పరిణామాలని చూస్తూ కూడా కరోనా వైరస్‌ విషయంలో ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఒక ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించారు. 130 కోట్ల జనాభాలోని 90 శాతం ప్రజల జీవనశైలి, బతుకుతెరువు చిధ్రమైంది. తాజాగా ఏప్రిల్‌ 20 తేది నుంచి అమలయ్యే సడలింపు వల్ల ఆర్థిక వద్ధి రేటులో అద్భుతాలు సంభవిస్తాయి అనుకోవడం భ్రమే. దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి, చెల్లాచెదురైన కార్మికులు మళ్లీ తాము పని చేసే చోట్లకు రావడానికి సమయం పడుతోంది. ఇదిలా ఉండగా కొన్ని సేవా రంగాల్లో వారికి కరోనా ‘జంకు’ అడ్డుపడుతోంది.  ముఖ్యంగా ఇండ్లలో పని చేసే వాళ్ళకి ఒక పెద్ద అవరోధంగా నిలుస్తుంది. ఈ విధంగా కోట్లాదిమంది కార్మికులకు ఉపాధిపై కరోనా మహమ్మారి నీలి నీడలు వెంటాడుతాయి. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని దేశంలో 120 కోట్లకు పైగా ఉన్న పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను ఆదుకోవడానికి పకడ్బందీ ఆర్థికసహాయ ప్రణాళికను ప్రకటించాలి. భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య సేవలను విస్తతం చేయాలి. ఈ సందర్భంగా రాజకీయ అభిప్రాయాలకు తావు లేకుండా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా విపత్తు మీద తక్షణం కార్యాచరణ రూపొందించాలి. 


జూలకంటి రంగారెడ్డి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
మొబైల్‌ : 94900 98349 

మరిన్ని వార్తలు