బీసీ విజ్ఞాన సూర్యోదయం

23 Jun, 2020 00:44 IST|Sakshi

సందర్భం

తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల జీవన విధానాన్ని మార్చి అన్నీ రంగాల్లో వారిని సమోన్నతంగా నిలపడానికి  విద్యా విప్లవాలు విజయవంతమవుతున్నాయి. ఇపుడు తెలంగాణలో విద్యా విప్లవాలు అట్టడుగువర్గాల బహుజన వాకిళ్ల నుంచి విరబూస్తున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన పెద్దమార్పు ఇది. కార్పొరేట్‌ విద్యావ్యవస్థను పారద్రోలాలని నినాదాలిస్తే సరిపోదు. అందుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో 959 గురుకుల విద్యాలయాలు కేసీఆర్‌ దార్శనికతతో ప్రారంభించారు. ఇపుడు 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లలో ఫలితాలన్నీ గురుకులాల విద్యావ్యవస్థకే దక్కాయి. ప్రధానంగా సమాజంలో సగభాగమైన బీసీల జీవితాలు సంపూర్ణంగా మారాలంటే విద్యాపరంగా ఈ వర్గాలు దూసుకుపోయేందుకు బీసీ గురుకులాలు ఎంతో దోహదం చేస్తాయి. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బీసీ గురుకులాలే అగ్రభాగాన నిలిచి అత్యధిక ఫలితాలు సాధించాయి. ఇది బీసీ వర్గాలకు పలవరింతల పరవశం. 

తెలంగాణ రాష్ట్రం అవతరణకు ముందు బీసీలకు 19 గురుకులాల విద్యాసంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇపుడవి 281 సంస్థలుగా వెలుగొందుతున్నాయి. 2015 నుంచి జూనియర్‌ కాలేజీలు ప్రారంభిస్తే ప్రతి ఏడాది ఈ విద్యాసంస్థలే అత్యధిక ఫలి తాలు సాధిస్తున్నాయి. ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఉంది. అది కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫలితాల్లో ఫస్ట్‌గా నిలిచింది. ఈ డిగ్రీ కాలేజీ నుంచి బైటకు వచ్చిన విద్యార్థులు దేశంలోని ప్రముఖ సంస్థల్లో పైచదువులు, శిక్షణ పొందుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఈ ఫలితాలను చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సీల పిల్లలకోసం 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీ పిల్లలకోసం 22 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 7 ఉమెన్స్‌ డిగ్రీ, 15 మెన్స్‌ డిగ్రీ కాలేజీలు నెలకొల్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్క ఆర్మీ డిగ్రీ కాలేజీ పెట్టాలని నిర్ణయించారు. 
తెలంగాణలో 2023–24కు 119 బీసీల గురుకుల పాఠశాలలు జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ అవుతాయి.

ప్రతి ఏడాది 20 వేల మంది విద్యార్థులు ఈ సంస్థల నుంచి ఇంటర్‌ పూర్తి చేసుకుని వస్తారు. అదే ఐదేళ్లలో ఒక లక్షమంది వస్తారు. వీళ్లు తెలంగాణలో అన్నిరంగాల్లోకి ఒక బలమైన శక్తిగా వెళ్లగలుగుతారు. తెలంగాణలో 125 బాలికల గురుకులాల విద్యాసంస్థలవల్ల భవిష్యత్తులో వీళ్లు జీవితంలో ఉన్నతంగా స్థిరపడుతున్న విశ్వాసం వ్యక్తమవుతుంది. బీసీ గురుకులాల్లోని 281 విద్యాసంస్థల్లో 2019–20కి గాను 90 వేలమంది విద్యార్థులుంటే 2020–21కి ఆ సంఖ్య ఒక లక్షా 11వేలకు పెరిగింది. వచ్చే ఏడాదికి 20 వేలమంది పెరుగుతారు. 2024–25 నాటికి ఒక లక్షా 70 వేలమంది బీసీ వర్గాలకు చెందిన పిల్లలు విద్యనభ్యసిస్తారంటే మొత్తం బీసీ కుటుంబాలను అవి ప్రభావితం చేస్తాయి.

ప్రతి ఏడాది 10వ తరగతి, ఇంటర్‌ పూర్తిచేసిన 20వేల మంది ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు పైచదువులకు ఇతర కోర్సుల్లోకి వెళుతున్నారు. కేసీఆర్‌ ఆలోచనల్తో వెలిసిన 959 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీల గురుకులాలలో 4 లక్షలమంది విద్యనభ్యసిస్తున్నారు. 2024–25 నాటికి ఆ సంఖ్య వూహించని విధంగా పెరుగుతుంది. ఇది విద్యావిప్లవమే. దేశంలో ఎక్కడాలేని విధంగా 959 విద్యాసంస్థలు నెలకొల్పింది తెలంగాణ రాష్ట్రమే. రాబోయే ఐదేళ్లలో మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసే మహాశక్తులుగా ఈ గురుకుల విద్యార్థులే అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలుస్తారనటంలో సందేహం లేదు. ఇది సి.ఎం.కేసీఆర్‌కున్న దూరదృష్టి. 

ఇప్పటికే తెలంగాణ సీడ్స్‌హబ్, ఫార్మాహబ్, ఐటీహబ్, దేశానికి తిండిపెట్టే ధాన్యాగారంగా అగ్రభాగాన నిలిచింది. త్వరలో విద్యాహబ్‌గా తెలంగాణ తయారై తీరుతుంది. రాష్ట్రంలోని 24 లక్షలమంది విద్యార్థులకు విద్యనందించే ప్రభుత్వ స్కూళ్లను సెమి రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటిని కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నివర్గాల, అన్నికులాల పేదపిల్లలకు ఉచిత చదువునందిం చేందుకు కేసీఆర్‌ దూరదృష్టితో అడుగులు వేస్తున్నారు. వూహించని విధంగా బీసీ డిగ్రీకాలేజీల సంఖ్యకూడా గణనీయంగా పెంచే ఆలోచనల్లోనే ప్రభుత్వం దృష్టిసారిస్తుంది.

తెలంగాణను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే కీలకమైన పనిని కేసీఆర్‌ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీలు 85శాతంగా వున్న ఆ వర్గాలు అన్నిరంగాల్లో శిరసెత్తుకుని నిలవాలంటే అందుకు బలమైన పునాది అయిన విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్న తలం పుతోనే కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. సమాజంలో సగభాగమైన బీసీ పిల్లలు జ్ఞానసూర్యులుగా తయారుకావడం బీసీలకు ఇక ఆకాశమే హద్దు. ఇవే జ్ఞానతెలంగాణకు బలమైన పునాదులు.

జూలూరు గౌరీశంకర్‌
వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 94401 69896

మరిన్ని వార్తలు