జీవధార కాళేశ్వరం... ఆధునిక భాగీరథి

21 Jun, 2019 05:31 IST|Sakshi

సందర్భం

దక్కన్‌ నేల ఏ క్షణంలోనూ కలలో కూడా కనని కమ్మటి కల కాళేశ్వరం. తెలంగాణ నేలకు ఏనాడూ లేని జలకళ కాళేశ్వరం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ఊపిరిని ఫణంగా పెట్టి నిరంతర శ్రమతో కాళేశ్వర నిర్మాణంగా మారారు. కాళేశ్వరం బీడుభూములకు ఊపిరిపోస్తూ రైతుకు కొత్త జీవి తాన్ని వాగ్దానం చేయనుంది. కాళేశ్వరం తెలంగాణ సస్యశ్యామల గీతానికి పల్లవిగా మారుతుంది. ప్రజల గుండెల్లోని స్వప్నాల్ని కాళేశ్వర జలగీతంగా అనువదించిన ఉద్యమనేత మన ముఖ్యమంత్రి.

భూమి దేహంలో సిరలు, ధమనుల్లాంటి సొరంగాలు నిర్మించి ప్రజల ఆకుపచ్చ ఆశయాల్ని నెరవేరుస్తున్నవేళ తెలంగాణ విద్వత్తంతా కాళేశ్వరం విద్యుత్తా అని లోకం నివ్వెరబోతున్న వేళ ... తెలంగాణీయుల ఆనందం ఎత్తిపోతల జలపాతంగా మారింది. తెలంగాణ నేలపై గంగమ్మ ప్రవహించాలని కాలమే కళ్లల్లో వొత్తులేసుకుని ఎదురుచూసింది. చూసీచూసీ కళ్లుకాయలు గాసాయేకానీ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల మనసు మాత్రం కరగలేదు. తెలంగాణ కన్నీళ్లతోనే, ఇంకిన కనుకొనలనుంచే రాష్ట్రసాధన ఉద్యమ పొలికేక వేసి నీళ్లకోసం జనతరంగాలు కదిలాయి. రాష్ట్రం సాధించుకున్న తర్వాత  ఉద్యమకారుడైన కేసీఆర్‌నే పాలకుడు కావటంతో కోటిఎకరాలకు నీళ్లందించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకొని మూడేళ్లలోనే ప్రాజెక్టును పూర్తిచేశారు.

జలస్వప్నాలను నిజంచేస్తూ కరువుగరుకు నేలపైకి గంగమ్మను తనరెండు చేతులతో తోడి నీటిని కిందినుంచి పైకి తెచ్చి ప్రవహింప చేసిన భగీరథుని పని కేసీఆర్‌ పూర్తిచేశారు. ఇది అద్వితీయం. తెలంగాణ  ప్రభుత్వం గత ఐదేళ్లపాలన దేశానికే రోల్‌మోడల్‌గా తయారైంది. ప్రపంచం తెలంగాణవైపు చూసేందుకు కారణభూతమయ్యాయి. నీళ్లపై తనకున్న అపారమైన పరిజ్ఞానంతో అసెంబ్లీలోనే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి శాసనసభలో నీళ్ల టీచర్‌గా పేరుతెచ్చుకున్నాడు. కేసీఆర్‌ మేధోతపస్సుతో చేసిన కృషి ఫలించి కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ కాలంలోనే పూర్తిచేయటం దేశంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదొక రికార్డుగా మిగిలిపోతుంది. ఇది మామూలు యత్నంకాదు. చాలా కష్టమైన పనిని కేసీఆర్‌ చేపట్టారు.

కాళేశ్వరం మొదలైన దగ్గర్నుంచి ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడినా కేసీఆర్‌ మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. కోటిఎకరాలకు నీళ్లందించాలన్న తలం పుతోనే పట్టుదలనే ప్రాణం చేసుకుని ముందుకుసాగారు. ఇది మామూలు సంకల్పమా? ఈ పని ఇంత త్వరగా ఎవరు మాత్రం పూర్తిచేయగలరు? కేసీఆర్‌ వజ్ర సంకల్పానికి ఆచరణాత్మకంగా పనికూడా వేగంగా జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతెంత చెమట చిందిందో? ఈ వజ్ర సంకల్పసాకారానికి నిరంతరం పడ్డ శ్రమ, పలురంగాలకు చెందినవాళ్లు చేసిన కృషి అపూర్వమైనది. ఇంజనీర్లు, కార్మికులు చిందించిన చెమట వెలకట్టలేనిది. అడుగడుగునా అడ్డుతగులుతున్న అడ్డంకుల్ని ఎదుర్కొంటూ, ప్రాజెక్టు అనుమతులను పొందుతూ, పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలను కొనసాగిస్తూ ముందుకు సాగ టం అన్నది తీగమీద నడకలాంటిది. దాన్ని కేసీఆర్‌ ఒడుపుగా సాధించారు. కేంద్రం నుంచి అనుమతులను పొందగలిగారు. అనతి కాలంలోనే హైడ్రాలజీ అనుమతులు, పర్యావరణ, అటవీశాఖల అనుమతులను సాధించారు.

తెలంగాణ జీవధార, ప్రజలకు జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికోసం కేసీఆర్‌ పడ్డ తపన, శ్రమ, కఠోర తపస్సు తక్కువదేంకాదు. కేసీఆర్‌ కాకుండా మరెవ్వరూ ఈ పనిని ఇంత పకడ్బందీగా ఇంత తక్కువకాలంలో పూర్తి చేయలేరు. తెలంగాణ ఎందుకోసం అంటే ఇదిగో ఈ కాళేశ్వరం వరదాయినిని సాకారం చేసుకోవటం కోసమని తెలంగాణ ప్రభుత్వం ఆచరణాత్మకంగా నిరూపించింది. 2016 ఆగస్ట్‌లో అగ్రిమెంట్‌ చేసుకుని 2016 మే 2న మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేశారు. ఇంత తక్కువకాలంలో ఇంతపెద్ద ప్రాజెక్టు పూర్తిచేయటం దేశ చరిత్రలోనే జరగలేదు. ఇది ఒక నూతన అధ్యాయం. రెండేళ్ల పదినెలల కాలంలోనే ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు నిర్మించడం మొత్తం పాలనారంగ చరిత్రలోనే ఒక అద్భుతం.

నోళ్ళెండిన బీళ్ళ నెర్రెలలోకి పారడమే నదికి సార్థకత. వరద సాఫల్యత నేల పొదుగు నిమిరి పంట తల్లి పారవశ్యానికి స్తన్యం పట్టడమే. అల కదిలి రైతు ఒడినింపి లోకానికి జీవధార కావడమే జల కల. నీటికి నడకలు నేర్పి దారి మళ్ళించి భూ మార్గం పట్టించడమే రాజు సమర్థత. జలనిర్వహణ తెలిసిన పాలకుడే జనం గుండె గలగల వినగలిగిన నాయకుడు. నీటిని మునివేళ్ళ మీద ఆడించగల యుక్తి, జనానికి ఏంకావాలో తెలుసుకోగల శక్తి వున్న ఏకైక ధీరుడు కేసీఆర్‌. అవును... ఇప్పుడు అపర భగీరథుడు కేసీఆర్‌. ఆధునిక భాగీరథి కాళేశ్వరం.
(నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా)

వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్‌, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌సభ్యులు

సెల్‌ : 94401 69896

మరిన్ని వార్తలు