చమురు దేశాలే అడ్డుకట్టయితే...!

11 Dec, 2018 01:38 IST|Sakshi

వేసవిలో రెండు నెలలు వేడి భరించాలంటేనే మనుషులకు చాలా కష్టం. అలాంటిది సంవత్సరం పొడవునా కాల్చే ఎండ తాకిడికి గురయ్యే పరిస్థితి ఏర్పడితే ఎలాఉంటుంది? కేవలం రెండు డిగ్రీల సెల్సియస్‌కి భూతాపం పెరిగి, ఇంతవరకు ప్రపం చం చవిచూసిన పర్యావరణ సమతుల్యతే ధ్వంసం అయిపోతే..! ప్రపంచ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. అందుకే పర్యావరణ సమస్య ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. కానీ శాస్త్రవేత్తలూ, పర్యావరణ నిపుణులూ, కార్యకర్తలూ ఒక వైపు మొత్తుకుంటున్నా ఆర్థిక ప్రయోజనాలు తప్ప దేన్నీ పట్టించుకోని రాజకీయ నేతలు, ప్రభుత్వాల నిర్వా   కం వల్ల ఇంత తీవ్ర సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకుండా ఉంది. పర్యావరణ రక్షణపై తొలి సారిగా ఒప్పందం సాకారమవుతుందనుకున్న కల భగ్నమవుతున్న సూచనలు కనపడుతున్నాయి.
 
నాలుగు చమురు ప్రధాన దేశాలు మానవాళి భవిష్యత్తుకు వ్యతిరేకంగా నిలుస్తున్న ఘటనకు పోలెండ్‌ లోని కటోవీస్‌ వేదికగా నిలిచింది. బొగ్గు, చమురు మొదలైన శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయకపోతే పర్యావరణ వ్యవస్థ ధ్వంసమయ్యే ప్రమాదముందని అంతర్జాతీ యంగా శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికల ఫలితంగా మూడేళ్ల క్రితం పారిస్‌ సదస్సులో ఉమ్మడి ఒప్పందం సాధ్యమైంది. ఆ ఒప్పందం అమలుకు రూపొందించుకోవలసిన నియమనిబంధనలు (రూల్‌ బుక్‌)పై రెండేళ్లుగా చర్చలు జరుగుతూ కటోవీస్‌లో కాప్‌–24 సదస్సులో ఒక నిర్దిష్ట రూపం దాలుస్తుందని పెట్టుకున్న నమ్మకం వమ్ము అయే సూచనలు కనిపిస్తున్నాయి. 

గత అక్టోబరులో విడుదలైన ఐక్యరాజ్య సమితి చారిత్రాత్మక వాతావరణ అధ్యయనానికి లభిస్తున్న ప్రపంచవ్యాప్త మద్దతుపై నీళ్లు చల్లేం దుకు నాలుగు చమురు ప్రధాన ఉత్పత్తి దేశాలు  అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్‌ పూనుకున్నాయి. మానవాళి మనుగడకు, ప్రపంచ భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన అతిముఖ్యమైన సదస్సును నాలుగంటే నాలుగు దేశాలు ప్రతిష్టంభనకు గురిచేస్తుండటం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. శిలాజ ఇంధనాలను నియంత్రిస్తే చమురు ఉత్పత్తి, అమ్మకాల పునాదిగా ఎదుగుతున్న తమ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోతాయన్న ఎరుక ఈ నాలుగుదేశాలను దారి మళ్లించింది. ప్రపంచం ఏమైతేనేం, పర్యావరణం ఎలా ధ్వంసమైతేనేం.. తమ పెట్రో డాలర్ల వాణిజ్యం సజావుగా ఉంటే చాలు అని అటు ఒకప్పటి అగ్రరాజ్యాలూ, ఇటు చమురు సంపన్న దేశాలు భావించడం స్వార్థప్రయోజనాలకు నిలువెత్తు సంకేతం. 

‘’అసంఖ్యాకులైన అమెరికన్‌ ప్రముఖ శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచ శాస్త్ర ప్రపంచం ఉమ్మడి బాధ్యతతో రచించిన ఈ కీలకమైన ఐరాస వాతావరణ అధ్యయన నివేదికను సాక్షాత్తూ ప్రపంచంలోనే అగ్రగామి సైంటిఫిక్‌ సూపర్‌ పవర్‌ తిరస్కరిం చడం, అవిశ్వాసం వ్యక్తపర్చడం నిజంగానే విచార హేతువు’’ అంటూ పర్యావరణ వేత్త అల్డెన్‌ మేయర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 నుంచి 2 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగితే భూమి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వాతావరణ మార్పుపై ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ప్రత్యేక నివేదిక (ఐపీసీసీ) పేర్కొనడమే కాకుండా సంస్కరణలను శరవేగంగా అమలు పర్చాలని కోరింది. 
కానీ పర్యావరణ సంస్కరణలను శరవేగంగా అమలు పర్చడం మాటేమిటో గానీ, అసలుకే మోసం వచ్చే పరిస్థితి కనబడుతోంది. ప్యానెల్‌  నివేదికను ప్రశంసిస్తున్నాం కానీ దానిలోని అంశాలను మేం స్వీకరించలేము. కావాలంటే వాటిని నోట్‌ చేసుకుంటాం అంటూ అమెరికా విదేశాంగ శాఖ చావుకబురు చల్లగా చెప్పింది. కటోవీస్‌లో ఈ ఒప్పందం అమలు విధి విధానాలపై తీవ్ర చర్చలు జరుగుతున్నప్పుడే అమెరికాతోపాటు రష్యా, సౌదీ అరేబియా, కువైట్‌ దేశాలు జరుగుతున్న చర్చలపై నీళ్లు చల్లే పని మొదలెట్టాశాయి. అసలు పారిస్‌ ఒప్పందంనుంచే వైదొలగుతామని డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలోనే హెచ్చరించారు. దీనికి ఇతర చమురు ప్రధాన దేశాలు ఇప్పుడు ఊతమివ్వడంతో ఆ ఒప్పందం ఉనికే ప్రమాదంలో పడనుంది

మనం ఇప్పుడు ఒప్పందం గురించి కాదు.. మన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. ఇంత తీవ్ర అంశం పట్ల ప్రభుత్వాలు వ్యతిరేక దృక్ప థంతో ఉంటే దాని ఫలితం యావత్‌ ప్రపంచం అనుభవించాల్సి ఉంటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. నాలుగు దేశాల స్వార్ధం సకల దేశాల మనుగడకు ప్రమాదం కానున్న పరిస్థితిని ఉమ్మడిగా ఎదుర్కోవడమే ఇప్పుడు జరగాల్సి ఉంది.
- కె. రాజశేఖరరాజు 

మరిన్ని వార్తలు