లాలూచీ రాజకీయం లాభిస్తుందా?

24 Mar, 2019 00:17 IST|Sakshi

త్రికాలమ్‌ 

‘నేను విన్నాను. నేను ఉన్నాను.’ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని రోజులుగా  ఎన్నికల ప్రచార సభలలో ప్రస్ఫుటంగా చెబుతున్న మాటలు ప్రజల హృదయాలను నేరుగా తాకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమరాంగ ణంలో ముగ్గురు యోధులు యుద్ధవిన్యాసాలు చేస్తున్నారు. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్ర బాబునాయుడికీ, ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికీ మధ్య సాగుతున్నదే నిర్ణాయక పోరాటం. మూడో యోధుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. ఈ ముగ్గు రిలో ఏ నాయకుడు ఏమని అన్నారో సగటు పౌరులు చెవులారా విన్నారు. కళ్ళారా చూశారు. ఎవరు మాట మార్చుతున్నారో,  ఎవరు మాటకు కట్టుబడి ఉన్నారో, ఎవరు సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నారో, ఎవరు బండగా మాట్లా డుతున్నారో, ఎవరు యూటర్న్‌లు తీసుకుంటున్నారో, ఎవరు రహదారిలో నడుస్తున్నారో తెలుసుకోవడానికి అవసరమైన తెలివితేటలూ, వివేకం పౌరులకు దండిగా ఉన్నాయి. వారికి జ్ఞాపకశక్తి, తెలివి లేవనుకోవడం పొరబాటు. ఏ పార్టీకి ఓటు వేయాలో, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో ఓటర్లలో అత్యధికులు ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటారు. ముగ్గురు నాయకులూ గడచిన 58 మాసాలలో ఏమేమి అన్నారో, ఏమేమి చేశారో గమనిస్తే ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపు తారో ఊహించడం కష్టం కాదు. 

గెలుపే గమ్యం, మార్గం అధర్మం
ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యవహారం చూద్దాం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు  పని చేసిన అనుభవం కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగిస్తుందనే ఆశతో చంద్రబాబునాయుడిని ప్రజలు గెలిపిం చారు. ప్రమాణ స్వీకారం చేయక ముందే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరువం దల పైచిలుకు వాగ్దానాలనూ పక్కన పెట్టి సొంత ఎజెండా అమలు చేయాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నారు. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దించిన తర్వాత ప్రపంచబ్యాంకును మెప్పించాలనే రంధిలో  సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. 1999లో సైతం ఎన్నికల ప్రణాళికను అటకపైన పెట్టి విద్యుత్‌ సంస్కరణల వంటి అప్రకటిత కార్యక్రమాలు అమలు చేశారు.  ఈ సారీ అంతే. ఎన్నికల సభలలో చెప్పిన పనులు చేయకుండా చెప్పని పనులు చేయడం మొదలు పెట్టారు.  కొత్త రాజధాని అమరావతి నిర్మాణం అయిదేళ్ళలో అంగుళ మైనా ముందుకు కదలలేదు. శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక కూడా పేర్చ లేదు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు ఒడిగట్టి అస్మదీయుల చేత భూములు కొనిపించి వారికి లబ్ది చేకూర్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని విభజన చట్టం నిర్దేశించింది.

ఆ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ బాధ్యతను అడిగి నెత్తికెత్తుకున్నది అస్మదీయులకు ప్రయోజనం కలిగించడం కోసమే. అయిదేళ్ళ పదవీకాలం పూర్తవుతున్నా పోలవరం సశేషంగా మిగిలింది. చివరికి దుర్గ గుడి కింద ఫ్లయ్‌వోవర్‌ కూడా పూర్తి చేయలేకపోయారు. విజయవాడ నగరంలోకి ప్రవేశించేవారికి అది వెక్కిరిస్తున్నట్టు కనిపించి అసౌకర్యం కలిగి స్తున్నది. రుణాల మాఫీ పూర్తి కాలేదు. పసుపు కుంకుమ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు ముందు ప్రారంభించారు. చాటుకోడానికి విజయం ఒక్కటీ లేదు. వైఫల్యాలు అనేకం. విద్యార్థుల ఫీజు రీయెంబర్స్‌మెంట్‌ కోసం మోహన్‌బాబు వంటి మాజీ మిత్రుడు ధర్నాకు దిగవలసి వచ్చింది. అంతులేని వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రతిపక్షంపైన దాడులు చేయడం. ప్రతిపక్ష నాయ కుడిపై బురద చల్లడం, వందిమాగధుల చేత అవాకులూచెవాకులూ మాట్లాడించ డమే ఎన్నికల ప్రచారంగా చెల్లుబాటు అవుతోంది. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్య మంత్రి చేస్తే మిన్ను విరిగి మీద పడుతుందంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలు అవుతున్నారు. శ్రేయోభిలాషులకు సైతం ఎబ్బెట్టుగా కని పిస్తున్నాయి ఆయన చర్యలు. 2014లో నరేంద్రమోదీ హవా, పవన్‌కల్యాణ్‌ ‘పుల్‌’, టీడీపీ బలం కలిస్తేనే ప్రతిపక్షం కంటే  కేవలం ఐదు లక్షల ఓట్ల ఆధిక్యం లభించింది. అప్పటికి చంద్రబాబు పట్ల వ్యతిరేకత లేదు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది.

ప్రభుత్వ  వైఫల్యాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడి జనాదరణ విశేషంగా పెరిగింది. ఒకప్పుడు మోదీ మహా నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తిన చంద్రబాబు మోదీ హవా తగ్గిపోయిందని అంచనా వేసి ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించారు. మోదీ వ్యతిరేకతను రాష్ట్రంలో సృష్టించి ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికలలో గెలుపొందాలని ఆశిం చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలుగువా రిని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఇంతలో పుల్వామాలో సైనిక శకటాలపైన ఉగ్రదాడి జరగడం, 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోవడం, కొద్ది రోజుల తర్వాత భారత వైమానికి దళానికి చెందిన యుద్ధవిమానాలు పాకిస్తాన్‌ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపైన బాంబుల వర్షం కురిపించడం జరిగింది. ఈ పరి ణామాలను తన దేశభక్తికీ, తన ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమంటూ మోదీ ప్రచారం చేసుకోవడం, ప్రధానిగా కొనసాగడం తథ్యం అంటూ జనాభిప్రాయం బలపడటం చంద్రబాబును పునరాలోచనలో పడవేసింది.

వెంటనే మోదీపైన దాడి తీవ్రతను పూర్తిగా తగ్గించారు. చంద్రబాబు తెలంగాణలో రాహుల్‌ గాంధీతో కలసి చెట్టపట్టాలేసుకొని ఎన్నికల  ప్రచారం చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ‘నేను కావాలా, చంద్ర బాబు కావాలా?’ అంటూ ప్రశ్నించి ప్రజల సంపూర్ణ మద్దతు పొందారు. అదే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగించాలనీ, కేసీఆర్‌ని విలన్‌గా చిత్రించా లనీ, ఆయనకు జగన్‌ బంటుగా వ్యవహరిస్తున్నారని జనాన్ని నమ్మించాలనీ ప్రయత్నం ముమ్మరం చేశారు. అందుకే చంద్రబాబు ప్రతి సభలో జగన్‌ నామ స్మరణ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీకి రహస్య ఒప్పందం ఉంది. కిశోర్‌ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి వంటి ఎంతోకొంత ప్రజా దరణ కలిగిన నాయకులు టీటీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

చేగువేరా–చంద్రబాబు
రెండో వీరుడు పవన్‌కల్యాణ్‌. ఆయన అగ్రజుడు మెగాస్టార్‌ చిరంజీవి సౌమ్యుడు. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. పవన్‌ రాజకీయాలలో ప్రవేశిం చినప్పుడు చేగువేరా అభిమాని. ఇప్పుడు చంద్రబాబు అనుయాయి. వామపక్ష భావజాలాన్ని అభిమానించే వ్యక్తిగా, గద్దర్‌ వంటి విప్లవ నాయకుల మిత్రుడుగా పరిగణన పొందిన పవన్‌ రాజకీయాలలో అడుగు పెడుతూనే బీజేపీతో కలసి ప్రయాణం చేయాలని సంకల్పించడమే విడ్డూరం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక సందర్భాలలో ఆయన  పిల్లిమొగ్గలు వేశారు. లోకేష్‌పైన అవినీతి ఆరోప ణలు చేసి ఆ తర్వాత మౌనం పాటించారు. మంగళగిరిలో లోకేశ్‌ పైన పోటీకి జనసైనికుడిని పెట్టకుండా సీపీఎం అడిగిన టిక్కెట్టును సీపీఐకి ఇచ్చారు. లోకేశ్‌కి ఇబ్బంది లేకుండా చూసేందుకే చంద్రబాబు అభీష్టం మేరకు జనసేన, సీపీఎం అభ్యర్థులను రంగంలో దింపలేదన్నది సామాన్య పౌరులకు సైతం తెలిసిపో తోంది. చింతమనేని ప్రభాకర్‌ విషయంలోనూ అంతే. అతనిపైన ఉద్యమం నిర్వహించి నిప్పులు కక్కిన పవన్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఓట్లు చీల్చి చింతమనేని విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో సత్యవతి అనే బీసీ మహిళను జనసేన అభ్యర్థిగా నిలబెట్టారు. విశాఖ, అమలాపురం, నరసాపురం లోక్‌సభ స్థానాలు జనసేనకు దక్కేటట్టు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ నియోజకవర్గాలలో బలహీనమైన టీడీపీ అభ్యర్థులను నిలబెట్టారు. విశాఖలో (జేడీ) లక్ష్మీనారాయ ణను గెలిపించాలన్నది చంద్రబాబు అభిమతం. బాలకృష్ణ ఒత్తిడి భరించలేక ఆయన రెండో అల్లుడూ, లోకేశ్‌ తోడల్లుడూ, దివంగత ఎంవీఎస్‌ మూర్తి మనుమడూ అయిన భరత్‌కు టిక్కెట్టు ఇచ్చినప్పటికీ టీడీపీ శ్రేణులు జనసేన అభ్యర్థి విజయానికే కృషి చేస్తాయని అంటున్నారు.

అమలాపురంలో హర్షకుమా ర్‌కి టీడీపీ టిక్కెట్టు ఇస్తే జనసేన అభ్యర్థి శేఖర్‌ (ఓఎన్‌జీసీ మాజీ డైరెక్టర్‌)కు గట్టిపోటీ ఇస్తారని భావించి బాలయోగి కుమారుడికి టీడీపీ టిక్కెట్టు ఖరారు చేశారు. నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడిని టీడీపీ అభ్యర్థిగా నిర్ణయిం చారు. ఆ తర్వాత సుబ్బారాయుడి స్థానంలో సంపన్నుడైన చైతన్యరాజును బరిలోకి దింపారు. కొంతకాలం ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ఆయననీ పక్కనపెట్టి ఉండి శాసనసభ్యుడు శివరామరాజును అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌ఫిక్సింగ్‌ల ఫలితంగా జనసేన అభ్యర్థులు ఖాయంగా గెలుస్తారని కాదు. టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉన్నదని ఇటువంటి ఉదంతాలు నిరూపిస్తున్నాయి. గాజువాక సీటును సీపీఎం అడిగింది. అక్కడ ఉద్యమాల నాయకుడు నరసింగరావును నిలబెట్టాలన్నది సీపీఎం ఉద్దేశం. పవన్‌ స్వయంగా ఆ సీటును వరించినప్పుడు వామపక్షాలు ఏమి చేయగలవు?  మాయావతికి మూడు లోక్‌సభ స్థానాలూ, 21 శాసనసభ స్థానాలూ కేటాయించడం చంద్ర జాలంలో భాగమే. వామపక్షాలకు చెరి రెండు లోక్‌సభ స్థానాలూ, ఏడేసి అసెంబ్లీ స్థానాలూ కేటాయించారు. ఇది స్థానికంగా కొద్దోగొప్పో ఉనికి కలిగిన వామ పక్షాలను అవమానించడమే.

సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్‌సభ నియోజక వర్గంలోనూ, నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ జనసేన అభ్యర్థులను ప్రకటించినట్లు తాజా సమాచారం.  లాలూచీ రాజకీయానికి ఇది పరాకాష్ట. వైఎస్‌ఆర్‌సీపీకి పడే కాపు, దళిత ఓట్లను చీల్చాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. కానీ బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో, బీ–ఫారాలు ఎవరు ఇస్తారో ఇంతవరకూ స్పష్టత లేదు. ఉత్తరాది, దక్షిణాది వైరుధ్యం గురించి గంభీర ప్రసంగాలు చేసిన పవన్‌ పనిగట్టుకొని లక్నో వెళ్ళి మాయావతిని కలుసుకోవడం, పొత్తు పెట్టుకో మని అడగడం, ఆమె ప్రధాని కావాలని తాను అభిలషిస్తున్నట్టు చెప్పడం కపట రాజకీయానికి నిదర్శనం. స్వయంగా సినిమా నటుడు కనుక స్క్రిప్టు చదవడం సుఖంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారు. కానీ తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారనే వ్యాఖ్య చేసినందుకు పవన్‌కల్యాణ్‌ను తెలుగు జాతి క్షమించదు. పవన్‌ లోగడ తన సినిమా రిలీజైనప్పుడు  కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఆయన నాయకత్వం లక్షణాలను పొగిడారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తాను టీఆర్‌ఎస్‌కే ఓటు వేశానంటూ నాగబాబు ప్రకటించారు. రాజకీయ లబ్ధికోసం రెండు రాష్ట్రాల మధ్య ద్వేషం రగిలించే వ్యాఖ్యలు పవన్‌ కల్యాణ్‌ వంటి వ్యక్తి చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు.  

ప్రవాహానికి ఎదురీదిన నేత
మూడో యోధుడు జగన్‌మోహన్‌రెడ్డి. 2014 ఎన్నికలకు ముందు సోనియా గాంధీని ధిక్కరించడం, సొంత పార్టీ పెట్టుకోవడం, ధిక్కారమును సైతునా అంటూ ఆగ్రహించిన సోనియా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం, నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడితో కలిసి పథకం ప్రకారం జగన్‌పైన బూటకపు కేసులు పెట్టించడం, దర్యాప్తు పేరుతో 16 మాసాల పాటు జైలులో నిర్బంధించడం చరిత్ర. 2014 ఎన్నికలలో శక్తివంచన లేకుండా పోరాడినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు అధైర్య పడలేదు. నిరాశ చెందలేదు. కుంగిపోలేదు. 2019 ఎన్నికలకు అప్పటి నుంచే సన్నాహాలు ఆరంభించారు. పార్టీని పటిష్టంగా నిర్మించారు.  3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. కోట్ల మంది ప్రజలను కలుసుకొని వారి సమస్యలు ఆలకించారు. తనపైన హత్యాప్రయత్నం జరిగినప్పుడు హుందాగా ప్రవర్తించారు. అధికారపక్షం ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఒక ఎజెండాను నెలకొల్పారు. దానికి స్పందించక తప్పని స్థితిలో చంద్రబాబును పడవేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం జగన్‌ ఆరంభించి కడదాకా కొనసాగిస్తే ముందు హోదా దండగనీ, ప్యాకేజీ మెండుదనీ వాదించి, చివరికి హోదా నినాదంతోనే ఎన్‌డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించింది. మోదీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా జగన్‌ ఎజెండాను చంద్రబాబు అనుసరించక తప్పలేదు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించి నప్పుడూ చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. వృద్ధులకు పింఛన్లు పెంచడానికీ, పసుపు కుంకుమ కార్యక్రమానికీ జగన్‌ పాదయాత్రలో చేసిన వాగ్దానాలూ, అంతకు మందు పార్టీ ప్లీనరీలో పేర్కొన్న నవరత్నాలే ప్రేరణ. ఎజెండా నిర్ణయిం చిన నాయకుడే మార్గదర్శకుడు. అతడే విజేత.


కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు