కప్పదాట్లు... కట్టుకథలు!

10 Mar, 2019 00:38 IST|Sakshi

త్రికాలమ్‌ 

‘వాట్‌ ఈజ్‌ డెమాక్రసీ? సమ్‌బడీ విల్‌ గివ్‌ మనీ, సమబడీ ఎల్స్‌ విల్‌ స్పెండ్‌ దట్‌ మనీ డ్యూరింగ్‌ ఎలక్షన్స్‌. వాట్‌ వే ఐ యామ్‌ కన్సర్న్‌డ్‌? (ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు. మరొకరు ఎన్నికలలో ఖర్చు చేస్తారు. దీనితో నాకేమిటి సంబంధం?).’ ప్రజాస్వామ్యాన్ని ఇంత సరళంగా, ధనప్రధానంగా నిర్వచించిన మేధావి ఎవరో కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రజాస్వామ్యాన్ని ఆయన అర్థం చేసుకున్న తీరు అది. ప్రజాస్వామ్య వైతాళికులనూ, ప్రపంచ మేధా వులనూ ఉటంకించడం ఆయన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను సమున్నతంగా నిలపాలని త్రికరణశుద్ధిగా ప్రయత్నించే నాయకుల బాపతు కాదు ఆయన.

ఆచరణయోగ్యమైన, తనకు అర్థమైన రీతిలో రాజకీయం చేయడం తిరుపతి విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడుగా ఉన్న కాలం నుంచీ చంద్రబాబునాయుడికి బాగా అబ్బిన విద్య. రాజకీయాలంటే వివిధ కులాల మధ్య సమన్వయం సాధిస్తున్నట్టు కనిపిస్తూనే అస్మదీయులకు ప్రయో జనాలూ చేకూర్చుతూ పార్టీనీ, ప్రభుత్వాన్నీ నడిపించడం అని ఆయన అవ గాహన. అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎటువంటి చాణక్యం చేసినా, ఏ నియమం ఉల్లంఘించినా  తప్పు లేదనీ, అధికారంలో కొనసాగడానికి అధికార దుర్వినియోగం చేయడానికి సంకోచించనక్కరలేదనీ ఆయన భావిస్తారు. అధి కారం కైవసం చేసుకునే క్రమంలో ఎవరి సహకారం అవసరమైతే వారి సహ కారం తీసుకోవాలనీ, అందుకు  ఏ వాగ్దానం అవసరమైతే ఆ వాగ్దానం నిరభ్యం తరంగా చేసేయాలనీ, అధికారం జేజిక్కిన తర్వాత తన మనుషులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏమి చేసినా సమర్థనీయమేననీ నమ్మకం. అధికారం హస్తగతం చేసుకునే క్రమంలో తనకు సహాయం చేసినవారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న పట్టింపు లేదు. మాటపైన నిలబడాలన్న నిబద్ధత లేదు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమని గట్టిగా విశ్వసించిన నాయకుడు ఆయన.

ఫలితంగా, ఈ రోజు సామాన్యులు ఎవ్వరూ ఎన్నికలరంగం వైపు తేరి పార చూడలేని పరిస్థితి నెలకొన్నది. పదుల కోట్ల రూపాలయలు ఖర్చు చేసిన వారే ఎన్నికల రంగంలో దిగి తమ అదృష్టం పరీక్షించుకోగలరు. సేవానిరతి, నిస్వార్థచింతన, సమాజంపట్ల ప్రేమ, అంకితభావం ఉన్నంత మాత్రాన చాలదు. డబ్బు దండిగా ఉండాలి. ఎన్నికల వ్యవహారం ఇంతగా డబ్బుతో ముడిపడే విధంగా దిగజారడానికి కారణభూతులైన నాయకులలో చంద్రబాబు అగ్రగణ్యులు. అందుకే ప్రజాస్వామ్యాన్ని ధనభూయిష్టంగా అంత అలవోకగా నిర్వచించగలిగారు. మన సులోని మాట అప్రయత్నంగానే బయటికి వస్తుంది. రాజకీయ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో, తన పరిమితులను తెలుసుకొని వాటిని అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఆయన దిట్ట. ఏ ఎన్నికలలో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో, ఎవరిని చేరదీయాలో, ఎవరిని దూరంగా పెట్టాలో తెలిసిన వ్యక్తి.  

ఆయనకు పరాజయం అంటే భయం. అభద్రతాభావం, వైఫల్యభీతి ఆయనను ఎల్లప్పుడూ వెన్నా డుతూ ఉంటాయి. ప్రతిక్షణం, ప్రతిరోజూ తానే గెలుపొందాలనీ, అందుకోసం ఏమైనా సరే చేసేయాలనీ ఆయన భావిస్తారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే గెలిచినా, ఓడినా పెద్దగా ప్రభావం వేయని ఉప ఎన్నికలో గెలిచేందుకు ఆయన అధికార యంత్రాంగాన్ని రంగంలో దింపుతారు. పది మంది మంత్రులనూ, పాతికమంది ఎంఎల్‌ఏలనూ, డబ్బు సంచులనూ ఉపఎన్నిక జరు గుతున్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పరుగులు పెట్టించి ఘనవిజయం సాధిస్తారు. ఇందుకు నంద్యాల ఉపఎన్నిక తాజా ఉదాహరణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కలలో కాంగ్రెస్‌ చావుదెబ్బ తినడంలో తన ప్రమేయం ఉన్నప్పటికీ అసలు తెలం గాణలో ఎన్నికలు జరగనట్టూ, తాను ప్రచారం చేయనట్టూ మాట్లాడతారు. 

నీతినియమాలకు తిలోదకాలు
రాజకీయాలలో నాయకులుగా జయప్రదంగా కొనసాగుతున్నవారందరికీ గొప్ప తెలివితేటలూ, మేధాసంపత్తీ ఉండాలన్న నియమం లేదు. సమాచారం తెలి సినవారితో సంపర్కం పెట్టుకొని వారి ఆలోచనలను సొంతం చేసుకొని తమ ఆలోచనలుగా చెప్పుకుంటూ ప్రజలను నమ్మించే నేర్పు కొందరికి ఉంటుంది.  నియమనిబంధనలనూ, నీతీనిజాయితీలనూ తప్పకుండా కష్టపడి రాజకీయా లలో పైకి వచ్చిన నాయకులు కొందరు ఉంటారు. నియమాలతో నిమిత్తం లేకుండా నీతిని పట్టుకొని వేళ్ళాడకుండా విజయం సాధించడానికి ఏది అవ సరమైతే అది చేసి అధికారం సంపాదించి పదవులలో చాలా సంవత్సరాలు ఉన్నవారూ లేకపోలేదు. వీరికి అసాధారణమైన పోటీ మనస్తత్వం ఉంటుంది. అభద్రతాభావాన్ని కప్పి పుచ్చడానికీ లేదా అధిగమించడానికీ బుకాయించడం, దబాయించడం, స్వోత్కర్షకు దిగడం ఆనవాయితీ. కళ్ళెగరవేస్తూ, చూపుడు వేలుతో ఛాతిని చూపిస్తూ  తాను ఎవ్వరికీ భయపడననీ, ఎవ్వరికీ లొంగే ప్రసక్తి లేదనీ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందిని చూశాననీ ప్రకటనలు చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో తప్పు చేసి ఇతరులపైన తోసి అడ్డంగా దబాయిస్తూ ఉంటారు.

అటువంటి ఘటనలలో డేటా చౌర్యం ఒకటి. మా సమాచారం దొంగిలించి మాపైనే దాడులు చేస్తారా?, ‘మా డేటాను దొంగిలించి అపోజిషన్‌ పార్టీకి ఇస్తారా మీరు?,’అంటూ కేసీఆర్‌ని ప్రశ్నించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పట్టుబడి విజయవాడకు పలాయనం చిత్తగించిన సమయం లోనూ ఇదే వరుస. ‘మీకు పోలీసులు ఉన్నారు. మాకూ పోలీసులు ఉన్నారు. మీకు ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది,’అంటూ రభస. డేటా చౌర్యం కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం తొమ్మదిమంది అధికారులతో ఒక సిట్‌ (స్పెషల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ టీమ్‌) నియమిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తొమ్మి దిమందితో ఒక సిట్‌ నియమించింది. తెలంగాణ సర్కార్‌ ఒక సిట్‌ నియమిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు సిట్‌లు నియమించింది. పైగా, తన రాజకీయ జీవితంలో నడవడిక (కేరెక్టర్‌)కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చానంటూ చెప్పు కుంటారు. ఇంతవరకూ చంద్రబాబు పేరున కానీ లోకేశ్‌ పేరు మీద ఉన్న సంస్థ లపైన కానీ ఆదాయంపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్, సీబీఐ దాడులు నిర్వహించలేదు. నోటీసులు సైతం ఇవ్వలేదు. అక్రమాలు చేసినట్టు అను మానించిన సంస్థలపైన దాడులు జరుగుతున్నాయి. నిజంగా ఆ సంస్థలు అక్ర మాలు చేయకపోతే వాటికి నష్టం జరగదు. మరి తనను మానసికంగా వేధిస్తు న్నారంటూ చంద్రబాబు ఎందుకు మనస్తాపం చెందుతున్నారు? అక్ర మంగా ఓటర్ల వ్యక్తిగత వివరాలను అపహరించిన సంస్థపైన వచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని పోలీసులు స్పందిస్తే దానిని రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ మంటూ అభివర్ణించడం దేనికి? 

ఆంధ్రప్రదేశ్‌లో 3.6 కోట్ల మంది ఓటర్ల కలర్‌ ఫొటోలతో సహా సకల వ్యక్తిగత వివరాలు రాష్ట్రప్రభుత్వం సేకరించి ఐటీగ్రిడ్స్‌ అనే సంస్థకు ఎందుకు అప్పగించిందో చంద్రబాబునాయుడు తెలిసినా చెప్పరు. ఎన్నికల కమిషన్‌ వద్ద మాస్టర్‌ కాపీలో మాత్రమే ఉండవలసిన ఓటర్ల కలర్‌ ఫొటోలు బ్లూఫ్రాగ్, ఐటీగ్రిడ్స్‌ వంటి సంస్థలకూ, సేవామిత్ర వంటి యాప్‌లకూ ఎట్లా లభించాయో వెల్లడించరు. ఐటీగ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ అనే వ్యక్తి రెండు, మూడు రోజుల్లో అజ్ఞాతవాసానికి స్వస్తి చెప్పి బయటకు వస్తారని  చెబుతారు. అంటే అశోక్‌ను ఎక్కడ దాచారో ముఖ్యమంత్రికి తెలుసని అనుకోవాలి. తెలంగాణ పోలీసులు వెతుకుతున్న నిందితుడికి ఒక ముఖ్యమంత్రి రక్షణ కల్పించడం చట్టవిహితమా? చంద్రబాబు రాజకీయం అవకాశవాదానికి పరాకాష్ఠ. 

ప్లేటు మార్చిన చంద్రబాబు
నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పట్ల ప్రజలలో ఆదరణ తగ్గినట్టు కనిపించింది. బీజేపీని మోయడం కంటే ఆగర్భశత్రువైన  కాంగ్రెస్‌తో కరచాలనం లాభదాయకమని భావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్‌తో ఒప్పందం క్షేమదాయకం కాదని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు ఉండదు కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పని చేస్తాయని ప్రకటించారు. మొన్నటి వరకూ చంద్రబాబు తీవ్రస్వరంతో మోదీని విమర్శించేవారు. సవాలు చేసేవారు. ఆయన కంటే తాను సీనియర్‌నంటూ పదేపదే చెప్పేవారు. తనకూ, మోదీకీ మధ్య పోరాటం జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేవారు. ఢిల్లీ, కోల్‌కతా తదితర నగరాలకు వెళ్ళి ప్రతి పక్షాలకు సంఘీభావం ప్రకటించేవారు. జగన్‌మోహన్‌రెడ్డికి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌)ల రహస్య మద్దతు ఉన్నదంటూ పదేపదే ఆరోపించారు. అంతలోనే సీను మారింది. చంద్రబాబునా యుడు ప్లేటు కూడా మారినట్టుంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌ భూభాగంలోని బాలాకోట్‌లో భారత వాయుసేన దాడి చేసిన తర్వాత జరుగుతున్న ప్రచారం ఫలితంగా మోదీ పైచేయి సాధించారనీ, ఆయన ప్రధాని పదవిలో కొనసాగే అవకాశం ఉన్నదనే అభిప్రాయం దేశప్రజలలో బలపడింది. ఇది గ్రహించిన చంద్రబాబు ఎందుకైనా మంచిదని మోదీపైన దాడులు తగ్గించారు. కేసీ ఆర్‌పైనా, తెలంగాణ పోలీసులపైనా ధ్వజమెత్తడానికి తాజాగా వెల్లడైన డేటా కుంభకోణాన్ని వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దగ్గర ఉండవలసిన డేటాను తెలంగాణ పోలీసులు ఐటీగ్రిడ్స్‌ నుంచి తస్కరించి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీకి ఇచ్చారంటూ సరికొత్త దాడికి తెరదీశారు. తాను కావాలో, కేసీఆర్‌ కావాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తేల్చుకోవాలంటూ పిలుపు ఇచ్చారు. ఇటువంటి వాక్యాలే ఎక్కడైనా వినినట్టు పాఠకులకు అనిపిస్తే అది వారి తప్పు కాదు. నాలుగు మాసాల కిందట తెలం గాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను ఇటువంటి ప్రశ్నే  అడిగారు. తాను కావాలో చంద్రబాబు కావాలో కోరుకోమని ప్రజలకు పిలుపు నిచ్చారు. వారు నిర్ద్వంద్వంగా కేసీఆర్‌ కావాలనే సంకల్పం ప్రకటించారు. అత్యధిక మెజారిటీ కట్టబెట్టారు. తెలంగాణలో చంద్రబాబునాయుడు ప్రచారం చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ ప్రచారం చేయబోరు. చంద్రబాబులాగా పొరుగు రాష్ట్రంలో చక్రం తిప్పాలనే దురాశ కేసీఆర్‌కు లేదు. అయినా సరే, ఏదో ఒక విధంగా ప్రజలలో భావావేశం రగిలించాలని చంద్రబాబు తాపత్రయం. ఇందుకోసం డేటా చౌర్యం ఉదంతాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నం.

వృధాప్రయాస
శనివారం అంతటా చంద్రబాబునాయుడు అసాధారణమైన అంశాలు వెల్లడిం చబోతున్నట్టు అనుకూల మీడియాలో ఊదర కొట్టారు. చివరికి సుదీర్ఘ మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంలో కొత్త అంశం ఏమీ లేదు. ఎన్నికల కమిషన్‌కు వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టుకొని అందులో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నట్టు  పేజీ నంబర్లు చెబుతూ, కొన్ని వాక్యాలు చదువుతూ చాలా ముఖ్యమైన విషయం కనిపెట్టినట్టు హడావిడి చేశారు. అంతా హుళక్కి. విజయసాయిరెడ్డి ఫిర్యాదు రహస్యం కాదు. అది బహిరంగ పత్రం. ‘అంతా విజయసాయిరెడ్డి చెప్పినట్టే జరుగుతోంది,’అంటూ, ‘దొంగతనాలు జరగవచ్చు, దాడులు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి,’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రబాబు మీడియా సమావేశాన్ని అపహాస్యం చేశారు. అంతకు ముందు ఒక సారి ‘మీ ఇంట్లో ఆడపిల్లను ఎత్తుకొని పోవచ్చు,’ అన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లా డవలసిన తీరేనా ఇది?  ప్రజల వివేకాన్ని అంత తక్కువగా అంచనా వేయడం తప్పు. ఎవరు అధికారంలో ఉన్నారో, ఎవరు ఓటర్ల సమాచారం సేకరించారో. ఓటర్ల బ్యాంకు ఖాతాల, లావాదేవీల వివరాలు సమస్తం ఒక బినామీ ప్రైవేటు కంపెనీకి ఎట్లా కట్టబెట్టారో, ఆ వివరాలను సేవామిత్ర యాప్‌ ద్వారా టీడీపీ కార్యకర్తలు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో, ఓట్లు ఎట్లా తొలగిస్తున్నారో అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు ప్రజలు. దొంగతనాలూ, దాడులు జరగకుండా నిరోధించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని కూడా ప్రజలకు తెలుసు. వైఫల్య భీతి చంద్రబాబు చేత అసంబద్ధమైన, నిరాధార మైన ఆరోపణలు చేయిస్తున్నది. ముఖ్యమంత్రి పథకం ప్రకారం ఆవేశపడుతున్నారు కానీ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. 2004, 2009లో లాగానే ఈసారి కూడా చంద్రబాబునాయుడు ఎత్తుగడలు ఫలించకపోవచ్చు. ప్రజలలో వ్యతిరేకత బలంగా ఉన్నట్టు సమా చారం. స్వయంకృతం.


కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు