స్వానుభవమే గీటురాయి

25 Nov, 2018 01:12 IST|Sakshi

త్రికాలమ్‌

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోలింగ్‌కు రెండు వారాల వ్యవధి కూడా లేదు. నామినేషన్లూ, బుజ్జగింపులూ, ఉపసంహరణల పర్వం పూర్తయింది. ప్రచారం  తారస్థాయికి చేరుకున్నది. యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒకే వేదికపై కనిపించి వేలాదిమంది సభికులకు కనువిందు చేసి వెళ్ళి పోయారు. తెలంగాణ రాష్ట్రంలో సోనియా అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఆప ద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌)  వరుస సభలతో దుమ్మురేపుతున్నారు. హరీష్‌రావు, కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) క్షణం తీరికలేకుండా తిరుగుతున్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల సభలో ప్రసంగించబోతున్నారు. 2014 నాటి ఎన్నికలకీ, ఈ ఎన్నికలకీ పోలిక లేదు. అప్పటి సమీకరణాలు ఇప్పుడు లేవు. నాటి పరిస్థితులు నేడు లేవు.  

నాలుగున్నర సంవత్సరాల కిందట ఎన్నికలు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)తో పాటు తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్‌ఆర్‌సీపీ కూడా పూర్తి స్థాయిలో పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్‌తో సీపీఐ కూటమి కట్టింది. సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది.  నాడు టీడీపీ, బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలోని జనసేన ఒక కూటమిలో భాగ స్వామ్య పక్షాలు. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడు. ఆయన పరిపాలనాదక్షత ఏపా టిదో ప్రజలకు తెలియదు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నేతగా అనుభవం గడించారు. ఇవి తెలం గాణ రాష్ట్రంలో తొలి ఎన్నికలు. బీజేపీతో టీడీపీ మైత్రీబంధం తెగిపోయింది. టీడీపీ ఆజన్మవిరోధి కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టింది. అందులో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పెట్టిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌), సీపీఐలకు భాగ స్వామ్యం ఉన్నది. సీపీఎం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్నది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తూ మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టింది. టీఆర్‌ఎస్, ఎంఐఎంల మధ్య అనుబంధం ఉన్నది. వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఎన్నికలకు దూరం. జనసేన పోటీలో లేదు. 52 మాసాల కేసీఆర్‌ పాలనలోని మంచిచెడులు ప్రజల ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాఫల్య వైఫల్యాలు అందరికీ తెలుసు. 

సోనియా సహకారం
శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో జరిగిన పెద్ద బహిరంగ సభలో సోనియాగాంధీ ప్రసంగంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఆమె ప్రసంగం కూటమికి కొత్త ఊపు ఇచ్చిందనీ, ఉత్సాహం నింపిందనీ కొంతమంది వ్యాఖ్యానిస్తే. సోనియా భాషణం చప్పగా ఉన్నదని మరి కొందరు చప్పరి స్తున్నారు. రాహుల్‌ క్లుప్తంగా మాట్లాడటాన్ని తప్పుపడుతున్నారు.  వాస్తవానికి సోనియా సభ నాలుగున్నర సంవత్సరాలు ఆలస్యంగా జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లును రాజ్యసభ ఆమోదించిన తర్వాత వారంరోజుల్లో హైదరాబాద్‌లో పెద్ద సభ నిర్వహించి సోనియాగాంధీని ఆహ్వానించి ఉన్నట్ల యితే తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి మంజూరు చేసినందుకు ప్రతిఫలం కాంగ్రెస్‌కి దక్కేది. అప్పటికి పదేళ్ళు మంత్రి పదవులు అనుభవించిన కాంగ్రెస్‌ నాయకు లలో ఒక్కరు కూడా నడుం బిగించలేదు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అట్టహాసంగా వచ్చిన కేసీఆర్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇంటికి పెద్ద ఊరేగింపులో చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. ఆ రోజే తెలంగాణ ఇచ్చిన పార్టీ కంటే తెచ్చిన పార్టీకే ప్రజలు పట్టం కడతారని తేలిపోయింది. శుక్రవారం సభ సైతం అంత భారీగా జరగడానికి టీడీపీ నుంచి కొన్ని మాసాల కిందట కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి చొరవ కారణం. ఎన్నికలు ప్రస్తుతం అయిదు రాష్ట్రాలలో జరుగుతున్నప్పటికీ సోనియాగాంధీ మరే  రాష్ట్రానికీ వెళ్ళడం లేదు. కాంగ్రెస్‌ నాయకత్వం విన్నపాన్ని మన్నించి ఆరోగ్యం సహకరించకపోయినా హైదరాబాద్‌కు ప్రత్యేకంగా వచ్చారు. ఆ సభ లక్ష్యం నెరవేరింది. 

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక భేష్‌
రాహుల్‌గాంధీ సాధించిన చిరువిజయాలు ముందుగా చెప్పుకోవాలి. ఎంత ఒత్తిడి వచ్చినా టీపీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కొనసాగించడం చెప్పుకోదగిన అంశం. పార్టీ అభ్యర్థులను నిర్ణయించిన తీరు గతం కంటే చాలా నయం. పెక్కు వడబోతల అనంతరం యోగ్యులైన అభ్యర్థులకే టికెట్లు లభించాయని చెప్పవచ్చు. టీజేఎస్‌కు కేటాయించిన కొన్ని స్థానాలలో పోటీ పెట్టడం, టీడీపీని 13 స్థానాలకు పరిమితం చేయడం విశేషం. ఈసారి కాంగ్రెస్‌ నాయ కత్వం వ్యవహరించిన తీరులో క్షేత్రవాస్తవికతకు సంబంధించిన స్పృహ కని పిస్తున్నది. మొత్తంమీద 99 స్థానాలలో అభ్యర్థులను నిలిపింది.

అధికారంలో ఉన్న పార్టీలో, అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీలో టికెట్టు ఆశించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. టికెట్టు దక్కని అసమ్మతి నేతలు తిరుగుబాటు చేయడం, పార్టీ ఫిరాయించడం లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం సర్వసాధారణం. టీడీపీ చంద్రబాబు సొంత సంస్థ కనుక ఆయన శక్తియుక్తులన్నీ ప్రయోగించి అసమ్మతివాదులకు ఉపశమనం కలిగిస్తారు. టీఆర్‌ఎస్‌లో ఆ పని కేటీఆర్‌ చేశారు. కాంగ్రెస్‌లో అసమ్మతివాదులను శాంతింజేయడానికి  అంత తీవ్రమైన ప్రయత్నం జరగదు. ఈ సారి మాత్రం పకడ్బందీగా జరిగింది.  అహమ్మద్‌ పటేల్, జైరాంరమేశ్‌ వంటి జాతీయ స్థాయి నాయకులూ, తమిళనాడు, కర్ణాట కకు చెందిన సీనియర్‌ నాయకులూ హైదరాబాద్‌లో మకాం పెట్టి అసమ్మతి నాయకుల ఇళ్ళకు వెళ్ళి బతిమిలాడి, బామిలాడి పోటీ నుంచి ఉపసంహరింప జేశారు. గతంలో పోల్చితే కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య తక్కువే. అసమ్మతివాదులకు నచ్చజెప్పడానికి  ఇంత పెద్ద  స్థాయిలో కృషి జరగడం ఇటీవలి కాంగ్రెస్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పట్ల వ్యతిరేకత లేకపోలేదు. కాంగ్రెస్‌ మరింత శ్రద్ధతో ఎన్నికలకు సిద్ధమై, టీజేఎస్, సీపీఐ కూటమితో సరిపెట్టుకుంటే టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగేది. ఏ కారణం చేతనో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించుకు న్నది. ఫలితంగా కేసీఆర్‌ చేతికి బలమైన ఆయుధం లభించింది. ‘తెలంగాణకు చంద్రబాబునాయుడు అవసరమా?;’ అంటూ ప్రతి ఎన్నికల సభలో ప్రజలను అడిగి కెమెరాలూ, మైకులూ సభికులవైపు తిప్పమంటూ టీవీ జర్నలిస్టులను కేసీఆర్‌  అడుగుతున్నారు. తెలంగాణ ప్రజల మనోగతం ప్రపంచానికి తెలియా లని అంటున్నారు.  కూటమి ‘పొరబాటున’ గెలిచినా ఢిల్లీకీ, అమరావతికీ గులా ములే పాలకులు అవుతారంటూ హెచ్చించే అవకాశం కేసీఆర్‌కి కాంగ్రెస్‌ ఇచ్చింది.

ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా కేసీఆర్‌ ప్రభు త్వంపైన చార్జిషీట్‌తో ధ్వజమెత్తుతూ, నోట్లరద్దునూ, గబ్బర్‌సింగ్‌ టాక్స్‌ (జీఎస్‌ టీ)ని సమర్థించినవారిలో ప్ర«థముడు తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు. నిజమే కానీ, నోట్లు రద్దు చేయమంటూ ప్రధాని నరేంద్రమోదీకి తానే సలహా చెప్పానంటూ ప్రస్తుతం కాంగ్రెస్‌ మిత్రుడు, బీజేపీ మాజీ స్నేహితుడు చంద్ర బాబునాయుడు గొప్పలు చెప్పుకున్నారు. జీఎస్‌టీని సైతం ఆయన సంపూ ర్ణంగా సమర్థించారు. ఆ విషయం మాట్లాడకుండా కేసీఆర్‌ని మాత్రమే నిందిస్తే విశ్వసనీయత ఉండదు. అవినీతి ఆరోపణలూ అంతే. కేసీఆర్‌ కుటుంబ పాలన గురించి బీజేపీ నాయకులు విమర్శిస్తే అర్థం ఉంటుంది. సోనియాగాంధీ తప్పు    బడితే పొసగదు. వంశ పాలనే లేకపోతే ఇటలీలో పుట్టి ఇండియాలో మెట్టిన సోనియాగాంధీ 1983లో భారత పౌరసత్వం స్వీకరించి 1998లో ఏఐసీసీ అధ్యక్ష పదవిని పొందగలిగేవారా?  కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత దీర్ఘకాలం (ఇరవై ఏళ్ళు) అధ్యక్షురాలిగా ఉండగలిగేవారా? తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ సోనియా ప్రకటించడాన్ని టీఆర్‌ఎస్‌ ప్రచారానికి వినియోగించుకుంటుంది.
 

సాఫల్య వైఫల్యాలు
తన తెలంగాణ బిడ్డలు తల్లడిల్లి పోతున్నారంటూ సోనియాగాంధీ ఆవేదన వెలి బుచ్చడం కాస్త కృతకంగా కనిపించింది. నిజమే. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు సమ్మతిస్తే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని తెలిసి కూడా సోనియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మాట ఎవ్వరూ కాదనలేరు. టీఆర్‌ఎస్‌  2014  ఎన్నికలలో చేసిన వాగ్దానాలలో కొన్నింటిని కేసీఆర్‌ ప్రభుత్వం నెరవేర్చని మాట వాస్తవం. ఉద్యోగ కల్పనలో వైఫల్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. యువతను ఆందోళనకు గురిచేస్తున్నది. రెండు పడకగదుల ఇళ్ళూ, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వంతున భూములు మంజూరు చేయడం వంటి కార్యక్రమాలు పాక్షికంగానే అమలైనాయి.  చేసిన ప్రతి వాగ్దానం నూటికి నూరు పాళ్ళూ అమలు కావాలనుకోవడంలో తప్పు లేదు కానీ అది అయిదేళ్ళ వ్యవధిలో జరగడం అసాధ్యం.

కేసీఆర్‌ ప్రచారంలో పేర్కొంటున్న విజయాలలో రోజుకు ఇరవైనాలుగు గంటలసేపు నాణ్యమైన విద్యుత్తు అందించడం ప్రధానమైనది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అక్కడ చీకటి రాజ్యం చేస్తుందని హెచ్చరించడాన్ని కేసీఆర్‌ అదేపనిగా ఉటంకిస్తున్నారు. మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళే శ్వరం ప్రాజెక్టు వంటి బృహత్తరమైన పథకాలు జయప్రదంగా అమలు జరుగు తున్న వాస్తవాన్ని కాదనలేము. ఐటీ రంగంలో జరుగుతున్న అభివృద్ధి కని పిస్తున్నది. హక్కులకు భంగం కలుగుతున్నదనే భావన బలంగా ఉన్నప్పటికీ  శాంతిభద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.  

ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం రైతులకు అందించడం ప్రశంసార్హం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు అనేకం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకరువు పెడుతున్నారు. వాటన్నిటినీ ప్రజలు ఆలకిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దంటూ కూటమి నాయకులు కరాఖండిగా చెబుతున్నారు. అహంకారి అనీ, ప్రజలకు అందుబాటులో ఉండరనీ, సచివాలయంలో అడుగుపెట్టకుండానే పదవీకాలం పూర్తి చేసుకుంటున్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారనీ, జాతకాలూ, వాస్తు వంటి నమ్మకాలు మితిమీరి పోతున్నాయనీ, నిరంకుశ పాల కుడనీ, మంత్రివర్గంలో ఒక్క మహిళకు సైతం చోటు కల్పించలేదనీ కేసీఆర్‌పైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ప్రజలు వింటున్నారు. 

చర్చనీయాంశమైన వ్యాఖ్య
అభ్యర్థుల యోగ్యత ఏ విధంగా ఉన్నప్పటికీ తన పట్ల ఉన్న ప్రజాదరణ వారిని గెలిపిస్తుందనే విశ్వాసంతో కేసీఆర్‌ ముందస్తుకు వెళ్ళారు. ‘గెలిపిస్తే గట్టిగా పనిచేస్తాం. ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటాం,’ అంటూ ఖానాపూర్‌ సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యను ప్రజలు అపార్థం చేసుకునే అవకాశాలే అధికం. ఓటమి భయం కేసీఆర్‌ను వెన్నాడుతూ ఆ విధంగా మాట్లాడించిందని కొందరూ, అది మనో వైజ్ఞానిక దబాయింపు (ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌) అని కొందరూ విశ్లేషించారు. ‘నన్ను ఎన్నుకుంటే కృతజ్ఞుడినై ఉంటాను. లేకపోయినా అంతే (If elected I shall be thankful; if not, it will be the same),’ అంటూ అమెరికా అధ్య క్షుడు అబ్రహాం లింకన్‌ చేసిన వ్యాఖ్య ఈ సందర్భానికి సరిపోతుంది. తనను ఓడిస్తే ప్రజలే నష్టపోతారని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ సందేశం సవ్యంగా అందలేదు. నరేంద్రమోదీకి హిందూ–ముస్లి బీమారీ (వ్యాధి) ఉన్నదంటూ నిర్మల్‌ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడాన్ని జాతీయ స్థాయిలో టీవీలు విస్తృ తంగా ప్రచారం చేశాయి.

బీజేపీకీ, టీఆర్‌ఎస్‌కీ రహస్య మైత్రి ఉన్నదంటూ ప్రత్యర్థులు ఊదరకొడుతున్నదానికి విరుగుడుగా కేసీఆర్‌ ఆ వ్యాఖ్యానం ఉద్దేశ పూర్వకంగానే చేసి ఉంటారు. పోటాపోటీగా జరుగుతున్న ఎన్నికలలో ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, ఎత్తుకు పైఎత్తు వేయడం సహజం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తమ జీవితా లలో ఎటువంటి మార్పు వచ్చిందో సమీక్షించుకొని  ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవలసింది ప్రజలే. పార్టీలు ఎంత ధాటిగా ప్రచారం చేసినా, నాయ కులు ఎంత ఘాటుగా ప్రసంగాలు చేసినా, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసి అరచేతిలో వైకుంఠం చూపించినా, మీడియా ప్రాధమ్యాలు ఎట్లా ఉన్నా ప్రజలు స్వానుభవం ప్రాతిపదికగానే ఏ పార్టీకి ఓటు వేయాలో, ఏ అభ్యర్థిని గెలిపించాలో లేదా ఓడించాలో నిర్ణయించుకుంటారు.

కె. రామచంద్రమూర్తి 

మరిన్ని వార్తలు