తూటాలే మాటలు!

8 Oct, 2017 00:20 IST|Sakshi

త్రికాలమ్‌
శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) మీడియా గోష్ఠి ఆసాంతం విన్నాను. వంద నిమిషాలకు పైగా సవివ రంగా మాట్లాడారు. సింగరేణి సంస్థలో బొగ్గు గని కార్మికుల సంఘం గుర్తింపు కోసం జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ఘనవిజయం సాధించింది. విజయో త్సాహంలో కేసీఆర్‌ కొన్ని అతిశయోక్తులు మాట్లాడినా అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష కూటమిని ఎద్దేవా చేసినా తప్పుపట్టనవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం హోరాహోరీ సాగింది. ప్రతిపక్షాల తరఫున వివిధ పార్టీల అధ్యక్షులూ, అగ్రనాయ కులూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఏఐసీసీ నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడూ కుంతియా సైతం ప్రచారంలో పాల్గొనడమే కాకుండా కూటమి గెలిచి తీరుతుందనీ, తెరాస పతనం ఆరంభం ఆవుతుందనీ ఢిల్లీలో ప్రక టించారు. ముఖ్యమంత్రిని ‘దొర’ అని సంబోధిస్తూ కొందరు నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగారు.

తెరాస సైతం ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి స్వయంగా అనేక వరాలు ప్రకటించారు. అక్కడి ఎన్నికలకు ఇంతకు పూర్వం ఏ ముఖ్యమంత్రి ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదు. మంత్రులూ, తెరాసకు చెందిన ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, ఇతర నాయకులూ శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు. మొత్తం 11 డివిజన్లలో తొమ్మిది డివిజన్లను టీబీజీకేఎస్‌ కైవసం చేసుకుంది. కాకపోతే 2012లో కంటే  ఓట్ల ఆధిక్యం తక్కువ. కిందటి సారి ఎన్నికలలో టీబీజీకెఎస్‌కు 6,587 ఓట్ల మెజారిటీ వస్తే ఈ సారి 4,217 ఓట్ల ఆధిక్యం లభించింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కార్మిక సంఘా లతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సారి సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కూటమికి అధిక ఓట్లు లభించాయి. అయినా తెరాస మద్దతు కలిగిన సంస్థను ఓడించలేక పోయింది. దానికి రెండంటే రెండే డివిజన్లు దక్కాయి. ఒకే యూనియన్‌ తొమ్మిది డివిజన్లను గెలుచుకోవడం అపూర్వమైన విషయం. ఇందుకు ముఖ్యమంత్రినీ, టీబీజీకేఎస్‌ నాయకులనూ, ముఖ్యంగా నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కవితనీ అభినందించవలసిందే.

కోదండరామ్‌పై దాడి
ఎన్నికలలో పోరాడి గెలవడంలో తమది తిరుగులేని రికార్డు అన్నట్టు కేసీఆర్‌ చెప్పు కోవడంలో తప్పులేదు. ఘనవిజయం సాధించినందుకు ఆనందం వెలిబుచ్చడం, ప్రతిపక్షాలను విమర్శించడం, ఓటర్లను అభినందించడంతో కేసీఆర్‌ సరిపెట్టుకొని ఉంటే ఈ వ్యాసం రాయవలసిన అవసరం ఉండేది కాదు.

కేసీఆర్‌ ప్రత్యర్థులపైన ఒంటికాలిపై లేస్తారనీ, పరుషపదజాలం ప్రయోగి  స్తారనీ తెలుగువారందరికీ తెలుసు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకోవడానికి దోహదం చేసిన అంశాలలో అత్యంత ప్రధానమైనది కేసీఆర్‌ వాగ్ధాటి. వాక్చా తుర్యంలో, వాగ్యుద్ధ కళలో ఆయనను మించిన రాజకీయ నేత రెండు తెలుగు రాష్ట్రాలలో మరొకరు లేరన్నది అందరూ అంగీకరించే విషయమే. పదిహేను సంవత్సరాలుగా కేసీఆర్‌ ఉపన్యాసాలు విని ఆనందించిన నాబోటివారికి సైతం నిన్నటి ప్రసంగం బాధ కలిగించింది. ప్రొఫెసర్‌ కోదండరామ్‌పైన దారుణంగా దాడి చేసిన తీరు ఆశ్చర్యం కలిగించింది. 2009 డిసెంబర్‌ 9న నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామంటూ చారిత్రక ప్రకటన చేసిన అనంతరం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలూ, ఎమ్మెల్యేలూ వరుస రాజీనామాలు చేశారు. ఈ  కారణంగా యూపీఏ సర్కార్‌ వెనుకంజ వేసి నప్పుడు ఉద్యమాన్ని కొనసాగించడంలో కేసీఆర్‌కు కోదండరామ్, ఇతర ఉద్యమ కారులూ ఏ విధంగా దోహదం చేశారో సన్నిహితంగా గమనించిన వారికి కేసీఆర్‌ మాటల తూటాలలోని అన్యాయం, అసత్యం స్పష్టంగా కనిపిస్తుంది.

తెలంగాణ మలి ఉద్యమంలో కేసీఆర్‌ది అత్యంత, అనితర సాధ్యమైన పాత్ర అనడంలో రవ్వంత సందేహం లేదు. కానీ ఆయనది ఏకైక పాత్ర అంటే అంగీకరించడం అసాధ్యం. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాన్ని జయప్రదం చేశారు. 1952 నుంచే ఎన్నోరకాల ఉద్యమాలు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా ప్రజల హృదయాలలో నాటాయి. ఆ ఉద్యమాల స్ఫూర్తిని కేసీఆర్‌ అందుకొని జైత్రయాత్ర సాగించారు. కోదండరామ్‌ భుజం కలిపారు. అందుకే కోదండరామ్‌ చేసింది ‘తొక్క’ అంటూ కేసీఆర్‌ తూష్ణీభావం ప్రదర్శించడం సమంజసం అనిపించలేదు. ఎలక్ట్రానిక్‌ మీడియా యుగంలో గతంలో నాయకులు చేసిన ప్రసంగాలు టేపులలో ఉంటాయి. కర్నూలు నాయకుడు టీజీ వెంకటేశ్‌ను సంబోధిస్తూ కోదండరామ్‌ గుణగణాలను ప్రస్తుతిస్తూ గతంలో కేసీఆర్‌ చేసిన ప్రసంగం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చివరి ఘట్టంలోనే కేసీఆర్, కోదండరామ్‌ల మధ్య విభేదాలు పొడసూపిన సంగతి తెలుసు. అందుకు కారణాలు ఏమిటో ఇద్దరూ బహిరంగంగా ఎన్నడూ వివరించలేదు. కానీ శుక్రవారంనాడు కేసీఆర్‌ వెల్లడించారు. ఎంతోకాలంగా  కడుపులో దాచుకున్న ఆగ్ర హావేశాలను కేసీఆర్‌ బయటపెట్టినట్టున్నారు. తెరాస అధికారంలోకి రావడం కోదం డరామ్‌కి ఇష్టం లేదని కేసీఆర్‌ చేసిన ప్రకటన పట్ల అభ్యంతరం లేదు. ఇష్టం లేక పోవడం నేరం కాదు. తెరాసను ప్రత్యక్షంగా వ్యతిరేకించిన వారూ, పరోక్షంగా వ్యతి రేకించినవారూ అనేకమంది. అది వారి ప్రజాస్వామిక హక్కు. ప్రతిపక్షాలపైన దాడి చేసే హక్కు అధికారపక్ష నాయకులకు ఉన్నప్పుడు అధికారంపక్షంపైన దాడి చేసే హక్కు ప్రతిపక్షాలకూ ఉంటుంది.

ప్రతిపక్షాల తీరు
అయితే, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సకారాత్మకంగా ఉన్నదా లేదా అనే విషయం ప్రజలు గమనిస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారనీ, కాంగ్రెస్‌ నాయకులు కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టిస్తున్నారనేది ప్రధాన విమర్శ. ముఖ్యంగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ పేరు ముఖ్య మంత్రి రెండు సార్లు ప్రస్తావించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు లేదా మల్లన్నసాగర్‌ల ప్రతిపాదనలలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పవచ్చు. వాటికి  ప్రత్యామ్నాయంగా మెరుగైన ప్రణాళికలు ఉన్నా ప్రజలకు వివరించవచ్చు. నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి ఉండవచ్చు. నిర్మాణంలో అవతవకలు జరిగినా, అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టుకు పోవచ్చు. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ద్రోణంరాజు సత్యనారాయణ చేసిన ఆరోపణలలో ప్రధానమైనవి అవినీతికి సంబంధించినవే. సీనియర్‌ న్యాయవాది ఎస్‌ రామచంద్రరావు ఎన్‌టీఆర్, విజయభాస్కర రెడ్డి, జనార్దనరెడ్డి ప్రభుత్వాలపైన వ్యాజ్యాలు నడిపింది అవినీతి ఆరోపణలపైనే.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఆరోపణలు చేసినా, న్యాయ స్థానాలను ఆశ్రయించినా అధికారపక్షం పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపైనే కానీ ప్రాజెక్టులు నిలిపివేయాలని కాదు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ప్రజలకు అత్యంత హానికరమని  భావించిన అంశాలనే ఎజెండాలో చేర్చాలి. గాంధీ చంపారన్‌ ఉద్యమంపైన కొన్ని మాసాలు ఎందుకు దృష్టి కేంద్రీకరించారు? ఉప్పు సత్యాగ్రహానికి అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు? వలస ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను అదే పనిగా వ్యతిరేకిస్తూ, వ్యాఖ్యానిస్తూ పోలేదు ఆయన. సంకేతప్రాయంగా, సందేశాత్మకంగా ఉండే సమస్య లపైన దృష్టి పెట్టడం ద్వారా స్వాతంత్య్ర సమరం సాగించారు. ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలన్న నిర్ణయంపైన ఉద్యమం నిర్మించవచ్చు. వాక్‌ స్వాతం త్య్రాన్ని హరిస్తున్నారంటూ, రాజ్యాంగ ప్రసాదించిన హక్కులను కాలరాస్తున్నా రంటూ ఉద్యమం చేయవచ్చు. వ్యవసాయదారుల సంఘాల నియామకాన్ని వ్యతిరే కించకుండా పంచాయతీరాజ్‌ సంస్థలను నిధులూ, విధులూ లేకుండా నిర్వీర్యం చేస్తున్నారంటూ ధర్మాగ్రహం ప్రదర్శించవచ్చు.  

యాక్టివిస్టా, రాజకీయవాదా?
కోదండరామ్‌లో కూడా సందిగ్ధం స్పష్టంగా కనిపిస్తున్నది. టీజాక్‌ నాయకుడుగా, హక్కుల కార్యకర్తగానే ఉంటారో, రాజకీయాలలోకి ప్రవేశిస్తారో తేల్చుకోవాలి. రాజ కీయాలలో దిగాలనుకుంటే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇతర ప్రతి పక్షాలతో పొత్తు పెట్టుకోవచ్చు. లేదా ఏదో ఒక పక్షంలో చేరవచ్చు. సర్పంచ్‌గా ఎన్నిక కాకపోయినా పర్వాలేదు. రాజకీయం అంటే ఎన్నికలు మాత్రమే కాదు.  లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆయనను రాజకీయ నాయకుడు కారని అనగలమా? ప్రజల మేలుకోసం ఏదైనా ప్రతిపాదన చేసి, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, దాని ఆమోదం కోసం ఒత్తిడి తేవడం యాక్టివిస్టు పని. అధికారపార్టీని ఓడించమని కానీ ప్రభుత్వాన్ని తొలగించమని కానీ యాక్టి విస్టులు ప్రజలను కోరరు. ప్రభుత్వం మెడలు వంచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు లేదా పిలుపునిస్తారు. (పిలుపు ఇచ్చే అధికారం ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికి మాత్రమే ఉంటాయని అనడం సమర్థనీయం కాదు. ఆ అధికారం ప్రతివారికీ ఉంటుంది. పిలుపును ఆలకించడం, ఆలకించకపోవడం అనేది ప్రజల ఇష్టం. ఉద్య మకాలంలో కేసీఆర్‌ అనేక సందర్భాలలో ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు సమధికోత్సాహంతో స్పందించారు. అందుకే ఉద్యమం జయప్రదం అయింది. పిలుపు ఇచ్చే అధికారం కేసీఆర్‌కి లేదని ఏ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రీ అనలేదు).

అరుణారాయ్‌ సమాచార హక్కుకోసం సుదీర్ఘకాలం ఉద్యమం చేశారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ను సాధించారే కానీ ప్రభుత్వాన్ని పడ గొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేయలేదు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం కోసం సాగిన ఉద్యమం విజయం సాధించిన తీరు కూడా యాక్టివిజానికి ఉదాహరణే. అలాగే లోక్‌పాల్‌ బిల్లు కోసం అన్నా హజారే ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించమంటూ ప్రబోధించలేదు. డాక్టర్‌ జయప్రకాశ్‌నారాయణ్‌ లోక్‌సత్తా సంస్థను హక్కుల సాధన వేదికగా నడిపి నంత కాలం ప్రభుత్వాలను దించాలని కానీ అధికార పార్టీని ఓడించాలని కానీ చెప్పలేదు. ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనాలని అనిపించినప్పుడు లోక్‌సత్తాని రాజకీయ పార్టీగా మార్చారు. తన రాజకీయాలకు ప్రజల ఆమోదం లభించడం లేదని గ్రహించిన తర్వాత రాజకీయ పార్టీని రద్దు చేసి తిరిగి హక్కుల సంస్థగా మార్చి సుపరిపాలనకోసం ఉద్యమం చేస్తున్నారు.

కోదండరామ్‌ సైతం ప్రత్యక్ష రాజ కీయాలలో ప్రవేశించాలని భావిస్తే అందులో తప్పేమీ లేదు. ఆ పని చేయకుండా తెరాస అనుబంధ సంస్థకు ఓటు చేస్తే సింగరేణి నాశనం అవుతుందని ప్రకటించడం సమర్థనీయం కాదు. అదే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటైజ్‌ చేస్తుందనే ఆరోపణ సైతం ఆక్షేపణీయమే. పొరుగున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభు త్వానికి ఉన్న ప్రైవేటైజేషన్‌ వ్యామోహం తెలంగాణ సర్కార్‌కు లేదు. ప్రజా జీవి తంలో తన ప్రయాణాన్ని  సమీక్షించుకోవలసిన అవసరం కోదండరామ్‌కి ఉన్నది. కాంగ్రెస్‌ నాయకుడు దయాకర్‌ రాజకీయవాది కనుక కేసీఆర్‌పైన ఎదురుదాడి చేసినా ఎవ్వరూ ఆ„ó పించలేదు. ఎవరి మాటలో ఎంత ప్రామాణికత ఉన్నదో, ఎంత నిజం ఉన్నదో, ఎవరి విశ్వసనీయత ఏ పాటిదో ప్రజలు తేల్చుకుంటారు. అంతి మంగా ప్రజలే ప్రభువులు.  

పరుష పదజాలం ప్రయోగించినందుకు కేసీఆర్‌ ఒక్కరినే నిందించనక్కర లేదు. అందరూ కఠినంగానే మాట్లాడుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి శైలి కారణం కావచ్చు. అంత కాఠిన్యం అవసరమా? అధికార, ప్రతిపక్షాల మధ్య విభే దాలు ఇతర రాష్ట్రాలలో కంటే తెలుగు రాష్ట్రాలలో అధికం. రాజకీయ వాతావర ణాన్ని సామరస్యంగా, నిర్మాణాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా నిర్మించడంలో ముఖ్య మంత్రి పాత్ర అద్వితీయమైనది. నిందాత్మక రాజకీయాలకు స్వస్తి చెప్పి సామరస్య పూరిత రాజకీయాలకు శ్రీకారం చుడితే ముఖ్యమంత్రికి ప్రజాదరణ మరింత పెరుగుతుంది.


కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు