నేతల జాతర–విలువల పాతర!

10 Feb, 2019 01:03 IST|Sakshi

త్రికాలమ్‌ 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సామాన్య ప్రజలలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరగడం సహజం. దృశ్యశ్రవణ ప్రధానంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు కనిపించవలసిన చోట కనిపించాలనీ, మాట్లాడవలసిన మాట మాట్లాడాలని రాజకీయ నాయకులు తాపత్రయ పడతారు. కొందరు రాజకీయ నాయకులు తమకు ప్రయోజనం కలిగిస్తుందని భావించే దృశ్యాన్ని వదిలిపెట్టరు. లాభసాటి దృశ్యాలలో ఉనికి కోసం ఎంత దూరమైనా వెడతారు. ప్రత్యర్థులపై దారుణాఖండల శస్త్రతుల్యమైన పదజా లంతో దాడి చేస్తారు. నిన్న పొగిడిన నోటితోనే నేడు తెగుడుతారు. సంవత్సరం కిందట సంజీవని కానిది ఈ రోజు ప్రాణప్రదమైన ఔషధి అవుతుంది. పొత్తు ఉన్నప్పుడు ఇంద్రుడూచంద్రుడూ అంటూ నెత్తికెత్తుకొని ఊరేగినవారే పొత్తు రద్దయిన తర్వాత దుష్టుడూ దుర్మార్గుడూ అంటూ నేలకేసి కొడతారు.  ఒకటి, రెండు మినహాయింపులు తప్పిస్తే అన్ని పార్టీల నాయకులదీ ఇదే వరుస. ఎన్నికల బరిలో దిగే ముందు మాటల ఈటెలకు పదును పెడుతున్నారు. ఇటు వంటి రాజకీయంలో నిజానిజాలతో నిమిత్తం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. రాజ్యాంగస్ఫూర్తి అసలే లేదు. తాము నిన్నామొన్నా ఏమని చెప్పామో, ఇప్పుడు ఏమి చెబుతున్నామో అన్న స్పృహ బొత్తిగా లేదు. 

ప్రతిపక్షాలపై దాడే వ్యూహమా?
అధికార పార్టీలు వ్యవహరించిన రీతినీ, ఎన్నికల ప్రణాళికలలో చేసిన వాగ్దానాలను అమలు చేసిన తీరునీ ఎన్నికల సమయంలో చర్చించడం సంప్రదాయం. తమ సాఫల్యవైఫల్యాలను అధికార పార్టీలు గుర్తించి ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయిందీ వివరించే రోజులు పోయాయి.  కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షాలపై దాడి చేయడం ద్వారా, సరికొత్త సంక్షేమపథకాలు పదవీకాలం ముగియనున్న తరు ణంలో అట్టహాసంగా ఆరంభించడం ద్వారా, లక్షల  కోట్లు ఖర్చు చేయవలసిన ప్రాజెక్టులకు అలవోకగా శంకుస్థాపనలు చేయడం ద్వారా  ప్రజలను మెప్పించి మళ్ళీ గెలిచి అధికారంలో కొనసాగాలని కలలు కంటున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఈ విన్యాసాలు ఫలించవు.  2014 ఎన్నికలలో పొత్తు పెట్టుకొని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకొని నాలుగు సంవత్సరాలు చెట్టా పట్టాలేసుకొని యుగళగీతాలు ఆలపించిన విషయాన్ని ప్రజలు మరచిపోవాలని మోదీ, బాబూ కోరుకుంటున్నారు. ప్రత్యేకహోదాపైన మోదీ, బాబూ ఇద్దరూ ఆడిన నాటకాన్ని ప్రజలు విస్మరించాలనీ, తాజా డ్రామాను మాత్రమే వీక్షించి మైమరచిపోవాలనీ వారి ఆకాంక్ష.

రఫేల్‌ వివాదంపై రగడ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులనూ, ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్న కొద్దిమంది మీడియా ప్రతినిధులనూ దేశద్రోహులుగా, దేశ సైన్యాన్ని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్న దుర్మార్గులుగా చిత్రించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తమ హయాంలో బోఫోర్స్‌ సహాlఅనేక కుంభకోణాలు జరిగిన వాస్తవాన్ని ప్రస్తావించ కుండా రఫేల్‌ను మాత్రమే ప్రజల ముందుకు ప్రముఖంగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ నాయకుల ఆరాటం. చిట్‌ఫండ్‌ అక్రమార్కుల కొమ్ముకాయడానికి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగసంక్షోభం సృష్టిస్తు న్నారని బీజేపీ ప్రవక్తల వాదన. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపైన కేసులు బనాయించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించి అప్రదిష్టపాలు చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారని మమతాదీదీ, తదితర ప్రతిపక్ష నేతల ఆరోపణ. ‘ఏమిటి నన్ను జైల్లో పెడతారా?’ అంటూ చంద్రబాబు బీజేపీ శాస నసభ్యులవైపు చూస్తూ హుంక రిస్తారు.  ప్రజాధనాన్ని దుబారా చేశారనీ, నిధులు కాజేయడం కోసమే అవసరం లేని ప్రాజెక్టులు కట్టారనీ, పోలవరం నిధులకు లెక్క చెప్పడం లేదనీ, ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నదనీ వస్తున్న ఆరోపణలపైన కేంద్రం విచారించలేదు. బీజేపీ నాయకులే స్వయంగా చేస్తున్న విమర్శలు గాలిలోకి కలసిపోతున్నాయి కానీ వాటిలోని నిజానిజాలు తేల్చే బాధ్యత కేంద్రం తీసుకోవడం లేదు.

ఇంతటి అనుకూల పరిస్థితులలో సైతం చంద్రబాబుకి జైలుభయం పట్టుకోవడం ఆశ్చర్యం. భయంలోనుంచి బుకాయింపు పుట్టుకొచ్చింది. సీబీఐ గీబీఐ జాన్తానై అంటున్నారు. ఈడీ  లేదూ గీడీ లేదూ అంటున్నారు.  దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటున్నారు. కేంద్రంపైన ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌ ధ్వజమెత్తినా, మమతా బెనర్జీ తిరుగు బాటు బావుటా ఎగరవేసినా వారి పక్కన దృశ్యంలో కనిపించేందుకు చంద్ర బాబు అన్ని పనులూ వదులుకొని శ్రమకోర్చి ప్రత్యేక విమానంలో ఢిల్లీకీ, కోల్‌కతాకీ వెడుతున్నారు. మోదీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కానీ చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలని అనుకుంటే అది పెద్ద  సమస్య కాదు. అందుకు అవసరమైన సామగ్రి వారి దగ్గర ఉన్నది.  కానీ వారికి ఆ ఉద్దేశం లేదు. చంద్రబాబుని తమ  ప్రధాన ప్రత్యర్థిగా మోదీ భావించడం లేదు. ఈ రోజు గుంటూరు సభలో చంద్రబాబుపై నరేంద్రమోదీ అమిత్‌షా లాగానే విమర్శలు చేయవచ్చు. మామూలు విమర్శలతో సరిపెట్టకుండా మమతాబెనర్జీపై చేసినంత కరకుగా మోదీ తనపైన కూడా వాగ్దాడి చేయాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. అందుకే ‘ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కి వస్తారు మోదీ?’, అంటూ రెచ్చగొడుతున్నారు. మోదీకి తానే ప్రధాన ప్రత్యర్థిగా తేలాలని తాపత్రయం. ఆంధ్రప్రదేశ్‌లో అంతటి దృశ్యం లేదు.

పశ్చిమబెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అమిత్‌షా, నరేంద్రమోదీ, యోగీ ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు పర్యటించి, దీదీని రకరకాల విమర్శలు చేసి వాతావరణం వేడెక్కించారు. బెంగాల్‌పైన ఎందుకు దృష్టి పెట్టారు? సమాజ్‌వాదీపార్టీ (ఎస్‌పీ), బహుజన సమా జ్‌పార్టీ (బీఎస్‌పీ)ల ఎన్నికల పొత్తు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ సారి తమ పప్పులు ఉడకవని బీజేపీ నాయకత్వానికి తెలుసు. 2014లో గెలుచుకున్న 71 స్థానాలలో సగం దక్కితే ధన్యులమనుకునే పరిస్థితి. యూపీలో కోల్పోయే స్థానా లను బెంగాల్‌లో సంపాదించాలని మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. బెంగాల్‌లో జనాదరణ రీత్యా తృణమూల్‌ కాంగ్రెస్‌ తర్వాత స్థానం బీజేపీదే. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి విజ యావకాశాలు లేవు. అందుకే ఇక్కడికి మాటవరుసగా పర్యటనకు వచ్చి ఒకట్రెండు ఉపన్యాసాలు ఇచ్చి వెడతారు కానీ ఆంధ్రప్రదేశ్‌పైనా, చంద్ర బాబుపైనా  దృష్టి కేంద్రీకరించే దండగమారి పని బీజేపీ అధినేతలు చేయరు. చంద్రబాబు తన అనుయాయులతో కుండల ప్రదర్శన చేయించినా, నల్ల బ్యాడ్జీలు ధరింపజేసినా, ‘మోదీ గోబ్యాక్‌’ అంటూ టీవీ చానళ్ళ కేమేరాల ముందు విచిత్ర విన్యాసాలు వేసినా, తానే స్వయంగా ఢిల్లీలో దీక్ష చేపట్టినా  ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ప్రజలు నమ్మరు. ఇదే గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీతో చంద్రబాబు వేదిక పంచుకున్నారు. భావి ప్రధాని అంటూ పొగిడారు. అనంతరం శాసనసభలో మోదీ అత్యున్నతమైన ప్రధాని అంటూ కీర్తించారు. వాజపేయి కంటే ఉన్నతుడనే విధంగా ప్రశంసల వర్షం కురిపించారు. 

వైఫల్యాలను ఒప్పుకుంటే మేలు
అధికారంలో ఉన్నవారికి ఇది పరీక్షాసమయం. సాధించిన విజయాలు ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి. వైఫల్యాలు ఉంటే ఒప్పుకోవాలి. దొంగలను ఉపే క్షించనంటూ, అందుకే ఈ చౌకీదార్‌ను ప్రజలు నియమించారంటూ పార్లమెంటు లోనూ, వెలుపలా మోదీ మిడిసిపడుతూ గంభీరమైన ప్రసంగాలు చేయడం వల్ల ప్రజలు ప్రభావితులై మూకుమ్మడిగా మళ్ళీ బీజేపీకి ఓట్లు కుమ్మరిస్తారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. లక్షల కొద్దీ ఉద్యోగాలను ఏన్‌డీఏ ప్రభుత్వం కల్పించిందంటూ ఎంత గట్టిగా మోదీ దబాయించినా ప్రజలు విశ్వ సించరు. అనుకున్న  విధంగా ఉద్యోగాలు సృష్టించడం సాధ్యం కాలేదో, స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకొని రావడంలో ఎందుకు విఫలమైనారో, గోరక్షకుల హింసాత్మక ధోరణిని ఎందుకు అరికట్టలేకపోయారో సవినయంగా వివరిస్తే ప్రజలు మన్నిస్తారు. రంకెలు వేసినంత మాత్రాన వైఫల్యాలు విజయాలుగా మారవు. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ ప్రసంగాలు చేసినా, సీబీఐని దుర్వినియోగం చేయడం లేదంటూ ఎంత గట్టిగా చెప్పినా లాభం లేదు. ఈ విషయం ప్రస్తావించే నైతిక హక్కు కాంగ్రెస్‌కి లేదు. చంద్రబాబు చరిత్రా అటువంటిదే. కాంగ్రెస్‌తో చేతులు కలిపి సీబీఐతో ప్రధాన ప్రత్యర్థి వ్యక్తిత్వహననం చేయడానికి ప్రయత్నించిన ఘనుడాయన.

విపక్షానికి చెందిన ఎంఎల్‌ఏలను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చరిత్ర ఆయనది. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్‌ వ్యవ స్థకూ తాను నిధులూ, విధులూ వికేంద్రీకరించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఆయనకు ఇతరులను తప్పుపట్టే యోగ్యత ఉంటుందా? నామినేషన్లపైన వందల కోట్ల రూపాయల పనులు అస్మదీయులకు కట్టబెట్టే వారికీ, వారి ప్రయోజనం కోసమే అమరావతి నగర నిర్మాణం విషయంలో రకరకాల ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించినవారికీ ఇతరులను ప్రశ్నించే నైతికత ఉంటుందా? ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం మోదీ చంద్ర బాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం. అందుకు మోదీని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు. ప్రధాని పర్యటలను ప్రజలు వ్యతిరేకించవచ్చు. కానీ బీజేపీతో మొన్నటివరకూ అంటకాగిన టీడీపీ  నిరసన ప్రదర్శనలు చేయడం విడ్డూరం. తమ స్వానుభవానికి విరుద్ధంగా నేతలు ఏమి చెప్పినా ప్రజలు విశ్వసించరు. ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి అది కనిపించదు. చుట్టూ ఉన్న వందిమాగధులు కనిపించనీయరు.

ఇందిర ఘోరపరాజయం
ఉదాహరణకు ఇందిరాగాంధీ 1975 జూన్‌ 25న అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. 19 మాసాలు దేశాన్ని నిరంకుశంగా ఏలిన తర్వాత అంతే అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేయాలనీ, రెండు మాసాలలోగా ఎన్నికలు నిర్వహించాలనీ ఆమె 1977 జనవరి 18న ప్రకటించారు. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ఓడిపోతుందని ఆనాడు అత్యధికులు ఊహిం చలేదు. అంతవరకూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి పరాజయం లేదు. చుట్టూ ఉన్నవారు అదే ఎన్నికలకు అనువైన సమయం అంటూ ఊదరకొట్టబట్టే ఆమె ఎన్నికలు జరిపించడానికి నిర్ణయించారు. జైళ్లలో బంధించిన వందలాదిమంది ప్రతిపక్ష నాయకులకు అనూహ్యంగా స్వేచ్ఛ లభించింది. ఎన్నికల ప్రచారానికి రెండు మాసాలే వ్యవధి. నిధుల సేకరణ సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఎదురు నిలిచే సత్తా కలిగిన పార్టీ లేదు. ఆత్యయిక  పరిస్థితిలో దేశం అభివృద్ధి చెందిందనీ, ప్రతిపక్షాల ఆందోళనలను అరికట్టగలిగామనీ, ప్రజలు సంతోషంగా ఉన్నారనీ ఇందిరాగాంధీ భావించారు. సంజయ్‌గాంధీకి పూర్తిగా పగ్గాలు అప్పగించాలా లేక అర్ధసింహాసనం ఇవ్వాలా అన్నదే ఆలోచన కానీ పరాజయం గురించి ఆమెకు చింత లేదు. తనకు పోటీ ఎవరున్నారు?  ‘తాను తప్ప దేశానికి వేరే దిక్కు ఎవ్వరూ లేరని ఆమె గట్టిగా విశ్వసించింది,’ అంటూ ఇందిర మేనత్త  కూతురు, ప్రఖ్యాత రచయిత నయనతార సెహగల్‌ అప్పట్లో వ్యాఖ్యానించారు.

నాటి ఎన్నికలలో కాంగ్రెస్‌ చిత్తుగా ఓడింది. ఇందిరాగాంధీపై రాజ్‌నారాయణ్‌ గెలుపొందారు. వివిధ భావజాలాలకు చెందిన ప్రతిపక్ష నాయకులను జైలు జీవితం కలిపింది. రైతు నాయకుడూ, భారతీయ లోక్‌దళ్‌ అధినేత చరణ్‌ సింగ్, జనసంఘ్‌ నాయకులు అడ్వాణీ, వాజపేయి, సోషలిస్టు నాయకులు జార్జి ఫెర్నాండెజ్, రాజ్‌నారాయణ్, కరడుకట్టిన మితవాది, కాంగ్రెస్‌ (వో) నాయకుడు మొరార్జీ దేశాయ్‌ వంటి నానాగోత్రీకులను లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఒక్క తాటిపైకి తెస్తారని ఎవరు ఊహించారు? మొరార్జీ దేశాయ్‌ని ప్రధానిగా వీరంతా అంగీకరిస్తారని ఎవరు కలగన్నారు? తనకు ప్రత్యామ్నాయం లేరని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నాయకుడు అనుకున్నా అది శ్రుతిమించిన స్వాను రాగమే. ఇప్పుడు మోదీకీ, చంద్రబాబుకీ భజన చేసినట్టే అప్పుడు ఇందిరా గాంధీకి పత్రికలు ఊడిగం చేశాయి (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి కొన్ని  పత్రికలు తప్ప). ఇందిరమ్మకు అన్నీ సకారాత్మక ఊహా చిత్రాలే కనిపించాయి. పరాజయ సూచనలు కానరాలేదు. అప్పటికింకా ప్రైవేటు టీవీ న్యూస్‌ చానళ్ళు రాలేదు. ఇప్పుడు టీవీల హంగామా అధికారంలో ఉన్న వారిని భ్రమలలో ముంచెత్తు తుంది. ఆకాశవీధిలో విహరింపజేస్తుంది. నేల విడవకుండా నిజాయతీగా సాము చేసేవారిదే విజయం.


-కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు