పెడధోరణికి సమాధి–ప్రగతికి పునాది

2 Jun, 2019 00:24 IST|Sakshi

త్రికాలమ్‌ 

‘వెల్‌ బిగన్‌ ఈజ్‌ హాఫ్‌ డన్‌.’ సవ్యంగా, సలక్షణంగా ప్రారంభమైన పని సగం పూర్తయినట్టే అంటారు. గురువారంనాడు అమరావతిలో, ఢిల్లీలో పదవీ ప్రమాణ స్వీకారోత్సవాలు అద్భుతంగా జరిగాయి. ఎన్నికలలో ప్రజలు తమ నిర్ణయం నిర్ద్వంద్వంగా, ప్రస్ఫుటంగా ప్రకటించారు. ప్రజల తీర్పును అను సరించి అమరావతిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఢిల్లీలో నరేంద్రమోదీ రెండోసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జగన్‌ ఒంటరిగా ప్రమాణం చేయగా, మోదీ మరి 53 మంది సహచరులతో కొలువుదీరారు. వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల నియామకం జరుగుతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ప్రజలు అధికా రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని తిరస్కరించి ప్రతిప„ý మైన వైఎస్‌ ఆర్‌సీపీకి పట్టం కట్టారు. దేశ ప్రజలు అధికారంలో ఉన్న మోదీ సారథ్యాన్ని ఆమోదించి మరో ఐదేళ్ళు సమధికోత్సాహంతో పొడిగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రజలు ఒకే విధమైన తీర్పు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌కు అఖండ విజయం ప్రసా దించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ 90 కోట్లమంది ఓటర్లూ దాదాపుగా ఒకే తరహాలో తీర్మానించారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభావం అంతగా లేకపోయినా కర్ణాటకలో అధికంగానూ, తెలంగాణలో గణనీ యంగానూ మోదీ హవా పని చేసింది. దేశం మొత్తం మీద బీజేపీది గొప్ప విజ యం. బీజేపీ ప్రచారం చేసిన ‘మోదీ హై తో ముమ్కిన్‌ హై’(మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే) నినాదాన్ని ఓటర్లలో అధిక సంఖ్యాకులు విశ్వసించారు. ‘ఆయేగా తో మోదీ హీ’ (మోదీయే వస్తాడు) నినాదం ముమ్మాటికీ నిజమై కూర్చున్నది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తర్వాత 2004లో జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించి వేలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మీదట తొలిసంతకం వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఫైల్‌ పైన చేశారు. ఆయన కుమారుడు తండ్రి కంటే ఎక్కువకాలం, ఎక్కువ దూరం పాదయాత్ర చేసి, ఎన్నికలలో తండ్రికంటే ఘన మైన విజయం సాధించి తండ్రిని మించిన తనయుడని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వృద్ధాప్య పింఛన్‌ మొత్తాన్ని రూ. 2,250లకు పెంచే ఫైలుపైన తొలిసంతకం చేసి అవ్వాతాతలకు మోదం కలి గించారు. ప్రజాసంక్షేమం విషయంలో వైఎస్‌ ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానన్న హామీని నిలబెట్టుకుంటూ త్రికరణశుద్ధిగా ప్రస్థా నం ప్రారంభించారు. 

అధ్వానంగా ఆర్థిక  పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచుల్లో ఉన్నది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు తోడు జగన్‌ ఎన్నికల ప్రచారానికి ముందే ప్రకటించిన నవరత్నాలలో భాగంగా చేపట్టవలసిన పథకాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వేతనాలు ఉదారంగా పెంచుతుందనే ఆశతో ఉన్నారు. రాజధాని నగర నిర్మాణం భారీ ఖర్చుతో కూడిన పని. కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడం, ఇచ్చిన హామీలను అమలు జరపడం ప్రభుత్వం ఎదుట ఉన్న పెనుసవాళ్లు. టీడీపీ ప్రభుత్వం దాదాపు రెండు ల„ý ల కోట్ల రూపాయలు అప్పు చేసి చిరు ఆస్తి కూడా నిర్మిం చకుండా ఖజానాను ఖాళీ చేసింది. కేంద్రం బకాయిలు చెల్లించడంతో సరిపుచ్చు కోకుండా అదనపు ఆర్థిక సహాయం చేయాలి. ప్రత్యేక హోదా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలూ, వ్యాపార సంస్థలూ వెలసి ఆర్థిక వనరులు పెంపొందుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) జగన్‌ ప్రమాణస్వీకార మహోత్సవానికి వచ్చి ‘కావలసింది ఖడ్గ చాలనం కాదు, కరచాలనం’ అని హితవాక్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పరస్పరం సహకరించుకుంటూ ప్రగతి పథంలో ప్రయాణం చేయాలని అనడం ఆప్తవాక్యం. నదీజలాల విషయంలో కేసీఆర్‌ ఇచ్చిన భరోసా స్వాగతించదగినది. తమిళనాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్‌ వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందదాయకం. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా పరుగులెత్తిస్తూ నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని జగన్‌ ఎంత వేగంగా, ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా నడిపిస్తారోనని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలూ, దేశంలోని ఇతర ప్రాంతాల నేతలూ, ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 

వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించిన తీరు జగన్‌ ఎటువంటి సవాళ్ళనైనా జయప్రదంగా ఎదుర్కోగలరనే విశ్వాసం కలిగిస్తుంది. 2014లో ఓడిపోకుండా స్వల్ప మెజారిటీతో ఆ పార్టీ గెలుపొంది ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అప్పుడు జగన్‌కు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించే అవకాశం ఉండేది కాదు. పాదయాత్రలో సుమారు కోటిమందిని కలుసుకొని వారి వెతలు ఆలకించి మనస్సులో నమోదు చేసుకునే సందర్భం ఉండేది కాదు. పాదయాత్ర ఫలితంగానూ, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాల కారణంగానూ, ప్రతిపక్ష నాయకుడిగా సమర్థమైన పాత్ర పోషించడం వల్లనూ  ప్రజల గురించీ, వారి సమస్యల గురించీ సంపూర్ణమైన అవగాహన ఏర్పడింది.  క్షేత్రజ్ఞానం విశేషంగా పెరిగింది. ఒక రకంగా ప్రతిపక్షంలో ఉండటం వల్ల మేలు జరిగింది. అప్పుడే గెలిచి ఉంటే అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి వచ్చారనీ, విశేష అనుభవం కలిగిన చంద్రబాబుకి అధికారం అప్పగిస్తే అద్భుతాలు చేసేవారనీ ప్రచారం చేయడానికి వీలుండేది. చంద్రబాబు పాలన చూసిన తర్వాత ఆయనను ముఖ్య మంత్రిని చేసినందుకు చింతించి, వగచిన ప్రజలు కసితో టీడీపీని చిత్తుగా ఓడిం చారు. వైఎస్‌ఆర్‌సీపీ అఖండ విజయానికి రెండు కారణాలు–ఒకటి, జగన్‌ మాట తప్పని, మడమ తిప్పని మనిషనీ, హామీలు తు.చ. తప్పకుండా అమలు చేస్తా రనీ, ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడనీ, సమర్థంగా పరిపాలిస్తారనీ బల మైన విశ్వాసం. రెండు, చంద్రబాబుపట్ల పెరిగిన అవిశ్వాసం, అసహనం, ఆగ్రహం. ఫలితంగా చంద్రబాబుకి అవకాశం ఇవ్వకుండా తప్పు చేశామని ఓటర్లు అనుకునే అవకాశం లేదు. జీవితంలో సంభవించే పరిణామాలను ప్రశ్నిం చకుండా స్వీకరించాలని తత్త్వవేత్తలు చెప్పిన హితవు జగన్‌కు అక్షరాలా వర్తి స్తుంది. ‘ఫెయిల్యూర్‌ ఈజ్‌ హైరోడ్‌ టు సక్సెస్‌’ (పరాజయం విజయానికి రహ  దారి) అనే నానుడిని సత్యమని నిరూపిస్తూ అద్భుత విజయం సాధించిన జగన్‌ ఉత్తమ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవడానికి అనువైన వాతావరణం ఈ రోజు ఆంధ్రావనిలో నెలకొన్నది.

పెరిగిన మోదీ ఆత్మవిశ్వాసం 
రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన నరేంద్రమోదీ తనతో పాటు పాతిక మంది కేబినెట్‌ మంత్రులనూ, అంతకంటే ఎక్కువ మంది సహాయ మంత్రు లనూ  ఒకే విడత నియమించడం పెరిగిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కొత్త మంత్రిమండలిలో విధిగా చెప్పుకోవలసిన విశేషాలు ముచ్చటగా మూడు ఉన్నాయి. ఒకటి, బీజేపీ అధ్యక్షుడుగా అనేక విజయాలు అందించిన అమిత్‌షాని మంత్రిమండలిలోకి తీసుకోవడం. అమిత్‌షా తన వారసుడని మోదీ చెప్పకనే చెప్పారు. తన కంటే 14 ఏళ్ళు చిన్నవాడైన అమిత్‌షాను తన తర్వాత స్థానంలో దేశీయాంగమంత్రిగా నిలపడం మోదీ చేసిన సరికొత్త ప్రయోగం. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు సహాయమంత్రి హోదాలోనే అమిత్‌షా హోంశాఖను నిర్వహించేవారు. షా పట్ల మోదీకి ఉన్న అచంచలమైన విశ్వాసానికి తాజా నిర్ణయం నిదర్శనం. కశ్మీర్‌లో శాంతి స్థాపనకు ఆయన ఎటువంటి చొరవ  ప్రదర్శిస్తారో చూడాలి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు కశ్మీర్‌లో 370వ అధిక రణను రద్దు చేస్తారా? మందిర నిర్మాణానికి ముందడుగు వేస్తారా? గోరక్షకుల పేరిట అన్యమతస్తులపై జరుగుతున్న దాడులను అరికడతారా? ఏం జరుగు తుందో చూడాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలకూ, నిఘా సంస్థలకూ ఎటువంటి స్వేచ్ఛ ఇస్తారో గమనించాలి. మంత్రిమండలిలో అగ్రస్థానం అమిత్‌షాకు ఒక రకంగా అగ్నిపరీక్ష.  రెండు, నిర్మలా సీతారామన్‌ను ఆర్థికమంత్రిగా నియమిం చడం మరో సాహసోపేతమైన ప్రయోగం. ఆమెకు రక్షణశాఖ అప్పగించినప్పుడే మోదీ చరిత్ర సృష్టించారు. అంతవరకూ ఆ శాఖను పూర్తిస్థాయిలో నిర్వహించిన మహిళా మంత్రి ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆర్థికశాఖా అంతే. దీన్ని స్వతంత్రంగా నిర్వహించే బాధ్యత ఒక మహిళకు అప్పగించడం ఇదే ప్రథమం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటూ రక్షణ, ఆర్థిక శాఖలను కొంతకాలం పర్యవేక్షించారు. అంతే. పార్టీ ప్రవక్త(ప్రతినిధి)గా తన ప్రతిభాపాటవాలతో అగ్రనాయకులను మెప్పించి, మంత్రిమండలిలో సహాయ మంత్రిగా ప్రవేశించి, రాజ్యసభలో సభ్యత్వం సంపా దించిన నిర్మల అధికార సోపానంలో వేగంగా అడుగులు వేస్తూ ఎదిగారు.  తమిళనాట పుట్టి, తెలుగునాట మెట్టి, కన్నడసీమ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విద్యాధికురాలు ఆమె. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ) ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేసి, ఇండో–యూరోపియన్‌ వాణిజ్యంపైన పీహెచ్‌డీ చేశారు. ప్రైస్‌వాటర్‌ కూపర్స్‌ అనే బహుళజాతి సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పని చేశారు. నిర్మల రక్షణమంత్రిగా రాణించినట్టే ఆర్థికమంత్రిగా సైతం మోదీ నమ్మ కాన్ని వమ్ము చేయరని చెప్పవచ్చు. 

విదేశాంగమంత్రిగా మాజీ దౌత్యాధికారి
మూడు, విదేశాంగమంత్రిగా నియుక్తుడైన జైశంకర్‌. ఆయనా జెఎన్‌యూలో పీహెచ్‌డీ చేశారు. ఇండో–అమెరికన్‌ అణు ఒప్పందంపైన 2005 నుంచి 2007లో మన్మోహన్‌సింగ్, జార్జి బుష్‌ల సంతకాలు జరిగే వరకూ జరిగిన చర్చలలో క్రియాశీలక పాత్ర పోషించిన దౌత్యవేత్త. 2017లో డోక్లాం వివాదం కారణంగా చైనాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌తో కయ్యం నిత్యకృత్యమై సంబంధాలు నానాటికీ తీసికట్టుగా దిగజారుతున్నాయి. వీటితో సంబంధాలు పెంపొందిం^è గలిగితే  జైశంకర్‌ జన్మ ధన్యమైనట్టు భావించాలి. ఆయన తండ్రి కె. సుబ్రహ్మణ్యం రక్షణ వ్యవహారాలలో అగ్రశ్రేణి విశ్లేషకుడు. చాలా మంది ప్రధానులు ఆయన సలహాలు సగౌరవంగా స్వీకరించేవారు. ఆరోగ్యం సహ కరించకపోయినా మనసున్న  విదేశాంగమంత్రిగా మంచిపేరు తెచ్చుకున్న సుష్మాస్వరాజ్‌ స్థానంలో నియుక్తుడైన జైశంకర్‌ కేబినెట్‌ మంత్రి పదవి పొందిన ప్రథమ భారత దౌత్యాధికారి. మేనకాగాంధీకీ, కల్నల్‌ రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌కీ, మరికొందరు ముఖ్యులకూ ఎందుకు ఉద్వాసన చెప్పారో తెలియదు. ఎప్పటిలాగానే కేంద్ర మంత్రిమండలిలో దక్షిణాదికి తగిన ప్రాతినిధ్యం లేదు. ఉత్తరభారతం, పశ్చిమభారతం ఎన్‌డీఏ ప్రభుత్వంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ స్థానం ఆక్రమించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాబల్యం, పరిచయాలూ కలిగిన కిషన్‌రెడ్డిని హోంశాఖ సహాయమంత్రిగా తీసు కోవడం విశేషం. యువమోర్చా కార్యనిర్వాహకుడిగా, బీజేపీకి అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పనిచేశారు. ప్రధానితో సాన్నిహిత్యం ఉంది.  కిషన్‌రెడ్డికి మంత్రిపదవి రావడం సముచితమేనంటూ అందరూ హర్షం ప్రక టిస్తున్నారు. అమిత్‌షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశంపైన ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర పరిశీలకుడిగా పని చేసిన జగత్‌ ప్రసాద్‌ నడ్డా  లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ పర్యవేక్షకుడిగా అనూహ్యమైన విజయాలు సాధించిన నేపథ్యంలో ఆయనను పార్టీ పదవి వరించవచ్చునని సంకేతాలు వెలువ డుతున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ పేరు కూడా వినిపిస్తున్నది. 

కేంద్రంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంపూర్ణ మెజారిటీలు సాధిం చిన పాలకపక్షాలు ఉండటం, ప్రధానికీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు లకూ మధ్య స్పర్థలు లేకపోవడం సంతోషించదగిన పరిణామం. ఇది ప్రగతికీ, సుస్థిరతకూ దారితీసే సానుకూల వాతావరణం. అయిదేళ్ళపాటు కుటిల రాజకీ యాలకూ, స్వార్థప్రయోజనాలకూ, ఎత్తులకూ, జిత్తులకూ, అవినీతికీ తావు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వాలు అంకిత భావంతో, ఏకాగ్రదృష్టితో కృషి చేస్తే ఇటీవలి ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన వివేక వంతమైన తీర్పు సార్థకం అవుతుంది. ఎన్నికల ప్రచారంలో విచ్చలవిడిగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ వంటి పార్టీలు సాగించిన పెడధోరణులకు తెరపడుతుంది. సకారాత్మక, నిర్మాణాత్మక రాజకీయాలకు పాలకులందరూ శ్రీకారం చుట్టవలసిన శుభసందర్భం ఇది.

కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు