కరడుగట్టిన ‘గరుడ’

28 Oct, 2018 04:29 IST|Sakshi

త్రికాలమ్‌

ప్రత్యర్థికి గాయమైతే బాధపడి, సానుభూతి చూపించడం ఉత్తమం. బాధ కల గకపోయినా, సానుభూతి లేకపోయినా లోకంకోసం బాధపడుతున్నట్టు, సాను భూతి చూపుతున్నట్టు నటించడం మధ్యమం. బాధపడకుండా, సానుభూతి చూపించకుండా పరిహాసం చేయడం, వెకిలిగా మాట్లాడటం అథమం. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన గురువారం విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాప్రయత్నంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు మూడవ శ్రేణి కిందికి వస్తుంది.

 2003లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలిపిరిలో నక్సలైట్లు మందుపాతర పేల్చిన దుర్ఘటనలో మృత్యుముఖంలోకి వెళ్ళి సురక్షితంగా బయటపడిన సందర్భం ఎవ్వరూ మరచిపోలేనిది. రాష్ట్రం అంతా నివ్వెరపోయింది. నాటి ప్రతి పక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ దుర్ఘటన జరిగిన వెంటనే ఫోన్‌ చేసి క్షేమం తెలుసుకోవడమే కాకుండా స్వయంగా తిరుపతి వెళ్ళి ముఖ్యమంత్రిని పరామర్శించారు. అంతటితో ఆగకుండా గాంధీ విగ్రహం దగ్గర శాంతి కోసం దీక్ష నిర్వహించారు. నక్సలైట్ల ఘాతుకాన్ని ఖండించారు.

అంతటి ఉదాత్తమైన వైఖరి చంద్రబాబు నుంచి ఎవ్వరూ ఊహించినట్టు లేరు. కనీసం నటించకుండా బాధితుడినే తప్పు పడుతూ, ఆయనను పరామ ర్శించినవారంతా తనపైన దాడి చేస్తున్నారనీ, తన ప్రభుత్వాన్ని అస్థిరం చేయ డానికీ, రాష్ట్రపతి పాలన విధించడానికి కుట్ర జరుగుతోందనీ విలేఖరుల ముందు గుండెలు బాదుకోవడం చూసినవారికి ముఖ్యమంత్రి మానసికస్థితి పట్ల అనుమానం రాకమానదు.  హత్యాప్రయత్నాన్ని మనస్పూర్తిగా ఖండించకపోగా, ఆ ఘటనను  నాటకంగా అభివర్ణించడం అమానుషం. చిరునవ్వులు చిందిస్తూ, కళ్ళెగరేస్తూ, తర్జని చూపిస్తూ, ‘ఎక్కడిపోతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా?’ అంటూ టీడీపీ అధినేత నాటకీయంగా మాట్లాడిన పద్ధతీ, ఆంధ్రప్రదేశ్‌లో అల జడి సృష్టించేవారిని ఉపేక్షించేది  లేదంటూ అర్థరహితంగా, అసందర్భంగా మాట్లాడిన తీరూ చూసిన నా బోటి రాజకీయ పరిశీలకులకు సైతం ఆందోళన కలుగుతున్నది.

నిజంగానే, ఎక్కడికి పోతున్నాం మనం? జగన్‌మోహన్‌రెడ్డిని పలకరించిన వారిలో కాంగ్రెస్‌ నాయకులను మినహాయించి మిగిలిన వారిని ఆయన తప్పుబట్టారు. నలభై సంవత్సరాల నుంచీ రాజకీయాలలో రాటు తేలిన వ్యక్తి, 14 సంవ త్సరాలు ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన నాయకుడు ఇంత నేల బారుగా వ్యవహరించడం అసాధారణం. ముమ్మాటికీ ఆక్షేపణీయం. గురువారం రాత్రి చంద్రబాబు మాట్లాడిన తీరు ఆయన అభిమానులకూ, సానుభూతి పరులకూ, రాజకీయంగా జగన్‌మోహన్‌రెడ్డిని వ్యతిరేకించేవారికి కూడా మింగు డుపడలేదు. ఎబ్బెట్టుగా తోచింది. ఆయన పట్ల గౌరవం ఎంతో కొంత తగ్గి ఉంటుంది. ఒక రకంగా చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకున్నారు. ఇది చాల దన్నట్టు అమరావతిలో తెలుగులో పాడిన పాటనే ఢిల్లీలో శనివారం మీడియా సమావేశంలో ఇంగ్లీషులో ఆలపించారు. 

ఢిల్లీలో విన్యాసాలు 
చంద్రబాబు అదృష్టం కొద్దీ ఒక్క ఇంగ్లీషు చానెల్‌ కూడా ఆయన గోష్ఠిని లైవ్‌లో చూపించలేదు. తెలుగు చానళ్ళు మాత్రమే ఆసాంతం చూపించాయి.  హిందీ మీడియాకు చెందిన ఒకరిద్దరు విలేఖరులు ప్రశ్నలు అడిగారు కానీ జాతీయ టీవీ న్యూస్‌చానళ్ళ, పత్రికల ప్రతినిధులు కనిపించలేదు. లేకపోతే చంద్రబాబు బండారం బయటపడేది. ప్రతిపక్ష నాయకుడిని పలకరించినవారిని ముఖ్య మంత్రి తన శత్రువులుగా భావించడం, వారంతా కలిసి రాష్ట్రంలో అస్థిరత సృష్టిం చడానికి కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించడం, రేపో, ఎల్లుండో తనపైన ఐటీ, ఈడీ దాడి జరిగే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించడం జాతీయ మీడియా చూపించి ఉంటే చంద్రబాబు పరువు కృష్ణా, గోదావరులతో పాటు యమునా నదిలో కూడా కలిసేది. అంత పని జరగనందుకు ఆయన హితైషులు సంతోషిం చాలి. ఏదో అపరాధ భావన ఆయనను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. 

విమానాశ్రయంలో హత్యాప్రయత్నం జరిగిన కొన్ని నిమిషాలలోనే ఆంధ్ర ప్రదేశ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ నిందితుడు వైఎస్‌ఆర్‌సీపీకి చెందినవాడనీ, ప్రచా రంకోసం దాడి చేశాడనీ చెబుతూ అదేమంత పెద్ద విషయం కాదన్నట్టు తేలికగా తీసిపారవేయడం చూశాం. ఎవరో ఎక్కడి నుంచో పంపిన మెసేజ్‌లు మొబైల్‌లో  చూస్తూ ఆయన మాట్లాడటం కనిపించింది. మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీ నానీ చేసిన దుర్భరమైన వ్యాఖ్యలు గమనించాం. వీరిద్దరు కానీ, కాల్వ శ్రీని వాసులు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు వంటి మంత్రులు కానీ దాడి పైన స్పందించిన తీరు చంద్రబాబుకు కానీ టీడీపీకి కానీ మేలు చేస్తుందా? సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం నాకు ఆశ్చర్యం కలిగిం చలేదు. ఆయనకు నిగ్రహం తక్కువ. ఆగ్రహం ఎక్కువ.

2010లో హెచ్‌ఎం టీవీలో ‘ఆంధ్రప్రదేశ్‌ దశ–దిశ’ చర్చా కార్యక్రమం హైదరాబాద్‌లో ఆరంభించి అన్ని జిల్లా కేంద్రాలలోనూ నిర్వహించిన విషయం విదితమే. ఆ క్రమంలో నెల్లూరులో సభ జరిగింది. ఇతర రాజకీయ నాయకులతోపాటు సోమిరెడ్డి కూడా హాజరైనారు. తెలంగాణ అతిథిగా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి (ఇప్పుడు తెలం గాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌) నాతో నెల్లూరు వచ్చారు. సోమిరెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆవేశంగా మాట్లాడుతూ శ్రీలంకలో ఎల్‌టీ టీఈ ఉగ్రవాదులను కాల్చి చంపినట్టే తెలంగాణవాదులను కూడా కాల్చివేయా లంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దానికి అంతే తీవ్రంగా స్పందించిన చక్ర పాణి అరగంటకుపైగా వీరంగం వేశారు. ఈ అనూహ్యమైన పరిణామానికి సభి కులంతా అవాక్కయినారు.

ఎత్తులూ, వ్యూహాలూ
నాలుగున్నర సంవత్సరాలు అధికారమాయలో, నిధులయావలో గడిచిపోయిన తర్వాత టీడీపీ అధినేతను ఓటమిభయం పట్టిపీడిస్తున్నదని ఆయన వాలకం చూస్తే తెలిసిపోతుంది. ఏదో ఒక పథకంతోనో, వ్యూహంతోనో ప్రజలను దారి మళ్ళించాలనే ప్రయత్నం ఆరేడు మాసాల కిందటే ప్రారంభించారు. ఎన్‌డీఏ నుంచి వైదొలిగి తన వైఫల్యాలకు బాధ్యత కేంద్రానిదీ, ప్రధాని మోదీదీ అని ప్రజలను నమ్మించడం అందులో ఒకటి. ‘ఆపరేషన్‌ గరుడ’ మరొకటి. ప్రతి పక్షంపైన దాడిని ముమ్మరం చేయడం ఇంకొకటి. మౌలికమైన సమస్యలపైన కాకుండా పనికిమాలిన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చర్చించుకోవలసి రావడం నిజంగా విషాదం.  

చంద్రబాబు రాజకీయాలు మొదటి నుంచీ ఎత్తుగ డలూ, వ్యూహాల ప్రాతిపదికపైనే సాగాయి. ‘ఆపరేషన్‌ చిత్తూరు జిల్లా పరి షత్‌’లో డాక్టర్‌ కుతూహలమ్మను అధ్యక్ష పీఠంపైన కూర్చోబెట్టడంతో మొదలై, ‘ఆపరేషన్‌ వైస్రాయ్‌’లో ఎన్టీఆర్‌ చేతుల్లో నుంచి అధికార పగ్గాలు లాక్కొని పార్టీనీ, ప్రభుత్వాన్నీ కైవసం చేసుకున్నప్పటి నుంచీ అధికారం నిలబెట్టు కోవ డానికీ, ఎన్నికలలో గెలుపొందడానికీ ఆయన చేయని అక్రమం, వేయని ఎత్తు గడ, పన్నని వ్యూహం లేదు. రాజకీయాలలో లక్ష్య సాధన కోసం ఏమి చేసినా తప్పు లేదనీ, ఎన్ని తప్పులు చేసినా తాను మాత్రం నిప్పుగానే ఉంటాననీ ఆయన నమ్మకం.

కొన్ని వ్యూహాలు సఫలమైతే, కొన్ని విఫలమైనాయి.  జగన్‌మోహన్‌రెడ్డిని అవినీతిపరుడుగా చిత్రించడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానంతో కలసి అమలు చేసిన వ్యూహం ఫలించలేదు. ఆయనపై బనాయించిన కేసులలో పసలేదనీ, న్యాయ పరీక్షలో అవి నిలువజాలవనీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ దిశగా ఎంత గొంతు చించుకున్నా నష్టమే కానీ ప్రయోజనం లేదని చంద్రబాబు గ్రహించారు. పైగా దాదాపు ఏడాదికాలంగా సాగుతున్న చారిత్రక పాద  యాత్రను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు.

తన వైఫల్యాల నుంచీ, జగన్‌ పాదయాత్ర నుంచీ ప్రజల దృష్టి మళ్ళించడంకోసం ‘ఆపరేషన్‌ గరుడ’ను శివాజీ అనే నటుడితో, ఒక టీవీ చానల్‌ సహకారంతో 2018 మార్చిలో అమలు చేయడం ప్రారంభించారు. ఈ ‘షో’ చూసినవారికి ఈ గరుడపురాణం రాసిన అభినవ వ్యాసుడు చంద్ర బాబేనన్న అనుమానం కలుగకమానదు. శివాజీ పేరు ప్రస్తావించి ఆయన స్క్రిప్టు ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిపై ప్రాణహాని లేని దాడి కూడా అందులో భాగమేనని అంటున్నారు. ఈ స్క్రిప్టులో ఉన్నది ఉన్నట్టు జరగాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది.

ఒక్కడి పని కాదు
ఈ హత్యాప్రయత్నం కేవలం శ్రీనివాసరావు అనే యువకుడు ఒంటరిగా చేసిన పని కాదనీ, దీని వెనుక కుట్ర ఉన్నదనీ అనుమానించడానికి ఆస్కారం ఉంది. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాసరావుకు కొన్ని మాసాల కిందటే విశాఖ విమానాశ్రయం క్యాంటీన్‌లో ఉద్యోగం వచ్చిందనీ, అతని జీతం ఏడు వేల రూపాయలనీ, అతని నివాసం కోసం అద్దె ఇంటిని క్యాంటీన్‌ యజమానీ, టీడీపీ నాయకుడూ హర్షవర్ధన్‌ ఏర్పాటు చేశారనీ సమాచారం. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు టీడీపీ అభిమానులనీ, వారికి ఇళ్ళు ఇవ్వడం, రుణాలు ఇప్పించడంతో పాటు శ్రీనివాస్‌కి విశాఖలో ఉద్యోగాన్ని కూడా జన్మభూమి కమిటీ ఇప్పించిందనీ చెబుతున్నారు.

కొన్ని మాసాల కిందట శ్రీనివాస్‌ స్వగ్రామానికి వెళ్ళి తన కష్టాలు గట్టెక్కా యనీ, ఆర్థికంగా స్థిరపడ్డాననీ చెబుతూ మిత్రులకు విందు ఇచ్చినట్టు తెలు స్తోంది. కోటి రూపాయలు పెట్టి నాలుగెకరాల భూమి కొనడానికి కూడా బేర సారాలు చేశాడని భోగట్టా. ఈ పరిణామాలు గమనిస్తే శ్రీనివాస్‌ వెనుక ఎవరో ఉండి ఉంటారనే అనుమానం రాకమానదు. పందెం కోళ్ళ కాళ్ళకు కట్టే పదునైన కత్తితో శ్రీనివాస్‌ దాడి చేశాడు. ఆ కత్తి మెడకు తగిలితే అక్కడికక్కడే ప్రాణాలు పోవడం ఖాయమని కోడిపందేలతో పరిచయం ఉన్న గోదావరి జిల్లా లలోని మిత్రులు అంటున్నారు. అదృష్టం కొద్దీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వెలిబుచ్చి, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్ష వ్యక్తం చేసి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిం చవలసిన ప్రభుత్వాధినేత ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి తనను తాను పలచన చేసుకున్నారు.

ఇది చాలదన్నట్టు ఢిల్లీ వెళ్ళి కేంద్రంపైన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయ కుడిపైన హత్యాయత్నం జరిగినప్పుడు గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవడం టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడం ఎట్లా అవుతుందో మెడ మీద తల ఉన్నవారికి ఎవ్వరికీ అర్థం కాదు. చంద్రబాబుని ముఖ్య మంత్రిగా, ఆయన సహచరులను మంత్రులుగా నియమించింది గవర్నర్‌. గవ ర్నర్‌ పేరు మీదే అన్ని జీవోలూ విడుదల అవుతాయి. మంత్రివర్గం గవర్నర్‌ పేరు మీదే పరిపాలన సాగిస్తుంది. ఇది ‘నా ప్రభుత్వం’ అని గవర్నర్‌ చెప్పుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి కాదు.

సీజన్డ్‌ పొలిటీషియన్‌ అని ఢిల్లీ మీడియా సమావేశంలో సైతం ప్రకటించుకున్న చంద్రబాబుకి రాజ్యాంగం స్పష్టం చేస్తున్న ఇంత చిన్న విషయం తెలియదా? సర్కారియా కమిషన్‌ను 1983లో ఇందిరాగాంధీ నియ మిస్తే తాను నియమించినట్టు చెప్పుకుంటే ఢిల్లీ విలేఖరులు ఏమనుకుంటారు? గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేస్తే 1995లో ఎన్టీఆర్‌ చేతిలోని అధికారం తీసి చంద్ర బాబు చేతిలో పెట్టడానికి కృష్ణకాంత్‌ ఉండేవారా? ప్రధాని, అధికారపార్టీ అధ్య క్షుడు ఒకే రాష్ట్రం నుంచి ఉండకూడదనే వాదన సమంజసమైనదే. ముఖ్యమంత్రి పదవీ, పార్టీ అధ్యక్ష పదవీ ఒకే వ్యక్తి చేతిలో ఉండవచ్చా? ఉన్నత స్థానాలలో అందరూ గుజరాత్‌కు చెందిన అధికారులు ఉండటం ఆక్షేపణీయమే.

మరి ఒకే సామాజికవర్గానికి చెందినవారు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక పదవులలో ఉండ వచ్చా? ప్రజలు నేరుగా ఎన్నుకున్న పంచాయితీలను నిర్వీర్యం చేసి జన్మభూమి కమిటీలతో అవినీతి, అరాచక, పక్షపాత పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రికి అధికార వికేంద్రీకరణ గురించీ, సమాఖ్యస్ఫూర్తి గురించీ మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? వ్యవస్థలన్నిటినీ మోదీ భ్రష్టుపట్టిస్తున్నారన్న మాట నిజమే కావచ్చు. చంద్రబాబు నిర్వాకం ఏమిటి? 

గోదావరి పుష్కరాలపైన విచారించిన జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ ఇచ్చిన నివేదిక చూసిన తర్వాత న్యాయవిచారణలో సైతం నిజం నిగ్గు తేలుతుం దనే నమ్మకం పోయింది. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థగా చెప్పుకునే సీబీఐ విశ్వసనీయత ఎప్పుడో మంటగలిసింది. ఇప్పుడు మరింత అపహాస్యం అవుతున్నది. ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ఎవరితో, ఏ సంస్థతో దర్యాప్తు జరిపించాలని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంతిమంగా న్యాయం ప్రజాకోర్టులోనే జరగాలి.

వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి
 

మరిన్ని వార్తలు