రైతు బడ్జెట్‌ అంటే ఇదేనా?

4 Feb, 2018 00:45 IST|Sakshi

త్రికాలమ్‌
వ్యాపార దృష్టి ఉన్నవారికి వ్యవసాయం అర్థం కాదు. వ్యవసాయదారులకు వ్యాపారం అంతుబట్టదు. వ్యవసాయంతో బొత్తిగా సంబంధం లేని వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీకీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకీ వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన అవగాహన ఉన్నట్టు కనిపించడంలేదు. గుజరాత్‌ స్థానిక ఎన్నికలలోనూ, అసెంబ్లీ ఎన్నికలలోనూ రైతులు ఎదురు తిరిగిన ఫలితంగా గట్టి దెబ్బ తగిలిన తర్వాత మోదీకి రైతుల గోడు పట్టించుకోవలసిన అవసరం ఏర్పడింది. జైట్లీ వార్షిక బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్న సమయంలోనే రాజస్థాన్‌ ఉప ఎన్నికల ఫలి తాలు వెల్లడైనాయి. రెండు లోక్‌సభ స్థానాలను కోల్పోవడమే కాకుండా వాటి పరిధిలోని మొత్తం 17 శాసనసభ స్థానాలలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ గణనీయమైన మెజారిటీలు సాధించిందనే వార్త అధికార పార్టీ నేతలకు దిగ్భ్రాంతి కలి గించింది. 

2014లో నగరజీవులతో పాటు రైతులు సైతం సమధికోత్సాహంతో ఓట్లు వేయబట్టే బీజేపీ మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలవగలిగింది. వ్యవసాయ ఉత్పత్తులకు యూపీఏ–2 ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (మిని మమ్‌ సపోర్ట్‌ ప్రైస్‌–ఎంఎస్‌పి) చాలా తక్కువనీ, తాము అధికారంలోకి వస్తే ప్రొఫెసర్‌ స్వామినా«థన్‌ కమిటీ చేసిన సిఫార్సులను తు.చ. తప్పకుండా అమలు చేస్తామనీ నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కూడా నమ్మబలికారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి మూడున్నరేళ్ళు దాటినప్పటికీ వ్యవసాయదారుల పరిస్థితిలో మార్పులేదు. రుణభారం కారణంగా రైతుల ఆత్మహత్యలు ఆగలేదు.

వ్యవసాయానికి పెద్దపీట?
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకుం టున్నామనీ, ఖరీఫ్‌ తరుణంలో పంటలకు ఎంఎస్‌పిని స్వామినాథన్‌ చెప్పిన సూత్రం ప్రకారం నిర్ణయిస్తామనీ ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ‘హింగ్లీష్‌’ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఇది గొప్ప వరమనీ, రైతులను కష్టాల కడలి నుంచి రక్షించేందుకు ఉపకరిస్తుందనీ చెబుతూ ఉత్తరాది ప్రజలకు స్పష్టంగా, సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆ భాగం మాత్రం హిందీలో చదివారు. ఎన్‌డీఏ బడ్జెట్‌ అటు స్టాక్‌మార్కెట్‌నూ, ఇటు వ్యవసాయరంగాన్నీ ఆగ్రహానికి గురి చేసింది. మధ్య తరగతినీ, ఉద్యోగ వర్గాలనూ నిరాశానిస్పృహలకు లోనుచేసింది. ఇన్ని వర్గాలకు సమానంగా మనస్తాపం కలిగించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను జైట్లీ సమర్పించడం విశేషం. 

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించాలనే విషయంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి బలమైన తార్కాణం 2015లో కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్టు. ఉత్పత్తి వ్యయంపైన యాభై శాతం అదనంగా వేసి కనీస మద్దతు ధర నిర్ణయించడం సాధ్యం కాదని అందులో వాదించింది. అసలు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను మోదీ ఎన్నడూ ప్రస్తావించలేదంటూ కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌ 2017 మే నెలలో దబాయించారు. మొన్న బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్వయంగా ఈ నివేదిక గురించి ప్రస్తావించారు కనుక ఇప్పుడు ఎవ్వరూ కాదనలేరు.

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నదని బడ్జెట్‌కు ముందురోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. వ్యవసాయదారుల ఆదాయం పెరగడం లేదనీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదనీ, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారనీ నివేదించింది. వాతావరణంలో మార్పుల కారణంగా పంట దిగుబడి, వ్యవసాయదారుల ఆదాయం 25 శాతం వరకూ పడిపోయే ప్రమాదం ఉన్నదని కూడా హెచ్చరించింది. రుణభారంతో, అవమానభారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోని రాష్ట్రం అంటూ దేశంలో ఈ రోజు లేదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర లోని విదర్భ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ఇవి అధికం. కానీ పంజాబ్‌ వంటి వ్యవసాయ విజయాలు సాధించిన రాష్ట్రంలోనూ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంఎస్‌పి కంటే మార్కెట్‌ రేటు తక్కువ ఉన్నట్లయితే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్న (భావాంతర్‌ భుక్తన్‌ యోజన) మధ్యప్రదేశ్‌లో కూడా రైతులు అప్పుల చెర నుంచి బయటపడలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మృత్యుముఖంలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న రైతులు ఏమి కోరుకుంటున్నారు? రైతు సంఘాలు చేస్తున్న మొదటి డిమాండ్‌ రుణమాఫీ. 

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో పశ్చిమ యూపీలో రైతు రుణమాఫీ ప్రకటించిన ప్రధాని ఆ రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాలకు దాన్ని వర్తింపజేయలేదు. ఇతర రాష్ట్రాలలో ఆ ఊసే లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీ ఎన్నికలలో గట్టెక్కడానికి రుణమాఫీ మంత్రం ప్రయోగించారే కానీ దానిని ఒక విధానంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి మోదీ సిద్ధంగా లేరు. అప్పు చేసి వ్యవసాయం చేసిన రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకపోతే వాటిని ఎట్లా తీర్చాలి? వ్యవసాయం గిట్టుబాటు అయ్యేవిధంగా కనీస మద్దతు ధర నిర్ణయించి, ఇంతవరకూ చేసిన రుణాలను రద్దు చేయగలిగితే బక్కౖ రెతు హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో కౌలు రైతుల సంఖ్య గణనీయం. వారికి రుణ సౌకర్యం కల్పించాలన్నది వ్యవసాయ సంఘాల రెండో డిమాండ్‌. ‘రుణ హామీ నిధి’ ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకులకు పూచీగా ప్రభుత్వం నిలవాలని వాటి అభ్యర్థన. 

వ్యవస్థాగతమైన రుణ సదుపాయం లేని కారణంగానే కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తున్నారనీ, బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లయితే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చుననీ 1998లో ఆత్మహత్యల పరంపర మొదలైనప్పటి నుంచీ వ్యవసాయ సంఘాల నాయకులు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకుంటూనే ఉన్నారు. రుణహామీ నిధిని జైట్లీ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. నీతి ఆయోగ్‌ రూపొందించిన ‘భూమి కౌలుచట్టం’ ముసాయిదా కౌలుదారుల కంటే భూయజమానులకే అనుకూలంగా ఉంది. ఇదే నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఎంఎస్‌పి నిర్ణయిస్తుందని ఆర్థికమంత్రి చెప్పారు. ఇందుకు ఎంత కాలం పడుతుందో చెప్పలేదు. అంత వ్యవధి ప్రభుత్వానికి లేదు. నిజంగా రైతులను ఆదుకొని వారి ఓట్లు సంపాదించాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే ఎంఎస్‌పిని ఉదారంగా నిర్ణయించడమే కాకుండా వేగంగా, సమర్థంగా అమలు చేయాలి. 

నానాటికి తీసికట్టు
ఎన్‌డీఏ హయాంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతలు నానాటికి తీసికట్టుగా ఉన్నాయనడానికి నిదర్శనం మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయ శాఖ కేటాయింపుల తగ్గుదల. నిరుడు బడ్జెట్‌ వ్యయంలో వ్యవసాయ శాఖ వాటా 2.38 శాతం. మొన్నటి బడ్జెట్‌ ప్రతిపాదనలలో అది 2.3 శాతానికి పడిపోయింది. బడ్జెట్‌ కేటాయింపులు పెంచకుండా రైతుల బతుకులను ఎట్లా బాగుచేస్తారు? వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగులు నిర్మిస్తామనీ, 22,000 గ్రామీణ మార్కెట్‌ యార్డ్‌లను అభివృద్ధి చేస్తామనీ ఆర్థికమంత్రి చేసిన ప్రతిపాదనలు స్వాగతించదగినవే. కానీ రైతులోకం ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యకు ఇటువంటి అరకొర చర్యలు పరిష్కారం ఎట్లా అవుతాయి? నీరసించిపోయిన కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించే పని అసంకల్పితంగానే మోదీ చేస్తున్నారనే వ్యాఖ్య వినిపిస్తోంది అందుకే. 

స్వామినాథన్‌ ఏమన్నాడు?
రబీ పంటలకు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు చేసిన విధంగా ఎంఎస్‌పి నిర్ణయించామనీ, వచ్చే ఖరీఫ్‌కి కూడా అదేవిధంగా చేస్తామనీ జైట్లీ ప్రకటించారు. ఇంతకీ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు ఏమిటి? ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయదారుల జాతీయ కమిషన్‌ సర్వేలూ, చర్చలూ, సంప్రదింపులూ నిర్వహిం చింది. 2006లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా సాగు వ్యయం–ధరల కమిషన్‌ (సీఏసీపీ) పంట పండించడానికి పెట్టిన ఖర్చుకు మూడు రకాల నిర్వచనాలు ఇచ్చింది. ఒకటి ఏ2. రెండు ఏ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌. మూడు సీ2. పంటలు పండించే క్రమంలో రైతు నగదు రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ చెల్లించిన మొత్తాలు కలిపి ఏ2 అంటారు. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, కూలీ, ఇంధనం, నీటి సరఫరా, తదితరాలపైన పెట్టిన ఖర్చుల మొత్తం ఇది. ఎఫ్‌ఎల్‌(ఫ్యామిలీ లేబర్‌) అంటే పొలంలో పనిచేసే కుటుంబ సభ్యుల శ్రమ విలువ. దీనిని లెక్క కట్టి ఏ2కి కలిపితే వచ్చేది ఏ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌. 

మూడో పద్ధతి అత్యంత సమగ్రమైనది. రైతుకు శ్రేయస్కరమైనది. ఏ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌లో కలిపినవే కాకుండా భూమిని ఎవరికైనా అద్దెకు ఇస్తే వచ్చే అద్దె మొత్తం, దాని పైన వడ్డీ మొత్తం, ఇతరత్రా ఖర్చు కూడా కలిపితే వచ్చే మొత్తం సీ2. కేంద్ర ప్రభుత్వం 2018 రబీ పంటల నిమిత్తం 2017 అక్టోబర్‌లోనే ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే స్వామినాథన్‌ సూచించిన సూత్రం తేలికగా బోధపడుతుంది. టన్ను వరిధాన్యం పండించేం దుకు ఏ2 నిర్వచనం కింద రూ. 840 ఖర్చు అవుతుందనీ, ఏ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ కింద రూ. 1,117 అవుతుందనీ, సీ2 ప్రకారం రూ. 1,484 ఖర్చు కాగలదనీ సీఏసీపీ నిర్ణయించింది. ఎంఎస్‌పిని రూ. 1,550గా ప్రతిపాదించింది. ఖరీఫ్‌లో ఇది ఎని మిది శాతం పెరిగి రూ. 1,675 కావచ్చు. ఎంఎస్‌పిని ఇరవై పంటలకు నిర్ణయిం చినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది బియ్యం, గోధుమలను మాత్రమే. ఇది కూడా జాతీయ ఆహార భద్రతాచట్టం అమలు చేయడం కోసం విధిగా ఆహారధాన్యాలు కొనాలి కనుక. 2015లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వెల్ల డించిన గణాంకాల ప్రకారం 5.8 శాతం మంది రైతులు మాత్రమే ఎంఎస్‌పి రేటుకు ప్రభుత్వానికి ఆహారధాన్యాలు విక్రయించారు. మిగిలినవారంతా దళారుల కబంధహస్తాలలో చిక్కినవారే. 

వ్యవసాయదారుల సంస్థలు
బడ్జెట్‌లో ప్రస్తావించిన ఎంఎస్‌పిపైన ఇంకా స్పష్టత రావలసి ఉన్నదని స్వామినాథన్‌ వ్యాఖ్యానించారు. ఎంఎస్‌పి కంటే మార్కెట్‌ రేటు తక్కువ ఉంటే ప్రభుత్వం ఎంఎస్‌పి రేటుకు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనీ, లేదా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ అన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు మండల స్థాయిలో పరిశోధన కేంద్రాలు నెలకొల్పాలనీ, నష్ట నివారణలో నైపుణ్యం కలిగిన ఒక మహిళనూ, ఒక పురుషుడినీ ప్రతి పంచాయతీ నుంచి ఈ కేంద్రాలలో నియమించాలనీ స్వామినాథన్‌ సూచించారు. మధ్యదళారుల పాత్రను రద్దు చేయడం, రైతులే వినియోగదారులకు నేరుగా ఆహారధాన్యాలు విక్రయించే వ్యవస్థను నిర్మించడం ద్వారా వ్యవసాయరంగంలో సంక్షోభాన్ని పరిష్కరించవచ్చు. 

1980ల నుంచి వ్యవసాయరంగం అభివృద్ధి రేటు సగటున 2.5 శాతానికి మించలేదు. రైతు ఆదాయాన్ని ఐదారు సంవత్సరాలలో రెట్టింపు చేయాలంటే ఏటా15–20 శాతం వృద్ధి సాధించాలి. అది అసాధ్యం. ఇతర వినిమయ వస్తువులలాగానే ఆహారధాన్యాల ధరలను కూడా ఉత్పత్తిదారులకు గణనీయమైన లాభం లభించే విధంగా నిర్ణయించినప్పుడే రైతు లోగిలిలో విషాదం తొలగి పోయి ఆనందం వెల్లివిరుస్తుంది. ఇందుకు మహారాష్ట్రలో జోరందుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నది. అందుకే ఇంతకాలం ఆ సంస్థలపైన విధిస్తున్న 30 శాతం పన్ను రద్దు చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులను లాభసాటిగా అమ్మడం ఈ సంస్థల బాధ్యత. మధ్యదళారులను పూర్తిగా తొలగించి, మార్కెటింగ్‌ వ్యవస్థను పటిష్ఠం చేసి, వ్యవస్థీకృతమైన రుణ సదుపాయం కలిగించి, వ్యవసాయ విస్తరణ అధికార యంత్రాంగాన్ని ప్రోత్సహించి, సాగునీరు అందించేందుకు విశేష ప్రయత్నం చేయగలిగితే రైతులూ, కౌలురైతులూ కోలుకుం టారు. వ్యవసాయం తెలిసినవారూ, వ్యాపారంలో నైపుణ్యం ఉన్నవారూ భుజం భుజం కలిపి సమష్టిగా కృషి చేస్తే వ్యవసాయం కూడా లాభసాటి వ్యాసంగం కావచ్చు. ఈ దిశగా బృహత్‌ ప్రయత్నం జరగాలి.

- కె. రామచంద్రమూర్తి
 

మరిన్ని వార్తలు