రాజనీతి శాస్త్రమా? రాజభీతి శస్త్రమా?

10 Aug, 2019 01:44 IST|Sakshi

స్వాతంత్య్ర పోరాటంలో, ఉద్యమాల్లో, రాజకీయాలలో పాల్గొన్న చాలామంది ఆనాడు తమ ఆస్తులను హారతి కర్పూరం చేసుకున్నారు. రాజకీయాలు అంటే సేవే పరమావధిగా భావించిన కాలమది. కానీ క్రమంగా మన రాజకీయాలు సంపాదన మార్గాలుగా, అధికారాలు చలాయించే కేంద్రాలుగా మారాయి. చట్టం, న్యాయం, ధర్మం దేన్నీ లక్ష్యపెట్టకుండా, అధికారమే పరమావధిగా రాజకీయనేతలు ఏమి చేయడానికైనా, ఎంతగా దిగజారడానికైనా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజ్యాంగాన్ని కూడా లక్ష్యపెట్టని స్థితి వచ్చేసింది. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం, ఏ పార్టీ నుంచి గెలిచినా తమ పార్టీ లో కలుపుకోవడం, పార్టీ మార్పిడులతో అధికార పక్షాన్ని కూలగొట్టి ప్రభుత్వాలనేర్పాటు చేయడం రాజకీయ నీతి రాహిత్యానికి పరాకాష్ట. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, గరీబీ హటావో, బంగ్లాదేశ్‌ విముక్తి లాంటి చర్యలతో తిరుగులేని ‘రాజకీయశక్తి’గా మారిన ఇందిరా గాంధీ హయాంలోనే ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడం, పార్టీమార్పిడులతో ప్రభుత్వాలనే మార్చివేయడం వంటి చర్యలకు నాంది పలికారు.

ప్రభుత్వాలను కూలదోయడం, పార్టీ మార్పిడులతో ప్రభుత్వాలను ఏర్పరచడం, ప్రతిపక్షాలే లేకుండా చేయడం, మొత్తం పార్టీని మార్పు చెందించి తమ పార్టీ జెండా కప్పడం గత నాలుగైదేళ్లుగా బహిరంగంగా జరుగుతోంది. బి.జె.పి. ఆధ్వర్యంలో  గోవా ఉత్తరాఖండ్, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోనూ, టీడీపీ ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్‌లోనూ, టి.ఆర్‌.ఎస్‌. అధ్వర్యంలో  తెలంగాణలోనూ ఈ రచ్చకీయం  గత నాలుగైదేళ్ళుగా  జరుగుతుంది. ఏ పార్టీ చేసినా ఇది అనైతిక, అరాచకీయ చర్యే. ఈ చర్యలను చట్టం ఒప్పుకుంటుందేమో కాని న్యాయం, ధర్మం, నైతికపరంగా తప్పుడు చర్యలే. ‘రాజ్యాంగ విరుద్ధ చర్యలే’. ఓ పార్టీలో గెలిచి అధికార పార్టీలో చేరి మంత్రి పదవులు కూడా పొందడం హేయాతిహేయమైందే.

శరీరంపై చొక్కా మార్చినట్టు మాది ఫలానా పార్టీ అనడం ఎంత హేయం? ఏ పార్టీ ద్వారా గెలిచినా అధికార పార్టీకి రావడమే ధ్యేయమైతే కోట్ల ఖర్చుతో ఎన్నికలెందుకు? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రతిపక్షం లేకుండా చేయడమంటే ప్రశ్నను అడ్డుకోవడమే. ప్రజల తీర్పును అపహాస్యం పాలు చేయడమే. పార్టీ మార్పిడులతో ప్రభుత్వాలను కూలదోయడం కూడా అప్రజాస్వామికమే. ఇలాంటి చర్యలకు పాల్పడినందుకే అప్పుడు ఇందిరాగాంధీ, నేడు చంద్రబాబు ప్రజాగ్రహానికి గురయ్యారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ మార్పిడులను ఏస్థాయిలోనూ ప్రోత్సహించడం లేదు. వైఎస్సార్‌సీపీలో చేరాలంటే ఎవరైనా సరే తమ పదవికి రాజీనామా చేసి మరీ రావాలని చెప్పడం అద్భుతమైన నిర్ణయమే. యువనేత జగన్‌ చర్య అన్ని పార్టీలకు, ఫిరాయింపును ప్రోత్సహించే నేతలందరికీ కనువిప్పు కావాలి. రాజభీతి శాస్త్రంగా మారిన రాజకీయాలు రాజనీతిశాస్త్రంగా మారితేనే మన ప్రజాస్వామ్యం బతుకుతుంది. 
  -డాక్టర్‌ కాలువ మల్లయ్య, ఫోన్‌ నెంబర్‌: 91829 18567 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు