మరి మతం మారితే అభ్యంతరమేల?

10 Oct, 2019 00:50 IST|Sakshi

విశ్లేషణ

దేశంలో ఇతర మతాల్లోని స్త్రీల కంటే క్రిస్టియన్‌ మహిళలే ఉద్యోగ అవకాశాల్లో ముందంజలో ఉన్నారని ఒక ఆరెస్సెస్‌ మేధో బృందం తాజా అధ్యయనంలో కనుగొన్నది. క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తంగా స్త్రీ–పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను దాటుకుంటూ వచ్చింది. ప్రపంచంలోని ఏ మతం కంటే క్రిస్టియన్‌ మహిళలు నేడు మరింత స్వేచ్చగా, స్వతంత్రంగా జీవిస్తున్నారు. ఆరెస్సెస్‌ కూడా ఈ వాస్తవాన్ని నిష్పక్షపాతంగా అంగీకరించింది. మరి, ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకొనే మతపర స్వాతంత్య్రాన్ని ఆరెస్సెస్‌ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అలా కాకుండా పేద ప్రజలు, దళితులు, ఆదివాసీలు ఎలాంటి నియంత్రణలూ లేకుండా మత స్వేచ్చను అనుభవించడానికి ఆరెస్సెస్‌ అనుమతించాలి. భారత్‌లో అమలులో ఉన్న అన్ని మతమార్పిడి వ్యతిరేక చట్టాలను రద్దుచేయాల్సిన సమయం ఆసన్నమైంది.

భారతదేశంలోని మహిళల అభివృద్ధిపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ మేధో బృందం 2019 సెప్టెంబర్‌ 19న విడుదల చేసిన ఒక చిన్న నివేదికను చూసి ఒకింత ఆశ్చర్యపడ్డాను. పుణేకి చెందిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మతపరంగా చూస్తే క్రిస్టియన్‌ మహిళలు అత్యధిక శాతం ఉద్యోగాలు చేస్తుంటే, హిందువులు, బౌద్దులు, ముస్లింలు, జైన్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నారని, ఉద్యోగితా శాతం సిక్కు మహిళల్లోనే అత్యంత తక్కువగా ఉందని ఆ నివేదిక పేర్కొంది (ది హిందూ). కానీ మతంవారీగా మహిళల విద్య గురించి అది ఏమీ చెప్పలేదు. ఉద్యోగితా శాతం ఎక్కువగా ఉంది అంటే వారు అక్షరాస్యత, విద్యలోనూ ముందంజలో ఉన్నట్లే కదా? అయితే ఇతర మతాల మహిళలతో పోలిస్తే క్రిస్టియన్‌ మహిళలే ఎక్కువ అక్షరాస్య తను కలిగి ఉన్నారని 2011 జనాభా లెక్కల డేటా చెబుతోంది. దాని ప్రకారం క్రిస్టియన్‌ మహిళల్లో నిరక్షరాస్యులు 28.03 శాతం ఉండగా, హిందూ మహిళల్లో 44.02 శాతం, ముస్లిం మహిళల్లో 48.1 శాతం, బౌద్ద మహిళల్లో 34.4 శాతం నిరక్షరాస్యులుగా ఉన్నారు.
విగ్రహారాధన కేంద్రంగా మనుగడ సాగిస్తున్న హిందువుల కంటే ఎక్కువగా, ఖురాన్‌ పఠనం కేంద్రంగా ఉండే మతం పరిధిలో జీవిస్తున్న ముస్లింలు తమ మహిళలను నిరక్షరాస్యులుగా ఉంచే యడం ఆశ్చర్యం కలిగించదు. మన దేశంలో మహిళల అక్షరాస్యత, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలకు సంబంధించిన ప్రశ్నలు ప్రభుత్వం లేక పౌర సమాజం సమస్యలుగా కాకుండా మత–సాంస్కృతిక సమ స్యలుగా ఉంటున్నాయి. క్రిస్టియన్‌ మతంలో స్త్రీ–పురుషుల మధ్య ప్రజాస్వామిక సంబంధాలు ఇతర మతాలతో పోలిస్తే మరింత అభి వృద్ధి అనుకూల తత్వంతో ఉంటున్నాయని ఆరెస్సెస్‌ మేధో బృందం అధ్యయనం, జనాభా లెక్కల డేటా తేటతెల్లం చేస్తున్నాయి. ఆధ్యా త్మిక రంగంతోపాటు సమాజంలోని అన్ని రంగాల్లో స్త్రీ–పురుష సమా నత్వాన్ని ఏ మతమైనా ప్రసాదించకపోతే, జాతీయ అభివృద్ధితో అధి కంగా ముడిపడివుండే మహిళల పురోగతిని అది తీవ్రంగా అడ్డు కుంటుంది. మహిళలు, నల్లజాతి వంటి మైనారిటీలు విద్యను పొంది, పురుషులతో పోటీపడుతూ ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత పాశ్చాత్య క్రిస్టియన్‌ ప్రపంచం సత్వర దిశలో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధిని వారు ఆధ్యాత్మిక ప్రజాస్వామిక ఆవరణలో కూడా ఉపయోగించారు.

ప్రత్యేకించి ప్రతిభ ఆధారంగా సాగే ఉద్యోగిత పెరిగాక, స్త్రీల శక్తి సామర్థ్యాలను తలుపు వెనుక దాచి ఉంచడాన్ని విశ్వసిస్తూ వచ్చిన సమాజాలు, దేశాల కంటే.. తమ మహిళలను తలుపుల వెనుక దాచి పెట్టని, వారి లైంగికతను వాస్తవమైనదిగా, తమకు తామే నిర్వహిం చుకునేదిగా విశ్వసించిన సమాజాలు.. ప్రపంచంలో ఎక్కువగా అభి వృద్ధి చెందుతూ వచ్చాయి. స్త్రీ శరీరాన్ని కేవలం లైంగిక వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా చూస్తూవచ్చిన పురుష కేంద్రక మతాలు ఇప్పటికీ అత్యంత వెనుకబాటుతనంలో ఉండిపోయాయి. హిందూ వర్ణధర్మ వ్యవస్థ (బాల్య వివాహం, సతి, శాశ్వత వైధవ్యం), సంస్క రణకు నోచుకోని ప్రస్తుత ముస్లిం సమాజాలు దీనికి చక్కటి ఉదాహ రణలు. ఈ సమాజాల్లో కుటుంబ, సామాజిక అభివృద్ధిని అణచిపెట్టే మగాడి గృహ పరిధిలోనే మహిళలను ఉంచేశారు.

భారత్‌లో చాలావరకు క్రైస్తవులు అంటే దళిత ఆదివాసులే. క్రిస్టియన్‌ మతంలోకి మతమార్పిడులు చాలావరకు మహిళల చొర వతో జరుగుతున్నవేనని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల విద్య ప్రతి తల్లికీ చోదకశక్తిగా ఉంటూ వస్తోంది. దళిత ఆదివాసీలుగా ఉంటున్నప్పటికీ వారి మహిళలు మాత్రం బాగా చదువుకున్నారు, చక్కగా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కేథలిక్‌ సంస్థాగత సంప దను మినహాయిస్తే దళిత క్రిస్టియన్‌ కమ్యూనిటీలో పెట్టుబడి సంచ యనం, భూ సంపద రూపంలో పెద్దగా సంపద కూడనప్పటికీ, సగటు కుటుంబ వ్యక్తిగత ఆస్తి తక్కువగానే ఉన్నప్పటికీ వీరు చాలా వరకు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు. వీరి సామాజిక సంబంధమైన వాణిజ్యం తక్కువగానే ఉన్నప్పటికీ అది సామూహికం గానే పంపిణీ అయ్యేది. అందుబాటులో ఉన్న వనరుల పంపిణీ అనేది ఇతర కమ్యూనిటీల కంటే క్రిస్టియన్‌ కమ్యూనిటీల్లోనే ఎక్కువ గానే ఉంటోంది. మతం ఏదైనప్పటికీ ఉత్తమమైన మహిళా విద్య, ఉద్యోగితా వనరులే సామూహిక జాతీయ వనరుగా ఉంటాయి. కానీ తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునేటటువంటి మతపరమైన స్వాతంత్య్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? క్రిస్టియన్లలో ఎక్కువమంది బలవంతంగా మతమార్పిడీకి గురయిన వారే అయితే భారతీయ క్రిస్టియన్‌ మహిళలు సాధించిన ఉత్తమ విద్య, ఉత్తమ ఉద్యోగ స్థితి గురించి ఆరెస్సెస్‌ ఏం చెబు తుంది? పైగా ఆరెస్సెస్‌ స్వయంగా ఈ నిజాన్ని ఇప్పుడు అంగీకరిస్తోంది కూడా. చారిత్రకంగా అత్యంత అణచివేతకు గురైన కులాల్లోంచి వచ్చినప్ప టికీ క్రిస్టియన్‌ మహిళలు ఎలా ముందంజ సాధించారు, హిందూ, ముస్లిం మహిళలు మాత్రం ఇప్పటికీ వెనుకబాటుతనంలోనే ఎలా ఉండిపోతున్నారు అనే సైద్ధాంతిక ప్రశ్నను మనం సంధించాల్సిందే.

మతపరమైన, ఆర్థిక పరమైన అభివృద్ధి సూచికలపై చైనా నిర్వ హించిన తాజా అధ్యయనాలను పరిశీలిస్తే బౌద్ధులు, కన్ప్యూసి యన్లతో పోలిస్తే అభివృద్ధిలో క్రిస్టియన్‌ భాగస్వామ్యమే ఎక్కువగా ఉందని చూపుతున్నాయి. అంటే, ఆధ్యాత్మికంగా మరింత ప్రజాస్వా మికంగా ఉండే మతమే  సామాజిక, ఆర్థిక ప్రజాతంత్ర భాగస్వామ్యా నికి అధికంగా వీలు కల్పిస్తూ.. వ్యక్తులు, కుటుంబాలు మెరుగైన జీవి తం గడిపేందుకు అవకాశాలు కల్పిస్తోంది. అందుకే చైనా ఇప్పటికీ మతపరమైన అణచివేత స్వభావంతో ఉంటున్నప్పటికీ, దేశంలో జరుగుతున్న మత మార్పిడులను మరొక దృష్టితో చూడటం మొద లెట్టింది. మహిళల స్వాతంత్య్రం, వారి విద్య, శ్రమను గౌరవించడం అనే స్పష్టమైన వైఖరితో వేగంగా పెరుగుతున్న వారి ఉద్యోగిత, తమ లైంగికతపై పూర్తి నియంత్రణను మహిళలే కలిగి ఉండేలా అనుమ తించడం అనేవి మహిళల అభివృద్ధికి, అలాగే జాతి అభివృద్ధికి కీల కమైన సాధనాలు. ఈ పరామితులలో భారతీయ క్రిస్టియన్లే ఉన్నత స్థానంలో ఉన్నారని ఆరెస్సెస్‌ ఇప్పుడు తెలుసుకుంది. అలాంట ప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాలను ఎందుకు తీసుకువస్తున్నారు? నిర్బంధ మతమార్పిడి పేరుతో వారి చర్చిలపై, మత సంస్థలపై ఎందుకు దాడులు చేస్తున్నారు?

మహిళలు అన్ని రకాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో బతకగలుగు తున్న క్రిస్టియానిటీలాగా హిందూమతం మారాలని ఆరెస్సెస్‌ కోరు కుంటున్నట్లయితే, స్త్రీ–పురుష సంబంధాల విషయంలో అది పూర్తిగా తన వైఖరిని మార్చుకోవల్సి ఉంది. హిందూయిజంలోని అన్ని నిర్మా ణాలూ మహిళలను తమలో భాగం చేసుకోవాల్సి ఉంది. అలాగే భారతీయ ముస్లింలు కూడా భారతీయ ఇస్లాం పద్ధతుల్లో, మహిళా స్వాతంత్య్రం.. ప్రత్యేకించి స్త్రీల విద్య, ఉద్యోగిత విషయంలో భారీ సంస్కరణలు తీసుకురావడంపై తప్పక ఆలోచించాలి. మరే ఇతర మతాలకంటే ఈరోజు ముస్లిం మహిళలు పూర్తిగా పురుషుల నియం త్రణకు గురవుతున్నారు. ఆధ్యాత్మిక రంగంలో వారికి స్థానం లేక పోవడం, ఇంటికి పరిమితం చేయడం వల్ల ఇతర మతాల స్త్రీలకు మల్లే ముస్లిం మహిళలు పోటీ మార్కెట్లోకి ప్రవేశించలేకున్నారు. పోటీకి స్వాతంత్య్రం అవసరం. బహుళ సాంస్కృతిక లేదా బహుళ మతాలతో కూడిన మంచి సమాజం అన్ని మతాల మహిళలకూ మార్కెట్లో సానుకూల పోటీకి అనుమతించాలి. ఈ క్రమంలో మహి ళలు తమ తమ మతాలకు చెందిన అనేక చట్టాలను సవాల్‌ చేయాల్సి ఉంటుంది. మతాలు కూడా ఈ మార్పులకు అవకాశం ఇవ్వాలే తప్ప భూస్వామ్య యుగ చట్టాలతో మహిళలను నిర్బంధించకూడదు. 

ఒక మతంగా క్రిస్టియానిటీ అనేక చెడు నిబంధనలను అమలు పరుస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా స్త్రీ– పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను అది దాటుకుంటూ వచ్చింది. ప్రపంచం లోని ఏ మతం కంటే క్రిస్టియన్‌ మహిళలు నేడు మరింత స్వేచ్చగా, లైంగిక నియంత్రణలకు పెద్దగా లోబడకుండా ఉంటున్నారు. ఇప్పుడు ఆరెస్సెస్‌ కూడా సమగ్రమైన ఫీల్డ్‌ వర్క్‌తో చేసిన సర్వే ద్వారా వాస్తవాన్ని పక్షపాతం లేకుండా అంగీకరించింది. కాబట్టి పేద ప్రజలు, దళితులు, ఆదివాసీలు ఎలాంటి నియంత్రణలూ లేకుండా మత స్వేచ్ఛను అనుభవించడానికి ఆరెస్సెస్‌ అనుమతించాలి. ఇస్లాంతో సహా మరేమతంలోనూ ఇలా మతమార్పిడి ఎందుకు జరగ లేదన్న విషయంపై వారు ఆలోచించాలి. అందుకే భారత్‌లో అమ లులో ఉన్న అన్ని మతమార్పిడి వ్యతిరేక చట్టాలను రద్దుచేయాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ


 

మరిన్ని వార్తలు