భారతీయులందరూ హిందువులేనా?

2 Jan, 2020 01:11 IST|Sakshi

విశ్లేషణ

ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తమ తమ దేవుళ్లతోపాటు, భారతమాతను పూజిస్తే చాలు.. వీరంతా హిందువులే అవుతారని ఆరెస్సెస్‌ సర్‌సంచాలక్‌ మోహన్‌ భగవత్‌ హైదరాబాద్‌ సదస్సులో ప్రకటించారు. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అంటూ సూత్రీకరించారు. ఆరెస్సెస్‌/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని కోరుకోరని చెప్పడం ద్వారా ఆయన కౌటిల్యుడిని, మనువును, సావర్కార్‌ని, హెగ్డేవార్‌ని, గోల్వాల్కర్‌ని కూడా దాటి ముందుకు వచ్చేశారు. అయితే రాజ్యాధికారం కోసం కాకపోతే బీజేపీని ఆరెస్సెస్‌ ఎందుకు స్థాపించినట్లు? లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్‌ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోవటాన్ని తప్పనిసరి చేస్తున్న మోహన్‌ భగవత్‌ కొత్త సిద్ధాంతంపై చర్చ జరగాల్సి ఉంది.

శాంతి, అహింసల ప్రబోధకుడిగా ప్రపంచమంతటా గుర్తించిన జీసస్‌ క్రీస్తు జన్మదినమైన డిసెంబర్‌ 25న ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంచాలక్‌ మోహన్‌ భగవత్‌ హైదరాబాద్‌లో ప్రసంగిస్తూ, హిందువులు, హిందూయిజం పూర్తిగా భిన్నమైనవని నిర్వచించారు. ఆయన అభిప్రాయం ప్రకారం దేశంలోని 130 కోట్లమంది ప్రజలు హిందువులేనట. ఈ గడ్డపై నివసిస్తూ, భారతమాతను పూజిస్తూ, ఈ నేలను, నీళ్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ హిందువులే అన్నారు. అంటే తమ తమ విశ్వాసాల మేరకు తమ దేవుడిని పూజించే, ప్రార్థించే భారతీయులందరూ ఇకనుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టించి, ప్రచారం చేస్తున్న భారతమాతను కూడా తమ దేవతగా తప్పకుండా పూజించాలన్నమాట. ఆయన చెప్పిందాన్ని బట్టి, ఈ దేశంలోని ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు తదితరులందరూ రెండు శక్తులను (ఒకరు తమ దేవుడు, మరొకరు దేవత అయిన భారతమాత) పూజించాల్సి ఉంటుంది.

జాతీయ పౌర పట్టికలో కానీ, పాఠశాలలో కానీ, మరే ఇతర రికార్డులో కానీ మతం అనే కాలమ్‌లో భారతీయులు తప్పనిసరిగా ఇకనుంచి ముస్లిం–హిందూ, బుద్ధిస్టు–హిందూ, క్రిస్టియన్‌–హిందూ, సిక్కు–హిందూ, పార్శీ–హిందూ అని నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు తమ పవిత్ర గ్రంథం, తమదైన ఆహార సంస్కృతిని, తమ వివాహ వ్యవస్థను అనుసరించవచ్చు. అయితే ఈసారి మాత్రం మోహన్‌ భగవత్‌ దేశపౌరులందరూ ఆవును పూజిం చాలని, గొడ్డు మాంసం తినడం ఆపివేయాలని తన ప్రసంగంలో చెప్పలేదు. అలాగే ఉమ్మడి పౌరస్మృతి గురించి కూడా మాట్లాడలేదు. అయితే ఇస్లాం లేక క్రిస్టియానిటీ లేదా బుద్ధిజం లేక సిక్కిజం మరే ఇతర మతంలో అయినా చేరినా లేదా చేరాలని తలుస్తున్నవారు తప్పకుండా తమ మతంలో విడదీయరాని విధంగా హిందూ అనే పదాన్ని చేర్చాలన్నది ఆయన ప్రసంగ సారాంశం.

సావర్కార్, హెగ్డేవార్, గోల్వాల్కర్‌ తదితరులు హిందుత్వకు ఇచ్చిన గత నిర్వచనాల నుంచి మోహన్‌ భగవత్‌ వేరుపడ్డారు. గతంలో హిందుత్వ లేక హిందూయిజం కాస్త విభిన్నార్థంలో కని పించేది. కాని ఇప్పుడు ఆయన ఒక ప్రధాన సమస్యను పరిష్కరించేశారు. ఈ క్రమంలో రాజకీయ సైద్ధాంతిక విషయాన్ని సైతం ఆయన తీసివేశారు. ఇది ముస్లింలు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, సిక్కులను కలుపుకోవడానికి అవకాశమిస్తుందని ఆయన అభిప్రాయం. ఇది పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక సమస్యను కూడా పరిష్కరిస్తుంది. వలస వచ్చిన ముస్లింలు లేక శరణార్థులు తమ పేర్లకు ముస్లిం–హిందూ అని చేర్చుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతే వారు అరబిక్‌ భాషలో అల్లా అని ప్రార్థించవచ్చు. కానీ ప్రార్థన ముగింపులో మాత్రం తప్పకుండా భారత్‌ మాతా కీ జై అని చెప్పాల్సి ఉంటుంది.

కౌటిల్యుడు, మనువు తర్వాత హిందూ తత్వశాస్త్రానికి సంబంధించిన అతి గొప్ప సిద్ధాంతవేత్తగా మోహన్‌ భగవత్‌ ఆవిర్భవించారు. కౌటిల్యుడు, మనువు తమ సొంత సైద్ధాంతిక రచనలైన అర్థ శాస్త్రం, మనుధర్మశాస్త్రం రచించడం ద్వారా  మౌర్య చంద్రగుప్త, పుష్యమిత్ర శుంగ సామ్రాజ్యాలను స్థాపించారు. తమ సిద్ధాంతాలతో చంద్రగుప్తుడిని, పుష్యమిత్రుడిని అధికారంలోకి తెచ్చిన కౌటిల్యుడు, మనువు లాగే మోహన్‌ భగవత్‌ కూడా నరేంద్రమోదీని అధికారంలోకి తెచ్చారు. నరేంద్రమోదీ తర్వాత తాను జీవించి ఉన్న కాలంలోనే అమిత్‌ షా కూడా దేశ ప్రధాని కావచ్చు. పార్లమెంటులో ప్రస్తుతం బీజేపీ సాధించిన మెజారిటీ కానీ, కేంద్రంలో రెండు దఫాల పాలన కానీ మోహన్‌ భగవత్‌ తాత్విక వ్యూహాత్మక చేర్పుగానే చెప్పాలి.

హైదరాబాద్‌ సదస్సులో తన నూతన సిద్ధాంతాన్ని విస్తరించి చెప్పినట్లుగా మోహన్‌ భగవత్‌ అభిప్రాయం మేరకు, ప్రపంచంలోని మానవులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరందరికీ మూడు రకాలైన లక్షణాలు ఉంటాయి. అవి ‘తమో, రజో, సత్వ’ గుణాలు. తమోగుణం కలిగినవారు తాము విషాదంలో ఉంటూ ఇతరులనూ విషాదంలో ముంచెత్తుతుంటారు. వీరు హింసను ప్రేరేపించినప్పటికీ విజయం సాధించలేరు. అంతిమంగా వీరు ప్రతి ఒక్క అంశాన్నీ విధ్వంసం చేస్తారు. ఇక రజోగుణానికి చెందినవారు తమ ప్రయోజనాలకు చెందిన పనులను మాత్రమే చేపడుతుంటారు. తాము సంపన్నులు కావడానికి, తమ సొంత ప్రతిష్టలకు వీరు ఇతరులను ఉపయోగించుకుంటుంటారు. కాగా సంఘ్‌ పరివార్, భారతదేశం ధర్మ విజయాన్ని (సత్వ గుణాన్ని) నమ్ముతుంటాయి. ఈ ధర్మపాలనలో ప్రజలు ఇతరుల సంతోషం కోసం, శ్రేయస్సు కోసమే వీరు జీవి స్తుంటారు తప్ప స్వర్గాన్నీ, రాజ్యాధికారాన్ని లేక మరి దేన్ని కూడా తమకోసం కోరుకోరు’’ (ది హిందూ 2019 డిసెంబర్‌ 28)

ఇది ఎంత అత్యున్నతమైన సృజనాత్మక సిద్ధాంతం అంటే.. స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని రెండింటినీ సాధించడానికి నేరాలకు, హింసలకు పాల్పడుతూనే  స్వర్గంపై, రాజ్యాధికారంపై విశ్వాసం నుంచి విశ్వాసులను కాపాడుతూ వస్తోంది. ఈ రెండు వ్యవస్థలూ మారణకాండకు దారితీసిన హింసను ప్రేరేపిస్తూ వచ్చాయి. ఇంతవరకు పవిత్ర ముస్లింలుగా, పవిత్ర క్రిస్టియన్లుగా, పవిత్ర బౌద్ధులుగా, పవిత్ర సిక్కులుగా చెప్పుకుంటూ జీవిస్తున్న ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు అందరూ ఈ జీవితంలో మరణం తర్వాత, రాజకీయాధికారం పొందిన తర్వాత స్వర్గాన్ని కోరుకుంటూ వచ్చారు. ఇలాంటి వాళ్లందరూ హింసకు పాల్పడుతూనే వచ్చారు.

అయితే తొలిసారిగా ఆరెస్సెస్‌/బీజేపీ కార్యకర్తలు స్వర్గాన్నీ, రాజ్యాన్నీ కోరుకోవడం లేదని మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. పైగా ఆరెస్సెస్‌/బీజేపీ కార్యకర్తలకుమల్లే స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని పొందాలనే కోరిక నుంచి బయటపడాలనే వారు తమ తమ మత చిహ్నాలతో పాటు హిందూ ట్యాగ్‌ను కూడా చేతపట్టాల్సి ఉంటుంది. హిందూయిజంలోకి మారాలని కానీ లేక తన హిందూ మతం నుంచి వేరొక మతంలోకి మారిన వారు ఘర్‌వాపసీలో భాగంగా మళ్లీ హిందూమతంలోకి మారాలని కానీ మోహన్‌ భగవత్‌ ఇప్పుడు ఎవరినీ కోరలేదు. దీనికి బదులుగా వీరందరూ తమ మతానికి అదనంగా హిందూ ట్యాగ్‌ను చేర్చుకుంటే చాలు.

అయితే ఇక్కడ మనకు తట్టే ప్రశ్నల్లా ఏమిటంటే.. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి కాకపోతే భారతీయ జనతాపార్టీని ఆరెస్సెస్‌ ఎందుకు స్థాపించినట్లు? పాపకార్యాలుగా తాను భావిస్తున్న లౌకికవాదం, రాజ్యాధికారంపై విశ్వాసం ఉంచుతున్న ఇతర రాజ కీయ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీని నిలిపి దాని విజయానికి ఆరెస్సెస్‌ ఎందుకు కృషి చేస్తూ వస్తోంది? ఆరెస్సెస్‌ తన 95 ఏళ్ల జీవితకాలంలో తమో, రజోగుణ కార్యాచరణలో ఎన్నడూ పాల్గొనలేదని ప్రపంచానికి మోహన్‌ భగవత్‌ నొక్కి చెబుతున్నారు. లేక ధర్మ కాలంలోలాగా 2014కి ముందు ఆరెస్సెస్‌ ఘర్షణల చరిత్రను ఆయన గుర్తిం చడం లేదు. హిందువులకు స్వర్గాన్ని, రాజ్యాధికారాన్ని తిరస్కరించడంలోనే మోహన్‌ భగవత్‌ ధర్మంలోని మౌలిక సారాంశం దాగి ఉంది. అందుచేత ఆయన ప్రస్తుత మాటలు గౌతమబుద్ధుడి కంటే మించిన రాడికల్‌ స్వభావంతో ఉంటున్నాయి.

ప్రాచీన హిందూ పురాణాలు మనకు చెబుతూ వచ్చినట్లుగా తమో, రజో గుణం కలిగినవారు భారతదేశంలో లేరని భగవత్‌ నూతన హిందూ సిద్ధాంతం చెబుతోంది. వారు భారతదేశంలోని దిగువ కులాలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు చెందినవారు కారనీ వారంతా భారత్‌ బయటే ఉంటున్నారని ఈ సిద్ధాంత భావన. అయితే భారతీయ ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, తమ తమ మత ముద్రలకు హిందూ ముద్రను చేర్చుకోనట్లయితే అప్పుడు వారిని తమో, రజో, గుణ సంపన్నులుగా గుర్తించవచ్చు. ఈ రకమైన వరివర్తనకు మోహన్‌ భగవత్‌ తగినంత పరిధిని ఇచ్చారు. ఇదీ మోహన్‌ భగవత్‌ నూతన భారతదేశం. ఈ జాతి పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఒక భారీ డిజైన్‌ని సూచిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ప్రవచించిన సిద్ధాంతాన్ని పలురకాలుగా వ్యాఖ్యానించవచ్చు, పునర్‌ వ్యాఖ్యానించవచ్చు కూడా. ఇప్పటికే మీడియా ఆయన సిద్ధాం తాన్ని చాలా ప్రముఖంగా నివేదించింది. టీవీ చానల్స్‌ ఆయన ప్రసంగాన్ని విస్తృతంగా ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో ఇతర మతాలకు చెందిన మేధావులు, లౌకిక మే«థావులు, పాశ్చాత్య విద్యా పండితులు ఆయన సిద్ధాంతం పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.

వ్యాసకర్త : ప్రొ‘‘ కంచ ఐలయ్యషెపర్డ్‌; డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ

మరిన్ని వార్తలు