హృదయం లేని ఆత్మ నిర్భరం

27 May, 2020 00:29 IST|Sakshi

విశ్లేషణ

భావగర్భితంగా చెప్పాలంటే హృదయాన్ని మానవుల సత్సంకల్పానికి, నిస్సహాయులను ఆదుకునే తత్వానికి సంకేతంగా పేర్కొం టుంటారు. శారీరక బాధలకు అతీతంగా ఉండే ఆత్మ అభౌతిక అంశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టే ఎవరైనా తమ ఆత్మనే తప్ప ఇతరుల ఆత్మను అస్సలు పట్టించుకోరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా వైరస్‌ సంక్షోభం నడుమ ఆత్మనిర్భర్‌ భారత్‌ (భారత స్వావలంబన) అనే ఆర్థిక ఎజెండాను ప్రకటించారు. దీనికి 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని జోడించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ఎలా అమలు చేయనుంది అనే అంశంపై వరుసగా అయిదు మీడియా సమావేశాలు పెట్టి మరీ వివరించారు.

ఆరెస్సెస్‌–బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్‌ పథకం మొత్తం లక్ష్యం ఏమిటి? మన దేశంలోనూ, ఇతర విదేశాల్లోనూ షేర్లు కలిగివుండి, కంపెనీలను నడుపుతున్న ప్రైవేట్‌ రంగం (సంపన్న పారి శ్రామికులు, బడా వాణిజ్యాధిపతులు) కరోనా సంక్షోభ కాలంలో జాతి సంక్షేమం, ప్రజా శ్రేయస్సుపై దృష్టి పెట్టకుండా లాభమే పరమావధిగా సాగుతున్నకాలంలో ఆర్థిక వ్యవస్థను మరింత మరింతగా ప్రైవేటీకరిం చడమే కేంద్ర పథకం లక్ష్యం. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణ కేంద్రాల్లో జీవితం గడపడం అసాధ్యమైపోయిన భయంకరమైన పరిస్థితుల్లో వేలాదిమైళ్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు వెళుతున్న అసంఖ్యాక కార్మికుల జీవితాలను భారత గుత్తపెట్టుబడిదారులు ఏమేరకు ఆదుకుని ఉంటారు అన్నదే అసలు ప్రశ్న. అర్థరాత్రి దేశవ్యాప్తంగా పనిస్థలాలను మూసివేసిన నేపథ్యంలో కూడు, గూడు, నీరు లేని స్థితిలో దేశంలోని 20 కోట్లమంది వలస కార్మికుల (వీరిలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే) పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించకుండానే ప్రధాని మోదీ మార్చి 24న దేశమంతటా లాక్‌ డౌన్‌ ప్రకటించారు. 

అలా కాకుండా లాక్‌డౌన్‌ ప్రకటనకు నాలుగైదు రోజులు ముందుగా అప్రమత్తం చేసి ఉంటే కరోనా నుంచి లాక్‌డౌన్‌ సమయంలో కాపాడిన వారికంటే ఎక్కువ సంఖ్యలో వలస కూలీలను కాపాడగలిగి ఉండవచ్చు. కరోనా వైరస్‌ కారణంగా చనిపోతున్న వారందరి పట్ల ప్రేమను, నిజమైన ఆందోళనను ప్రదర్శించడానికి బదులుగా పాలకవర్గాలు ప్రదర్శించిన హృదయరాహిత్యాన్ని వలస కూలీల దుస్థితి తేటతెల్లం చేస్తోంది. ఆకలిదప్పులకు గురవుతూనే నడచుకుంటూ పోతున్న పిల్లలు, మహిళలు రహదారులపై, అడవుల్లో, రైల్వే ట్రాక్‌లమీదే పడి కుప్పకూలిపోతున్నారు. డస్సిపోయి మరణిస్తున్న చిన్నపిల్లల ముఖాలు కేవల ఆత్మను కాకుండా మానవీయ హృదయాన్ని కలిగిన ప్రతి ఒక్కరినీ చాచికొడుతున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ ఆరెస్సెస్, అతిపెద్ద రాజకీయపార్టీ బీజేపీ నేతలు పూర్తిగా ఇళ్లకే పరిమితమై తమ ప్రాణాలను కాపాడుకోవడంలోనే మునిగిపోయి ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా కాలినడకన సాగిపోతూ, ఆకలితో అలమటిస్తూ చనిపోతున్న ప్రజలను కాపాడటానికి తమ నాయకులను కానీ, కేడర్లను కూడా పంపించిన పాపాన పోలేదు. యావత్‌ ప్రపంచం లాక్‌డౌన్‌లో ఉంటున్న కాలంలోనే, తనను మించినవారు లేరని గర్విస్తున్న జాతీయవాద పార్టీ పాలిస్తున్న భారతదేశంలో రహదారులన్నీ వలసకూలీల పాదాలతో రక్తమోడుతున్నాయి. ఉపాధిలేని, అంతకుమించి హృదయం లేని పట్టణ కేంద్రాల్లో కంటే గ్రామాలు ఎంతోకొంత మానవీయ వాతావరణంతో ఉంటాయని వలస కార్మికులు భావిం చారు. నిజానికి లాక్‌డౌన్‌ కాలంలో పట్టణ కేంద్రాలు వలస కార్మికులను శారీరకంగా, మానసికంగా కూడా చంపేశాయి. నగరాల్లో సురక్షితంగా బతుకుతామని లేశమాత్రం ఆశ ఉండి ఉంటే, మండువేసవిలో పిల్లలు, గర్భిణీలు, వృద్ధమహిళలతో వలసకూలీలు జాతీయ రహదారులపైకి వచ్చి ఉండేవారు కారు.

దేశవ్యాప్తంగా ఆహార ఉత్పత్తిదారులు, భవన నిర్మాతల పట్ల తన హృదయరాహిత్యాన్ని హిందుత్వ నిస్సిగ్గుగా ప్రదర్శించింది. హిందుత్వ శక్తుల జాతీయవాదమే వందలాది వలసకార్మికులను రహదారులపై కరోనాకు బలి ఇచ్చింది. క్రూరమైన వైరస్‌ బారినపడి వలసకూలీల్లో చాలామంది చనిపోతున్నారు. మన దేశంలో దేవుళ్లు కానీ, ఈ జాతీయవాదులు కానీ వీరిపట్ల కరుణ చూపడం లేదు. భారతదేశంలో గత 95 ఏళ్లుగా ఉనికిలో ఉంటున్న ఆరెస్సెస్, బీజేపీ (గతంలో జనసంఘ్‌)లు భావజాలపరంగా, ఆచరణాత్మకంగా కూడా దేశంలోని కోట్లాదిమంది శ్రామికుల జీవితాన్ని మెరుగుపర్చడం గురించి ఆలోచించేవిధంగా ఎన్నడూ శిక్షణ పొందలేదు. ప్రజలను కూడగట్టడం, ఆచరణాత్మక తీర్మానాలు రాయడం, ప్రచార క్రమంలో ప్రసంగించడం అనే ఈ సంస్థల మొత్తం ప్రక్రియ మతపరమైన జాతీయవాదంతోనే సాగింది. వీరి జాతీయవాద కీలకలక్ష్యం ముస్లింలను, క్రైస్తవులను వ్యతిరేకించడమే.

వారు గొప్పగా చర్చకు పెట్టిన సాంస్కృతిక జాతీయవాదం కూడా దేశంలో ముస్లింలు, క్రైస్తవుల ఉనికిని బలహీనపర్చడం గురించే మాట్లాడింది తప్ప దేశానికి అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న, భవనాలు నిర్మిస్తున్న పేదవారిని బలోపేతం చేయాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. ఎందుకంటే వీరంతా దళితులు, శూద్రులు, ఓబీసీ ఆదివాసీ కుటుంబాలకు సంబంధించినవారే. వీరి జాతీయవాదం పేదవారికి పారిశ్రామికులు, బలిసిన మత గురువులతో సమానస్థాయిని ఇవ్వలేదు. అంతేకాకుండా వీరు ఒక నిర్దిష్టమైన ఆర్థిక జాతీయవాద ఎజెండాను ఎన్నడూ రూపొందించలేదు.

20వ శతాబ్ది మొదట్లో ఆరెస్సెస్‌ ప్రారంభమైనప్పుడు ఆర్థిక జాతీయవాదం అంటే.. ప్రధానంగా వ్యవసాయం, భూ సమస్య, చేతివృత్తులను బలపర్చడం, కుల విభేదాలను పరిష్కరించడం అనే అర్థాలతో ఉండేది. భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ తమ పరిమితుల్లోనే ఈ సమస్యల్లో చాలా వాటిని చర్చించాయి. ఇక అంబేడ్కర్, పెరియార్‌ రామస్వామి నాయకర్‌ వారి సహచరులు మానవ అసమానతలను తగ్గించడంతోపాటు కుల నిర్మూలన సమస్యను కూడా లేవనెత్తారు. కానీ వీరిని ఆరెస్సెస్‌ జాతీయవాదులు శత్రువులుగా భావించారు. ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్తలు ఈ దేశంలోని భూస్వామ్యతత్వంపై, లేక భారత వ్యాపార పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న వడ్డీ పెట్టుబడికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా రాయలేదు. ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు వ్యాపారాన్ని, బడా భూ ఎస్టేట్లను ఎన్నడూ నియంత్రించలేదు. ఉదాహరణకు మహారాష్ట్రలో దేశాయి, సర్దేశాయిలు భూస్వాములు. వీరు బ్రాహ్మణులు. తర్వాతికాలంలో శూద్ర మరాఠాలు భూస్వాములుగా మారడానికి ముందు బ్రాహ్మణులే భూమిపై ఆజమాయిషీ కలిగి ఉండేవారు. చాలా మీడియా రిపోర్టులు ఆత్మనిర్భర్‌ పథకం కూడా ఆరెస్సెస్‌ ఆర్థిక సిద్ధాంతకర్త దత్తోపంత్‌ తెంగడి (స్వదేశీ జాగరణ్‌ మంచ్‌) రూపొందించిన స్వదేశీ ఎజెండాలో భాగమేనని సూచిస్తున్నాయి. ఇక 1993లో ‘హిందూ ఎకనమిక్స్‌ ఎటర్నల్‌ ఎకనమిక్‌ ఆర్డర్‌’ అనే పుస్తకం రాసిన హిందుత్వ ఆర్థికవేత్త డాక్టర్‌ ఎంజీ బొకారే కూడా ఈ ఎజెండా రూపకర్తల్లో ఒకరని తెలుస్తోంది.

పైగా ఆరెస్సెస్, బీజేపీలు భారత ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాల్లో ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన సూత్రబద్ధతను కలిగి ఉన్నాయా అనేది ప్రాథమిక ప్రశ్న. వీరికి ఉత్పత్తి, పంపిణీపై ఏదైనా సానుకూల సిద్ధాంతం కూడా ఉన్నట్లు రికార్డులేదు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ అనంతర ప్రైవేటీకరణ దేశ కార్మికశక్తిని మరింతగా మృత్యుశయ్యలోకి నెట్టేస్తుందని చెప్పాలి. హిందుత్వ శక్తుల దృష్టి ఎప్పుడూ మతం, సంస్కృతి చుట్టూనే తిరుగుతూవచ్చింది తప్పితే ఆర్థికంపై లేదు. మహాత్మాగాంధీ తన హింద్‌ స్వరాజ్‌లో ఉపయోగించిన స్వదేశీ భావన గురించి వీరు అస్పష్టంగా మాట్లాడుతుంటారు. భారతదేశంలో పారిశ్రామికీకరణను గాంధీ వ్యతిరేకించడమే కాకుండా వికేంద్రీకరించిన గ్రామీణ ఆర్థిక నమూనాను సమర్థించారు. చర్కా తన ఆర్థిక నమూనాకు సంకేతం. కానీ నెహ్రూవియన్‌ సిద్ధాంతకర్తలు, కమ్యూనిస్టులు మాత్రం తొలి నుంచి పారిశ్రామికీకరణ, పట్టణీకరణను బలపర్చేవారు. ఇక హిందుత్వ సిద్ధాంతకర్త దత్తోపంత్‌ ప్రతిపాదిస్తున్న ’మూడో మార్గం’కి ఏ దారీ తెన్నూ ఉన్నట్లు లేదు.

కాబట్టి ఒక స్పష్టమైన ఆర్థిక మార్గం అంటూ లేని ఆరెస్సెస్, బీజేపీల ఆత్మనిర్భర భారత్‌ స్వరూపం ఎలా ఉండబోతోంది? ఇంతవరకు కేంద్రంలో 11 సంవత్సరాలు పాలించిన ఆరెస్సెస్, బీజేపీలు అంతి మంగా కాంగ్రెస్‌ అభివృద్ధి నమూనానే పాటిస్తూ వచ్చాయి. కాంగ్రెస్‌కు భూస్వామ్య భూసంస్కరణ వ్యతిరేక ఎజెండా ఉండేది. కానీ భూసంస్కరణపై ఎలాంటి చర్చనూ ఆరెస్సెస్, బీజేపీలు అనుమతించవు. ఇప్పుడు భూస్వామ్యవిధానం అంతరించింది. భారత ఆర్థికవ్యవస్థ ఆజమాయిషీలోని పట్టణ వ్యాపార పెట్టుబడిదారీ విధానానికి ఆరెస్సెస్‌ బీజేపీ అనుకూలం. భారత గుత్తపెట్టుబడి అమెరికన్‌–యూరోపియన్‌ పెట్టుబడితో మిలాఖతై ఉంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తిగా అమెరికన్‌ అనుకూల ధోరణితో ఉంది. ఇలాంటి పెద్దన్న, చిన్నన్న సంబంధంలో స్వావలంబనకు చోటెక్కడ?

మరోవైపున లాక్‌డౌన్‌ సంక్షోభకాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ శ్రామిక శక్తి వల్లే దేశం భద్రంగా ఉంది. కోవిడ్‌–19 సంక్షోభ సమయంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంది. అదేసమయంలో ప్రైవేట్‌ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా మూతపడిపోయింది. భారత శ్రామిక వర్గం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యం పొందే పరిస్థితుల్లో ఉంటోంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపనలో ప్రభుత్వ వైద్యరంగానికి కేటాయించిన వాటా లెక్కలోకి కూడా రాదు. దీన్నంతా చూస్తుంటే వలస కార్మికుల మరణాలను ఫణంగా పెట్టి హృదయంలేని హిందుత్వ ఆత్మ మరింత డబ్బుకోసం వెంపర్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

వ్యాసకర్త : ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌, డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా