ఇంటర్‌ రద్దే ‘కార్పొరేట్‌’ జబ్బుకు మందు

2 May, 2019 00:44 IST|Sakshi

అభిప్రాయం

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల చీడను మూలం వరకు పెకిలించాలంటే ప్రభుత్వాలు తక్షణం ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థను రద్దు చేయాలి. ప్రతి హైస్కూల్లోనూ 11, 12 తరగతులను తప్పనిసరిగా బోధించాలి. రాజకీయ పార్టీలన్నింటిపై ప్రభావం చూపగల బలమైన వ్యవస్థను ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థల లాబీలు నెలకొల్పుకున్నాయి. ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్నీ, ఇంటర్‌ విద్యను రద్దు చేయడాన్నీ సుతరామూ అనుమతించవు. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కఠిన వైఖరి అవలంబించి హైస్కూల్స్‌లోనే విద్యార్థులు 12వ తరగతిని పూర్తిచేసుకునేలా చేయగలిగితే నూతన సమాజం రూపుదిద్దుకుంటుంది.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల బోర్డు్డ భారీ సంక్షోభాన్ని సృష్టించింది. దీని బారినపడి ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా పలువురు విద్యార్థులు తీవ్రమైన నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. ఈ పెనుసమస్యకు పరిష్కారం.. పరీక్షాపత్రాల్లోని మార్కులను తిరిగి లెక్కించడంతో కానీ, పరీక్షా పత్రాల పునర్మూల్యాంకనం చేయడంతో కానీ లభించదు. ప్రస్తుత సమస్య మరింత విస్తృతస్థాయిలో ఉంది. విద్యాపాలనా వ్యవస్థలపై అజమాయిషీ చేస్తున్న ప్రైవేట్‌ కాలేజీ నెట్‌వర్క్‌లో ఈ సమస్యకు మూలం దాగి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన గుత్తాధికార స్వభావం కలిగిన రెండు కార్పొరేట్‌ ప్రైవేట్‌ విద్యా సంస్థలు అత్యంత కీలకమైన మన విద్యావ్యవస్థను ధ్వంసం చేసిపడేశాయి. పైగా అవి ఇప్పుడు కాన్సెప్ట్‌ స్కూల్స్‌ పేరిట పాఠశాల విద్యా వ్యవస్థలోకి జొరబడ్డాయి.

ఈ ప్రైవేట్‌ విద్యా సంస్థలు ప్రధానంగా నాలుగు  అంశాలను చేపట్టాయి. 1) ఇవి రెండు రాష్ట్రాల్లో జూనియర్‌ కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లను నెలకొల్పాయి. 2) భారీ పెట్టుబడులతో ప్రకటనలు గుప్పించడం ద్వారా ఇవి రెండు రాష్ట్రాల కుటుంబ వ్యవస్థను (గిరిజన ప్రాంతాల వరకు కూడా) ప్రైవేట్‌ విద్యా సంస్థల్లోనే చక్కటి విద్య లభ్యమవుతుందని నమ్మేలా చేశాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా ఈ కార్పొరేట్‌ విద్యా సంస్థలు గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి లక్షలాదిమంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. కొన్ని డజన్లమంది విద్యార్థులకు పెయిడ్‌ ర్యాంకులను ప్రకటించడమే కాకుండా పరీక్షా ఫలితాలు ప్రకటించిన వెంటనే మీడియా నెట్‌వర్క్‌లలో భారీ స్థాయి ప్రకటనలు గుప్పిస్తూ తల్లిదండ్రులు, పిల్లల మనస్సులపై భారీ యుద్ధానికి తలపెడుతున్నాయి.

3) దీనివల్ల రెసిడెన్షియల్, డే స్కాలర్‌ ప్రైవేట్‌ ఇంటర్మీడియట్, కోచింగ్‌ సెంటర్లలో భారీ ఎత్తున విద్యార్థులు చేరిపోతున్నారు. పైగా కార్పొరేట్‌ విద్యాసంస్థలు విస్తృత స్థాయిలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. అధ్యయనానికి బదులుగా నిద్రపోనీయకుండా వల్లెవేయించడం, తరుణ వయస్సులో ఎలాంటి వినోదాల్లో పాలుపంచుకోనీయకుండా చేస్తూ ఈ విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక స్థితిని ధ్వంసం చేస్తున్నాయి. సృజనాత్మకతలేని ఈ హింసాత్మక విద్యావంచన కోసం ఇవి కుటుంబాల ఆర్థిక వ్యవస్థనే కూల్చివేస్తున్నాయి.

4) ముఖ్యంగా కార్పొరేట్‌ విద్యాసంస్థలు భారీస్థాయిలో రాష్ట్రాల ప్రభుత్వాలపై అజమాయిషీ చలాయించడానికి వచ్చాయి. నారాయణ విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్ట సంప్రదాయానికి తెర తీశారు. ఇప్పుడీయన రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతి పెద్ద ఇంటర్మీడియట్‌ విద్యా కుంభకోణాల కర్తల్లో అగ్రగణ్యుడిగా ఉంటున్నారు. నారాయణ కొల్లగొట్టిన ధనసంపదను చూసి చంద్రబాబు ఆయనకు మంత్రిపదవినిచ్చారు. అలాగే హైదరాబాద్‌లో ఉండే ప్రముఖ విద్యాసంస్థల అధిపతిని కూడా చంద్రబాబు పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీని చేశారు. ఇప్పుడీయన కేసీఆర్‌ పార్టీలో చేరిపోవడమే కాకుండా మంత్రిపదవి కూడా కొట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రైవేట్‌ స్కూళ్లు, ఇంటర్, డిగ్రీకాలేజీ యాజమాన్యాలు వాస్తవానికి అక్రమంగా ఆర్జించిన సంపదతో రాష్ట్రాలను నడుపుతున్నాయి.

నా ఉద్దేశం ప్రకారం, ప్రైవేట్‌ స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ ఎడ్యుకేషన్‌ నుంచి ప్రైవేట్‌ డీమ్డ్‌ యూనివర్సిటీల వరకు అన్నీ అనైతికమైన, అవినీతికరమైన, నాసిరకం విద్యా కుంభకోణాలకు పాల్పడుతున్నాయి. అయితే ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థ ద్వారానే అతిపెద్ద నష్టం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ చీడ మూలాన్ని పెకిలించాలంటే తక్షణం ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థను రద్దు చేసి పడేయాలి. ప్రతి హైస్కూల్లోనూ 11, 12 తరగతులను తప్పనిసరిగా బోధించాలి. పదవ తరగతిలో కఠినమైన ఇంటర్నల్‌ పరీక్షను నిర్వహిస్తూ 12వ తరగతిలో మాత్రమే టెర్మినల్‌ బోర్డు పరీక్షను నిర్వహించాలి. ఈ నూతన వ్యవస్థలో 12వ తరగతి వరకు తెలుగు భాషా సబ్జెక్టును కలిగి ఉంటూనే చక్కటి ఇంగ్లిష్‌ మీడియంని బలోపేతం చేసినట్లయితే గ్రామీణ స్థాయి పాఠశాలల ప్రమాణాలు మెరుగుపడతాయి. దీనివల్ల ప్లస్‌ 2 లెవల్‌ విద్యపై తల్లితండ్రులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక రెండో అంశం ఏదంటే, తమ పిల్లలను గ్రామాల నుంచి సుదూరంలో ఉండే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలకు పంపించడాన్ని పరిత్యజించాలి.

ఇంటర్మీడియట్‌ స్థాయిలో తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని రెండో సబ్జెక్టుగా అనుమతించడం అనేది మార్కుల నిర్వహణా యంత్రాంగంగా మారిపోయింది. ఈ విధానంలో ఏ విద్యార్థి కూడా నిజమైన సంస్కృతాన్ని నేర్చుకోవడం లేదు. అందుకే సంస్కృతాన్ని తొలగించి తెలుగును తప్పనిసరి సబ్జెక్టును చేయాలి. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాల సంక్షోభం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న 10+2 విద్యా విధానాన్ని ఎస్‌బీఎస్‌ఈ నమూనాలో ఉండే 1 నుంచి 12వ స్కూల్‌ లెవల్‌ లోకి మార్చాలని తలుస్తున్నట్లు సమాచారం. ఇది నిజంగా అందరూ ఆహ్వానించదగిన అంశం. కానీ ఈ మార్పును కూడా ఇంటర్మీడియట్, ప్రైవేట్‌ స్కూల్‌ లాబీలు ప్రతిఘటించే ప్రమాదం ఉంది. అందుకే ప్రైవేట్‌ విద్యా లాబీల ఒత్తిడికి తలొగ్గకుండా దీనిని చేపట్టాల్సి ఉంటుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం కూడా ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థను తక్షణం రద్దు చేయాలి. అయితే రాజకీయ పార్టీలన్నింటిపైనా అజమాయిషీ చేయగల బలమైన వ్యవస్థను ప్రైవేట్‌ ఇంటర్మీడియట్, కోచింగ్‌ సంస్థల లాబీలు నెలకొల్పుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే ఆశ లేశమాత్రంగా లేని కమ్యూనిస్టుపార్టీలతో సహా ఏ రాజకీయపార్టీనీ ప్రైవేట్‌ విద్యా సంస్థల లాబీలు వదిలిపెట్టడం లేదు. అన్నిరకాల రాజకీయ భావజాలాలకు చెందిన జూనియర్, స్కూల్‌ టీచర్‌ నాయకులు సైతం ప్రైవేట్‌ స్కూల్స్, జూనియర్‌ కాలేజీలు, భారీస్థాయిలో డబ్బు దండుకుంటున్న కోచింగ్‌ సెంటర్లను నెలకొల్పడంలో మునిగి తేలుతున్నారు. ఇక నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో, కోచింగ్‌ సెంటర్లలో పాఠాలు చెబుతున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ టీచర్లు, ఇతర టీచర్లు కూడా తమ డబ్బును, తమ ఆర్థిక, సంస్థాగత శక్తిని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేవారు కూడా తప్పకుండా జరగాల్సిన ఈ మార్పునుంచి తప్పించుకోలేరని వీరికి తెలుసు.

విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తే ఎన్నికల వ్యవస్థలోకి చొప్పిస్తున్న భారీ మొత్తంలోని డబ్బును అది తగ్గిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తున్నాయి. ఇదంతా అమాయకులైన విద్యార్థుల తల్లిదండ్రులనుంచి లూటీ చేసిన డబ్బే. అందుకే రాజకీయ పార్టీలకు, ప్రైవేట్‌ విద్యా సంస్థలకు మధ్య ఉన్న అపవిత్ర సంబంధాన్ని బద్దలు చేయాల్సి ఉంది. అయితే విద్యా విధానంలో మార్పును ఇవి అంత సులభంగా అనుమతించవు. విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలు తప్ప కుండా వీరిపై ఒత్తిడి తీసుకురావాలి. తెలంగాణలో దీనికి సంబంధించిన ఉద్యమం ప్రారంభమైతే అది ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేగం పుంజు కుంటుంది. అధికారంతో ముడిపడి ఉన్న ఈ పవర్‌ బ్రోకర్లు ఇంతకుముందు కేసీఆర్‌నే లొంగదీసుకున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యావ్యవస్థలో కేజీ టు పీజీ ప్రవేశపెడతామని కేసీఆర్‌ గతంలో పదే పదే మాట్లాడారు. ఆ తర్వాత అందరికీ ఉచిత విద్యను అందించే ఈ కేజీ టు పీజీ గురించి మాట్లాడటమే ఆయన మానేశారు. ఈ ప్రైవేట్‌ శక్తులే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. పాఠశాల, జూని యర్‌ కళాశాల టీచర్ల నాయకులు పలువురు ప్రైవేట్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ విద్యా వ్యవస్థను రద్దు చేయడాన్ని, దాన్ని ప్రభుత్వ స్కూల్‌ వ్యవస్థలో విలీనం చేయడాన్ని జూనియర్‌ లెక్చరర్‌ సంఘాలు వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే హైస్కూల్‌లో పాఠాలు చెప్పడం తమ పని కాదని ఇవి వాదించవచ్చు. జూనియర్‌ కాలేజీల్లాగా కాకుండా పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా వ్యాపించాయి. లోతట్టు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు పాఠాలు బోధించకపోవచ్చని ఈ సంఘాలు వాదించవచ్చు.

ఇలాంటి వాదనలు చేసేవారితో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. జూనియర్‌ కాలేజీ గ్రేడ్‌ టీచర్లు ఆన్‌ రోల్స్‌లో ఉన్నంతవరకు పాఠశాలల్లోని 11, 12 తరగతులకు బోధించాల్సి ఉంటుంది. కానీ వీరిని ఎక్కడైనా నియమించవచ్చు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తాము తెలుగు మీడియంలో బోధించడానికే నియమితులమయ్యామని పాఠశాల ఉపాధ్యాయులు వాదించారు. కానీ ఇలాంటి బోధనా వ్యతిరేక శక్తులతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చివరగా... ఇంటర్మీడియట్‌ రద్దు అనేది మన విద్యావ్యవస్థలో కొత్త మలుపును తీసుకొస్తుంది. భారతదేశంలోని పాఠశాల విద్యావ్యవస్థ మొత్తాన్ని ఈ చట్రం కిందికి తీసుకురావాలి. ఇంతవరకు సీబీఎస్‌ఈ మోడల్‌ ఉత్తమమైనదిగా ఉంటోంది. ప్రతి గ్రామీణ విద్యార్థి గ్రామీణ పాఠశాలలోనే 12వ తరగతిని పూర్తి చేసుకున్నట్లయితే నూతన సమాజం రూపుదిద్దుకుంటుంది.

కంచ ఐలయ్య షెఫర్డ్‌
వ్యాసకర్త రాజకీయ సిద్ధాంతవేత్త, సామాజిక కార్యకర్త,
రచయిత ‘ ఈ–మెయిల్‌ : kanchailaiah1952@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా