కరోనా నేర్పుతున్న కొత్త పాఠం

15 Apr, 2020 00:50 IST|Sakshi

విశ్లేషణ

పెట్టుబడిదారీ విధానంలో డబ్బే డబ్బును సృష్టిస్తుంది. లాభాలనిస్తూ ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి దోహదపడుతుంది. జీవితాలను కాపాడాల్సిన ఆసుపత్రులు డబ్బు సృష్టించే యంత్రాలుగా మారాక, కరోనా వచ్చి కొత్త పాఠాలు చెబుతోంది. ఇది ప్రస్తుతం ఒక ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం కూడా దీనికి సాటిరాదు. కరోనా అనంతరం ఈ భూగ్రహంపై జీవితం గురించి చాలామంది ఆలోచనల్లో మార్పు వస్తుంది. కారల్‌ మార్క్స్‌ చెప్పిన సోషలిస్ట్‌ విధానాలను అనుసరిస్తూ పేద, ధనిక భేదం లేకుండా కలిసిమెలిసి జీవించాలి. భవిష్యత్‌లో మానవ జీవితం గురించి ప్రతి దేశం ఆలోచించాలి. అవసరమైనప్పుడు ప్రతి మనిషికీ ప్రాణవాయువును అందించగలిగే ఆరోగ్య సంరక్షణ కల్పించాలి.

ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’లో హీరో తల్లి పాడినపాట ఇది. ‘‘నిన్నయితే కన్నాను నేను/ నీ రాతలు కనుగొనలేను/ఏ తీరం నీ కథ చేరేను/గర్వంగా ఉన్నా గానీ/ కన్నా నా భయం నాది /ఎంతైనా కన్న కడుపు ఇది’’.శత్రువుల చేతిలో జార్జిరెడ్డి హత్యకు గురవడానికి కాస్త ముందుగా ఆయన తల్లి పడిన వేదన లాంటి బాధనే అమెరికాలో, యూరప్‌లో ఉంటున్న ఎందరో కుమారులు, కుమార్తెల తల్లులు ప్రస్తుతం అనుభవిస్తున్నారు. ఆ దేశాల్లో నివసిస్తున్న తమ బిడ్డల పాలిట శత్రువుగా ప్రాణాంతక కరోనా ఈ తల్లులందరికీ ఇప్పుడు కనిపిస్తోంది.  బిడ్డల్ని కన్న కడుపు కాబట్టి వారి భద్రత ప్రతి తల్లినీ ఇప్పుడు వెంటాడుతోంది. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక తల్లి కూతురు తన భర్త, ఇద్దరు పిల్లలతో అమెరికాలో నివసిస్తోంది. అలాగే ఆమె కుమారులిద్దరూ, వారి కుటుంబాలు ఇంగ్లండులో నివసిస్తున్నారు. ఆమె కూడా ఇప్పుడు ఇదే భయాలతో గడుపుతోంది. ఆమెకు ఇప్పుడు 60 ఏళ్లు. 70 ఏళ్ల వయసున్న ఆమె భర్త దీర్ఘకాలిక గుండెరోగిగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అమెరికా, ఇంగ్లండ్‌ గురించిన వార్తలు వచ్చినప్పుడల్లా ఆమె తెలుగు టీవీ చానల్స్‌ను అంటిపెట్టుకుని కూర్చుంటోంది. ఇంగ్లండ్‌ కంటే అమెరికాలో పరిస్థితి ఆమెను మరింతగా హడలెత్తిస్తోంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టీవీల్లో కనిపించినప్పుడల్లా ఆమె పెద్దగా అరుస్తూ, ‘ఇతగాడికి డబ్బునుంచి డబ్బు సృష్టించడం మాత్రమే తెలుసుకానీ తన ప్రజలను మాత్రం కాపాడలేడు. ఒబామా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ప్రజలు క్షేమంగా ఉండేవారు’’ అని వ్యాఖ్యానిస్తుంది. డబ్బునుంచి డబ్బును సంపాదించేవారు కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడలేరు అని ఆమె చేసిన ప్రకటన.. ట్రంప్‌ వంటి పెట్టుబడిదారులు, వ్యాపారులు, కరోనా వైరస్‌పై పోరాటంలో వారి ఉద్దేశంపై, వారి సామర్థ్యాన్ని శంకిస్తూ చేసిన ప్రకటనగానే చూడాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రంప్‌ అమెరికా మాత్రమే కాదు.. పెట్టుబడిదారీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మొత్తంగా తన జీవితకాలంలో ఎన్నడూ ఎరుగనంతటి పెను సంక్షోభాన్ని ఇప్పుడు కరోనా వైరస్‌ రూపంలో ఎదుర్కొంటోంది.

కరోనా వైరస్‌ అర్ధ–సోషలిస్టు చైనాలోని పెట్టుబడిదారీ జంతు మాంసపు మార్కెట్‌ లోంచి పుట్టుకొచ్చింది. కానీ అతితక్కువ కాలంలో ఆ వైరస్‌ పెట్టుబడిదారీ విమానాల ద్వారా ప్రయాణించి నేడు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ విస్తరించింది. సోషలిస్టు దేశాలయితే ఒక సంఘటిత రాజ్య వ్యవస్థతో, సామాజీకరించిన ఆరోగ్య సంరక్షణతో, ఆసుపత్రుల దన్నుతో వైరస్‌పై పోరాడుతుండగా, ప్రపంచంలోనే అత్యంత గరిష్ట స్థాయిలో ప్రైవేట్‌ పరమైన పెట్టుబడిదారీ దేశాలు ఈ కనిపించని శత్రువు చేసిన దాడిని తట్టుకోలేక కుప్పకూలి పోయాయి. అమెరికా, స్పెయిన్, ఇటలీలు యావత్ప్రపంచంలోనే అత్యంత గరిష్టంగా ప్రయివేట్‌పరం చేయబడిన ఆరోగ్య వ్యవస్థలకు నెలవుగా ఉన్నాయి. ఇవి మాత్రమే నేడు ఘోరంగా దెబ్బతింటున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కేర్‌ని ఛిన్నాభిన్నం చేసిన ట్రంప్‌ అమెరికాలోని మొత్తం ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ని ప్రైవేట్‌ కంపెనీల పరం చేసేశాడు. ఇవి కరోనా తరహా వ్యాధులను స్వీకరించవు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఆవరించిన తరుణంలో  ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు వ్యక్తిగతంగా ఒక్కొక్క రోగి డిమాండ్లను గాలికొదిలేశాయి. ఒక్క బ్రిటన్‌ మాత్రమే మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా లాక్‌ డౌన్‌ కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన వారిలో 80 శాతం మంది వేతనాలను చెల్లిస్తానని బ్రిటన్‌ హామీ ఇచ్చింది. ఇది మినహా ఏ పెట్టుబడిదారీ దేశమూ బ్రిటన్‌లాగా సాహసం చేయలేదు.

మెల్లమెల్లగా మనుషుల ప్రాణాలు హరించే వ్యాధులతో బాధపడేవారికి చికిత్స చేస్తూ రోగుల నుంచి వ్యక్తిగతంగా రోగుల నుండి డబ్బు గుంజుతూ ఆ లాభాల మీదే పెట్టుబడిదారీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మనుగడ సాగిస్తుంటాయి. వీటి నైపుణ్యం, సాంకేతిక సామర్థ్యం శంకించడానికి వీల్లేనివి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను కరోనా వైరస్‌ కంపింపజేస్తున్న నేపథ్యంలో ఈ ప్రైవేట్‌ ఆసుపత్రుల వ్యాపారానికి ఇప్పుడు గండిపడింది. పెట్టుబడిదారీ, సోషలిస్టు దేశాలు, నిరంకుశ ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్‌ బాధితులను పరీక్షించి, చికిత్స చేసే బాధ్యతను చేపట్టాయి. అయితే కొన్ని దేశాల్లో మినహాయిస్తే ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా పేలవంగా ఉంటోంది లేక అసలు ఉనికిలో కూడా ఉండటం లేదు. అమెరికా వంటి దేశంలో అత్యున్నతమైన వైద్య సామగ్రి, మంచి డాక్టర్లు ప్రైవేట్‌ రంగంలోనే అందుబాటులో ఉంటున్నారు. ఒబామా కేర్‌ కూడా ప్రభుత్వ వ్యయంతో ప్రైవేట్‌ రంగంలోని పేదలకు అందుబాటులో ఉండేలా ఆధునిక ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ బీమా రంగాన్ని ట్రంప్‌ కుప్పగూల్చేశాడు.

ఇకపోతే 130 కోట్ల పైబడి జనాభా కలిగిన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అగాధంలో ఉందనే చెప్పాలి. భారత్‌లో మొదటి దశలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ తర్వాత్తర్వాత ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్లడానికి ప్రభుత్వం తలుపులు తెరిచేసింది. 1990లో ప్రతిరంగంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ మొదలైన తర్వాత భారత్‌లో యూరప్‌–అమెరికా తరహా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పర్చాలనే ఆకాంక్షతో ప్రైవేట్‌ ఆసుపత్రులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ వచ్చారు. దీంతో జనాభాలోని 55 శాతం మంది పేదలు, అసంఘటితరంగ కార్మికులకు ఇప్పడు ఊపిరి ఆడటం లేదు. కరోనా నేపథ్యంలో పేద, ధనిక తేడాలేకుండా భారతీయులందరికీ ఇప్పుడు స్వచ్ఛమైన ప్రాణవాయువు తప్పనిసరి అవసరం. అఖిల భారత వైద్య శాస్త్ర సంస్థలతో కూడి నిర్వహణ పేలవంగా ఉంటున్న ప్రభుత్వ వ్యవస్థ ఒక్కటే ప్రస్తుత సంక్షోభంపై తలపడుతోంది. మరోవైపున లాక్‌ డౌన్‌ సమయంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు మూతబడి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు.

కేరళలో ప్రజాస్వామిక సోషలిస్టు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మినహా మరే ప్రాంతంలోనూ గ్రామాలను పట్టణాలకు అనుసంధించిన తరహా గొలుసుకట్టు వ్యవస్థ కనిపించడం లేదు.కరోనాలాంటి మహమ్మారి వ్యాపించిన కాలంలో డాక్టర్లంతా యుద్ధకాలంలో సైనికుల్లాంటి వారు. కానీ, మామూలు సమయాల్లో సొమ్ము చేసుకున్న ప్రైవేట్‌ సెక్టార్‌ లోని డాక్టర్లు, నర్సులు ప్రస్తుతం సాధారణ పౌరుల్లా ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. అందుకే వెంటనే డాక్టర్ల సేవలను జాతీయ అత్యవసర సర్వీసుగా ప్రకటించి, అందరినీ వెంటనే విధుల్లోకి హాజరుకావాల్సిందిగా ఆదేశించాల్సిన అవసరం ఉంది. తక్కువ వేతనం పొందుతున్న ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు ఇబ్బందులు పడుతుంటే ప్రైవేట్‌ డాక్టర్లు ఇంటిపట్టున కూర్చుంటున్నారు. దేశంలోని ప్రజలంతా డాక్టర్ల కోసం చప్పట్లు కొట్టారంటే, ఆ చప్పట్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లకేగానీ, ఇంట్లో కూర్చున్నవారి కోసం కాదు. భారత సైన్యం, పోలీసుల్లాగే డాక్టర్లు కూడా జాతీయ విధుల్లో పాలుపంచుకోమని చెప్పడానికి మనదేశంలో వీల్లేదు. 

పెట్టుబడిదారీ వైద్య విధానం క్యూబాలోవలే సోషలిస్టు వైద్య విధానంగా మారకపోయినా, కనీసం ఇటువంటి సమయాల్లో దేశీయ వైద్య విధానంగా మారాలి. పెట్టుబడిదారీ విధానం లాభాలనిస్తూ ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి దోహదపడుతుంది. పెట్టుబడిదారీ విధానంలో డబ్బే డబ్బును సృష్టిస్తుంది. జీవితాలను కాపాడాల్సిన ఆసుపత్రులు డబ్బు సృష్టించే యంత్రాలుగా మారాక, కరోనా వచ్చి కొత్త పాఠాలు చెబుతోంది. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, స్థిరపడటం కోసం తమ పిల్లలను అమెరికా పంపాలనుకునే తల్లిదండ్రులకు కరోనా పీడకలగా మారింది. ఇది ప్రస్తుతం ఒక ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం కూడా దీనికి సాటిరాదు. కరోనా అనంతరం ఈ భూగ్రహంపై జీవితం గురించి చాలామంది ఆలోచనల్లో మార్పు వస్తుంది. కారల్‌ మార్క్స్‌ చెప్పిన సోషలిస్ట్‌ విధానాలను అనుసరిస్తూ పేద, ధనిక భేదం లేకుండా కలిసిమెలిసి జీవించాలి. భవిష్యత్‌లో మానవ జీవితం గురించి ప్రతి దేశం ఆలోచించాలి. అవసరమైనప్పుడు ప్రతి మనిషికీ ప్రాణవాయువును అందించగలిగే ఆరోగ్య సంరక్షణ కల్పించాలి.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్‌
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ 

మరిన్ని వార్తలు