ఆ నాటకం ఓ స్వప్న సాఫల్యం

7 Jan, 2018 01:32 IST|Sakshi

ఆదిత్య హృదయం

సినిమా కంటే రంగస్థలం అనేది ప్రజలు, వారి విలువలు, ప్రవృత్తులకు సంబంధించిన ఉత్తమ ప్రతిబింబంగా ఉంటుందని నేను చెబుతాను. ఉదాహరణకు, అవాస్తవాన్ని లేక పలాయనవాద కాల్పనికతను నమ్మింపజేయడం వెండితెర కంటే రంగస్థలం మీద చాలా కష్టం. సినిమాను ముందుగా తీసి చూపించడం కంటే, నాటకాన్ని అప్పటికప్పుడు ప్రదర్శించడం మరింత ఆసక్తిదాయకంగా ఉంటుంది. గత వారం లండన్‌లో నేను చూసిన ఒక సంగీత నాటకమే ఈరోజు మీకు నేను చెప్పబోతున్న ఉదాహరణ.

‘ఎవ్రీబడీ ఈజ్‌ టాకింగ్‌ ఎబౌట్‌ జేమీ’ అనే ఈ నాటకాన్ని బ్రిటన్‌ మధ్యప్రాంత పట్టణం షెఫీల్డ్‌లో రూపొందించారు. ఇది అమ్మాయిలా దుస్తులు ధరించాలనుకునే జేమీ అనే పదహారేళ్ల కుర్రాడి గురించిన కథ. అయితే జేమీ హిజ్రా కాదు. పైగా అతడు గే కావలసిన అవసరం కూడా లేదు. ఆకర్షణీయమైన రాణి కావాలనేది అతడి కల. ఆ కల ఎలా నెరవేరింది, శ్రోతల కోసం అతడు హీరోగా ఎలా పరిణమించాడు అనేదే నాటక ఇతివృత్తం.

మరిన్ని వివరాల్లోకి వెళ్లడానికి ముందు ఈ నాటకం గురించి స్థూలంగా చెప్పనివ్వండి. అ సమయంలోనే అమెరికన్‌ హిప్‌– హాప్‌ సంగీత రూపకం హామిల్టన్‌ బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ ప్రదర్శన టిక్కెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. బ్లాక్‌ మార్కెట్‌లో ఒక టికెట్‌ను వెయ్యి పౌండ్లకు అమ్మినట్లు దళారులు ఘనంగా ప్రకటించారు. వాస్తవం ఏమిటంటే ప్రతి ఒక్కరూ హామిల్టన్‌ రూపకం గురించే మాట్లాడుతున్నారు తప్ప జేమీ గురించి ప్రస్తావించే వారు కూడా లేరు.

లండన్‌లో ఆ రెండింటినీ నేను చూశాను. హామిల్టన్‌ చాలా మంచి ప్రదర్శన అంటే నేను నిరాకరించను. కానీ జేమీ మాత్రం అసాధారణమైంది, అరుదైనది కూడా. అదొక విశిష్ట రూపకం. మొత్తంమీద చెప్పాలంటే హామిల్టన్‌ రూపకం.. చూడటానికి మీరు పెట్టే డబ్బుకు తగిన విలువైనది కాదు. సగటు థియేటర్లలో ఉన్న ధర కంటే ఎక్కువ ధరను పెట్టినప్పటికీ, జేమీ కోసం మీరు పెట్టిన ప్రతి పెన్నీ కూడా విలువైనదే. బ్రిటన్‌ గర్వించదగిన నాటకంగా జేమీ ఎందుకు విశిష్టమైనదో తెలుసుకోవడానికి ఇప్పుడు మళ్లీ వెనక్కు వద్దాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిలాగా దుస్తులు ధరించాలన్న కోరికను వెల్లడిస్తే ప్రపంచంలో ఉన్న పలు సమాజాలలో అది కుటుంబ విషాదంగానూ, జనానికి చికాకును, సంకటస్థితిని కలిగించే ఘటనగాను తయారవుతుంది. అప్పటినుంచి అతడు తెరచాటునే ఉండాల్సి వస్తుంది. తలుపుల వెనుక అతడిని నిర్బంధిస్తారు. పైగా అతడిని ఇక మాట్లాడనివ్వరు.

నిజాయితీగా చెప్పాలంటే, భారత్‌లో అతడితో మనం అలాగే వ్యవహరిస్తాం. కానీ ఈ నాటకం మాత్రం అలా చూపలేదు. అందుకే అది అత్యంత ప్రత్యేకమైన నాటకంగా నిలుస్తోంది. కార్మికవర్గం ప్రధానంగా ఉండే యార్క్‌షైర్‌ సెట్టింగులో, జేమీ ఆకాంక్షను జీవితానికి సంబంధించిన పరమ సంతోషకరమైన సంబరంగా చిత్రించారు. మీకు మీరు నిజాయితీగా ఉండి, మిగిలిన ప్రపంచం ఏం చెబుతుందో లెక్కపెట్టకుండా ఉన్నట్లయితే, ఈ నాటకంలో సగ భాగం ఈ ఆనందకరమైన సంబరాన్నే చూపిస్తుంది. మరొకటి ఇంకా ముఖ్యమైంది. మీరు కోరుకున్నట్లు ఉండాలని మీరు భావిస్తే ప్రపంచం మిమ్మల్ని ఆమోదిస్తుంది, అంతేకాకుండా మిమ్మల్ని గౌరవించడానికి కూడా ముందుకొస్తుంది.

నాటకం కొనసాగిన రెండున్నర గంటల సమయంలో శ్రోతలు జేమీని చూసి, అతడి తల్లి తన కోరికను ప్రోత్సహించి, సమర్థించే తీరును చూసి పగలబడి నవ్వారు, ఏడ్చారు కూడా. జేమీ మారిన వస్త్రధారణను ఆమోదించని అతడి స్కూల్‌ టీచర్‌ తానెంత క్రూరమైన వ్యక్తి అన్నదాన్ని గుర్తించనప్పటికీ, అతడికి మద్దతు పలుకుతూ వచ్చిన తోటి విద్యార్థులు మాత్రం, పెద్దల కంటే పిల్లలే తరచుగా విజ్ఞత కలవారన్న అంశాన్ని శక్తివంతంగా శ్రోతలముందు పెడతారు.

చివరకు మెరిసే దుస్తులతో వాటికి సరిపోలే మహిళలు వాడే స్టిలెట్టో హీల్స్‌తో, ఒక బ్లాండ్‌ విగ్‌తో, మేకప్‌తో జేమీ పాఠశాలకు వచ్చినప్పుడు ఈ నాటకం తనదైన సుందర క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. జేమీ మైమరపించే అమ్మాయిని తలపించడంలో సందేహం లేదు కానీ, ఆ క్షణంలో మీరు తిలకించే అసలు మ్యాజిక్‌ ఏమిటంటే, మానవ స్వప్న సాఫల్యానికి చెందిన నిసర్గ సౌందర్యమే. అది ఆచార సంప్రదాయాలను తోసిపుచ్చినప్పటికీ, జేమ్స్‌ స్నేహితులు, ఇరుగు పొరుగువారు జేమీ నూతన వస్త్ర ధారణను పూర్తిగా ఆమోదిస్తారు. పరమలోభి అయిన అతడి తండ్రి మాత్రమే వీళ్లందరికీ దూరం జరుగుతాడు.

నాటకం ముగియగానే శ్రోతలు సుదీర్ఘ కరతాళధ్వనులతో అభినందనల్లో ముంచెత్తారు. తర్వాత వెంటనే అందరూ లేచి నిలబడి మరీ ఆ నాటకాన్ని గౌరవించారు. జేమీ తండ్రిని ఛీకొట్టారు. కాబట్టి, మీరు ఈ సంవత్సరం లండన్‌ సందర్శించాలని అనుకుంటే.. అడుక్కుని, అరువు తీసుకుని, టిక్కెట్‌ దొంగిలించి అయినా సరే.. జేమీ నాటకం తప్పక చూడండి. ఇలాంటి నాట కాన్ని మీరు భారత్‌లో ఎన్నటికీ చూడలేరు. నిజం చెప్పాలంటే, ఇలాంటి నాటకాన్ని, ప్రదర్శనను మీ జీవితంలో మరెన్నడూ చూడలేరు కూడా.

కొస మెరుపు : బ్రిటన్‌ సంగీత రూపకాల చరిత్రలో ‘ఎవ్రీబడీ ఈజ్‌ టాకింగ్‌ ఎబౌట్‌ జేమీ’ కొత్త ట్రెండ్‌ సృష్టించింది. 2017లో తొలిసారిగా ప్రదర్శితమైన ఈ సంగీత నాటకం సుప్రసిద్ధ పత్రికల ప్రశంసలను పొందుతోంది. బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ పట్టణంలో, ఒక కౌన్సిల్‌ ఎస్టేట్‌లో నివసించే 16 ఏళ్ల కుర్రాడు జేమ్స్‌ పాత్ర మనిషి ఆకాంక్షలను సఫలం చేసుకునే కృషిని ఈ సంగీత రూపకంలో అత్యద్భుతంగా ప్రదర్శించింది. భవిష్యత్తు గురించి భయకంపితుడైన జేమ్స్‌ ప్రేమమూర్తి అయిన తన తల్లి, స్నేహాన్ని పంచే మిత్రుల దన్నుతో తనలోని దురభిప్రాయాలను అధిగమించి, అంధకారం నుంచి బయటపడటమే కాకుండా ప్రపంచం చూసి ఉండని ఒక సంచలనాత్మక ఘటనను ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు.

చివరిక్షణంలో కూడా అనుకున్నది సాధించవచ్చని, మీరు కనే చిన్న చిన్న కలలను కూడా సాకారం చేసుకుని సమాజ ఆమోదం పొందవచ్చని ఒక సున్నితమైన అంశం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ఈ నాటకం పండితులను, పామరులను, విమర్శకులను కూడా ఏకమొత్తంగా ఆకర్షించి తిరుగులేని ప్రాచుర్యం పొందుతోంది. 2017 ఫిబ్రవరి 13న షెఫీల్డ్‌ లోని క్రుసిబుల్‌ థియేటర్‌లో ప్రదర్శన ప్రారంభమైన ఈ సంగీత రూపకం బ్రిటన్‌లోని పలు ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా ప్రదర్శితమవుతూనే ఉంది.


కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net

మరిన్ని వార్తలు