నూతన పద సృష్టికి స్వాగతం

31 Dec, 2017 01:22 IST|Sakshi

ఆదిత్య హృదయం

నేడు 2017 సంవత్సరం ముగింపు దినం. ఈ సంవత్సరం గడిచిపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రపంచ ప్రముఖులు తమ అంతిమ క్షణాల్లో ఉపయోగించిన మాటలను లేదా పదాలను కాస్త పరిశీలించాను. ఎలాంటి కాంతి లేకుండానే అంధకారపు సొరంగంలోకి తొంగి చూసేందుకు అవసరమైన గొప్ప సామర్థ్యాన్ని అవి ప్రతి బింబించాయి.

‘‘స్కాచ్‌ నుంచి మార్టిని (ఒకరకమైన మద్యం)కి నేను ఎన్నడూ మారకుండా ఉండాల్సింది’’ అని అమెరికన్‌ దిగ్గజ నటుడు హంప్రే బొగర్ట్‌ తన అంతిమ క్షణాల్లో అన్నాడు. ఇక వెస్పాసియన్‌ చక్రవర్తి దీన్నే మరొక విధంగా చెప్పాడు. ‘‘డియర్, నేను దేవుడిని అవుతున్నట్లు భావిస్తున్నాను’’. గ్రూచో మార్క్స్‌ తనదైన శైలిలో చెప్పిన మాట అలక్ష్యంతో కూడిన సరదాను కలి గిస్తుంది. ‘‘మరణించు ప్రియతమా? ఎందుకు అంటే, నేను చేయగలిగిన చివరి పని అదే‘‘. ఇక ఫ్రెంచ్‌ చక్రవర్తి పదహారో లూయిస్‌ రాణి మేడమ్‌ డె పోంపడార్‌ అంతిమ క్షణాల్లో చెప్పిన మాట ఆమె డాక్టర్‌ను వణికించింది. ‘‘ఒక్క క్షణం మాన్సియెర్‌ లే డాక్టర్, మనం కలిసే వెళదాం’’. ఇక మీరు ఆయన మాటల్ని నమ్మేటట్లయితే, విన్‌స్టన్‌ చర్చిల్‌ మరణాన్ని చాలా తేలిగ్గా తీసుకుని ‘‘దాంతో నేను పూర్తిగా విసుగెత్తిపోయాను’’ అన్నాడు.

2017 సంవత్సరానికి సంబంధించిన ఆహ్లాదకరమైన క్షణాల్లో ఒకటి కొత్తపదాలు కనిపెట్టడమే. ఈ కొత్త పదాలు పెద్దగా కష్టపడనవసరం లేకుండానే తమ అర్థాన్ని వ్యక్తం చేస్తాయి. వీటిలో కొన్నింటిని నేను తప్పకుండా వచ్చే సంవత్సరం ఉపయోగిస్తాను. ఉదాహరణకు, పదే పదే తప్పులు చేసే వ్యక్తిని నిత్యం తప్పులు చేసేవాడు ‘ఎర్రరిస్ట్‌’ అంటారు. తరచుగా మీ సలహాను కోరుతూనే సరిగ్గా దానికి వ్యతిరేకంగా చేసే వ్యక్తిని (ఇలాంటి వ్యక్తులు మనకు తెలుసు) ‘ఆస్క్‌హోల్‌’ అంటారు. వ్యర్థమైన, పక్కన పెట్టదగిన సంభాషణను ‘నాన్‌వర్జేషన్‌’ అంటారు. మీరు వాట్సాప్‌ని బాగా ఇష్టపడేవారయినట్లయితే, మీకు ఒక మెసేజ్‌ వచ్చిందని మీ మొబైల్‌ సమాచారం ఇచ్చినప్పుడు మీరు పొందే ఆత్రుతను ఇకనుంచి ‘టెక్స్‌పెక్టేషన్‌’ అని పిలవాలి. ఇక ‘యావతో కూడిన’ (యాంబిచ్యువస్‌) అంటే అర్థం ఏమిటో మనందరికీ తెలుసు. ధనాశ, అధికార కాంక్ష, గుర్తింపు యావ కలిగిన వారికి ఇది వర్తిస్తుంది.

2017లో నేను మరి కొన్ని పదాలు కనుగొన్నాను. నిజానికి వాటికి నిర్దిష్టమైన పేరు లేదనుకుంటాను. ఉదాహరణకు, మీ కనుబొమల మధ్య ఉన్న స్థలాన్ని ‘గ్లబెల్లా’ అని పిలువవచ్చు. వర్షం కురిసిన తర్వాత వచ్చే మట్టివాసనను ‘పెట్రికోర్‌’ అంటారు. నవజాత శిశువు ఏడుపును ‘వగిటూస్‌’ అంటారు. చాంపేన్‌ బాటిల్‌లో కార్క్‌ని పట్టి ఉంచే తీగలతో కూడిన బోనును ‘ఎగ్రాఫీ’ అంటారు. మీరు ఆశ్చర్యార్థకాన్ని ప్రశ్నార్థకంతో కలిపినప్పుడు (?!లాగా) దాన్ని ‘ఇంటెర్రోబ్యాంగ్‌’ అంటున్నారు. నా విషయంలో అయితే వ్యక్తిగతంగా నాకు సంబంధించిన అంశాలు రెండున్నాయి. ఒకటి ‘డైసానియా’. అంటే ఉదయం నిద్రలేవడం కష్టసాధ్యంగా భావిం చడం. రెండోది ‘క్రాప్యులెన్స్‌’. అంటే, మరీ ఎక్కువగా తినడం, తాగటంతో వచ్చే అస్వస్థ అనుభూతి!

ఈ సందర్భంగా నేను తెలుసుకున్న కొన్ని ‘నిజాలు’ మరింత ఆశ్చర్యభరితంగా ఉంటున్నాయి. మానవుడి గుండె రక్తాన్ని 30 అడుగుల ఎత్తుకు పంప్‌ చేసే ఒత్తిడిని సృష్టిస్తుందని, ఒక మిణుగురు తన ఒంటి పరిమాణానికి 350 రెట్లు ఎగురుతుందని, కుడిచేతి వాటం వ్యక్తులు ఎడం చేతి వాటం వ్యక్తుల కన్నా 9 సంవత్సరాలు అధికంగా జీవిస్తారని మీకు తెలుసా? లేక సంతోషం కోసం సెక్సులో పాల్గొనే జీవులు ప్రపంచంలో మనుషులు, డాల్పిన్లు మాత్రమేనని మీకు తెలుసా? ఈ సత్యాలు నిజమే అయినట్లయితే, ఇవి భూమ్మీద ఎలా రుజువయ్యాయి? శాస్త్రజ్ఞులు ఇంకా నిరూపించవలసిన అంశాలు ఉన్నాయా?

చివరగా, వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తన పాఠకులను ఒక పదరూపకల్పన పోటీకి ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో భాగంగా నిఘంటువులోని ఒక పదాన్ని తీసుకుని దానికి ఒక అక్షరాన్ని కలపడం, తీసివేయడం, లేదా మార్చడం ద్వారా ఒక కొత్త అర్థాన్ని సృష్టిం చాలని చెప్పేవారు. సంవత్సరాలుగా వారు ఈ పోటీ నిర్వహిస్తున్నారు. 2017లో కింది అద్భుత పదాల సృష్టి జరిగింది. మాటలు తప్ప చేతలు లేకపోవడం ‘గ్లిబిడో’. మీ బెడ్‌రూంలో దోమ రూపంలోని సైతాను పేరు ‘బ్లేజ్‌బగ్‌’. మీ యాపిల్‌లో పురుగును కనుగొన్నాక మీరు మార్చే రంగు ‘కేటర్‌పాలర్‌’. టాక్స్‌ రిఫండ్‌ను పొందడాన్ని సూచించే పదం ‘ఇన్‌టాక్సికేషన్‌’. ఇల్లు కొనుక్కున్నవారిని బికారులుగా మార్చే చర్య ‘క్యాస్ట్రేషన్‌’. మీరు ఇప్పటికీ నా కథనం చదువుతూ, మరొక కథనంలోకి వెళ్లనట్లయితే లేక పేజీని తిరగేయకుంటే: ‘‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’’.


కరణ్‌ థాపర్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net

మరిన్ని వార్తలు