సైనిక సంప్రదాయాన్ని మార్చిన ‘బీటింగ్‌ రిట్రీట్‌’

4 Feb, 2018 00:29 IST|Sakshi

ఆదిత్య హృదయం

పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం, ఎకనమిక్‌ సర్వే తర్వాత బీటింగ్‌ ద రిట్రీట్‌ (సైనిక సంరంభోత్సవం) గురించి తెలుసుకోవడానికి మీకు సమయం లేకపోతే, మీరు కోల్పోయింది ఏదీ లేదని నేను నొక్కి చెబుతాను. ప్రతి ఏడాదిలాగే ఈసారీ నేను దాన్ని తిలకించటానికి ప్రయత్నించాను కానీ పూర్తిగా అసంతృప్తి, ఆశాభంగం కలిగించింది. పైగా అసహ్యం వేసింది కూడా. బీటింగ్‌ ద రిట్రీట్‌ ఎప్పుడూ నాకు ఇష్టమైన కార్యక్రమంగా ఉంటూ వచ్చింది. ఇది ఏ ప్రమేయం లేకుండానే మనతో డ్యాన్స్‌ చేయించే సంగీతంతో, అత్యంత నిర్దిష్టమైన మార్చింగ్‌తో కూడిన సంరంభోత్సవం. కార్యక్రమం చివర్లో ప్రదర్శించే లేజర్‌ లైటింగ్‌ మిరిమిట్లు గొలుపుతుంది. కాని ఈ అన్ని అంశాల్లోనూ ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఘోరంగా తయారైంది. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపర్చామని భావిస్తున్న వ్యక్తులు నిజానికి దాని హృదయాన్ని తూట్లు పొడిచేశారు.

నా స్నేహితుడు, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో స్ట్రాటెజిక్‌ ఎఫైర్స్‌ ఎడిటర్‌ కల్నల్‌ అజయ్‌ శుక్లా ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోయే ‘ట్వీటింగ్‌ రిట్రీట్‌’ శీర్షికతో తన విచారాన్ని వ్యక్తం చేశారు. ‘సైనిక ఉత్సవానికి వీరేం చేశారో నాకు తెలీదు. డ్రమ్మర్ల డ్యాన్సింగ్, సితార్‌ ప్లేయర్లు, సంగీతం అన్నీ ఉన్నాయి కానీ మిలిటరీకి సంబంధించిన స్పృహ లేకుండా చేశారు. అర్థరహితమైన మార్పులతో ఒక గొప్ప సంప్రదాయాన్ని బలిపెట్టడానికి సైనికాధికారులు ఎలా అనుమతించారో చూస్తుంటే విచారమేస్తుంది!’ 

బాధ్యతారహితమైన మన సైనిక జనరల్స్‌ బీటింగ్‌ ద రిట్రీట్‌ ఒక సంప్రదాయమని, నిరంతర కొనసాగింపే దాని ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయారు. పూర్తిగా పతనమయ్యే స్థాయికి దాన్ని మార్చేశారు. ఈ విశిష్ట సైనిక సంప్రదాయం 1690లో ప్రారంభమైంది. ఇంగ్లండ్‌ చక్రవర్తి జేమ్స్‌–ఐఐ యుద్ధం ముగిసిన రోజు చివరలో సైనిక దళాలు వెనక్కు వచ్చే సందర్భంగా సైనిక వాయిద్యాలను మోగించాలని ఆదేశించాడు. కాబట్టి అది ఒక ముగింపుకు సంబంధించిన సమ్మేళనం. అంతిమ పరిణామానికి అది చిహ్నం. ఇది పూర్తిగా సైనిక సంరంభ కార్యక్రమం.

శతాబ్దాలుగా బీటింగ్‌ ద రిట్రీట్‌ ఒక అత్యద్భుతమైన సంగీతం, అత్యంత నిర్దిష్టంగా సాగే మిలిటరీ డ్రిల్‌కు మారుపేరుగా ఉంటూ వస్తోంది. చక్కటి పొందికతో పాదాలను కదపడమే ఈ మ్యూజికల్‌ మార్చ్‌ విశేషం. విషాదమేమిటంటే, గత సోమవారం ఈ కార్యక్రమాన్ని భారతీయులే కంపోజ్‌ చేసి ఉండవచ్చు కానీ వాళ్లు అసలైన కవాతును మాత్రం చేయించలేదు. రెండు. ఈ కార్యక్రమం కోసం వాడే సంగీత వాయిద్యాలు సాంప్రదాయిక మిలిటరీ బ్యాండ్‌కు సంబంధించినవిగానే ఉండాలి. అందరూ ఇష్టపడే సితారకు ఈసారి వారు చోటు ఇవ్వలేదు. వచ్చే ఏడాదికి వారు షెహనాయ్‌ని పరిచయం చేస్తారా? 

మూడు. బ్యాండ్‌ తప్పకుండా సంగీతానికి అనుగుణంగా మార్చ్‌  చేయాలి లేదా డ్రిల్‌ చేయాలి. సమర్థవంతమైన డ్రమ్మింగ్‌ మెప్పించవచ్చు కానీ దాన్ని సరైన విధంగా మేళనం చేయలేదు. ఇలాంటి సంగీతంతో మీరు మార్చ్‌ చేయలేరు. పైగా జాజ్‌ సంగీ తాన్ని పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నం అయితే మరీ అసంబద్ధంగా కనిపించింది. నేను 1960లు, 70లు, 80ల నాటి బీటింగ్‌ రిట్రీట్స్‌ను గుర్తు తెచ్చుకున్నాను. అవి శ్రోతలకు దిగ్భ్రమ కలిగించేవి. బ్యాండ్లు కూడా మేటి సంగీతంతో అలరించేవి. బాలీ వుడ్‌ అనుకరణలను పక్కనబెడితే సైనిక కవాతు నిజానికి అలాంటి ప్రభావం కలిగిస్తుంది మరి. 

చివరగా, సూర్యుడు దిగంతంలోకి జారుకుంటున్నవేళ, సాయంవేళ దీపకాంతులను ప్రతిబింబించేది. రైసినా హిల్స్‌ విద్యుద్దీపాలతో మెరిసిపోయేది. ప్రతి ఒక్కరూ ఆ క్షణం తీసుకువచ్చే ఆకస్మిక వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. కానీ ఈ సంవత్సరం వారు లైటింగ్‌ కూడా మార్చేశారు. జాతీయ పతాక రంగులను ప్రతిబింబించే లైటింగ్‌లో దిగ్భ్రమ కలిగించే ప్రభావం లేకుండా పోయింది. కొత్త లైటింగ్‌ చీకటిలో మెప్పించవచ్చు కానీ సాయంత్రం ప్రారంభంలో అది కలిగించే ప్రభావం పెద్దగా ఉండదు. మీరు ఊహించే పతాకదశను ప్రదర్శించడంలో అది మిమ్మల్ని వంచిస్తుంది అంతే. కాని ‘అబైడ్‌ విత్‌ మి’, ‘సారే జహాసె అచ్ఛా’ గీతాలాపనతో వారు కాస్త దయ చూపినందుకు నేను కృతజ్ఞుడిని. వీటిని కూడా వారు ఉపసంహరిస్తారేమోనని నేను భావించాను. ఎందుకంటే మొదటి గీతం క్రిస్టియన్‌ కీర్తన. చివరి గీతాన్ని స్వరపర్చింది పాకిస్తాన్‌ సంస్థాపకులలో ఒకరు. ఈ సంవత్సరానికి మటుకు ఈ రెండూ బతికిపోయాయి మరి.

మొత్తంగా నా అభిప్రాయం చాలా సరళమైంది. సంప్రదాయానికి విలువ ఇవ్వని దేశం తన గతాన్ని గౌరవించదు, పైగా అది విలువ ఇచ్చే జాతీయ మనోభావాలను కూడా పలుచన చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ మీరు మార్చకూడని కొన్ని విషయాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మీరు వాటిని అదేవిధంగా కొనసాగిస్తూ ఉండాలి. బీటింగ్‌ రిట్రీట్‌ అలాంటి అంశాల్లో ఒకటి.

- కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net

మరిన్ని వార్తలు