విభిన్న నేత.. అసాధారణ వక్త..!

3 Dec, 2017 01:04 IST|Sakshi

ఆదిత్య హృదయం

పిరమిడ్‌లలో కనుగొన్న మమ్మీలకు 1920లు, 30లలో అత్యంత ప్రాచుర్యం లభిస్తున్న కాలంలో, ప్రసిద్ధి పొందిన ఒక పాటలో తొలి పంక్తి ఇలా ఉండేది: ‘నేనొక మనిషితో డ్యాన్స్‌ చేశాను, అతడు ఒక బాలికతో డ్యాన్స్‌ చేశాడు, ఆమె ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌తో డ్యాన్స్‌ చేసింది’. ఈ వారం అలాంటి స్థితే నా అనుభవంలోకి వచ్చింది.

ఈ శుక్రవారం బరాక్‌ ఒబామాతో కలిసి హిందూస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో నేను పాల్గొన్నాను. అద్భుతమైన వక్త, గొప్ప మేధావి అయిన ఒబామా నిజంగానే, చిన్న విషయాలను గుర్తుపెట్టుకుని వాటి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించే ప్రత్యేక వ్యక్తిగా నాకు కనిపించారు. గొప్ప రాజకీయవేత్తలకు అలాంటి సున్నిత విషయాలను ప్రస్తావించే సమయం ఉండదు మరి. కానీ అలాంటి వారిలో అతి గొప్ప వ్యక్తి అయిన ఒబామా ఈ విషయంలో కాస్త విభిన్నంగానే ఉన్నారు.

సదస్సు ప్రారంభానికి ముందు నిర్వాహకులు నన్ను ఒబామాకు పరిచయం చేశారు. ఒబామాతో గౌరవపూర్వకంగా కరచాలనం చేయడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి కొద్దిమందిని ఆహ్వానించారు. ఆ అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని.

మాలో ప్రతి ఒక్కరికీ బరాక్‌ ఒబామాతో ఫొటో దిగే అవకాశం వచ్చింది. సాధారణంగా తమ అసహనంతో, సుస్పష్టంగా కనిపించే చికాకుతో సెలబ్రిటీలు పాల్గొనే చిల్లరమల్లర కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. కానీ బరాక్‌ ఒబామా అలాంటివారు కాదు. ఈ సదస్సుకు హాజరైన తొంభైమందిలో ప్రతి ఒక్కరితో ఆయన ఒకటి లేదా రెండు మాటలను పంచుకున్నారు. మాలో ఎవరినీ అయన కలిసి ఉండలేదు కానీ ప్రతి ఒక్కరినీ తాము ప్రత్యేక వ్యక్తులుగా భావించేలా చేశారు.

తనతో కరచాలనం చేస్తుండగా ఆయన నన్ను పలకరిస్తూ, నేను టై కట్టుకుని ఉండటాన్ని గమనించారు. ‘మీరు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు, నేను కూడా టై ధరించి ఉంటే బాగుండేదని ఇప్పుడే భావిస్తున్నాను. ఫరవాలేదా? లేక నేను తప్పిదం చేశానా?’ అన్నారు ఒబామా.

సదస్సు కొనసాగుతుండగా ఈ ప్రత్యేక వ్యక్తిలో మరో కోణాన్ని కనుగొన్నాను. తాను కోరుకోని ప్రశ్నలు కొన్నింటిని శ్రోతలు సంధించారు. కానీ ఆయన వాటిని జోక్‌గా తీసుకున్నట్లుగా కనిపించింది. కానీ ఆయన విషయాన్ని పక్కకు తప్పించి ప్రశ్నకు పూర్తి భిన్నమైన అంశంగురించి మాట్లాడారన్న విషయాన్ని మీరు కనుగొనేంతవరకు ఆ ప్రశ్నలకు పూర్తి సమాధానం చెబుతున్నట్లే కనిపించారు.
నేను పలువురు ప్రభుత్వాధినేతలను ఇంటర్వ్యూ చేశాను. తమకు అసౌకర్యంగా భావించే అంశంపై మీరు లోతుగా ప్రశ్నిస్తున్నపుడు వారి ముఖం ఒకవైపునకు గుంజుకుపోవడం లేక వారి కళ్లు దొంగ చూపులు చూడటం మీరు స్పష్టంగా గమనించవచ్చు. కానీ బరాక్‌ ఒబామా అలాంటి వ్యక్తి కాదు. అనుచితమైన అంశంలోకి తనను లాగడానికి నేను ప్రయత్నించిన ప్రతి సమయంలోనూ ఒబామా నవ్వేసేవారు. ఎప్పుడైనా ఆయన కనుబొమలు ముడిపడవచ్చు కానీ అది శ్రోతలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించే ఒక కామిక్‌ ఉద్రేకానికి సంబంధించిన భంగిమగా మాత్రమే కనిపిస్తుంది.
మైక్‌లు విఫలమైనప్పుడు సదస్సుకు భంగం కలిగింది కానీ,  పప్పును ఎలా వండుతారు అనే చమత్కార ప్రశ్నను ఒబామా ఎదుర్కొన్నారు. మీరు వేసిన బలమైన పంచ్‌ ఎవరికైనా ఉద్రేకాన్ని తెప్పిస్తుందేమో కానీ ఒబామా విషయంలో అలా జరగదు. అలాంటి పరిస్థితిని కూడా ఒబామా చిరునవ్వుతోనే స్వీకరించారు.

సత్వరం వివేకంతో వ్యవహరించే మాజీ అమెరికన్‌ అధ్యక్షుడిలాగా కాకుండా, నేను ఒక ఆహ్లాదభరితమైన కథను కూడా అల్లలేకపోయాను. అందుచేత మేం, గత సెప్టెంబర్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ సదస్సులో బ్రిటన్‌ ప్రధాని థెరెస్సా మే ఎదుర్కొన్న దురవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఉన్నట్టుండి దగ్గు ముంచుకు రావటంతో ఆమె తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. ‘అది అంత భయంకరమైనది కాదా మరి?’ అన్నారు ఒబామా... ‘ఏ రాజకీయనేత అయినా ప్రసంగించడానికి పూర్తిగా సిద్ధమైన దశలో ఉన్నట్లుండి గొంతు పెగలని స్థితి ఏర్పడితే అంతకుమిం చిన దురవస్థ మరొకటి ఉండదు’ అంటూ ఒబామా నిశ్శబ్దంగా నవ్వారు.

బరాక్‌ ఒబామాను మాలో ఎవరైనా మళ్లీ కలవడం అసంభ వమే కావచ్చు. కానీ ఆయన కలిగించిన అపారమైన ప్రభావాన్ని మాత్రం కొందరు మర్చిపోలేరు. నామట్టుకు నాకు మహదానందం కలిగింది. పైగా మా ఇద్దరి సంభాషణ గురించి నేను ఇకపై కూడా కథలు కథలుగా చెప్పగలను. 1920ల నాటి ఆ సుప్రసిద్ధ గీతం ఈ పదాలతో ముగుస్తుంది. ‘సంతోషించు, సంతోషించు, హల్లెలూజా! స్త్రీలలో అత్యంత అదృష్టవంతురాలిని నేనే!’ ఈ పాటలో లింగాన్ని కాస్త మారిస్తే.. అది నేనే కావచ్చు!


- కరణ్‌ థాపర్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.net

>
మరిన్ని వార్తలు