అస్పష్ట కర్ణాటకం!

13 May, 2018 02:03 IST|Sakshi
రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీ

త్రికాలమ్‌

కర్ణాటకలో శనివారంనాడు పోలింగ్‌ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు ఒక తీరుగా లేవు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించబోతోందని టైమ్స్‌నౌ, ఇండియాటుడేల సర్వేలు నిర్ధారిస్తే, బీజేపీకే అత్యధిక స్థానాలు దక్కుతాయని రిపబ్లిక్‌ టీవీ, న్యూస్‌ఎక్స్, మరి కొన్ని ఇతర చానళ్ళు తీర్మానించాయి. పోలింగ్‌ ముందు జరిగే ఒపీనియన్‌ పోల్స్‌ వాస్తవానికి కాస్త దూరంగా ఉంటాయనీ, ఎగ్జిట్‌పోల్స్‌ కొంత దగ్గరగా ఉంటాయనీ అందరూ అంగీకరించే విషయం. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్క చానల్‌ కూడా ఫలితాన్ని కచ్చి తంగా అంచనా వేయలేకపోయింది. గుజరాత్‌ ఎన్నికలలో కొంత నయం.

కానీ కర్ణాటకలో పోలింగ్‌ జరుగుతున్న సమయంలో పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో  పూర్తి విరుద్ధమైన ఫలితాలు రావడం విడ్డూరం. టైమ్స్‌నౌ, ఇండియాటుడేలు కాంగ్రెస్‌కి దాదాపు వంద స్థానాలూ, బీజేపీ 70 స్థానాలు ఇస్తే, రిపబ్లిక్‌టీవీ, న్యూస్‌ఎక్స్‌లు బీజేపీకి వందకు పైగా స్థానాలతో ప్రథమ స్థానం ఇచ్చాయి. కర్ణాటకలో రాబోయేది హంగ్‌ అసెంబ్లీ అని అన్ని సర్వేలూ స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ రాని పక్షంలో బీజేపీ, జేడీ (ఎస్‌)లు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ఒక వాదన. జేడీ(ఎస్‌)కు 30–35 స్థానాలు రావ చ్చునని కొన్ని ఎగ్జిట్‌పోల్స్‌ సూచించాయి.

ఎన్నికల తర్వాత తన కుమారుడు (మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి) కనుక బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అతడితో తన సంబంధాలు తెగిపోతాయని జెడీ(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ్‌ సీనియర్‌ జర్నలిస్టు బర్ఖాదత్‌తో చెప్పారు. కానీ ఇటువంటి ప్రకటనే 2006లో కూడా దేవె గౌడ చేశారు. అయినప్పటికీ, బీజేపీ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కుమార స్వామితో దేవెగౌడ సంబంధాలు రవ్వంతైనా చెడిపోలేదు. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ నిర్మాణంలో జేడీ (ఎస్‌)దే కీలక పాత్ర. ఈ సారి దేవెగౌడ, కుమారస్వామి ఏమి చేస్తారు? వారి ప్రయోజనాలకూ, వారి ఆకాంక్షలకూ అనుగుణంగా ఏమి చేయవలసి వస్తే అదే చేస్తారు.

బీజేపీ, కాంగ్రెస్‌లతో సంబంధం లేకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి అధికారం హస్తగతం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) చేసిన ప్రతిపాదన దేవెగౌడకు నచ్చినట్టుంది. కాంగ్రెస్‌ భాగస్వామ్యం లేకుండా బీజేపీని గద్దెదించడం సాధ్యం కాదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో నిర్ణా యక పాత్ర పోషించాలనే ఆకాంక్ష  దేవెగౌడకు ఉన్నట్లయితే ఆయన కాంగ్రెస్‌తో జేడీ (ఎస్‌) పొత్తు పెట్టుకోవాలని కోరు కుంటారు.

కాంగ్రెస్, జేడీ (ఎస్‌)లు ఏర్పాటు చేసే ప్రభు త్వానికి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారు. తానే ముఖ్యమంత్రి కావాలని కుమారస్వామి అనుకుంటే ఆయన బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తారు. అప్పుడు బీజేపీ తరఫున ఉపముఖ్య మంత్రిగా సదానందగౌడ కానీ శ్రీరాములు కానీ ఉంటారు. ఇవన్నీ ఊహగానాలు. వాస్తవ చిత్రం ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది.  

ఏమున్నది గర్వకారణం?
ఈ ఎన్నికలలో విశేషంగా చెప్పుకోవలసిన అంశం విలువల పతనం. ప్రచారంలో నాయకులు ప్రయోగించిన భాష అవాంఛనీయమైనది. వ్యవసాయ సంక్షోభం నివారించ డంలో సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమైందని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. మూడువేలమందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా విమర్శించారు. ఒక్క సిద్ధరామయ్యే కాదు ఈ దేశంలోని రాజకీయ నేత లందరూ, పౌరులందరూ సిగ్గుతో తలవంచుకోవలసిన విషాదం ఇది.

మోదీ ప్రచార శైలిలో మార్పు లేదు. అదే ఆత్మ విశ్వాసం. అదే శక్తి. కాంగ్రెస్‌కి ఢోకా లేదనీ, మళ్ళీ కాంగ్రెస్‌ గెలుస్తుందనీ మోదీ రంగ ప్రవేశం చేసే వరకూ ధీమాగా చెప్పినవారు మోదీ ప్రచారంతో వాతావరణం మారి పోయిందనీ, బీజేపీకి అత్యధిక సంఖ్యలో స్థానాలు లభించ వచ్చుననీ చెప్పడం ఆరంభించారు. మోదీ వాక్ప టిమ గురించి దేశ పౌరులకు ఈ రోజు కొత్తగా చెప్పనక్కర లేదు. నాలుగేళ్ళుగా ప్రజలు ఆస్వాదిస్తూనే ఉన్నారు. కర్ణా టక ప్రచారంలో మోదీ ఉపన్యాసాలలో కొన్ని అవాస్తవాలు దొర్లాయి.

జనరల్‌ కరియప్పకూ, జనరల్‌ తిమ్మప్పకూ తేడా తెలియకుండా మాట్లాడటం, భగత్‌సింగ్‌ను నెహ్రూ లాహోర్‌ జైలులో కలుసుకున్న విషయం, భగత్‌సింగ్‌ బలి దానం తర్వాత ఆయన త్యాగాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తీర్మానం చేయడం వెనుక నెహ్రూ ఉన్నాడనే అంశాన్ని గ్రహించకుండా కేవలం నెహ్రూను బదనాం చేయాలనే సంకల్పంతో మోదీ చరిత్రను వక్రీకరించడం శోచనీయం. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన పద్ధతి అది కాదు. కర్ణాటకలో ప్రత్యేక పరిస్థితి ఏమంటే మోదీ మాటల వెనుక నిజాయితీ లోపించడం. ఉదాహరణకు,  ముఖ్య మంత్రి సిద్ధరామయ్యది పది శాతం (లంచాలు తీసుకునే) ప్రభుత్వం అంటూ మోదీ ధ్వజమెత్తారు.సిద్ధరామయ్యను ‘సిద్ధరూపయ్యా’ అని సంబోధించారు.

ఆ సమయంలో అవినీతి ఆరోపణల కారణంగా బీజేపీ అధిష్ఠానవర్గం సూచన మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప వేదికపైన ప్రధాని పక్కనే కూర్చొని ఉన్నారు. అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని యడ్యూరప్ప నాయ కత్వంలో బీజేపీ అందిస్తుందంటూ మోదీ నమ్మకంగా చెబితే ప్రజలకు నమ్మకం కుదురుతుందా? మూడు వేలకు పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకో వడానికి కారణం సిద్ధరామయ్య విధానాలే అంటూ మోదీ నిందించారు. అది నిజమే. రైతుల బలవన్మరణాలకు సిద్ధ రామయ్యే జవాబు దారీ. సందేహం లేదు.

కానీ పక్కనే బీజేపీ ఏలుబడిలో ఉన్న మహారాష్ట్ర సంగతి ఏమిటి? మహా రాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో రైతులు వ్యవసాయం గిట్టుబాటు కానందువల్ల జీవితాలు అర్ధంత రంగా చాలిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ చేయలేని అద్భుతం సిద్ధరామయ్య ఎట్లా చేస్తారు? ప్రధా నిగా నాలుగు సంవత్సరాలు పని చేసిన వ్యక్తి ఒక్క సారైనా వ్యవసాయరంగం సంక్షోభం గురించి పార్లమెంటులో సుదీర్ఘ చర్చ నిర్వహించే ప్రయత్నం చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కర్ణాటకలోని మొత్తం 224 శాస నసభ స్థానాలలోనూ 40 మాత్రమే పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి. మరో 32 నియోజకవర్గాలు పట్టణాలుగా మారు తున్న గ్రామీణ ప్రాంతాలు. తక్కిన 150 నియోజక వర్గాలూ వ్యవసాయమే ప్రధానం.

2013 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది. ఈ సారి సైతం కాంగ్రెస్‌ అదే వాగ్దానం చేసింది. లక్ష రూపా యల వరకూ వ్యవసాయ రుణాలను ప్రభుత్వమే చెల్లి స్తుందనీ, వ్యవసాయ ఉత్ప త్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విషయంలో ఎంఎస్‌ స్వామినాధన్‌ సిఫార్సు లను పరిగణనలోకి తీసుకుంటామనీ బీజేపీ ఎన్నికల ప్రణాళిక హామీ ఇచ్చింది. రుణమాఫీ విషయంలో ఈ రెండు జాతీయ పార్టీల కంటే ఉదారంగా ఉంటామనీ, ఎక్కువ మొత్తంలో తీసుకున్న అప్పులను కూడా సర్కార్‌ చెల్లిస్తుందని జేడీ (ఎస్‌) మాట ఇచ్చింది. అంతే కానీ సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతున్న రైతులను ఏ విధంగా ఆదుకోవాలన్న స్పష్టమైన అవగాహన మూడు పార్టీలలో దేనికీ లేకపోవడం గమనించాలి.

డబ్బు, కులం, మతం 
ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 25కోట్ల తక్కువ కాకుండా ఒక్కొక్క పార్టీ ఖర్చు చేసిందనే సమాచారం ఆందోళన, ఖేదం కలిగిస్తున్నాయి. డబ్బు, కులం, మతం ప్రభావం ఎన్నికలపైన విపరీతంగా పడిందని పరిశీలకుల అభిప్రాయం.  కులాల పేరుమీదా, మతాల పేరు మీదా కాంగ్రెస్‌ సమాజాన్ని చీల్చుతున్నదని మోదీ ఆరోపించడం మరో విశేషం. నిజానికి ఈ ఆరోపణ ఇంతకాలం బీజేపీపైన కాంగ్రెస్, వామపక్షాలూ చేసేవి. ఇప్పుడు అదే ఆరోపణతో కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి చేయడం గమనార్హం. మోదీ వ్యూహం తెలిసిన సిద్ధరామయ్య మతంపేరుతో తానూ రాజకీయం చేయడానికి ప్రయత్నించిన మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం.

బీజేపీకీ, ముఖ్యంగా ఆ పార్టీ ముఖ్య మంత్రి అభ్యర్థి యడ్యూరప్పకు, అండగా నిలుస్తూ వచ్చిన లింగాయతులను మైనారిటీ మతస్థులుగా గుర్తించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేయడం వెనుక రాజకీయం ఉంది. ఈ ఎత్తుగడ ఫలించిందా లేక బెడిసికొట్టిందా అన్నది ఓట్ల లెక్కింపు తర్వాత కానీ తెలియదు. బీజేపీ హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి రాజీవ్‌గాంధీ అయోధ్యలో శిలాన్యాస్‌ని అనుమతించడం, గుజరాత్‌ ఎన్నికల ప్రచారం లోనూ, ఆ తర్వాతా రాహుల్‌గాంధీ దేవాలయాలు సంద ర్శించడం రాజకీయ వ్యూహంలో భాగమే.

తమ పార్టీని ముస్లిం పార్టీగా ముద్రవేసిన కారణం గానే 2014 ఎన్నికలలో దారుణంగా ఓడిపోయామని సోనియాగాంధీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నం జరుగుతోంది. లోగడ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా సిద్ధరా మయ్య కొంత చొరవ తీసుకున్నారు. మోదీని ఎదుర్కొ నేందుకు తానే స్వయంగా ఒక ప్రణాళిక వేసుకున్నారు. బీజేపీ జాతీయ వాదానికి విరుగుడుగా కాంగ్రెస్‌ ప్రాంతీయ వాదం వినిపించింది. కన్నడిగుల ఆత్మగౌరవ నినాదం విని పించింది. కర్ణాటకకు ఒక ప్రత్యేక పతాకాన్ని ఆవిష్కరిం చారు. ‘వజ్రం వజ్రేన భిద్యతే’ అన్న సూత్రం పాటించినట్టు కనిపించింది.
ప్రధాని పదవికి సిద్ధం : రాహుల్‌
ఈ ఎన్నికల ప్రచారాన్ని మోదీకీ, సిద్ధరామయ్యకూ మధ్య సాగిన పోరాటంగా ప్రజలు పరిగణించి ఉంటే ఫలితం కాంగ్రెస్‌కు అనుకూలంగా రావచ్చు. లోగడ ఢిల్లీలో, బిహా ర్‌లో బీజేపీ తరఫున ప్రధాన ప్రచారసారధి నరేంద్రమోదీ. ఢిల్లీలో ప్రచారం మోదీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్య వాగ్యుద్ధం సాగింది. కేజ్రీవాల్‌ గెలుపొందారు. బిహార్‌ ప్రచారయుద్ధం మోదీ, నితీశ్‌కుమార్‌ మధ్య జరిగింది. నితీశ్‌ కుమార్‌ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల భాగస్వామి లాలూ ప్రసాద్‌కు జల్లకొట్టి మోదీ పరిష్వంగంలో వొదిగిపోయారు. అది వేరే విషయం. పంజాబ్‌లో కెప్టెన్‌ అమరేంద్రసింగ్‌  కాంగ్రెస్‌ ప్రచారానికి సారథ్యం వహిస్తే బీజేపీ–అకాలీదళ్‌ కూటమికి మోదీ నాయకత్వం వహించారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అమరేంద్రసింగ్‌ను విజయం వరించింది.

కర్ణాటకలో కూడా అటువంటి ఫలితమే వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రచారం చివరి భాగంలో రాహుల్‌ గాంధీ ఒక చమత్కారం చేశారు. 2019లో కాంగ్రెస్‌కు ఇతర పార్టీల కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు లభిస్తే ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దాంతో ఈ పోరాటం మోదీకీ, రాహుల్‌కీ మధ్య జరుగుతోందనే అభి ప్రాయం కొద్దిసేపు కలిగింది. దాన్ని కర్ణాటక ఓటర్లు మనసుకు పట్టించుకుంటే ఫలితం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాహుల్‌ వ్యాఖ్య వల్ల కాంగ్రెస్‌కి లాభం చేకూరిందో, నష్టం కలిగించిందో అంతిమ ఫలితాలు వెల్ల డైన తర్వాతే తెలుస్తుంది.


ఈ ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఏడాది చివరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్ని కలతో పాటు లోక్‌ సభ ఎన్నికలు జరిపించాలని మోదీ ప్రతి పాదించినా ఆశ్చర్యం లేదు. ప్రతిపక్షాలు సంఘటితమై పోరాటానికి  సిద్ధమయ్యేలోగానే ఎన్నికలకు వెళ్ళడం లాభ దాయకంగా మోదీ భావించవచ్చు. ఒక వేళ కాంగ్రెస్‌ విజయం సాధిస్తే మోదీ రథానికి అవరోధం ఏర్పడినట్టే. మోదీ జనాకర్షణశక్తి తగ్గిపోయినట్టే. సిద్ధరామయ్య ప్రతిష్ఠ, రాహుల్‌కి జనామోదం పెరిగినట్టు గుర్తించాలి. అందుకే ఈ ఎన్నికల ప్రభావం కేవలం కర్ణాటకపైనే  కాకుండా దేశం మొత్తం మీద పడుతుంది.

కె. రామచంద్రమూర్తి 

మరిన్ని వార్తలు