రెండు భాషల విధ్వంసకుడు ‘బాబే’

24 Nov, 2019 01:47 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ విద్యను ప్రవేశపెట్టే అంశంపై నేడు సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది. నిజానికి విద్య వేరు, మాతృభాష వేరు, సంస్కృతి వేరు, సాహిత్యం వేరు. ఇవన్నీ కూడా అంతస్సంబంధితంగా వుంటాయి. పలు సందర్భాల్లో ప్రత్యేక అస్తిత్వాలుగాను వుంటాయి. తల్లి భాష మూడేళ్లలోపే తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, పరిసరాలు.. సమాజం నుంచి ఎక్కువగా అలవడుతుంది. ఈ రోజున 50% మందికి అసలు అక్షరాలే రావు. అయితే వారికి జీవించే భాష వచ్చు. సామాజిక కుటుంబ జీవనానికి సంబంధించిన మౌఖిక సాహిత్యం వచ్చు. నిజానికి మా అమ్మకు 100 పాటలు వచ్చేవి. నాకు వందల పద్యాలు వచ్చుగాని వంద పాటలు రావు. మాతృభాష పరంగా నాకంటే ఎప్పుడు మా అమ్మే ముందు వుంటుంది. 

ఇంగ్లిష్‌ వాళ్ళు భారతదేశం వచ్చిన తరువాత పరిపాలనా రంగంలోకి ఎక్కువ మందిని తీసుకోవడం కోసం విద్యాశాలలో కొన్ని చోట్ల ఇంగ్లిష్‌ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకులు కూడా అయ్యారు. గాంధీ, నెహ్రూ రాకముందు స్వాతంత్రోద్యమం ప్రాంతీయ భాషలో నడిచింది. ఆ తరువాత అది జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి ఇంగ్లిష్‌ భాషే వాహిక అయ్యింది. ఇంగ్లిష్‌ భాషలో ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసిన  యం. యన్‌. రాయ్, రాజారామ్మోహన్‌ రాయ్, డాంగే ఇంకా అనేకమంది సంప్రదాయ బ్రాహ్మణులు సంస్కర్తలుగా మారారు. డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఇంగ్లిష్‌ భాషలో ప్రావీణ్యం సంపాదించిన తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదవగలిగారు.

ప్రపంచ తత్వవేత్తలందరి పుస్తకాలతోపాటు వేదాలు, దర్శనాలను కూడా ఆయన ఇంగ్లిష్‌ భాషలో చదవగలిగారు. నిజానికి తెలుగు భాష మూలాలు దళిత వాడల్లో వున్నాయి. కారణం అనేక వలస రాజ్యాల భాషా ప్రభావం వారి మీద పడలేదు. అందుకే తెలుగు భాషను, సాహిత్యాన్ని దళితవాడలు, ఆదిమవాసుల మాటల్లోనుంచి, పాటల్లోనుంచి, సంస్కృతుల్లోనుంచి మనం పరిశోధించుకుంటున్నాం. తెలుగును అభివృద్ధి చేస్తే దళిత వాడలు అభివృద్ధి అవుతాయనే దుర్భుద్ధితోనే.. తెలుగు భాషను గురించి నేడు మాట్లాడుతున్న వారు దళితవాడల్లో తెలుగు గ్రంథాలయాలు ఏర్పరచలేదు, తెలుగు నేర్పే పాఠశాలలు పెట్టడం లేదు. విద్యాపరమైన అంశాల్లో వాళ్ళు ముందుకు వెళుతూ దళిత బలహీన వర్గాలకు లిఖిత తెలుగు కూడా రాకుండా చేస్తున్నారు.

కార్పొరేట్‌ కాలేజీల్లో తమ పిల్లలకు తెలుగు రాకుండా చేయడమే గాక దళిత వాడల్లో వున్న ప్రజలకు తెలుగు రాత రాయకుండా చేస్తూ వారిని నిరక్షరాస్యులుగా ఉంచే ప్రయత్నం చేస్తూనే.. అమెరికాలో తానాల పేరుతో కుల తత్వాలను ఇతర దేశాలకు మోసుకెళ్తున్న ఈ తెలుగు మహానుభావులే తెలుగుకు శత్రువులు. తెలుగుని ద్వేషించేవాళ్ళు, తెలుగుని తమ ఇంట్లో విధ్వంసం చేసేవాళ్ళు, తమ పిల్లలు తెలుగులో మాట్లాడితే కొట్టేవాళ్ళు.. వీళ్ళు తెలుగు పునరుద్ధరణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా ఇంగ్లిష్‌ మాధ్యమం ప్రవేశ పెట్టినా తెలుగు భాషా పదాలను నేర్పే ఒక ప్రత్యేకమైన పీరియడ్‌ కొనసాగించాలి. వక్తృత్వపోటీలు పెట్టాలి. తెలుగు మౌఖిక కళలని పునరుద్ధరించాలి.

అసలు తెలుగు రాజులు ఎంతో సాహిత్యం సృష్టిం చారు. రాజుకు, పాలకుడికి భాష మీద మక్కువ వుండాలి. కానీ ఒక పాలకుడిగా చంద్రబాబు తెలుగు భాషా విధ్వంసకుడు. ఆయన కార్పొరేట్‌ల కొమ్ముకాసి తెలుగు భాషను ధ్వంసం చేశాడు. పైగా బడుగు బలహీన వర్గాల అనేక వ్యవస్ధలను ధ్వంసం చేశాడు. తెలుగు సంస్కృతికి బదులుగా సొంత కుల సంస్కృతిని తేవాలని ప్రయత్నం చేశాడు. తెలుగు విధ్వం సంలో చంద్రబాబు పాత్ర సాధారణమైంది కాదు. కమ్మ సామాజిక వర్గ సాహిత్య పీఠాలను కూడా ఆయన ధ్వంసం చేశారు. నిజానికి వెంకయ్య నాయుడి జిల్లా నెల్లూరు తెలుగు పత్రికా రంగానికి పెట్టని కోట. కానీ ఆయన కూడా అక్కడ తెలుగు భాష గురించి ఏ ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల బోధన లేక చిక్కిపోతున్నాయి. నేడు తెలుగువారు ప్రపంచ మానవులు అవుతున్నారు. తమ తల్లి నేర్పిన భాష వారి దగ్గర బలంగా వుంది.

కానీ ఇప్పుడు ఇంగ్లిష్‌ నేర్చితీరవలసిన ఒక చారిత్రక భాషగా తల్లిదండ్రులు, విద్యార్ధులూ భావిస్తున్నారు. మొత్తం కార్పొరేట్‌ వ్యవస్థ 60% పిల్లల్ని ఇంగ్లిష్‌మయం చేస్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు విద్యా బోధన మాత్రమే ఆచరణ సాధ్యం కాదు. అయితే ఇంగ్లిష్‌ నేర్పుతూనే ఒక తెలుగు సబ్జెక్టును బలంగా వుంచి అదనంగా తెలుగు పద్యాల పఠనం, తెలుగు వక్తృత్వ పోటీలు, తెలుగు సాంస్కృతిక  వికాస అధ్యయనం, తెలుగు కార్యక్రమాలు జరుపుకొంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంది. ప్రభుత్వం కూడా ప్లే స్కూళ్ళు ఇంగ్లిష్‌లో నిర్వహించకుండా అంగన్‌వాడి నుంచి పిల్లల్ని పంపి ఒకటో తరగతిలో ఇంగ్లిష్‌ చెప్పడం సాధ్యం కాదు. స్కూలు వున్న ప్రతి చోటా మళ్ళీ ప్లే స్కూల్స్‌ పెట్టాలి. అలాగే ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ బోధనా కార్యక్రమాన్ని ఎండాకాలం నిర్వహించాలి. ఇంగ్లిష్, తెలుగు సాంస్కృతిక వికాసానికి సంబంధించి కవుల చిత్రపటాలు, రీడింగ్‌ రూములు అన్నీ రూపొందించాలి.

తెలుగు కోసం పోరాడే వాళ్ళు కూడా తాము తెలుగు కోసం ఏమి చేశామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళందరికి ఎంతో పని మిగిలివుంది. వాటి కోసం ఎంతో మంది నిరక్ష రాస్యులు ఎదురుచూస్తున్నారు. వారి ఇళ్లలో తెలుగు పుస్తకాలు 100 అయినా వున్నాయో లేదో వెనక్కు తిరిగి చూసుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రకటనలకు తగ్గట్టుగా ప్రణాళికను రూపొందించుకోవాల్సి వుంది. ప్రకటనలు వున్నంత బలంగా కార్యక్రమంలేకపోతే ప్రజలు సంక్షోభంలో కూరుకుపోతారు. డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ చెప్పినట్టు దేశీయ భాషలు, జాతీయ భాషలు ప్రపంచ భాషల్ని నేర్చుకొంటూ, వ్యక్తిత్వాన్ని విస్తృతం చేసుకొంటూ మానవులందరూ సమానంగా జీవించే సమసమాజ నిర్మాణం కోసం చిత్తశుద్ధితో అందరూ ముందుకు నడవాల్సిన చారిత్రక కాలం ఇది. అంబేడ్కర్, మహాత్మాఫూలే ఆలోచనా క్రమంలో ప్రధానమైంది సామాజిక విద్యా విప్లవం. ఆ విప్లవంలో భాగస్వాములం అవుదాం.

    కత్తిపద్మారావు 
వ్యాసకర్త సామాజిక తత్త్వవేత్త,
వ్యవస్థాపక అధ్యక్షులు, నవ్యాంధ్రపార్టీ
మొబైల్‌ : 98497 41695 

మరిన్ని వార్తలు