వర్తమాన అవసరం అంబేడ్కర్‌

14 Jan, 2020 00:53 IST|Sakshi

విశ్లేషణ

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతోంది. ఆయన, హోంమంత్రి అమిత్‌ షా కలిసి రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. మానవ హక్కుల్ని నిరంతరం ఉల్లంఘిస్తున్నారు. వాస్తవానికి ఇది లౌకికవాదంపై సాగుతున్న దాడి. స్త్రీల హక్కులపై జరుగుతున్న దాడి. మైనారిటీల హక్కులపై జరుగుతున్న దాడి. రాజ్యాంగంపైనా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలపైనా స్పష్ట మైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తిం చగలరు. స్వాతంత్య్రోద్యమం సాగుతున్న కాలం లోనే అంబేడ్కర్‌ ఒక మాటన్నారు. ‘నా ఉద్దేశంలో హిందూ సమాజం కులరహిత సమాజం అయిన ప్పుడు మాత్రమే అది తనను తాను రక్షించుకునే శక్తిని, సామర్థ్యాన్ని సంతరించుకోగలదు. 

అంతర్గత బలం లేకుండా హిందువులకు స్వరాజ్యం వచ్చినా మళ్లీ దాస్యంవైపు ఒక అడుగు ముందుకు వేయడమే కావొచ్చు. బాగా ఆలోచిం చండి’’ అని ఆయన చెప్పారు. హిందూ సామ్రాజ్య భావనను అంబేడ్కర్‌ అప్పట్లోనే గుర్తించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా (ఎన్‌ఆర్‌సీ) వంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు దేశ పౌరుల హక్కులు కాలరాస్తున్నాయి. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు మనం భారతీయులమా కాదా అనే అను మానం కలిగేలా ప్రస్తుత పాలన కొనసాగుతోందని ఇటీవల చేసిన వ్యాఖ్యానం వర్తమాన పరిస్థితుల్ని ప్రతిబింబిస్తోంది. మన రాజ్యాంగంలోని 14 నుంచి 18 వరకూ ఉన్న అధికరణలు చట్ట సమా నత్వానికి సంబంధించినవి.

చట్టం ముందు ఎవరూ అధికులు కారు. అందరూ సమానులు. అయితే ఆర్థిక, సామాజిక, భౌగోళిక అసమాన తలు, విద్యా అసమానత ఉన్న దేశంలో సమా నావకాశాలు, చట్ట సమానత్వం ఎలా సాధ్యం? అందువల్ల ఈ అధికరణలను వాస్తవిక దృక్ప థంతో, విస్తృత పరిధిలో అన్వయించుకోవాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. పౌర సత్వ సవరణ చట్టం రాజ్యాంగేతరమైనదే కాక, ఆరెస్సెస్‌ ఎజెండాకు అనుగుణమైనది. పౌరులను మత ప్రాతిపదికన చూసేది. ఇలాంటి ప్రమాదాన్ని అంబేడ్కర్‌ చాలా ముందుగానే గుర్తించారు. అందువల్లే ఆ భావజాలంపై పోరాడటానికి పూను కొన్నారు. గాంధీ, జిన్నాలు ఇద్దరివల్లా రాజకీ యాల్లో వికార ప్రదర్శనల పోటీ మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. 

భారత ఉపఖండ విభజనకు వీరిద్దరే పునాదులు వేశారని కూడా అన్నారు. కానీ అంబే డ్కర్‌ మతం గురించి, కులం గురించి మాట్లాడు తున్నారని కమ్యూనిస్టులు అప్పుడు ఎద్దేవా చేశారు. తమకు హిందూ మతంలో రక్షణ లేదని, అందువల్ల బౌద్ధమతంలోకి వెళ్లిపోతున్నామని అంబేడ్కర్‌ చెప్పారు. సమాజంలో కనబడే అస్పృ శ్యతను అర్థం చేసుకోనివారికి తన ప్రకటన వెనక వున్న ఉద్దేశాలు అర్థం కావని వ్యాఖ్యానించారు. అట్టడుగు కులాలవారిపై అత్యాచారాలు, వారి పిల్లల్ని పాఠశాలలో చేర్చాలనుకున్నప్పుడు, ఊరి బావి నుంచి నీరు తోడుకోవడానికి ప్రయత్నించి నప్పుడు, వారు మంచి దుస్తులు ధరించినందుకు, వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగినందుకు, వ్యవ సాయం చేసినందుకు, గుర్రంపై పెళ్లి కొడుకు ఊరే గినందుకు వారిని అగ్రవర్ణాలు అనేక రకాలుగా హింసించిన తీరును, వారి ఇళ్లను తగలబెట్టిన ఉదంతాలను అంబేడ్కర్‌ వివరించారు. చాలా కాలం కమ్యూనిస్టులు అంబేడ్కర్‌ కుల నిర్మూ లనను, హిందూ మతవాద నిరసనను పట్టించు కోలేదు. అందువల్లే ఇప్పుడు భారత రాజ్యాంగ పరిరక్షణకు వారు పిలుపునిచ్చే పరిస్థితులు ఏర్ప డ్డాయి.

దేశంలో జరుగుతున్న నిరసనల్లో ఉద్యమ కారులంతా మతాలకు అతీతంగా అంబేడ్కర్‌ ఫొటోలు, రాజ్యాంగం ప్రతులు చేతబూనడం కన బడుతుంది. కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌ ద్వంద్వ విధానాలను విడనాడి అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగంతో పాటు ఆయన సిద్ధాంతాలను ఆచ రించినప్పుడే ప్రజలు వారిని విశ్వసిస్తారు. ఇది చారి త్రక సమయం. లౌకికవాద వ్యవస్థను పునర్నిర్మిం చుకోవడానికి అందరూ సంసిద్ధులైతే సమసమాజం తథ్యం.

డాక్టర్‌ కత్తిపద్మారావు 
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త,
నవ్యాంధ్రపార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు
మొబైల్‌ : 98497 41695

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా