ఒక ఆకాంక్ష ఒక విలువ

8 Mar, 2020 01:41 IST|Sakshi

సందర్భం

1910 నుండి మార్చి 8 అంటే అంతర్జాతీయంగా స్త్రీల  సామాజిక సామూహిక శక్తికి సంకేతం. మహిళల అస్తిత్వం, వ్యక్తిత్వం, ఆకాంక్షలు, విజయాలు ఏ స్థాయికి చేరాయో చూసుకొని వాటికి అవరోధంగా ఉన్న సమస్త అధికార శక్తుల నుండి విముక్తికి  పునరంకితం కావటానికి కావలసిన ఉత్సాహ శక్తిని పుంజుకొనవలసిన సందర్భం ఇది.  స్త్రీ పురుషులు సంఖ్యలోనే కాదు, శక్తిసామర్థ్యాలలో, అవకాశాలలో, అభివృద్ధిలో, నిర్ణయాలలో, నిర్మాణంలో సమానంగా ఉండే ప్రపంచం నిస్సందేహంగా శక్తిమంతమైన ప్రపంచమే. అయితే అలాంటి ప్రపంచాన్ని నిర్మించుకొనటం ఆకాంక్షగా, ఆదర్శంగా మిగిలిపోతున్నదే తప్ప ఆచరణ వాస్తవం కావటంలేదు. ఎందువల్ల? భారతదేశంలోనైతే స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్లకే స్త్రీ పురుష సమానత్వం సాధించబడలేదన్న ఎరుక కలి గింది కదా! సమానత్వ దిశగా తొలి అడుగులు మాత్రమే పడుతున్నాయి  అని అనుకున్న (Towards equality report) 50 ఏళ్ళ తరువాత వెనుదిరిగి చూస్తే ఆ అడుగులు  సాగిన జాడ లేక   అక్కడే కూరుకు పోయాయా ఏమిటి? అని ఆందోళన  కలగక మానదు.

ఇది మనదేశపు స్థితే కాదు. సాపేక్షంగా చూస్తే చాలా దేశాలు మనకన్నా పైస్థాయిలో ఉండవచ్చు కానీ ప్రపంచమంతటా ప్రజాస్వామ్యాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని హేళన చేస్తూ స్త్రీపురుష అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్లనే ప్రతి ఒక్కరూ సమానత్వం కోసం అని ఈ మార్చ్‌ 8న మళ్ళీ పిలుపును ఇయ్యవలసిన అంతర్జాతీయ అక్కర  వచ్చింది. స్త్రీల హక్కులను వాస్తవానుభవంలోకి తేవటంగురించి నొక్కి చెప్పాల్సి వచ్చింది. మహిళా సాధికారత అనే భావనను ముందుకు తెచ్చిన బీజింగ్‌ సదస్సు జరిగిన పాతికేళ్ల తరువాత పరిస్థితి ఇది. 

ఆడపిల్లను పుట్టకుండానే ఆపివేసే లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్థ శిశుహత్యలు చట్ట ప్రకారం నేరమే అయినా   ఈ రోజున అది  వైద్యరంగంలో కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం అయి పొయింది.  విద్యాఉద్యోగాలలో 33 శాతం స్త్రీల ప్రాతినిధ్యం చట్టబద్ధంగా అమలవుతున్నది, స్త్రీలు సాఫ్ట్‌ వేర్‌ రంగంలో సైతం ప్రతిభను చాటుకుంటున్నారు, కంపెనీ సీఈఓలుగా అత్యున్నత స్థాయికి ఎదిగారు అని మురిసినంత సేపు పట్టదు ఈ నాటికీ హైస్కూల్‌ స్థాయి విద్యలో అర్ధంతరంగా చదువులు ఆపేసి వెళ్తున్న ఆడపిల్లలు 63.5 శాతం (2015) ఉన్నారని తెలిసి దిగులు పడటానికి. పేదరికము, తాగివచ్చి తండ్రి ఇంట్లో చేసే యాగీ, బడిలో టాయిలెట్‌ వంటి వసతులు లేకపోవటం, పెళ్లిచేసి పంపియ్యాలన్న తొందర.. కారణాలు ఏమైతేనేమి వీళ్లంతా విద్యాఉద్యోగ అవకాశాలకు దూరం చెయ్యబడుతున్నవారే. పెద్దపెద్ద ప్రాజెక్టుల వల్ల, ప్రత్యేకఆర్ధిక మండలుల వల్ల అటవీ వనరుల మీద, భూముల మీద హక్కులు, జీవనోపాధిమార్గాలు, ఆహారభద్రత కోల్పోతున్నారు అనే కమంది మహిళలు. 

అదే 33 శాతం ప్రాతినిధ్యం పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో వుంది కనుక స్త్రీలు కిందిస్థాయిలో రాజకీయ భాగస్వామ్యాన్ని అయితే పొందుతున్నారు గానీ స్వతంత్రంగా ఎంతవరకు పనిచెయ్యగలుగుతున్నారు అంటే మిగిలేది నిరాశే. చట్టసభలలో స్త్రీల రిజర్వేషన్‌ బిల్లు ఎప్పుడో తుంగలో తొక్కేశాం. ఇప్పుడు రాజకీయరంగంలో ఉన్న స్త్రీలకు కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం ఏమీ లేదని 2019 ఎన్నికల సందర్భంగా 95 మంది మహిళా రాజకీయనాయకులపై మిలియన్‌కు పైగా ట్విట్టర్‌ మొదలైన మాధ్యమాలలో అసభ్యంగా, అవమానకరంగా–వాళ్ళ శరీరాన్ని, రంగును, దుస్తులను, కులాన్ని హీనపరుస్తూ వచ్చిన స్క్రోలింగుల గురించి  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ విడుదల చేసిన నివేదిక చెప్తున్నది. ఇక మహిళా సాధికారత ఎక్కడ ? ఇళ్ల దగ్గర నుండి వసతి గృహాల వరకు ఆడపిల్లలను లైంగిక అవసరాలకు వాడుకొనే వికృతి వ్యాపించింది.

అత్యాచారం, అక్రమ రవాణా, హత్య సాధారణ విషయాలు అయిపోయాయి. తాగుడు, మాదకద్రవ్యాల వినియోగం ఈ నేరాలకు తక్షణ కారణాలైతే, స్త్రీలను లైంగిక వస్తువుగా తప్ప చూడలేని మానసిక వికృతిని మప్పిన సిని మాలు, అశ్లీల చిత్రాలు వాటికి మరింత బలం చేకూర్చేవి. స్త్రీపట్ల మగవాడి దృష్టిని ఈ విధంగా నిర్మిస్తూ వచ్చిన తరతరాల పితృస్వామిక అధికార సంస్కృతిది అసలు నేరమంతా.. ఈ అన్ని నేరాలను పట్టించుకోకుండా స్త్రీల కట్టుబొట్టు వ్యవహార సరళి పురుషులను రెచ్చగొట్టేవిగా ఉండటమే స్త్రీలపై అత్యాచారాలకు కారణమంటూ బాధితులనే నేరస్తులుగా చేసే రాజకీయం ఈనాడు కొనసాగుతున్నది. వీటిని వేటినీ ప్రశ్నించకుండా, సంస్కరించకుండా ‘ప్రతిఒక్కరూ సమానత్వం కోసం’ అనే మాటకు అర్ధం ఉంటుందా? మంత్రాలకు చింతకాయలే రాలవు అని మనకు తెలిసిందే. మరి సమానత్వం ఎలా సాధ్యం? సాధ్యం కాదని ఈనాడు స్త్రీలు గ్రహిస్తున్నారు. కుటుంబం, కులం,మతం, సంపద, సంస్కృతి, రాజ్యం వంటి సంస్థల వర్గ వర్ణ లింగ పాక్షిక దృష్టి స్త్రీల సమానతకు ఎప్పుడూ అవరోధమే అని వాళ్లకు తెలుసు. అందువల్లనే వాళ్ళు ఈ నాడు పోరాటశక్తులుగా ఎదుగుతున్నారు. విస్తరిస్తున్నారు. 

ఈ పాక్షిక దృష్టి  సగభాగమైన స్త్రీలను నిర్వీర్యం చేయటంవల్ల సమాజాన్ని పక్షవాతానికి గురిచేస్తుందని గుర్తుచేస్తున్నారు.  తక్షణ పరిష్కారాలతో నేరాలను అరికట్టలేము, నేర కారణాల నిర్మూలనపై దృష్టిపెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. నేరరహిత సమాజంతో ముడిపడి స్త్రీల హక్కులు అనుభవ వాస్తవం అవుతుందని నమ్ముతున్నారు. అందుకే ఈనాడు స్త్రీలు తమ హక్కుల కోసం, అవకాశం కోసం మాట్లాడుతున్నదానికంటే ఎక్కువగా తమలాగే హక్కులు అవకాశాలు కోల్పోతున్న దళిత ఆదివాసీ మైనారిటీ మత సమూహాలకోసం మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడటం, వాళ్ళ పక్షాన పనిచేయటం అసమానతలు లేని ఒక మానవీయ సమాజ నిర్మాణంకోసమే. స్త్రీలంటే తల్లులు కదా! బిడ్డలైనా, సమాజమైనా, దేశమైనా పాడై పోతుంటే వూరికే ఉండలేరు.

అట్లా ఉండకపోవటం కుటుం బంలో అయితే అవిధేయత. సమాజంలో అయితే బరితెగించటం. రాజ్యం దృష్టిలో అయితే ద్రోహం. అందుకు ఫలితం బహిష్కరణలు లేదా జైళ్లు. అయినా ‘ప్రతి ఒక్కరూ సమానత్వం కోసం’  ఆలోచించే సంస్కారాన్ని పెంచుకొనే దిశలో మానవీకరించబడటం కోసం స్త్రీలు అందుకు సిద్ధమవుతున్నారు. షాహిన్‌ బాగ్‌ దానికి ఒక సంకేతం. వేలాది లక్షలాదిమంది ముస్లిం మహిళలు ఒక సమానత్వ విలువ కోసం వీధుల్లోకి వచ్చారు. ఐదారేళ్ళ పిల్లలనుండి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా ఆజాదీ అని గొంతెత్తి నినదిస్తున్నారు. ఆ ఆకాంక్ష , ఆ విలువ మొత్తం సమాజాన్నీ ఉన్నతీకరించే దిశగా స్త్రీలను మరింత సంఘటితం చేస్తుంది అన్న ఆశ కలుగుతున్నది.

కాత్యాయనీ విద్మహే
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి,
కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌


 

మరిన్ని వార్తలు