అవసరం –ఆత్మగౌరవం

30 Aug, 2018 00:30 IST|Sakshi

జీవన కాలమ్‌

యాభై అరవై సంవత్స రాల కిందట– మేం రచనలు ప్రారంభించిన తొలి రోజుల్లో ‘రీడర్స్‌ డైజెస్ట్‌’ చాలా ప్రాచుర్యంలో ఉండేది. అందులో చివర ఒక సంక్షిప్త నవల ఉండేది. నిజంగా జరిగిన సంఘటన మీద ఒక నవల వచ్చింది. స్విట్జర్లాండ్‌లో ఒక విమాన ప్రమాదం జరిగింది. బాగా ఎత్తుగా ఉన్న ఆల్ఫ్స్‌ పర్వతశ్రేణి మధ్య ఆ విమానం కూలిపోయింది. నరమానవులు వెళ్లలేని మంచు శ్రేణులవి. అందులో 22 మంది ఉన్నారు. అందరూ వారిమీద ఆశలు వదులుకున్నారు. కానీ కొద్ది రోజులకు ఆ కూలిన ప్రదేశం నుంచి సంకేతాలు రాసాగాయి. అంతా తుళ్లిపడ్డారు. వెంటనే వారిని రక్షించడానికి పరుగులు తీశారు. తీరా 22 మందిలో 16మంది మరణించగా ఆరుగురు బతికారు. వారి మొదటి సమస్య బయటి ప్రపంచానికి తమ ఉనికిని తెలియజేయడం. మరి ఈ ఆరుగురు 16 రోజులు ఎలా జీవించారు? వారి చుట్టూ 16 శవాలు మంచులో నిక్షేపంగా ఉన్నాయి. ఆ నవల చివరి వాక్యం ఇన్నేళ్లూ నా మనస్సులో తలచుకున్నప్పుడల్లా తుపాకీలాగ పేలుతూనే ఉంది.

‘థాంక్‌గాడ్‌! వారి చుట్టూ మంచులో 16 దేహాలు ఉన్నాయి!’ ఇంతే కథ, ఆ కథ వివరాలు ఇప్పుడేమీ గుర్తులేవు. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒక జాతీయ రూపక కార్యక్రమంలో ఒక నాటకం ప్రసారం చేసి నట్టు బాగా గుర్తు. ఇక్కడా వివరాలు గుర్తు లేవు. కానీ ఒక బృందం కలిసి ప్రయాణం చేస్తున్నారు. అందరూ సంస్కారవంతులు. విద్యాధికులు, నగర సంస్కృతిలో జీవించేవారు. ప్రాణాంతకమైన ప్రమా దంలో ఎన్నో రోజులు ఇరుక్కున్నారు. కొందరు పోయారు. మిగిలినవారు ఎన్నో రోజులు జీవించాలి. ప్రాథమికమైన ‘బ్రతకాలనే’ ఆర్తి క్రమంగా వారి సంస్కారాన్ని అటకెక్కిస్తుంది. వారు అతి ప్రాథమి    కమైన– కేవలం ‘ఉనికి’ కోసం విలువల్ని విస్మరించే స్థితికి వస్తారు. ఇది భయంకరమైన వాస్తవానికి ప్రతి బింబం. ఎన్నో నెలలపాటు కొత్త ప్రాంతాల అన్వేషణకు బయలుదేరిన అలనాటి కొలంబస్, వాస్కోడీగామా వంటి వారి బృందాలు సముద్ర మధ్యంలో ఆహార పదార్థాలు కొరవడగా– తమ నౌకల్లోని ఎలుకలను పట్టి తినడాన్ని మనం చదివాం.

ఈ మూడు కథలూ– ఒక అనూహ్యమైన మలు పులో మానవునిలో సంస్కారవంతమైన విలువలు లుప్తమై కేవలం Suటఠిజీఠ్చిl∙లక్ష్యమైపోతుంది అన్న సత్యానికి నిరూపణలు. ఇప్పుడు కేరళలో ఎదురైన విపత్తు అలాంటిది. ఇక్కడ ‘ఆత్మ గౌరవం’ ఆలోచన లకు బహుదూరం. కేరళలో గత 100 సంవత్సరాలలో కనీవినీ ఎరు గని వర్షాలు పడ్డాయి. 32 డ్యామ్‌లు నీటితో ఊపిరి బిగించాయి. 10వేల కిలోమీటర్ల రోడ్లు కొట్టుకుపో యాయి. లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఎందరో మరణించారు. ఇప్పుడు వీరి పునరావాసానికి గుంజాటన జరుగుతోంది. ఒక విలేకరి ఒక ఇంటిని చూపి– ఇక్కడ నీరు తగ్గాక– వర్షం తెచ్చిన మట్టి, ఇతర చెత్త నుంచి ఈ ఇంటిని పరిశుభ్రం చేయాలంటే కనీసం 2 నెలలమాట– అన్నారు. ఒక ఉదాహరణ. చెంగల్పట్టు సమీపంలో మామండూరు అనే ఊరిలో– రోడ్డుపక్క ఒక ఫ్యాక్టరీ షెడ్డు ఉంది. పక్కనే ఏరు. ఫ్యాక్టరీ మూతపడింది. ఎన్నో నెలల తర్వాత– కొత్త వ్యాపారి దానిని అద్దెకి తీసుకున్నాడు. శుభ్రం చేయడానికి మనుషుల్ని పుర మాయించాడు. లోపలికి మనుషులు వెళ్లగా రెండు పాములు కనిపించాయి. వాళ్లు బెదిరి పాములు పట్టేవారిని పిలిపించారు. తీరా ఆ షెడ్డులో కేవలం మూడు వేల పాములున్నాయట!

కేరళ ఇళ్లలో శవాలే ఉన్నాయో, చెత్తే ఉందో, మరేం ఉందో ఇంకా తెలీదు. ఈలోగా విదేశాల వారు కూడా స్పందించి సహాయానికి నడుం కట్టారు. యునైటెడ్‌ ఆరబ్‌ రిపబ్లిక్‌ 700 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ కేంద్రం పరాయి దేశాల సహాయం వద్దంది. ‘మా అవసరాల్ని మేమే తీర్చు కుంటాం. మీ పెద్ద మనస్సుకి జోహార్‌’ అంటూ విదేశాంగ శాఖ విదేశాలకు సమాధానం ఇచ్చింది. కేరళ ముఖ్యమంత్రి ‘వారినయినా ఇవ్వనివ్వండి, మీరయినా ఇవ్వండి’ అన్నారు. కష్టంలో, సుఖంలో ప్రపంచమంతా చేతులు కలపాలన్న ‘వసుధైక కుటుంబం’ ఆదర్శం పాటించే దేశం– చెయ్యి అందించే పరాయి దేశం సహాయాన్ని ఎందుకు తిరస్కరించాలి? ఆత్మగౌరవం అరుదైన విలువ. కానీ అవసరం ప్రాథమికమైన ఉప్పెన. ఆపదలో ఆదుకునే సహృదయానికి ఆత్మగౌరవం ఆటంకం కాకూడదు. కాగా, సౌజన్యానికి ఎల్లలని నిర్ణయించడం ‘ఆత్మగౌరవానికి’ దక్కవలసిన కితాబు కాదు. ఔదార్యానికి ఆంక్ష పెద్ద మనసు అనిపించుకోదు. మన పెరట్లో మూడువేల పాములున్నాయి. బూరా ఊదే మనిషిని దూరంగా ఉంచకండి.


గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు