కొలకలూరి కీర్తిలో ‘విమర్శిని’

6 Dec, 2018 02:42 IST|Sakshi
కొలకలూరి ఇనాక్‌

ఎట్టకేలకు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ వార్త చూసిన వారిలో కొంతమందైనా ‘ఏంటి? ఇనాక్‌కి ఇంతకాలం అకాడమీ అవార్డు రాలేదా?’ అని ఆశ్చర్యపోయి ఉంటారు. అందుకు కారణం ఆయన ఆ అవార్డుకు మించి ఎదిగిపోవడమే. జ్ఞాన పీఠ్‌ వారి ప్రతిష్టాత్మకమైన మూర్తిదేవి పురస్కారంతోపాటు, పద్మశ్రీ కూడా ఇప్పటికే అందుకున్నారాయన. జులై 1, 1939లో గుంటూరు జిల్లా వేజెండ్లలో జన్మించిన ఇనాక్‌ అంచెలంచెలుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ శ్రీవేంకటేశ్వరి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ స్థాయి వరకూ ఎది  గారు. తన తండ్రి మరణం ప్రేరణతో 1954లో తొలి కథ రాశారు. ఈ దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న దళితుల చరిత్రను వెలికితీస్తూ అనేక గ్రంథాలు వెలువరించారు.

చరిత్రలో మరుగునపడిన దళితుల కృషిని ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంలో, శూర్పణఖ అంతరంగాన్ని ‘కన్నీటి గొంతు’ కావ్యంలో అపూర్వంగా ఆవిష్కరించారు. అళ్వారుల్లో ప్రసిద్ధుడైన ‘మునివాహనుడు’పై నాటకం రాశారు. ఇక కథలకైతే లెక్కేలేదు. ఊరబావి, అస్పృశ్య గంగ, సూర్యుడు తలెత్తాడు, గులాబీ నవ్వింది, కొలుపులు కథలు పాఠకులకు సుపరిచితం. సర్కార్‌ గడ్డి, అనంత జీవనం వంటి నవలలు ప్రసిద్ధాలు. వైవిధ్యభరితమైన సమాజాన్ని తన కథల ద్వారా అన్ని కోణాల్లో ఆవిష్కరించారు. దళితులు, దళిత స్త్రీలు, కులవృత్తులవారి కన్నీటితడిని రంగరించుకున్న ఇనాక్‌ సాహిత్యమంతా అట్టడుగువర్గాల జీవితానికి అద్దంపడుతుంది.

తన చుట్టూ వున్న జీవితాల్ని, తాను చూసిన జీవితాల్ని, తాను అనుభవించిన జీవితాన్ని అక్షరాల్లో బందించడం వల్లే ఆయన రచనలన్నీ చెమటవాసనతో గుబాళిస్తుంటాయి. అనేక ప్రక్రియల్లో బడుగుల జీవితాన్ని చిత్రించడం ద్వారా అన్ని వర్గాలను చేరుకోవచ్చనేది ఇనాక్‌ ఆలోచన. కవిత, కథ, నవల, నాటకం, పరిశోధన, విమర్శ ఏది రాసినా వాటిపై ఆయన ముద్ర స్పష్టం. ఇప్పటి వరకు తొమ్మిది పదులకుపైగా పుస్తకాలను వెలువరించారు. తన రచనలు నచ్చినవారికైనా, నచ్చనివారికైనా; తాను లేవనెత్తిన సమస్యలు అంగీకరించక తప్పని పరిస్థితి కల్పించడమే ఆయన సాహిత్యం ప్రధాన ఉద్దేశం.

ఆయన రచనలు ఆవేశపూరితంగానో, రెచ్చగొట్టేవిగానో ఎప్పుడూ ఉండవు. ఆలోచనాత్మకంగా, నిలకడగా సాగుతూ ఆయా సంఘటనపట్ల పాఠకుడిలో వాస్తవిక దృష్టిని కలిగిస్తాయి. ఆయన రచనలు దేశ, విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై అనేకమంది ఎం.ఫిల్, పీహెచ్‌డీలు చేశారు. ఇనాక్‌కు అందని పురస్కారంమంటూ దాదాపు లేదనే చెప్పవచ్చు. ఎప్పుడో అలనాడు జాషువాకు, మధ్యలో ఓసారి బోయి భీమన్నకు దక్కిన అకాడమీ పురస్కారం చాలా ఆలస్యంగానే అయినా ఇనాక్‌ రచించిన వ్యాస సంపుటి ‘విమర్శిని’ని వరించడం తెలుగు దళిత సాహిత్యానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని భావించవచ్చు.   – దేశరాజు (కొలకలూరి ఇనాక్‌కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా)

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాజీ సేవకులే, తాజా కమిషనర్లా?

నదుల అనుసంధానం ఎవరికోసం?

రాష్ట్రాల మధ్య భాషా సమస్యలు

ప్రదక్షిణం

జనజాగృతే ప్రజాస్వామ్యానికి రక్ష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిన్న వయసులోనే దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు

హైదరాబాద్‌లో మహేష్‌ మైనపు బొమ్మ

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!