ఆక్రందనకు లాఠీ జవాబా?

2 Nov, 2017 01:03 IST|Sakshi

సందర్భం

ట్రేడర్ల మాయాజాలంతో తాము దారుణంగా మోసపోతున్నామని రైతులు మార్కెట్‌ యార్డుల్లో నిరసనకు దిగుతున్నారు. కడుపుమండి రోడ్లపై బైఠాయి స్తున్న రైతులపై పోలీసులను ప్రయోగించడం పరిష్కారమేనా?

గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వ్యవసాయ సంక్షోభాన్ని తెలం గాణ రైతాంగం ఎదుర్కొం టోంది. పంట చేతికొచ్చే తరు ణంలో కురిసిన కుండపోత వర్షాలకు పత్తి, వరి, మక్క, సోయాబీన్‌ పంటలు దారు ణంగా దెబ్బతిన్నాయి. వరి కోతకొచ్చే సమయంలో వర్షాలు విడవకుండా పడటంతో గింజలు రాలడం, వెన్నులపైనే మొలకెత్తడం, ధాన్యం రంగు మారడం లాంటి సమస్యలు తలెత్తాయి. లక్షన్నర ఎకరాల్లో వరి నేల పాలైంది. పత్తి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా క్వింటాలుకు వెయ్యి నుంచి మూడు వేలకు మించి చెల్లించేది లేదని వ్యాపారులు కూడబలుక్కున్నా ప్రశ్నించే నాథుడే లేడు. ఈసారి పత్తి సాగు విస్తీర్ణం పెరిగిందని ప్రభుత్వానికి తెలుసు. అంతర్జాతీయంగా పత్తి దిగుబడులు 10 శాతం పెరగ నున్నాయని ఇంటర్నేషనల్‌ కాటన్‌ అడ్వయిజరీ కమిటీ (ఐసీఏసీ) కూడా ముందే ప్రక టించింది. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వమైనా 4 నెలల ముందే ధరలు పతనం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మద్దతు ధరగా ప్రకటించిన రూ. 4,320కు రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు జరిగేలా ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఉండాల్సింది. పత్తి కొనుగోలుకు కాటన్‌ కార్పొరేషన్‌ (సీసీఐ) కేంద్రాలు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ప్రకటనలైతే వచ్చాయి. కానీ సీపీఐ అక్టోబరు పది నుంచి తెరిచిన కొనుగోలు కేంద్రాల్లో ఒక్క క్వింటాలు కూడా సేకరించ లేదు. సెప్టెంబరు రెండో వారం నుంచి నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పూత కాయగా మారే దశలో పడిన వర్షాల వల్ల కాపు తగ్గింది. చేతికొచ్చిన పత్తి కూడా నాణ్యత తగ్గింది. వ్యాపారులు కుమ్మక్కు కాకుండా పోటీ నెలకొల్పే లక్ష్యంతో ఏర్పాటైన సీసీఐ కేంద్రాలు ట్రేడర్ల చెప్పుచేతుల్లో నడుస్తున్నాయి. సర్వర్‌ పని చేయడం లేదని, తేమ 12 శాతానికి మించి ఉందని సీసీఐ అధికారులు కొనుగోళ్లను నిలిపి వేయడం వ్యాపారులకు లాభం కలిగించడం కోసం కాదా?

నాణ్యత దెబ్బతిన్న విషయం సీసీఐ, రాష్ట్ర ప్రభు త్వాలకు తెలియందేమీ కాదు. అంతా సరిగా ఉంటే ఎవరి జోక్యం లేకుండానే అమ్మకాలు, కొనుగోళ్లు జరిగి పోతాయి. వర్షాల తాకిడికి పత్తి నల్లబడటం, తేమ చేర డంలో రైతుల ప్రమేయం ఏముంటుంది? అన్ని రకాలు పెట్టుబడులు పెట్టి పంట సేకరణ సమయంలో సంభ వించిన ఉపద్రవాలకు వారిని బాధ్యులను చేసి ధరలు పతనం చేస్తే ఇక ప్రభుత్వాలు ఎందుకు? రైతులపట్ల తనకు నిజంగా బాధ్యత ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిరూ పించుకోవాలంటే 15 శాతం తేమ ఉన్నా పత్తి కొనుగోళ్లు జరిగేలా చూడాలి. ప్రతి క్వింటాలుపైన 3వేల రూపా యల బోనస్‌ ఇస్తే తప్ప పత్తి రైతుల పెట్టుబడి చేతికి రాదు. వరి పండించిన రైతులకు ఎకరానికి రూ. 5 వేలు చెల్లించాలి. తక్షణమే ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలి.

గత ఏడాది మంచి రాబడి రావడంతో ఈసారి రైతులు పత్తి సాగుకు ఎగబడ్డారు. దాదాపు 45 లక్షల ఎకరాల్లో, కిందటేడాది కంటే 26.5 శాతం ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. వర్షాల వల్ల పూత కాయ లుగా ఏర్పడక ఆరు క్వింటాళ్లు కూడా దిగుబడి రాని పరి స్థితి. పైగా పగిలిన పింజల్లోకి నీరు చేరి నల్లబడి నాణ్యత పోయింది. గులాబి రంగు కాయ తొలిచే పురుగు విరుచు కుపడి మరో 10 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది.

పంటను సేకరించడానికి కూలీలకు కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఇది క్వింటా లుకు రూ. వెయ్యి అవుతోంది. గ్రామాల్లో కూలీల సమస్య ఉండటం, చేలలో ఇంకా బురద ఆరకపోవడం వల్ల సేకరణ కష్టంగా మారింది. నాణ్యత లోపం, అధిక తేమ పేరుతో క్వింటాలుకు రూ. వెయ్యి నుంచి మూడు వేలు మాత్రమే దక్కితే ఇక వారు పెట్టిన పెట్టుబడి సంగతేమిటి? అంతా అనుకూలంగా ఉండి పది క్వింటా ళ్లపైన పండితేనే రైతుకు బొటాబొటిగా పెట్టుబడి చేతికి వస్తుంది. పదిహేను క్వింటాళ్లు పండితేగానీ నాలుగు పైసలు చేతిలో మిగలవు. పత్తి క్వింటాలుకు రూ. 7 వేలు దక్కేలా చూడాలని రైతులు ఎప్పటినుంచో కోరుతు న్నారు. తెలంగాణలో పత్తి సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని హెక్టారుకు రూ. 84,045కు చేరిందని ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రచురించిన ‘సోషియో ఎక నమిక్‌ అవుట్‌లుక్‌–2017’ కూడా స్పష్టం చేస్తోంది. ఇన్ని తెలిసిన ప్రభుత్వం తీరా పంట చేతికొచ్చే సమయంలో రైతులను ఆదుకొనే దిశగా ప్రయత్నించక పోవడం దారుణం. మార్కెట్లలో ట్రేడర్లు కుమ్మక్కవుతుంటే జోక్యం చేసుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మ రిస్తోంది. ట్రేడర్ల మాయాజాలంతో తాము దారుణంగా మోసపోతున్నామని రైతులు మార్కెట్‌ యార్డుల్లో నిరస నకు దిగుతున్నారు. కడుపుమండి రోడ్లపై బైఠాయించి ప్రభుత్వ జోక్యాన్ని డిమాండు చేస్తున్నారు. పోలీసులను ప్రయోగించి వాళ్లను చెదరగొట్టవచ్చనుకుంటే అది సమ స్యను మరింత జటిలం చేయటమే అవుతుంది. తమను ఆదుకోవాలని వారు చేస్తున్న ఆక్రందనే వివిధ రూపాల్లో నిరసనగా కనిపిస్తుంది. ఎవరూ జోక్యం చేసుకోకపోతే ఆత్మహత్యలకు దారి తీస్తుంది. అప్పుడు ఎవరేం చేసినా ప్రయోజనం ఉండదు. దేశంలో రైతుల బలిదానాలు ఎక్కువ జరుగుతున్న రెండో రాష్ట్రంగా ప్రభుత్వం ఇప్ప టికే అపప్రథను మూట కట్టుకుంది. రైతులను ఆదుకునేం దుకు తక్షణం స్పందించకపోతే మొదటి స్థానం కోసం ప్రయత్నిస్తోందని భావించక తప్పదు.


కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
వ్యాసకర్త ఎమ్మెల్సీ, తెలంగాణ
ఫోన్‌: 98669 11221

మరిన్ని వార్తలు