సమాజమా.. ఐ డోంట్‌ కేర్‌!

7 Feb, 2018 03:07 IST|Sakshi
కొమ్మినేని శ్రీనివాసరావు, రాంగోపాల్‌ వర్మ

కొమ్మినేని శ్రీనివాసరావుతో సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ‘మనసులో మాట’

సమాజం గురించి తానెప్పుడూ ఆలోచించనని, తనగురించి ఆలోచించడానికే సమయం ఉండడం లేదని సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పష్టం చేశారు. అందుకే తన సినిమాలన్నీ సందేశాలకు దూరంగా ఉంటాయన్నారు. ఫ్యామిలీ అంటేనే తనకు పడదని, ఒంటరితనాన్ని బాగా ఇష్టపడతానని, పెళ్లి చేసుకున్న తర్వాతే ఈ విషయం తనకు బాగా బోధపడిందని వర్మ చెప్పారు. వయసులో నీకన్నా పెద్ద అయినంతమాత్రాన వారికి నీకన్నా ఎక్కువ తెలుస్తుందని ఎప్పుడూ అనుకోవద్దు అంటూ తండ్రి చేసిన ఉపదేశం తనను బాగా ప్రభావితం చేసిందంటున్న వర్మ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

మా ‘మనసులో మాట’కు విచ్చేసినందుకు నమస్కారాలు
మీ కార్యక్రమం పేరు మనసులో మాట. కానీ నాకు మనసనేదే లేదు. మనసు అంటూ సాధారణంగా అందరూ దేనిగురించి అనుకుంటారో అది నాకు లేదేమో అని చిన్న అనుమానం.

మనిషన్న తర్వాత మనసు లేకుండా ఉండదు కదా?
మనిషికి మనసు ఉంటుందని అంటారు. అందుకే నేను మనిషిని కానేమో..  నా కూతురు నన్ను జంతువు లాగా చూస్తుంది. నువ్వు జూలో చిన్న జీవి లాంటోడివి అంటుంది తను. 

ఆమె మాటలకు బాధపడ్డారంటే మీకూ మనసు ఉన్నట్లేగా!
బాధ కాదండి. జంతువులంటే నాకు ఎంతో ఇష్టం. ఆమె వ్యాఖ్యను నేను అభినందనగానే తీసుకుంటాను. 

మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఘట్టం ఒకటుందని మొదటిసారి వింటున్నాను!
అలాంటి పరిస్థితి అంటూ ఏమీ లేదు. మీరు ఊహించుకుంటున్నారంతే. నాకు ఫ్యామిలీ అంటూ లేదు. ఫ్యామిలీస్‌ అంటే నాకు పడదు. అది నా ఇష్టం. అలాగని నాలో తేడా ఏమీ లేదు. ఒంటరితనాన్ని ఇష్టపడతాను. 

మరి ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు?
బుద్ధి లేక. పెళ్లి చేసుకున్నాకే బుద్ధొచ్చింది. అన్నిసార్లూ మనం కరెక్టే చేస్తామా. ఎన్నోసార్లు తప్పులు చేస్తాం. 

మీరెలా పెరిగారు? మీ చుట్టూ వాతావరణం ఎలాంటిది?
మా నాన్న నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. నీ మనసుకు నచ్చినట్లు వెళ్లు. వేరొకరి అభిప్రాయాలకు విలువ ఇవ్వొద్దు. వయసులో నీకన్నా పెద్ద అయినంతమాత్రాన వారికి నీకన్నా ఎక్కువ తెలుస్తుందని ఎప్పుడూ అనుకోవద్దు అంటూ ఇలా కొన్ని ప్రత్యేక అంశాలను నాన్న చెప్పారు. ఆయన మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఎలాంటి ప్రభావం అంటే స్కూలు కెళ్లడం మానేయడం, సినిమాలు చూడటం, దెబ్బలాటలకు దిగటం, చిన్నప్పుడు ఏమేం చేయకూడదో అవన్నీ చేశాను నేను. 

గొడవల్లోకి వెళ్లాలనే ఆలోచన ఎలా వచ్చింది?
టీనేజ్‌ మొత్తంగా విజయవాడలో పెరిగాను. అక్కడి గొడవల్లో పాల్గొనేవాడిని. వర్గం అని ఏమీ లేదు. కాలేజీలో గొడవలు. అంతే. ఏదైనా గొడవ జరుగుతుంటే వెంటనే రంగంలోకి వెళ్లిపోవడమే. అలా గొడవలకు దిగడం ద్వారా మంచిపని చేశాను అనిపిస్తుంది. లేకుంటే శివ లాంటి సినిమా తీసేవాడిని కాదు. గ్యాంగ్‌స్టర్స్‌ సిని మాలు తీసేవాడిని కాదు. నాకున్న ఎడ్యుకేషన్‌ అంతా రౌడీలు, క్రైమ్‌లతోనే నడిచింది. అంటే సినిమాలు తీసే ఎడ్యుకేషన్‌. నేను చదివింది సివిల్‌ ఇంజనీరింగ్‌. అయితే సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక సిమెంట్‌ కాంక్రీట్‌ మిక్సింగ్‌ చేయడం కూడా నాకు తెలీదు. అంతగా సినిమాలపైకి ఆకర్షితుడినయ్యాను.

మీ సినిమాల ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటారు?
సందేశాలు ఇవ్వకూడదు అనే సందేశం ఇవ్వాలన్నదే నా సినిమాల ప్రధాన ఉద్దేశం. నేను సమాజం గురించి ఎప్పుడూ అలోచించను. నాగురించి నేను ఆలోచించుకోవడానికే నాకు సమయం ఉండదు. ఇక సందేశాలా?

జీఎస్టీ లాంటి సినిమాలతో ఏం చేయాలని మీ ఉద్దేశం?
ఆ సినిమా తీయడం ఏ ఉద్దేశంతో అనుకుంటున్నారు? కొన్ని లక్షల పోర్న్‌ వీడియోలు ఉన్నాయి నెట్‌లో. జీఎస్టీ కూడా ఫారిన్‌ నటితో తీశాను. పైగా అది పోర్న్‌ సినిమా కాదు. పోర్న్‌కు నిర్వచనం లైంగిక చర్యలు చూపించడం. కానీ నేను తీసిం దాంట్లో అది లేదు. కానీ, ఎవరికి వాళ్లు వాళ్లుగా ఊహిం చుకుని రకరకాలుగా వాదాలు చేస్తున్నారు. 

ఇలాంటి కారణాలతోనే మీ కుటుంబం  మిమ్మల్ని వెలివేసిందట కదా?
కుటుంబం వెలివేయడం కాదు. నేను పోర్న్‌ సినిమాలు తీయలేదు. ఎవరి ఊహలు, అంచనాలు వాళ్లవి. పోర్న్‌ అనే మాట మీరు వాడినప్పుడు దాని అర్థం మీకు తెలిసి ఉండాలి. కాని దానర్థం మీకూ తెలీదు. బీజేపీ వాళ్లకూ తెలీదు. 

నగ్నంగా చూపించి సమాజాన్ని ఏం చేయదలిచారు?
లక్షలాది పోర్న్‌ వీడియోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. పోర్న్‌ వీడియోలు చూస్తున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇది అంతర్జాతీయ సర్వే గణాం కాల ముచ్చట. నేను చెప్పింది కాదు. నేను తీయకుంటే పోర్న్‌ అనే విషయం తెలీదా వాళ్లకు. 

మీవంటి వారు కూడా అలాంటివి తీయడం సబబా?
నేను పర్వర్ట్‌ని అని 20 ఏళ్లుగా వాళ్లే చెబుతున్నారు. ఇక ప్రముఖుడిని ఎక్కడ? పైగా నేను రిలీజ్‌ చేసిన జీఎస్టీ ట్రైలర్‌కి 40, 50 లక్షల వ్యూస్‌ వచ్చాయి. వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేసిన 15 నిమిషాల్లో 30 వేల హిట్లు వచ్చాయి. జనం చూడడానికి ఇష్టపడ్డారు. మీరు చెప్పే ఆ నిరసన కారులు మొత్తంగా 30 మంది కూడా ఉండరు.

మీ సినిమాకు వచ్చిన హిట్ల కంటే సమాజం పెద్దది కదా?
సమాజంలో చాలామంది ఇదే చూడడానికి ఇష్టపడుతున్నారని నేను చెబుతున్నాను. కాదని మీరంటున్నారు. ఎవరిష్టం వారిది. తంటా ఏమిటి దీంట్లో?

(వర్మతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)
 

మరిన్ని వార్తలు