కాంగ్రెస్‌లో నూతన ఉత్తేజం!

14 Aug, 2018 01:22 IST|Sakshi

అభిప్రాయం

ఏఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత, రాహుల్‌ గాంధీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటానికి అన్ని అనుకూలతలున్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇలాంటి కీలక సమయంలో రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తుంది. జమిలీ ఎన్నికల మాట అటుంచి, రాష్ట్రంలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు పోనున్నారన్న ప్రచారం ఎక్కువైంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ దూకుడు పెంచింది. ఏఐసీసీ ప్లీనరీలో చెప్పినట్టుగా  కార్యకర్తలకు అధిష్టానానికి ఉన్న అడ్డుగోడలను కూల్చివేసే ప్రక్రియ తెలంగాణ నుంచే ఆరంభిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుపడుతున్న మోదీకి అన్ని సంద ర్భాలలో కేసీఆర్‌ మద్దతుగా నిలవటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీ ‘బి–టీం’గా వ్యవహరిస్తోందని తేలి పోయింది. దీనితో సెటిలర్లలో, విభజన హామీలుS అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కటే మార్గమనే భావన ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తూ, అన్యాయం చేస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలని చూస్తున్న తరుణంలో, రాహుల్‌ పర్యటన తెలం గాణ ప్రజలకు భరోసా ఇవ్వనుంది. మోదీ రూపంలో ప్రజలను పట్టిపీడిస్తున్న ధరల పెరుగుదల, జీఎస్టీ భారం, బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత, అసహనం, దళితులపై దాడులు, రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణం తదితర అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న ద్రోహాలను రాహుల్‌ తన రెండు రోజుల పర్యటనలో ఎత్తిచూపనున్నారు.

ఇక రాహుల్‌ గతంలో నామకరణం చేసినట్టు ‘మినీ మోదీ’ కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలు ఎమ్మెల్యేల పదవీ కాలం రద్దు, ప్రాజెక్టుల్లో అవినీతి, ఇసుక మాఫియా, నేరెళ్ల ఘటన, కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తించకపోవటం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణంలో స్తబ్దత, అభయ హస్తం పింఛన్లు, ఊసే లేని కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, నిర్లక్ష్యానికి గురవుతున్న ఆరోగ్యశ్రీ, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరసనలు, రేషన్‌ డీలర్ల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు రైతు బీమా పేరుతో తెచ్చిన పథకం 60 ఏళ్ళు నిబంధన ఇలా ప్రజలు అసంతృప్తితోవున్న అనేక అంశాలు గ్రేటర్‌ వేదికగా, యావత్‌ తెలంగాణ ప్రజల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను రాజకీయాలకు అతీతంగా సందర్శించి, విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా, ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్‌ వస్తారంటే టీఆర్‌ఎస్‌ నేతలు దీన్నీ వివాదాస్పదం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అన్ని సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పని చేస్తుంటే, టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు మాత్రం అనుమతి ఇవ్వొద్దని పోటీగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి యూనివర్సిటీ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ, పార్టీ కార్యక్రమాలతో పాటు, సమాజంలోని అనేక రంగాల ప్రజలను రాహుల్‌ ఈ పర్యటనలో కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కూడా కలవరం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే బలమైన రాజకీయ శక్తి అని భావించి, ఈ మధ్యనే వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు రాహుల్‌ పర్యటనను తమ ఉనికిని చాటుకోవడానికి అనువైన సమయంగా భావిస్తుండటంతో పాత–కొత్త కలయికతో పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగనుంది. ఊహించినట్టుగా ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌లోపే వచ్చినా ఈ పర్యటనలో రాహుల్‌ స్ఫూర్తితో పనిచేసి, మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని, అధికారంలోకి రావాలనే ఊపు పార్టీ శ్రేణులలో కనబడుతుంది.


-కొనగాల మహేష్‌(వ్యాసకర్త సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ -98667 76999)

మరిన్ని వార్తలు