మహా కూటమి ‘మహో’దయం

29 Nov, 2019 01:22 IST|Sakshi

సందర్భం

మహారాష్ట్రలో రాజకీయ పోరు రసవత్తరంగా ముగి సింది. ఈ పోరులో కాంగ్రెస్‌–ఎన్సీపీ–శివసేన కూటమి, ప్రభుత్వ ఏర్పా టుద్వారా మహోదయానికి శ్రీకారం చుట్టింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో శివసేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దక్కగా, బీజేపీ మహాగుణపాఠం నేర్చుకుంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెం బ్లీలో, ఏ రాజకీయ పార్టీ కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ 145ను చేరుకోలేకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. సీఎం పీఠం పంచుకునే విషయమై బీజేపీ–శివసేనల మధ్య రాజకీయ విభేదం తలెత్తింది. బీజేపీ తాము కేంద్రంలో అధికారంలో ఉండటంతో తమ వాదన చెల్లుబాటు అవుతుందనే భావనతో శివసేనను లెక్కచేయలేదు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన శివసేన కొత్త మిత్రులను వెతుక్కుంది. పలు చర్చల తరువాత కనీస ఉమ్మడి ప్రణాళికతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌– ఎన్సీపీ–శివసేనల మధ్య అంగీకారం కుది రింది. 

మహారాష్ట్ర ఎపిసోడ్‌లో గవర్నర్‌ పక్షపాతంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొదటగా బీజేపీని ఆహ్వానించిన గవర్నర్, తరువాత శివసేన, ఆ తరువాత ఎన్సీపీని ఆహ్వానించారు. కానీ, గవర్నర్‌ ఎన్సీపీకి ఇచ్చిన గడువు పూర్తికాకుండానే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కేంద్ర కేబినేట్‌ ఆ సిఫార్సును ఆమోదించడంతో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. దీనిపై కూటమి నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అత్యవసర అంశంగా పరిగణించిన కోర్టు విచారణ చేపట్టింది.

ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుంటే, హడావుడిగా అర్ధరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేసిన గవర్నర్‌.. చీకట్లోనే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. అనూహ్యంగా, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఎరగా వేసి, ఎన్సీపీ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బలం చూపిస్తామని బీజేపీ భావించింది. కానీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌ వైపు నిలబడటంతో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. మరోవైపు కూటమి వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నవంబర్‌ 27, సాయంత్రం లోపు, అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేయాలని, ఫ్లోర్‌ టెస్ట్‌ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన తర్వాత తన ఓటమిని ముందే అంగీకరించిన ఫడ్నవిస్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

దేశంలో బీజేపీ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. ఈ ఉదంతంతో తెలుగు రాష్ట్రాలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోవాల్సింది. అక్కడ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బు, పదవుల ఆశ చూపినా ఏ ఒక్కరూ వాటికి లొంగలేదు. కాంగ్రెస్‌–ఎన్సీపీ–శివసేన ఎమ్మెల్యేలు పార్టీల కోసం నిలబడ్డారు.162 మంది కూటమి ఎమ్మెల్యేలు ఒక్కటిగా ప్రతిజ్ఞ చేశారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, అనంతర పరిణామాలు, భవిష్యత్‌ మరాఠా రాజకీయాలను మలుపుతిప్పే రెండు ముఖ్యమైన సమీకరణాలను తెరపైకి తెచ్చాయి. ఒకటి, ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని ఠాక్రే కుటుంబం నుంచి మనవడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల్లో పోటీచేసి గెలి చారు. ఠాక్రే కుటుంబం నుంచి మొదటిసారి ఒకరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నారు. ఇక రెండవ విషయం, మరాఠా యోధుడు శరద్‌ పవార్‌ తరువాత ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇన్ని రోజులు శరద్‌ పవార్‌ సోదరుడు అజిత్‌ పవార్‌ మరియు కూతురు సుప్రియా మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు, తన అన్న శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా, అజిత్‌ పవార్‌ బీజేపీతో చేతులు కలపటంతో, ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి పవార్‌ వారసురాలు సుప్రియాకు మార్గం సుగమమైంది.

మహారాష్ట్రలో ఈ మహా కూటమి ‘మహో’దయంతో, దేశంలో బీజేపీ ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మినహా చెప్పుకోదగిన ఏ ఒక్క పెద్ద రాష్ట్రాలలోనూ అధికారంలో లేకుండా పోయింది. మహా రాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నాయి.

వ్యాసకర్త: కొనగాల మహేష్‌, జాతీయ సభ్యులు, ఏఐసీసీ
మొబైల్‌ : 98667 76999

మరిన్ని వార్తలు