యూరియా కష్టాలు ఎవరి పాపం?

8 Sep, 2019 01:07 IST|Sakshi

అభిప్రాయం

గత నెల రోజులుగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పంటలకు డోకా లేదు, ఈ ఫసలు గట్టెక్కుతం అనుకున్న రైతన్నలను ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ’యూరియా’ కొరత తీవ్రంగా బాధపెడుతోంది. రైతులు ఆధార్‌ కార్డులు చేతబట్టి, డీ.సీ.ఎం.ఎస్‌.ల ముందు వారం రోజుల పాటు తిరిగితే తప్ప యూరియా బస్తాలు దొరకడం లేదు. పగలు– రాత్రి అని తేడా లేకుండా వంతుల వారిగా రైతులు క్యూలో నిలబడుతున్నారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు తిండితిప్పలు మానేసి యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు వదులుతున్నారు. అసలు రైతులకు ఇన్ని బాధలు ఎందుకు? ఈ పరిస్థితికి రావటానికి కారణం ఎవరు? ఈ యూరియా కొరత పాపం ఎవరిది?

యూరియా మన రాష్ట్రంలో తయారీ కాదు. మహారాష్ట్ర, బిహార్‌ లాంటి పక్క రాష్ట్రాల మీద ఆదారపడాల్సిందే. సీజన్‌ ప్రారంభంలోనే అంచనా వేసిన మొత్తం ఎరువులను మన రాష్ట్రానికి తెచ్చి, మార్కుఫెడ్‌ గోదాములలో నిల్వచేసుంటే రైతులకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వర్షాలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతూనే పంటలు పచ్చగా కావాలంటే రైతులు యూరియా మందు వేయాల్సిన పరిస్థితి. అసలే ఇక్కడ మన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే, మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను నాలుగు రోజులపాటు పక్క రాష్ట్రం కర్ణాటకకు మళ్ళిం   చారు. రైతులు వేసే అడుగు మందుల ద్వారా మొక్కజొన్న కర్రలకు, పత్తి చెట్లకు పూర్తి బలం చేకూర్చాలంటే తేమ అధికంగా ఉన్నపుడే యూరియా వేయవలిసి ఉంటుంది. కాలం పోతే (వానలు ఆగిపోతే) పదును లేకపోతే, ఆరుగాలం చేసిన కష్టం మట్టిలో కల్సిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నిజానికి, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభించడానికి ముందే, ఈ సీజన్లో ఎంత యూరియా అవసరం పడుతుందనే లెక్కలు అంచనా వేసి, దానికనుగుణంగా యూరియా నిల్వ సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ, రాష్ట్ర వ్యవసాయ  మంత్రి, అధికారులు ఏ ముందస్తు చర్యలూ చేపట్టలేదు. దీంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ. 267. కానీ, యూరియా కొరతను సాకుగా చూపి కొన్ని ప్రాంతాల్లో పెర్టిలైజర్‌ దుకాణాదారులు ఒక్కొక్క యూరియా బస్తా మీద రూ. 50 పెంచి అమ్ముతున్నారు. మొన్న దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో నిలబడి, అలసిపోయి ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. సీఎం సొంత ఇలాకాలో ఎరువుల కొరత ఒక రైతు ప్రాణం తీసింది. వ్యవసాయ మంత్రి రైతుల కష్టాలను హేళన చేస్తూ వెకిలిగా, అసంబద్ధంగా మాట్లాడారు.

రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరో వారం రోజుల్లో పత్తి, మొక్కజొన్న పంటలు పూతకు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి సకాలంలో యూరియా అందించకపోతే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తరువాత రాబోయే వారం, పది దినాల్లో వరి పొలాలకు యూరియా ఎక్కువ అవసరం. కనీసం ఇప్పటికైనా, ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి, యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తెప్పించి, రైతులకు అందుబాటులో ఉంచి, పంటలను కాపాడాలి.


వ్యాసకర్త: కొనగాల మహేష్‌, ఏఐసీసీ సభ్యులు
మొబైల్‌ : 98667 76999

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా